
పచ్చిపాలతో ప్రమాదం హెచ్చు
కొత్త పరిశోధన
అప్పుడే పితికిన పచ్చిపాలు ఆరోగ్యానికి ప్రశస్తమైనవని చాలామంది నమ్ముతారు. అయితే, తగిన పద్ధతిలో కాచి చల్లార్చకుండా, పచ్చిపాలు తాగితే ప్రమాదమేనని అమెరికన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చిపాలలో క్షయ, టైఫాయిడ్ సహా పలు వ్యాధులకు దారితీసే ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు జీవించి ఉంటాయని, పాలను మరిగించకుండా వాటిని యథాతథంగా తీసుకుంటే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని అమెరికాలోని వ్యాధి నియంత్రణ కేంద్రం నిపుణులు చెబుతున్నారు.
పాలను 72 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కనీసం 15 నిమిషాలు మరిగించినట్లయితే, సురక్షితంగా ఉంటాయని వారు అంటున్నారు. రోగాలపాలు కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పాలను మరిగించాల్సిందేనని సూచిస్తున్నారు.