దాడులనూ ఎదుర్కొన్నా... ధైర్యంగా ..! | jamila special interview women activities | Sakshi
Sakshi News home page

దాడులనూ ఎదుర్కొన్నా... ధైర్యంగా ..!

Published Thu, Sep 15 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

దాడులనూ ఎదుర్కొన్నా... ధైర్యంగా ..!

దాడులనూ ఎదుర్కొన్నా... ధైర్యంగా ..!

‘దేవుడే పిట్టకు రెక్కలిచ్చాడు. ఎగరవద్దని ఆదేశించడానికి మీరెవరు?  జ్ఞానమెప్పుడూ కాంతులనే ప్రసరిస్తుంది. దానికి నల్ల బురఖా వేయడం సరికాదు. ఇలా ఏ మతమూ చెప్పదు’... అంటారు జమీలా. దాంతో ఆమెకు లెక్కలేనన్ని చిక్కులూ... ఎన్నో ఇక్కట్లు.  ఇల్లు అద్దెకు ఇవ్వడాన్ని సైతం కొందరు వ్యతిరేకించారు.  మత వ్యతిరేకి అని ఆమెను అడ్డుకున్నారు.  ఎవరాక్షేపించారో  వారే ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు.  దిక్కులేని వారెదురైతే ఆమె గూటికి చేరమంటున్నారు.  జమీలా ఏర్పరచిన ‘షాహీన్’ సంస్థకు దక్కిన గౌరవమిది.  మతానికి అతీతంగా మానవతావాదులందిస్తున్న చేయూత ఇది.

‘మా నాన్న (సయ్యిద్దీన్ మహ్మద్ ) పెయింటర్.
జేఎన్‌టీయూలో ప్రొఫెసర్. కాస్మోపాలిటన్ కల్చర్‌లో చాలా స్వేచ్ఛగా పెరిగాం మేం. మా ఇంట్లో వాతావరణం, చదివిన పుస్తకాలు, మా సర్కిల్ వల్ల నాకు డిఫరెంట్ ఎక్స్‌పోజర్ దొరికింది. పైగా నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. విమెన్ యాక్టివిస్ట్ కన్నా ముందు నేను పొయెట్‌ను. ఇస్లాంలోని బుర్ఖా, బహుభార్యత్వం, ట్రిపుల్ తలాఖ్ పద్ధతుల మీద ఎక్కువగా రాసేదాన్ని. వాటిని ముస్లిం రచయితలు చాలా వ్యతిరేకించేవారు. అయినా రాయడం ఆపలేదు నేను. సంప్రదాయ ముస్లింకు వ్యతిరేకంగా చూసేవారు నన్ను. అలా  నా కవితలతోనే స్త్రీల మీద జరుగుతున్న హింస, వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించడం మొదలు పెట్టాను.

మతకలహాలు
1980లో హైదరాబాద్ పాతబస్తి మతకలహాలతో అట్టుడికిపోయింది. ఆ టైమ్‌లోనే అంటే 1980 చివర్లలో షాబాను ఇష్యూ వచ్చింది. తను భరణం (మెయింటనెన్స్) కోసం పోరాటం మొదలుపెట్టింది. ఆమెకు న్యాయం చేయకపోగా ఆ సమస్యను పెద్దది చేశారు. 90ల వరకు కొనసాగింది అది. షాబానును అబ్యూజ్ కూడా చేశారు. ఆమెకు మద్దతుగా నిలబడ్డాం.  ఒకరకంగా నా ఉద్యమం షాబాను కేస్‌తోనే స్టార్టయిందని చెప్పొచ్చు.  స్త్రీల మీద చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా! ఆ సందర్భంగానే 1996లో ముంబైలోని ఓ సంస్థతో కలిసి పాతబస్తీలో ముస్లిం స్త్రీల స్థితిగతుల పై సర్వే చేశాం. చాలా మంది ట్రిపుల్ తలాక్ (భర్త మూడుసార్లు తలాక్ తలాక్ తలాక్ అంటూ విడాకులైపోయే పద్ధతి)కి వ్యతిరేకంగా, జెండర్ జస్టిస్ కావాలనే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. అప్పుడు అనిపించింది నాకు ఇక  సీరియస్‌గా పనిచేయాలి అని.

గుంపు వచ్చింది... సమాధానం చెప్పాను....
పాతబస్తీలో మా ఆఫీస్‌కి దగ్గరగా ఉన్న ఆడపిల్లలందరినీ పోగేసి వాళ్లకు పెయింటింగ్, మ్యూజిక్ నేర్పించడం మొదలుపెట్టాం.  అయితే పాటలు, ఆటలు నేర్పిస్తూ ఆమ్మాయిలను చెడగొడ్తున్నానే దాడులు మొదలయ్యాయి నా మీద.  ఒక శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండున్నరకు అనుకుంటా... నమాజ్ ముగించుకొని ఓ ఇరవై, ముప్పై మంది మగవాళ్లు గుంపుగా మా ఆఫీస్‌కొచ్చారు దాడికి. దాదాపు మూడు గంటలు నా మీద ప్రశ్నల వర్షం కురిపించారు.

ఒకరకంగా ఇంటరాగేషనే! అన్నిటికీ తొణక్కుండా బెణక్కుండా సమాధానం ఇచ్చా. చివరికి ఈమెకు ముస్లిం సంప్రదాయం అంటే తెలియదు.. తెలియజెప్పాలి... ప్రతి శుక్రవారం మనం ఇక్కడికి వచ్చైనా సరే.. లేదా ఏదైనా కార్యక్రమానికి ఆమెను పిలిచైనా సరే అని కన్‌క్లూజన్ ఇచ్చుకొని వెళ్లారు. నిజానికి ముస్లిం మగవాళ్లెవరూ స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు అలా గుంపుగా వెళ్లరు. కాని మా ఆఫీస్‌కు వచ్చారు నన్ను భయపెడదామని, బెదరగొడదామని. నేను తప్పు చేయనప్పుడు నాకెందుకు భయం, ఎందుకు బెరుకు? అందుకే కంటిన్యూ అయ్యాను.

ఆమెకు ఇల్లు ఎందుకిచ్చారు?
ఆ ఆలోచనతోనే 1998లో అస్మితలో చేరాను. ఆ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేయడం వల్ల అసలు మొత్తం స్త్రీల సమస్యల పట్ల పూర్తి అవగాహన వచ్చింది. ముస్లిం మహిళల్లో చైతన్యం తేవాలని 2002లో పాతబస్తీలోనే ఓ ఆఫీస్ తెరిచాను. అప్పటికే నాకు పెళ్లయింది. హుమాయున్ నగర్ (హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో)లో ఉండేవాళ్లం. పని మీద నేను బయటకు వెళ్లగానే కొంతమంది పెద్దలు మా ఇంటి ఓనర్‌కి ఓ లెటర్ పంపారు.. ‘మీ ఇంట్లో ఉంటున్న జమీలా మంచిది కాదు, తస్లీమా నస్రీన్‌లా మాట్లాడుతుంది. అలాంటి ఆమెకు ఇల్లు అద్దెకు ఎందుకు ఇచ్చారు వెంటనే ఖాళీ చేయించండి’అంటూ! అప్పుడు మావారు (సయ్యిద్దుల్ రెహమాన్)  వాళ్లకు నేను చేస్తున్న పని గురించి వివరించి నచ్చజెప్పారు. అయినా కమ్యునిటీ పెద్దల నీడ ఎప్పుడూ ఉండేది నామీద.

ఈసారి పిల్లలను..
మాటలతో చెప్పితే వినలేదని ఫత్వా కూడా జారీ చేశారు నామీద. నేను కోర్టుకు వెళ్లాను. ఆ ఫత్వా చెల్లదని  స్టేట్‌మెంట్ ఇచ్చింది కోర్ట్.  ఇంకోసారి ఏకంగా కేసే పెట్టారు. లాయర్ ద్వారా డీల్ చేశాను. గెలిచాను. ఇవన్నీ జరుగుతున్నా మా ఆఫీస్‌లో ఆడపిల్లలకు చదువు చెప్పే యాక్టివిటీ ఆగలేదు. ఇది నచ్చలేదు కమ్యూనిటీ పెద్దలకు. అందుకే ఈసారి పిల్లల తల్లిదండ్రుల వైపు నుంచి వచ్చారు. పెద్దవాళ్ల దగ్గరకు వెళ్లి ‘ఆమె మీ పిల్లలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అంటూ వాళ్లను నాలుగు గోడలు దాటేలా చేస్తోంది... చెడగొడ్తోంది.. ఎందుకు పంపిస్తున్నారం’టూ నూరిపోశారు. అప్పటిదాకా నలభై మందిదాకా ఉన్న బ్యాచ్ కాస్తా అయిదుగురికి పడిపోయింది.

అయిదుగురు వచ్చినా సరే.. నా యాక్టివిటీ ఆపొద్దు అని కొనసాగించా. ఆ అయిదుగురికీ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేశాం. పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టాం. ఒక అమ్మాయి పంజరంలో పక్షిని గీసింది. దానర్థం ఏమిటని అడిగితే  ‘ఆ పంజరంలోంచి ఆ పక్షికి ఎలా స్వేచ్ఛ కావాలో మాకూ అలా స్వేచ్ఛ కావాలి’ అంది. అప్పుడే మా సంస్థకు షాహీన్ అని పేరు పెడదామని ఆ పిల్లలే సజెస్ట్ చేశారు. షాహీన్ అంటే స్వేచ్ఛగా ఎగిరే పక్షి అని అర్థం. అలా మా సంస్థ ‘షాహీన్ విమెన్ రిసోర్స్ అండ్ వెల్ఫేర్’ అసోసియేషన్‌గా రిజిస్టర్ అయింది.

ఆ అయిదురుగు మరో అయిదుగురిని...
ఆగిపోయిన పిల్లల్ని మళ్లీ రప్పించాలి చైతన్యవంతం చేయాలి. అందుకే ఈ అయిదుగురు పిల్లలు... తాము ఏం నేర్చుకున్నారో, ఆగిపోయిన వాళ్లు ఏం మిస్ అవుతున్నారో తెలిపేందుకు ఇంటింటికి వెళ్లారు. వాళ్లను

మోటివేట్ చేసి ఒకొక్కరు మరో అయిదుగురు అమ్మాయిలను తీసుకొచ్చారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈలోపే మళ్లీ కమ్యునల్ టెన్షన్ ఎక్కువైంది పాతబస్తీలో. అయినా అధైర్యపడలేదు. ఈసారి ముస్లిం మహిళలు దళిత బస్తీల్లోకి అక్కడి స్త్రీలను చైతన్యం చేశారు. దళిత్ మహిళలు ముస్లిం బస్తీలోకి వెళ్లి ముస్లిం మహిళలతో మాట్లాడారు. ఇద్దరి మధ్యా ఒకరకమైనా ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. దాంతో మగవాళ్ల మాటలను వినిపించుకోలేదు. వీళ్ల అవగాహన, ఫ్రెండ్‌షిప్ కొంతవరకు మతకల్లోలాల హింసను కంట్రోల్ చేయగలిగింది. తమ బస్తీల వరకైతే డిస్టర్బ్ కాకుండా చూసుకున్నారు.

ఇప్పుడు..
ఒకప్పుడు ‘షాహీన్’కు అమ్మాయిలను రానివ్వకుండా అడ్డుకున్న కమ్యూనిటీ పెద్దలే ఇప్పుడు అమ్మాయిల మీద హింస జరిగితే షాహీన్‌కు వెళ్లండి, మీకు న్యాయం జరిగేలా చూస్తారు అని సలహా ఇస్తున్నారు. ఒక్క కేంద్రంతో మొదలైన షాహీన్‌కు ఇప్పుడు పాతబస్తీలోని పలు చోట్ల నాలుగు సెంటర్లున్నాయి. అక్కడ శిక్షణ పొందుతున్న మహిళలు సాధికారత సాధిస్తున్నారు.  వాళ్లు ఇంకో పదిమందిని చైతన్యంవంతులను చేస్తున్నారు.

ఒకప్పుడు నా కవిత్వాన్ని వ్యతిరేకించిన వారే ఇప్పుడు ఆదరిస్తున్నారు. గౌరవిస్తున్నారు. విమెన్ స్టడీ కమిటీలో అడ్వయిజరీ బోర్డ్ మెంబర్‌గా నియమించారు. అయినా నా పోరాటం ఆగదు. షాబాను కేస్‌తో మొదలుపెట్టింది ఇంకా పరిష్కారం కానేలేదు. జెండర్ జస్టిస్ అనే గమ్యాన్ని చేరుకోలేదు. ఇప్పటి తరం అమ్మాయిలూ ఇందులో పాలుపంచుకోవాలి. ఇప్పటి తరం అమ్మాయిలకు నేను చెప్పేది ఒకటే .. ధైర్యంగా ఉండాలి... తమ మీద జరుగుతున్న హింస, అన్యాయాల పట్ల సెలైంట్‌గా ఉండకూడదు. దైర్యంగా ఎదుర్కోవాలి. డోంట్ బీ సెలైంట్! - సంభాషణ : సరస్వతి రమ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement