
జింకు ఎక్కువైతే కిడ్నీలో రాళ్లు..
మన ఆహారంలో జింకు కీలక పోషక పదార్థమనే సంగతి తెలిసిందే. ఆహారంలో జింకు తక్కువైతే ఎదుగుదల లోపాలు, వెంట్రుకలు రాలడం, రోగ నిరోధక శక్తి క్షీణించడం, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటం, చర్మ ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయనే విషయం కూడా చాలామందికి తెలిసిందే. అయితే, అవసరమైన మోతాదు కంటే జింకు ఎక్కువైతే కిడ్నీల్లో క్రమంగా రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అతి తక్కువగా నీరు తాగడం, ఉప్పు, చక్కెర మితిమీరి వాడటం, వ్యాయామం లేకపోవడం లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు ఉందంటున్నారు. కాల్షియం సహా ఇతర ఖనిజాలతో జింకు కలిసిపోయి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతోందని కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది.