
‘అండమాన్‌లో అమ్మాయిలు..’ ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటున్నారా..కానే కాదు. నగరానికి చెందిన8 మంది తెలుగమ్మాయిలు గతనెల చివరి వారంలో అండమాన్ దీవుల్లో విహారయాత్రకు ఎవరి సహాయం లేకుండా వెళ్లొచ్చారు. కేవలం అమ్మాయిలు మాత్రమే ఎవరికి వారు సోలోగా ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా విహరించి అక్కడి అందాలను ఆస్వాదించారు. వీరిలో లాయర్లు, ఆర్కిటెక్చర్స్, ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు. మామూలుగా టీనేజ్ అమ్మాయిలు, విద్యార్థినులు కుటుంబ సభ్యులు లేదా కళాశాలల సిబ్బంది తోడ్పాటుతోనే టూర్స్ వెళ్తుంటారు. ‘కానీ మేం మాత్రం అందుకు మినహాయింపు’ అంటూ వివరించారు వై.తేజశ్రీరెడ్డి. ఎనిమిది మంది గ్రూపులో ఒకరైన తేజశ్రీరెడ్డి తమ అండమాన్ టూర్ వివరాలను ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
ప్రకృతి చాలా అందమైనది...ఉరుకుల పరుగుల జీవితంలో చాలా వరకూ ప్రకృతి అందాలను చూసే ఓపిక..తీరిక లేకుండా పోయింది. విదేశాల్లో ప్రజలు సంవత్సరంలో 3 నెలలు విహారయాత్రలకు కేటాయిస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. అండమాన్ దీవులు మనకు చాలా దగ్గరలోని అందమైన ప్రకృతిసిద్ధమైన ప్రదేశం. ఇండియాకు దక్షిణ దిశగా చివరిభాగంలో ఉంటుంది. బంగాళాఖాతం సముద్రంలో ఇండియాకు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూ అతిపెద్ద కోస్తా తీరం కలిగి ఉంది. విమానంలో అయితే పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్లాలి. సముద్రమార్గంగా చెన్నై, కోల్‌కతా నుంచి వెళ్లొచ్చు. క్లీన్ అండ్ గ్రీన్ బీచ్‌ల నిలయం అండమాన్–నికోబార్ దీవులు. అండమాన్ అంటే ఓ పెద్ద జైలు అంటారు. జైలుతో పాటు ప్రకృతి అందాలతో కూడిన చోటు కూడా. చాలా తక్కువ ఖర్చులో విమానంలో వెళ్లి అక్కడి అందాలను చూసి రావొచ్చు.
పోర్ట్‌బ్లెయిర్ టుహేవ్‌లాక్ ఐల్యాండ్‌కు..
మేమంతా నగరవాసులమే. నాతోపాటు మా ఫ్రెండ్స్ తరుణిరెడ్డి, అఖిల, పూజిత, రవళి, సాహిత్య, అనీష, రిథి అందరం కలిసి సరదాగా టూరిస్ట్ ప్లేస్‌కు వెళ్లాలని అండమాన్‌ను ఎంచుకున్నాం. హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో బయలుదేరాం. అయితే మేము వెళ్ళిన రోజు మా బ్యాచ్‌లో రవళి బర్త్‌డే. ఫ్లయిట్‌లో కెప్టెన్ నుంచి విషెష్ చెప్పించాలని అనుకున్నాం. మా విమానం కెప్టెన్‌ను అడిగితే కుదరలేదు. అయితే అందులోని స్టాఫ్ గుర్తించి ప్లేట్‌లో బ్రెడ్‌తో కేక్‌ను తయారుచేసి బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. చాలా సరదాగా విమానంలో బర్త్‌డే జరిగింది. మాకు బాగా గుర్తుండిపోయే సంఘటన. అలా పోర్ట్‌బ్లెయిర్‌లో దిగి అక్కడి నుంచి హేవ్‌లాక్ ఐలాండ్‌కు పడవలో వెళ్లాం.
స్కూబా డైవ్... ఎలిఫెంట్ బీచ్
మా టూర్‌లో మరిచిపోలేని అనుభూతి స్కూబా డైవ్. బ్యాచ్‌మేట్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. స్కూబాలో సముద్రపు చేపలు, జంతువులు చాలా మధురానుభూతిని అందించాయి. అక్కడి నుంచి పడవలో ఎలిఫెంట్ బీచ్, రాధానగర్ బీచ్‌లను చూశాం. రాధానగర్ బీచ్ చాలా అందమైనది. మనం చూసే బీచ్‌లకు చాలా భిన్నంగా అండమాన్ బీచ్‌లు ఉంటాయి. అక్కడే పారాసైక్లింగ్, బనానా రైడ్, జెట్‌స్కై, స్టార్క్స్ ఆటలు ఆడాం.
అందమైన బీచ్‌లు..
హావ్‌లాక్, రాధానగర్ బీచ్‌లు చాలా సుందరంగా.. క్లీన్‌గా ఉన్నాయి. వాటిని చూస్తే అద్భుతం అన్పించింది. నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. అలలు కూడా పెద్దగా ఉండవు. అక్కడ తినే ఫుడ్ కూడా బీచ్‌లోకి అనుమతించరు. దగ్గరలో కొన్ని దుకాణాలు ఉంటాయి. అక్కడే ఏమైనా తిని బీచ్‌లోకి వెళ్లాలి. మేము హావ్‌లాక్‌లో నైట్ సింఫనీ అనే రెస్టారెంట్‌లో డిన్నర్ చేశాం. మా బ్యాచ్ సీఫుడ్, వెరైటీ ఐటమ్స్ బాగా లాగించారు. ఐస్‌లాండ్ రిసార్ట్‌లో రాత్రికి బసచేశాం.
కయాకింగ్ ఓ అనుభూతి
రాత్రి సముద్రంలో కయాకింగ్ ఓ ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. రాత్రి ఇద్దరు ఉండే చిన్నపాటి పడవలో సముద్రంలో మనమే తెప్పల ద్వారా నడుపుకుంటూ వెళ్లాలి. కొద్దిదూరం వెళ్ళాక చిన్నపాటి పడవలను వరుసగా పేర్చి పడుకోవచ్చు. అక్కడ నీటిని తడిమితే సముద్రంలోని ఫంగస్ జీవులు వెళుతురు అందిస్తాయి. ఆకాశంలో స్టార్స్, సముద్రంలో స్టార్స్ మద్యలో మనం. చాలా మధురానుభూతి కలిగించే ప్రదేశం. అక్కడే ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ 20 నిమిషాలు ఉన్నాం. ఇక చివరిరోజు కాలాపతర్ బీచ్‌కు వెళ్లాం. అక్కడ సమ్‌థింగ్ డిఫరెంట్ అనే రెస్టారెంట్ ఉంది. నిజంగానే సమ్‌థింగ్ ఢిఫరెంట్‌గా పుడ్ ఉంది. బాగా ఎంజాయ్ చేశాం. అక్కడి నుంచి పడవలో పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్లాం. అండమాన్ జైలును చూసే సమయం లేకుండా పోయింది. అదొక్కడే మా విహారయాత్రలో వెలితి. కానీ మళ్లీ అండమాన్‌కు మరోసారి వెళ్లాలని మా గ్యాంగ్ తీర్మానించింది...అంటూ తమ టూర్ విశేషాలను ఉత్సాహంగా వివరించారు లా గ్రాడ్యుయేట్ అయిన తేజశ్రీరెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment