ప్రెగ్నెన్సీ టైమ్‌లో పైల్స్... తగ్గేదెలా?
నా వయసు 27 ఏళ్లు. నాకు గర్భధారణ సమయంలో పైల్స్ సమస్య మొదలైంది. ఎన్ని మందులు వాడినా సమస్య తరచూ వస్తూనే ఉంది. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. దయచేసి నా సమస్య హోమియోతో నయమయ్యే అవకాశం ఉందా? సలహా ఇవ్వగలరు. – ఒక సోదరి, రాజమండ్రి
గర్భధారణ సమయంలో కొన్ని హార్మోన్ల కారణంగా రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. దాంతో కొంతమంది మహిళల్లో పైల్స్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పైల్స్ సమస్యలో మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి, వాపు రావడం జరుగుతుంది. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కూడా అవుతాయి.
కారణాలు: దీర్ఘకాలికంగా మలబద్దకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం, దీర్ఘకాలిక దగ్గు, గర్భధారణ సమయంలో కాలేయ సంబంధిత వ్యాధుల వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారణాలతో మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. వాటిలో రక్తం నిల్వ ఉండటం వల్ల మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గరి ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తూ, రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం అవుతుంది. పైల్స్‌లో రకాలు ఉంటాయి. అవి... 1. ఇంటర్నల్ పైల్స్ 2. ఎక్స్‌టర్నల్ పైల్స్.
మలద్వారం వద్ద ఏర్పడే సమస్యల్లో పైల్స్ మాత్రమే గాక ఫిషర్, ఫిస్టులా వంటి ఇతర సమస్యలను కూడా మనం గమనించవచ్చు.
ఫిషర్స్: మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఆ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల అది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన అనంతరం గానీ తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. రక్తస్రావం కూడా అవుతుంది.
ఫిస్టులా: మలద్వారం వద్ద రెండు ఎపిథీలియల్ కణజాలాల మధ్య భాగంలో ఒక గొట్టం లాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. కానీ మలద్వారం వద్ద యానల్ ఫిషర్ ఏర్పడటం చాలా సాధారణం. మలద్వారం పక్కన చిన్న మొటిమలాగా ఏర్పడి నొప్పి, వాపుతో రెండు రోజులలో పగిలి చీమును వెలువరుస్తుంది. ఆపరేషన్ చేసినా 90 శాతం మందిలో మళ్లీ వస్తుంది.
చికిత్స: జెనెటిక్ కన్‌స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలను హోమియో వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చు. మళ్లీ తిరగబెట్టకుండా సంపూర్ణమైన చికిత్స అందించవచ్చు.
- డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
నెలసరి సరిగా లేదు... చికిత్స చెప్పండి
మా అమ్మాయి వయసు 23 ఏళ్లు. హార్మోన్ లోపం వల్ల ఆమెకు నెలసరి సరిగా రావడం లేదు. ఆమె బరువు పెరుగుతోంది. హోమియోపతిలో సరైన చికిత్స చెప్పండి.
– ఎల్. సుమతీదేవి, ఖమ్మం
మనిషి జీవించడానికి శ్వాస ఎంత ముఖ్యమో, ఆరోగ్యంగా ఉండటానికి హోర్మోన్లు అంతే ముఖ్యం. శిశువు పిండంగా ఉన్నప్పుడు మొదలుకొని, వారి జీవితాంతం హార్మోన్లు తమ ప్రభావం కలిగి ఉంటాయి. మెదడులోని హైపోథెలామస్, పిట్యూటరీ గ్రంథులు శరీర కణాల క్రమబద్ధీకరణలో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ హార్మోన్లే శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితి, నిద్ర, దాహం, ఉద్వేగాలను అదుపులో ఉంచుతాయి.
ఇవి రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి చాలా సూక్ష్మమోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ శరీరంపై చాలా ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ మొదలుకొని, శరీరక, మానసిక ఎదుగుదల, మానసిక సమతౌల్యత వంటి అంశాలన్నింటికీ ఇవి తోడ్పడతాయి. హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతాన లేమి, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్ అసమతౌల్యత వల్ల వచ్చేవే.
థైరాయిడ్ హార్మోన్లయిన టీ3, టీ4... థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. వీటిలో అసమతౌల్యత ఏర్పడితే హైపోథైరాయిడిజమ్, హైపర్‌థైరాయిడిజమ్, గాయిటర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి.
ఈ హార్మోన్ల అసమతౌల్యత వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసౌమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమె సమస్యను తెలుసుకోవాలి. మీరు చెబుతున్న లక్షణాల ప్రకారం థైరాయిడ్ సమస్య కావచ్చు.
దీన్ని నిర్ధారణ చేస్తే ఆమెకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్ వంటి మంచి మందులే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఆమెను అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమెకు ఉన్న వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.
- డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్
చర్మంపై పొలుసుల్లాగా రాలుతున్నాయి..?
నా వయసు 37 ఏళ్లు. ఐదు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతో మంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా? – డి. సుబ్బారావు, అనకాపల్లి
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, అవి పొలుసులుగా ఊడిపోతోంది. సోరియాసిస్ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసువారికైనా రావచ్చు.
లక్షణాలు:
♦ చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది
♦ కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి
♦ తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది.
కారణాలు: వంశపారంపర్యం; అధిక ఒత్తిడి; ఆటోఇమ్యూన్ డిజార్డర్లు సోరియాసిస్‌కు ప్రధాన కారణాలు.
ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగాలేకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది.
ఇటీవలి వ్యాధి ట్రెండ్: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి.
చికిత్స: ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్ కన్‌స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్ సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో ప్రక్రియలో పూర్తిగా సాధ్యమవుతుంది.
- డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment