'హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో మహిళలు తక్కువ ఆదాయాలను పొందే ఫ్రంట్‌లైన్ పాత్రలలోనే కనిపిస్తున్నారు అని దస్రా ఆర్గనైజేషన్ ఒక డేటా విడుదల చేసింది. మహిళలు వైద్యవిద్యలలో 29 శాతం ఉంటే, నర్సింగ్ సిబ్బందిలో 80 శాతం ఉన్నారు. ఇక 100 శాతం ఆశావర్కర్లుగా ఉన్నారు.ఆరోగ్య సంరక్షణలో నాయకత్వ స్థానాల్లో కేవలం 18 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ రంగంలో పురుషుల కంటే 34 శాతం స్త్రీలు తక్కువ సంపాదిస్తున్నారు.'
లాభాపేక్ష లేకుండా, అన్ని రంగాలలో సామాజిక మార్పునకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ దస్రా. ఈ సంస్థ హెల్త్ కేర్ రంగంపై దృష్టి పెట్టి, ఓ నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో పొందుపర్చిన విషయాలలో ముఖ్యంగా గమనించాల్సింది మహిళలకు రోల్‌మోడల్స్ లేకపోవడం, వారి పనిని తక్కువ అంచనా వేయడం, అంతర్గత పక్షపాతాలు, లింగ సమానత్వం గురించి సరైన అవగాహన లేకపోవడం అని పేర్కొంది.
ఫ్రంట్‌లైన్ పాత్రలలోనే..
భారతదేశంలో ప్రధానమైన హెల్త్‌కేర్ రంగం కొన్ని సంవత్సరాలుగా సాంకేతికత, నైపుణ్యాలు, విద్య, వృత్తిపరంగా గణనీయమైన అభివృద్ధి, విస్తరణను చవిచూసింది. అయినప్పటికీ ఆరోగ్య సంరక్షణ రంగంలో మహిళలు తక్కువ ఆదాయాలను పొందే ఫ్రంట్‌లైన్ పాత్రలలో కనిపిస్తున్నారని దస్రా నివేదిక సూచిస్తుంది. దస్రా డైరెక్టర్ శైలజా మెహతా మాట్లాడుతూ ‘ఆరోగ్య సంరక్షణరంగంలో మహిళల నాయకత్వంలో మార్పు తీసుకురావడం చాలా అవసరం. ఎందుకంటే, ఇతర రంగాలను కూడా హెల్త్‌కేర్ ప్రభావితం చేయడమే కారణం. లింగ సమానత్వం విషయంలో మా పనిలో మేం మహిళల పురోగతికి సంబంధించిన గ్యాప్‌పై దృష్టి పెట్టాలనుకున్నాం’ అని తెలిపారు.
అతి తక్కువ శాతం!
నివేదిక ఫలితాల ప్రకారం మొత్తం హెల్త్‌కేర్ వర్క్ ఫోర్స్‌లో 54 శాతం ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ సెక్టార్‌లో మహిళలు దాదాపు 25 నుంచి 30 శాతం నాయకత్వ స్థానాలను ఆక్రమించారు. ఫార్మాస్యూటికల్, బయోటెక్ రంగాలలో 5 నుంచి 10 శాతం మాత్రమే నాయకత్వపాత్రల్లో మహిళలు ఉన్నారు. మార్కెటింగ్ కార్యకలాపాల స్థానాల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ప్రవేశ స్థాయి స్థానాల్లో మహిళలు 40 నుంచి 50 శాతం ఉండగా, సీనియర్ పాత్రలలో ఈ శాతం గణనీయంగా 15 నుంచి 20 శాతానికి పడిపోయింది.
పరిమిత ప్రాధాన్యం..
మహిళలు ఆర్ అండ్ డి, నర్సింగ్, హెచ్‌ఆర్, పరిపాలన, నాణ్యత హామీ, చట్టపరమైన, నియంత్రణ వ్యవహారాలు వంటి విధుల్లో బాగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవి పరిమిత ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ హెచ్‌ఆర్ పాత్రల కోసం మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. దీని ఫలితంగా గణనీయంగా 70–80 శాతం ప్రాతినిధ్యం ఉంది. ఇదే నాయకత్వ స్థానాల్లో 20 నుంచి 30 శాతానికి పడిపోతుంది. నివేదిక ఫలితాలు, రోగుల సేవా బృందాలు, ఎఫ్ అండ్ బి మొదలైన వాటిలో ఇదే విధమైన నమూనాను గమనించాయి. ప్రవేశ స్థాయులలో 40 నుంచి 60 శాతం మహిళలను ప్రాధాన్యంగా నియమించుకుంటారు. అయితే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ స్థాయులకు వారి పురోగతి పరిమితంగా ఉంది. ఇది 15 నుంచి 20 శాతానికి మాత్రమే చేరుకుంది.
రోల్ మోడల్స్ లేకపోవడమే..
లీడర్‌షిప్ క్వాలిటీ పెంపొందించుకోవడానికి మహిళలకు ప్రధాన అవరోధం రోల్ మోడల్స్ లేకపోవడమే. మహిళల పనిని తక్కువ అంచనా వేయడం, అంతర్గత పక్షపాతాలు, లింగ సమానత్వం, వైవిధ్యం గురించి నమ్మదగిన సాంస్కృతిక కథనం లేకపోవడం అని నివేదిక హైలైట్ చేసింది. శైలజా మెహతా మరిన్ని వివరాలు చెబుతూ ‘అడ్డంకులు చాలా రెట్లు ఉన్నాయి. మహిళలు నిజంగా ప్రభావవంతంగా ఉన్నారా.. మంచి నాయకులు కాదా... అని ప్రశ్నించే మూస పద్ధతి కూడా ఒక కారణంగా ఉంది.
మహిళల నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రతికూల పక్షపాతాలు, నిబంధనలు, ప్రవర్తనలు, ఊహాజనితాలు ఎన్నో ఉన్నాయి. వీటిని వదులుకోవడం అంత సులభం కాదు. సంస్థలు మెరుగైన వ్యాపారం కోసం ఆలోచిస్తాయే తప్ప మహిళా ఉన్నతిని పెద్దగా పట్టించుకోవు. హెల్త్‌కేర్ రంగంలో మహిళలు లీడర్‌షిప్ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. భారతదేశంలో చాలా మంది మహిళలకు వారి ఆకాంక్షలకు కఠినమైన అడ్డంకులు ఉంటాయి. మహిళల లక్ష్యం నర్సు కావడమే అన్నట్టుగా ఉంటుంది. మేనేజర్‌గా లేదా సీఇవోగా ఉండటానికి వారికి అవకాశం ఇవ్వరు.
‘మహిళలు తమ పరిమితులను దాటి, విస్తరించాలి. అడ్డుగోడలను, నిబంధనలను తొలగించుకుంటూ తమను తాము ప్రోత్సహించుకుంటూ ముందడుగు వేయాలి. అప్పుడే భవిష్యత్తు తరాలకు రోల్‌మోడల్స్‌గా నిలుస్తారు’ అని చెబుతున్న దస్రా నివేదిక మనందరినీ ఆలోచింపజేస్తుంది.
ఇవి చదవండి: కుమారులకి వంట నేర్పిస్తే.. ఏం జరుగుతుందో ఈ అమ్మ చూపించింది!
Comments
Please login to add a commentAdd a comment