తడిపే అలవాటు తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్
మా బాబు వయసు 13 ఏళ్లు. చిన్నప్పటి నుంచి రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటు ఉంది. ఈ సమస్య వల్ల బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించే అవకాశం ఉందా? - సునీత, కందుకూరు
పెద్దపిల్లలు రాత్రుళ్లు నిద్రలో పక్క తడిపే అలవాటును వైద్య పరిభాషలో నాక్చర్నల్ ఎన్యురెసిస్ అంటారు. ఈ సమస్యతో బాధపడే పిల్లలు, వారి తల్లిదండ్రులు చాలా ఆదుర్దాతో ఉంటారు. సాధారణంగా పిల్లల్లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనపై అదుపు అన్నది రెండు నుంచి ఐదేళ్ల వయసులో వస్తుంటుంది. కానీ ఐదు శాతం మంది పిల్లల్లో పదేళ్ల వయసు తర్వాత కూడా మూత్రవిసర్జనపై అదుపు రాకపోవచ్చు. ఐదేళ్ల వయసు తర్వాత కూడా తరచూ పక్కతడిపే అలవాటు ఉండటాన్ని ప్రైమరీ ఎన్యురెసిస్ అంటారు. సాధారణంగా ఇది కొన్నాళ్లలోనే తగ్గిపోతుంది. ఎదుగుదల సమయంలో వచ్చే లోపం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. అయితే కొంతమంది పిల్లలు పక్కతడపడం మానివేశాక, మళ్లీ ఆర్నెల్ల తర్వాత సమస్య తిరగబెట్టవచ్చు. ఇంతకుముందు పక్కతపడపకుండా ప్రస్తుతం మళ్లీ పక్కతడపడం మొదలుపెట్టినట్లయితే దాన్ని ‘సెకండరీ ఎన్యురెసిస్’ అంటారు.
కారణాలు : నాడీ వ్యవస్థ ఎదుగుదల లోపాలు, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు, మూత్రాశయం సమస్యలు, కొందరిలో వంశపారంపర్య కారణాల వల్ల ఈ సమస్య కనిపిస్తుండవచ్చు. ఇంకొంతమంది పిల్లల్లో కండరాలు ఎక్కువ సార్లు అనియంత్రితంగా సంకోచం చెందడం వంటి కారణాలతోనూ ఈ సమస్య కనిపించవచ్చు. టైప్–1 డయాబెటిస్, మలబద్దకం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడటం వల్ల, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమంది పిల్లల్లో మానసిక ఒత్తిడి, భయం వల్ల కూడా రాత్రివేళలో తమకు తెలియకుండానే మూత్రవిసర్జన జరిగిపోవచ్చు.
పక్క తడిపే పిల్లలను తిట్టడం, వాళ్లకు శిక్షలు విధించడం వల్ల పిల్లలు మరింత కుంగిపోయి సమస్య మరింత జటిలం అవుతుంది. ఇలా పిల్లలను మందలించడం వల్ల ప్రయోజనం చేకూరదు సరికదా... కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే హోమియో చికిత్సతో పిల్లల్లో ఈ అలవాటు పూర్తిగా మాన్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి
హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్