
సమాజంలో తన తోటి వారి నుంచి నిత్యం ఎదురయ్యే చీత్కారాలు, అన్నింటా వివక్ష, కుటుంబం నుండి కూడా అందని సాంత్వన, అయినా ఇవేవీ అవరోధాలుగా మారలేదు. నాటక కళాకారిణిగా, నృత్యకారిణిగా, స్వచ్ఛంద కార్యకర్తగా తను నచ్చిన జీవితం సాగిస్తోంది కాజల్ (27). సామాజికంగా వివక్షను ఎదుర్కొంటున్న హిజ్రాల్లో కూడా విశేష ప్రతిభ దాగుందంటూ కర్ణాటకలో దక్షిణ కన్నడ జిల్లా రేవు నగరం మంగళూరులో కాజల్ అనే హిజ్రా నిరూపించారు. ఇప్పటికే వివిధ రంగాల్లో తన ప్రతిభను చాటుకున్న కాజల్ తాజాగా (రేడియో జాకీ) ఆర్జేగా మారింది. మంగళూరులోని 107.8 ఎఫ్‌ఎం రేడియోలో ఆమె ఈ నెల 21 నుంచి ప్రసారం కానున్న ‘శుభమంగళ’కు ఆర్జేగా వ్యవహరించనున్నారు.
విభిన్న రంగాల్లో ప్రతిభ......
కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన కాజల్ నిజానికి ఒక అబ్బాయి. చిన్నతనంలోనే తనలో వస్తున్న మార్పులను గుర్తించి, కుటుంబంతో విభేదించి ఇంటా, బయటా అనేక అవమానాలను ఎదుర్కొన్నాడు. ఇక మండ్యలో ఉండలేనని భావించి, ముంబై వెళ్లిపోయాడు. అక్కడే కొంత మంది తనలాంటి వారితో కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొంతకాలం జీవనం సాగిస్తూ ట్రాన్స్‌జెండర్‌గా మారి కాజల్ అయ్యింది.
తొమ్మిదేళ్ల క్రితం ఉడుపి జిల్లా బ్రహ్మావరకు చేరుకున్న కాజల్ మళ్లీ చదువులపై దృష్టి సారించింది. ఇంటర్ పూర్తి చేసిన కాజల్ డిగ్రీ చేయడానికి నిర్ణయించుకోగా అందుకు స్థానిక ఎంజీఎం కాలేజ్ ప్రొఫెసర్ మంజునాధ కామత్ సహకారం అందించారు. దూరవిద్య విధానంలో డిగ్రీ పూర్తి చేసింది. నాటకాల్లో కూడా పాల్గొంటూ ఉండగా, ప్రముఖ దర్శకుడు రవిరాజ్ ఆమె ప్రతిభను గమనించి ప్రోత్సహించారు. అలా నాట్యం, నాటకం, బుల్లితెరపై తనదైన ప్రతిభను కాజల్ కనబరిచింది.
వాక్చాతుర్యంతో అవకాశం
విభిన్న రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న కాజల్‌కు రేడియో సారంగ్ అసిస్టెంట్ డైరెక్టర్ మెల్విన్ పింటోతో పరిచయం ఏర్పడింది. కాజల్‌లోని వాక్చాతుర్యాన్ని గమనించిన ఆయన మంగళూరు 107.8 రేడియో ఎఫ్‌ఎంలో కాజల్‌కు రేడియో జాకీ అవకాశం కల్పించారు. కాజల్ ప్రతి మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు శుభమంగళ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. – షెహనాజ్, సాక్షి, బెంగళూరు:
స్ఫూర్తిగా నిలవాలనే ప్రయత్నం
హిజ్రాలంటే సమాజంలో చాలా చిన్నచూపు ఉంది. అలాంటి వివక్షత నుండి ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కేవలం భిక్షాటనలకు, సెక్స్‌వర్కర్లుగా మిగిలిపోతున్న నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలనే ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను. అంతేకాదు నాకు వీలైనంత వరకు నాలాంటి మరికొంత మందికి గౌరవప్రదమైన జీవితాన్ని అందజేసేందుకు కృషి చేస్తాను. – కాజల్
Comments
Please login to add a commentAdd a comment