బెస్ట్ మదర్ మా అమ్మే... | Inspirational Women's Awards by sakshi | Sakshi
Sakshi News home page

బెస్ట్ మదర్ మా అమ్మే...

Published Tue, Feb 17 2015 10:56 AM | Last Updated on Mon, Aug 20 2018 8:31 PM

బెస్ట్ మదర్ మా అమ్మే... - Sakshi

బెస్ట్ మదర్ మా అమ్మే...

*మార్చి 8 మహిళ పురస్కారాలు-అమ్మ అమృతమూర్తి

*తొలివిడత ఎంపిక పూర్తయింది! ... 24 మంది మధ్య పోటీ మొదలైంది!
 
మహిళా దినోత్సవం సందర్భంగా ‘మార్చి 8 మహిళ’ పురస్కారాల కోసం అమ్మ (అమృతమూర్తి), అర్ధాంగి (జీవన సహచరి), యువతి (శక్తి స్వరూపిణి), మహిళారైతు (భూదేవి) అనే నాలుగు కేటగిరీలలో 8 అవార్డుల కోసం (ఒక్కో కేటగిరీలో ఇద్దరు విజేతలు చొప్పున) సాక్షి ‘ఫ్యామిలీ’ ఇచ్చిన ప్రకటనకు పాఠకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. అయితే, ‘యువతి’ కేటగిరీకి వచ్చిన ఎంట్రీలలో ఒక్కటి కూడా పోటీకి అర్హత సంపాదించలేక పోయింది! మిగిలిన మూడు కేటగిరీలలోనూ తొలి విడత వడపోతలో భాగంగా పేరు, ఊరి పేరు, ఫోన్ నెంబరు, ఫొటోలు లేని ఎంట్రీలను తొలగించాం.

‘అమ్మ’ కేటగిరీకి వచ్చిన ఎంట్రీలలో చాలామంది అసలు అమ్మ అంటేనే బెస్ట్ అంటూ అమ్మ మీద ప్రేమానురాగాలను చాటుకున్నారు. అమ్మ గురించి ఎక్కువ చెప్పినా, తక్కువ చెప్పినా, ఎలా చెప్పినా, అసలు చెప్పకపోయినా అమ్మ గొప్పదనం అమ్మదే. అయితే రాసిన విధానాన్ని బట్టి, రాసిన విషయంలోని స్పష్టతను బట్టి, ఇంకా పలు రకాల అంశాలను దృష్టిలో ఉంచుకుని ‘బెస్ట్ మదర్’ ఎంట్రీల వడపోత ప్రక్రియ కొనసాగించాం. అలాగే ‘అర్ధాంగి’ కేటగిరీకి వచ్చిన చాలా ఎంట్రీలలో భార్య అంటే భర్త కోసం జీవితాన్ని ధారపోయాలనే మూస ధోరణి  కనిపించింది. వడపోతలో భాగంగా ఈ ధోరణిలో సాగిన ఎంట్రీలన్నిటినీ తొలగించాం. విడతలవారీ సాగిన ఈ వడపోత ప్రక్రియ అనంతరం పోటీకి యోగ్యత సంపాదించిన వందల ఎంట్రీలను వరుసగా పదిరోజులపాటు వడగట్టి కేటగిరీకి 8 చొప్పున 3 కేటగిరీల నుంచి 24 ఎంట్రీలను ఎంపిక చేశాం. ఎంపికైన ఈ 24 మంది గురించి ‘ఫ్యామిలీ’లో నేటి నుంచి వరుసగా 8 రోజుల పాటు రోజుకు ముగ్గురు చొప్పున ప్రచురిస్తున్నాం. అలా ప్రచురించిన వాటిలోంచి మళ్లీ న్యాయనిర్ణేతలు ఆరుగురిని (కేటగిరీకి ఇద్దరు చొప్పున) ఎంపిక చేసి మార్చి 7న (మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు) పురస్కారాల విజేతల్ని హైదరాబాద్‌లో సన్మానిస్తాం. ఆ విషయాన్ని విజేతలకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది. పోటీలో పాల్గొన్న పాఠకులందరికీ అభినందనలు.
 - ఎడిటర్, ‘సాక్షి’ ఫీచర్స్
 
అమ్మ అమృతమూర్తి-1
 

మాది కడప జిల్లా. మా అమ్మ పేరు ఆవుల లక్ష్మమ్మ. నేను చూసినవాళ్లలో బెస్ట్ మదర్ మా అమ్మే. అమ్మానాన్నకు పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకు మా అమ్మకు పుట్టింటినుంచి, మెట్టింటి నుంచి సపోర్ట్ లేదు. కారణం మా పేదరికం. మా నాన్న వైపు వాళ్లు మా నాన్న కష్టాన్ని వాడుకున్నారు కాని ప్రతిఫలంగా అవమానాలు తప్ప ఆర్థిక సహాయం చేయలేదు. మా అమ్మ పుట్టింటి వైపువాళ్లకీ నాన్నంటే ఇష్టం లేదు. కాబట్టి ఏ సహాయమూ చేయలేదు. అమ్మానాన్నని విడదీయడానికి చాలా కష్టపడ్డారు. కాని మా అమ్మ మా నాన్న చెయ్యి వదలలేదు.

నాకు ఊహ తెలిసినప్పటి నుండి మేము కటిక పేదరికంలోనే మగ్గిపోయాము. మేము ముగ్గురం పిల్లం. పిల్లలు పెరిగే కొద్దీ మా నాన్న ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అయినా అమ్మానాన్న ఇద్దరూ బేల్దారీ పనికి వెళ్లి మాకు ఏ లోటు లేకుండా పెంచారు. నాన్నకి టీబీ వచ్చి మంచాన పడ్డారు. సరైన వైద్యానికి డబ్బుల్లేవు. మా అమ్మ కళ్ల ముందు పెరుగుతున్న పిల్లలు, మంచాన పడ్డ భర్త. ఆమె అదృష్టం ఏంటంటే అప్పటికే మా అక్కకు పెళ్లి చేసేసింది. అదీ అప్పులు తెచ్చి.

మాతోపాటే అప్పులు కూడా పెరగసాగాయి. నాన్న అనారోగ్యం వల్ల అమ్మ ఒక్కత్తీ కూలికి వెళ్లి తెచ్చే డబ్బులు కుటుంబ పోషణకే తక్కువపడేవి. నాన్న వైద్యానికి సరిపోయేవి కావు. అయిన వాళ్లెవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. మా అమ్మ ఆత్మాభిమానాన్ని చంపుకుని పిల్లల కోసం, భర్త కోసం ప్రాధేయపడ్డా ఛీ కొట్టారే కాని కనికరించలేదు. ఆ పరిస్థితుల్లోనూ మా అమ్మ తన ఆత్మస్ధైర్యాన్ని వదిలిపెట్టలేదు. భర్తని ఎలాగైనా బతికించుకోవాలనుకుంది. మళ్లీ అప్పులు తెచ్చి మా నాన్నకి ఆరోగ్యం బాగు చేసింది. నాన్నకు కొంచెం నయమయ్యాక నన్ను, మా అన్న బాధ్యతను మా నాన్నకు అప్పగించి తను అప్పులు తీర్చడానికి, మమ్మల్ని ప్రయోజకులను చేయడానికి పరాయిదేశం వెళ్లింది.

కువైట్‌లో మా అమ్మ 8 సంవత్సరాలు ఉంది. ఇక్కడ అప్పులన్నీ తీర్చేశాము. కాని మా నాన్న నిర్లక్ష్యం వల్ల చేతిలో ఏమీ మిగుల్చుకోలేదు. రెండోసారి అమెరికా- ఇరాక్ మధ్య యుద్ధసమయంలో కువైట్‌లో చెలరేగిన అలజడుల వల్ల కట్టుబట్టలతో తిరిగి భారతదేశానికి వచ్చింది. మా అమ్మ రెక్కలకష్టంతో సంపాదించిన దానిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఇదేంటని అడిగినందుకు మా నాన్న అమ్మని ఇష్టం ఉన్నట్టు కొట్టాడు. పని చేయడానికి శక్తి లేని మా నాన్నకి భార్యపై చేయిచేసుకోవడానికి బాగా శక్తి వచ్చింది. అయినా ఓర్పులో, సహనంలో మా అమ్మ సీతమ్మ వారి కంటే గొప్పది.

కువైట్ నుంచి తిరిగివచ్చాక భర్తను, పిల్లలను పోషించడానికి తిరిగి కూలిపనులకు వెళ్లింది మా అమ్మ. ఆ డబ్బులతోనే మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని చదివించింది. తన జీవితాన్నే మా కోసం, మా నాన్న కోసం త్యాగం చేసిన గొప్ప స్త్రీ మా అమ్మ. మా అన్నను ఇంటర్ వరకు చదివించింది. కుటుంబ బాధ్యతలో మా అన్న కూడా పాలుపంచుకున్నాడు. నిరక్షరాస్యత వల్ల మా అమ్మ  ఎంతో నష్టపోయింది. ఎంతో శ్రమపడింది. రెక్కల కష్టంతో ఇల్లు గడిపింది. ఒక స్త్రీగా ఎన్నో అవమానాలకు గురయ్యింది. ఇలాంటిజీవితం నా కూతురికి రాకూడదని నన్ను ఎం.ఏ వరకు చదివించింది. ఇప్పుడు నేను కూడా జాబ్ చేస్తున్నాను. ఇంటిబాధ్యతను తీసుకుని, మా అమ్మను ఆ బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకోమన్నాను. జీవితం అంతా మా కోసం ధారపోసిన మా అమ్మను సంతోషంగా చూసుకోవాలి. మా అమ్మ కష్టపడకూడదు. మా ఇంటి దేవతగా చూసుకోవాలి. ఇదే నా ధ్యేయం. మహిళ దినోత్సవం నాడు మా అమ్మను ఆదర్శ మహిళగా అందరు తల్చుకుంటే చాలు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.


 - ఎ. సుహాసిని (లక్ష్మమ్మ కుమార్తె)

 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement