హోమియో కౌన్సెలింగ్స్
మా బాబుకు 12 ఏళ్లు. చిన్నప్పటి నుంచి రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటు ఉంది. ఈ సమస్య వల్ల బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించే అవకాశం ఉందా? – సుహాసిని, అశ్వారావుపేట
రాత్రుళ్లు నిద్రలో పక్క తడిపే ఈ అలవాటును వైద్య పరిభాషలో నాక్చర్నల్ ఎన్యురెసిస్ అంటారు. ఈ సమస్యతో బాధపడే పిల్లలు, వారి తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఇది కొంతమంది పెద్దల్లోనూ ఉంటుంది. సాధారణంగా పిల్లల్లో రాత్రి సమయంలో మూత్రవిసర్జనపై అదుపు రెండు నుంచి ఐదేళ్ల వయసులో వస్తుంటుంది. కానీ ఐదు శాతం మంది పిల్లల్లో పదేళ్ల వయసు తర్వాత కూడా మూత్రవిసర్జనపై అదుపు సాధించడం జరగకపోవచ్చు. ఐదేళ్ల వయసు తర్వాత కూడా తరచూ పక్కతడిపే అలవాటు ఉండటాన్ని ప్రైమరీ ఎన్యురెసిస్ అంటారు. సాధారణంగా ఇది కొన్నాళ్లలోనే తగ్గిపోతుంది. ఎదుగుదల సమయంలో వచ్చే లోపం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. అయితే కొంతమంది పిల్లలు పక్క తడపడం మానివేశాక, మళ్లీ ఆర్నెల్ల తర్వాత సమస్య తిరగబెట్టవచ్చు. ఈ పరిస్థితిని ‘సెకండరీ ఎన్యురెసిస్’ అంటారు.
కారణాలు: నాడీ వ్యవస్థ ఎదుగుదల లోపాలు, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు, మూత్రాశయ సమస్యలు, వంశపారంపర్య కారణాల వల్ల, కొంతమంది పిల్లల్లో కండరాలు ఎక్కువసార్లు అనియంత్రితంగా సంకోచం చెందడం వంటి కారణాలతోనూ ఈ సమస్య కనిపించవచ్చు. టైప్–1 డయాబెటిస్, మలబద్దకం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడటం వల్ల, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. మానసిక ఒత్తిడి, భయం వల్ల కూడా తెలియకుండానే మూత్రవిసర్జన జరిగిపోవచ్చు.
చికిత్స: పక్క తడిపే పిల్లలను మందలించడం, దండించడం తగదు. హోమియో చికిత్సతో పిల్లల్లో ఈ అలవాటు పూర్తిగా మాన్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
మూడేళ్లుగా రుతు సమస్య... పీసీఓడీ అంటున్నారు!
నా వయసు 25 ఏళ్లు. మూడేళ్లుగా రుతు సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే పీసీఓడీ అంటున్నారు. పరిష్కారం చెప్పండి.
– రమ్య, హైదరాబాద్
ఈమధ్య ఈ సమస్యతో బాధపడే స్త్రీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సరైన జీవనశైలి కొరవడటం, వ్యాయామం చేయకపోవడం, జంక్‌ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లతో ఈ వ్యాధి విస్తృతి పెరుగుతోంది. పీసీఓడీ వల్ల మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిల్లో సంతానలేమి, రుతుసమస్యలు ముఖ్యమైనవి. ఈ ఒవేరియన్ సిస్ట్ సమస్యలో హార్మోన్ల అసమతౌల్యత వల్ల అండాశయం (ఓవరీ)లో నీటిబుడగలు ఏర్పడతాయి. అండాశయం చుట్టూ దళసరి పొర ఏర్పడుతుంది. వీటి వల్ల రుతుచక్రమంలో అండం విడుదలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి రుతుక్రమంలో మార్పులు జరిగి సంతానలేమి సమస్యకు దారితీస్తుంది.
కారణాలు: అధిక బరువు, జంక్‌ఫుడ్ తినడం ∙హార్మోన్ల అసమతౌల్యత ∙డయాబెటిస్, హైపోథైరాయిడ్ సమస్యలు ∙గర్భనిరోధక మాత్రలు వాడటం...
లక్షణాలు: రుతుక్రమం సరిగా రాకపోవడం ∙రుతుక్రమం వచ్చినప్పుడు అధిక రక్తస్రావం ∙అవాంఛిత రోమాలు ∙ముఖంపై మొటిమలు ∙రుతుక్రమం సరిగా ఉన్నా ఒక్కోసారి అండం సరిగా విడుదల కాకపోవడం.
వ్యాధి నిర్ధారణ: అల్ట్రాసౌండ్ పెల్విక్ ఆర్గాన్ ∙ఎఫ్‌ఎస్‌హెచ్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ పరీక్షలు ∙టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్షలు
చికిత్స: పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ)కు హోమియోలో మంచి పరిష్కారం ఉంది. వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులు ఇస్తారు. దీనికి సెపియా, గ్రాఫైటిస్, పల్సటిల్లా, కాల్కేరియా కార్బ్, ఇగ్నీషియా, తూజ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే వ్యాధి సమూలంగా నయమవుతుంది.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్
సోరియాసిస్ సమస్య వేధిస్తోంది...
నా వయసు 32 ఏళ్లు. మూడు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎన్ని మందులు వాడినా తాత్కాలికమైన ఉపశమనమే ఉంది. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. దీనికి హోమియోలో మందు ఉందా? – ఎమ్. రాజేశ్వరరావు, గుంటూరు
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. సోరియాసిస్ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసువారికైనా రావచ్చు.
కారణాలు : వంశపారంపర్యం లేదా అధిక ఒత్తిడి ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు సోరియాసిస్‌కు ప్రధాన కారణం.
లక్షణాలు: ∙చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది ∙కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి ∙తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగాలేకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది.
ఇటీవలి వ్యాధి ట్రెండ్: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి.
చికిత్స: రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్ కన్‌స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో ప్రక్రియలో పూర్తిగా సాధ్యమవుతుంది.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment