కింగ్‌డమ్ ఆఫ్ కాంబోడియా | In Past Cambodia is known as the Kingdom of Cambodia | Sakshi
Sakshi News home page

కింగ్‌డమ్ ఆఫ్ కాంబోడియా

Published Sat, Jul 5 2014 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

కింగ్‌డమ్ ఆఫ్ కాంబోడియా

కింగ్‌డమ్ ఆఫ్ కాంబోడియా

 ప్రపంచ వీక్షణం
 
చరిత్ర పుటలలో... కాంబోడియాను కింగ్‌డమ్ ఆఫ్ కాంబోడియా అని పిలుస్తారు. పూర్వం దీనిని కాంపూచియా లేదా కాంభోజ దేశం అని పిలిచేవారు. క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాల క్రితం నుండే దీని ఉనికి చరిత్రలో ఉంది. క్రీస్తుశకం 700 నుండి ఖ్మేర్ రాజులు కాంబోడియాను పరిపాలించారు.

ఈ రాజవంశమే దాదాపు 13వ శతాబ్దం వరకు అధికారం చలాయించింది. 14వ శతాబ్దం నుండి కాంబోడియా పతన దిశలో నడిచింది. 18వ శతాబ్దంలో ఫ్రెంచి రాజులు కాంబోడియాను ఆక్రమించుకున్నారు. అనేక పోరాటాల తర్వాత 1953లో ఫ్రాన్స్ నుండి కాంబోడియాకు విముక్తి లభించి స్వతంత్రదేశంగా అవతరించింది.
 
అంకోర్‌వాట్: ఇక్కడ ఆర్కియాలజీ పార్కు చూడదగ్గది. ఇక్కడ బ్రహ్మాండమైన బౌద్ధ దేవాలయం ఉంది. బౌద్ధ భిక్షువుల సమూహాలు ఇక్కడ ఎక్కువగా దర్శనమిస్తాయి. దీనిని తప్పనిసరిగా చూడవలసిందే. ఇది సీమ్‌రీప్ నగరంలో ఉంది. ఇక్కడే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

ఆహారం
కాంబోడియాలో వరిధాన్యం ఎక్కువగా పండుతుంది. అన్నంలో సూపులు, నూడుల్స్, చేపలకూర, చేపల పులుసు, చేపల సూపు, పాలు, చింతపండు, అల్లం మొదలైన వాటితో ఆహార పదార్థాలు తయారుచేస్తారు. ఖ్మేర్ ప్రాంతంలో తినే వంటకాలను ‘ప్రహోక్’ అంటారు. ఇందులో చేపలతో చేసిన పేస్టు ప్రత్యేకంగా ఉంటుంది. వీరికి ఇష్టమైన పానీయం ‘అమోక్’. వీరు కొబ్బరిపాలను మనం కాఫీ తాగినట్లుగా తాగుతూ ఉంటారు.
 
పంటలు-పరిశ్రమలు

దేశంలో వరి, మొక్కజొన్న, అరటి, రబ్బరు, పొగాకు, జనుము, కలప ఎక్కువగా పండుతాయి. సముద్ర తీరంలో చేపలు, అడవులలో కలప బాగా లభిస్తాయి. దేశంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు బాగా ఉన్నాయి. చేపలను విదేశాలకు ఎగుమతి చేయడం, కలప వ్యాపారం  వీరి ముఖ్యమైన వ్యాపారాలు. ఇవేకాదు, వివిధ రకాల కూరగాయలను, ముడి రబ్బరును కూడా విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు.
 
విహారస్థలాలు
ప్రేక్ ఆంపిల్: ఇది కాంపోట్ జిల్లాలో కోటోచ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడి తెల్లటి ఇసుక సముద్రతీరంలో కనిపిస్తుంది. వేలాదిగా మాంగ్రూవ్ చెట్లు తీరమంతా నిండి ఉంటాయి.
 
నగరాలు - పట్టణాలు
కాంబోడియా దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 25 ప్రాంతాలుగా విభజించారు. అలాగే దేశంలో 159 జిల్లాలు, 26 పురపాలక నగరాలు ఉన్నాయి. ముఖ్యమైన నగరాలలో సిసోప్రాన్, బట్టమ్‌బాంగ్, కాంపాంగ్‌బామ్, కాంపాంగ్ స్పే, కాంపాంగ్ ధామ్, కాంపోట్, టాఖ్మో, క్రాంగ్ ఖెప్, క్రాచే, సెన్మనోరమ్, సమ్‌రోంగ్, నామ్‌ఫెన్, సిహనౌక్ బెంగ్ మీంచే, పుర్సట్, ప్రేవెంగ్, బాన్‌లుంగ్, సీమ్‌రీప్, స్టంట్‌ట్రెంగ్, స్వేరీంగ్, టేకియో, సువాంగ్ ఉన్నాయి.
 
బోటమ్ సకోర్ జాతీయ పార్కు
ప్రసత్‌బేయన్‌లో బోధిసత్వుడు, అవలోకిటేశ్వరుల భారీ విగ్రహాలను దర్శించవచ్చు. అలాగే బోటమ్ సకోర్ జాతీయ పార్కు, ఇలా ఎన్నో ప్రాంతాలు చూడదగ్గవి  ఉన్నాయి.
 
అత్యంత పురాతనదేవాలయాలు
వేలాది సంవత్సరాల పూర్వం అప్పటి రాజులు నిర్మించిన దేవాలయాలను ఇప్పటికీ మనం చూడవచ్చు. అలాంటి వాటిలో నామ్‌ఫెన్ నగరంలో ఉన్న దేవాలయాలు, టా ఫ్రోమ్, ఇంద్రదేవాలయం... ఇలా మరెన్నో ఆలయాలు మనకు దర్శనమిస్తాయి.
 
చా ఓంగ్ జలపాతం

ఇది బాన్‌లాంగ్ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నీళ్ళు పైనుండి మూడు అంతస్థులుగా క్రిందికి జాలువారడం ఒక ప్రత్యేకత. ఈ జలపాతం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ‘ఏసేపక్‌టామక్’ అనే పర్వతం నుండి ఈ జలపాతంలోకి నీళ్ళు వస్తూ ఉంటాయి.
 
సంస్కృతి - సంప్రదాయాలు
కాంబోడియాలో బౌద్ధమత ప్రాచుర్యం అధికంగా ఉండడం వల్ల ఎక్కడ చూసినా బౌద్ధ సన్యాసులు దర్శనమిస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారు క్రామా అనే దుస్తులను ధరిస్తారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో ‘సామ్‌పోట్’ అనే ఒకరకమైన దుస్తులను కూడా వీరు అధికంగా ధరిస్తారు. ఎందుకంటే కాంబోడియాలో ఒకప్పుడు హిందూమతం గొప్ప ప్రాచుర్యంలో ఉండేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement