సెబోరిక్ డర్మటైటిస్ అంటే..?
హోమియో కౌన్సెలింగ్స్
నా వయసు 45 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్ డర్మటైటిస్ అని చెప్పారు. మందులు వాడినప్పుడు సమస్య తగ్గినట్లే అనిపిస్తోంది కానీ వెంటనే మళ్లీ తిరగబెడుతోంది. ఈ సమస్య అసలెందుకు వస్తోంది? హోమియో మందులతో పూర్తిగా నయమవుతుందా? సలహా ఇవ్వండి.
– దయాకర్‌రావు, నల్గొండ
సెబోరిక్ డర్మటైటిస్ అనేది తరచూ తిరగ బెడుతూ బాధపెడుతుండే వ్యాధి. చర్మంలో సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడం, దురద వంటి లక్షణాలు ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇది దీర్ఘకాలిక సమస్య. చాలా ఎక్కువ మందిని వేధించే సమస్య ఇది. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది.
కారణాలు: ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది ∙రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్‌సన్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ ∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ వాతావరణం, హార్మోన్ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు.
లక్షణాలు: ∙సెబోరిక్ డర్మటైటిస్ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి. ∙చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది. ఈ వ్యాధి గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆధునిక జెనెటిక్ కాన్స్‌టిట్యూషన్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని సరిచేయడం వల్ల సెబోరిక్ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్, సీఎండ్‌డి
హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
వానలో తడిస్తే... ఒంటిపై దద్దుర్లు!
హోమియో కౌన్సెలింగ్స్
ఇటీవలి వర్షాల్లో చాలాసార్లు తడిసిపోయాను. ఆ తర్వాత చర్మం దురదగా ఉండి కురుపులు, దద్దుర్లు వస్తున్నాయి. ఒక్కోసారి ఆ కురుపులకు చీము కూడా పడుతోంది. దీనికి హోమియోలో చికిత్స ఉందా? – శ్రీనివాస్, నిజామాబాద్
వేసవి వెళ్లి వానాకాలం రాగానే వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులను చూస్తాం. ఒక్కోరోజు ఎండకాస్తుండగానే... వర్షం పడుతుంది. అలా వెంటవెంటనే వచ్చే వాతావరణ మార్పులకు, ఉష్ణోగ్రతల్లో తేడాలకు మన శరీరం తట్టుకోలేదు. పైగా వానలో తడవడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ కాలంలో బ్యాక్టీరియా, ఫంగస్, ఈస్ట్‌లు ఎక్కువగా ఇన్ఫెక్షన్లను కలగజేస్తాయి. ఇక దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ఇన్ఫెక్షన్లూ ఈ సీజన్‌లో ఎక్కువే. ఇలాంటి ఇన్ఫెక్షన్లను పిల్లలు, వృద్ధులు తట్టుకోలేరు. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకం.
ఇక మీ సమస్య విషయానికి వస్తే వాతావరణంలోని రసాయనాలు వాన నీటితో కలిసి ఒంటిని తడిపేస్తే వాటి దుష్ప్రభావం వల్ల చర్మం పాడయ్యే అవకాశం ఉంది. తడి చర్మంపై ఇన్ఫెక్షన్లు రావడానికి, పాకడానికి అవకాశాలున్నాయి. ఈ వర్షాకాలంలో వెంట్రుకలు, కుదుళ్లు, చర్మం, గోళ్లు, ప్రైవేట్ పార్ట్స్... ఇలా అన్ని చోట్లా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. కాళ్ల వేళ్ల మధ్య, గజ్జల్లో ఈ ఇన్ఫెక్షన్లు ఈ తరహా ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి.
వానాకాలంలో చర్మం మీద ఎగ్జిమా అనే చర్మ సమస్య చాలా సాధారణం. పెద్దలతో పోలిస్తే పిల్లలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. ఇక పొలం పనులు చేసే రైతులు, కూలీల్లోనూ ఇది ఎక్కువ. అలాగే నీళ్లలో ఎక్కువగా పనిచేసేవారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలోనూ ఈ తరహా ఇన్ఫెక్షన్లు చాలా సాధారణం. అలాగే చమట ఎక్కువగా పట్టే శరీర తత్వం ఉన్నవారు అదేపనిగా చాలాసేపు బూట్లు వేసుకుంటే కూడా ఈ సమస్య వస్తుంది. వాతావరణ మార్పులు, పూల పుప్పొడి, తేమ వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. చర్మం శుభ్రంగా ఉంచుకోవడం, కొన్ని రకాల రసాయనాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో దీన్ని నివారించుకోవచ్చు.
లక్షణాలు: ∙దురద, మంట ∙చర్మం పొట్టులా రాలడం, రంగుమారడం ∙పాదాలు చమటతో తడిసిపోవడం ∙చర్మంపై పగుళ్లు, నీటి పొక్కుల వంటివి కనిపించడం.
వ్యాధి నిర్ధారణ : బయటకు కనిపించే లక్షణాలతో పాటు కొన్ని రక్తపరీక్షలు
చికిత్స: వర్షాకాలం వచ్చే ఇన్ఫెక్షన్లకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వానాకాలం సమస్యలకు హోమియోలో రస్టాక్స్, ఆర్స్ ఆల్బ్, సెపియా, మెర్క్‌సాల్, కాల్కేరియా కార్బ్, వంటి మందులు వాడాల్సి ఉంటుంది. అయితే రోగి లక్షణాలు, ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్లు ఈ మందులను సూచిస్తుంటారు. వాటిని అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి, హైదరాబాద్