ఇది మా ప్రభుత్వం.. ఎంత ధైర్యం ఉంటే ఇక్కడకు వస్తావ్
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘‘ఏయ్..! నీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడకు వచ్చి ఇసుకను తీసుకెళ్తావ్. ఇది మా ఊరి వంక. ఇక్కడ మా ఇష్టం వచ్చినట్టు మేమే ఎత్తుకోవాలి. ఇంకో మాట మాట్లాడావంటే నీ అంతు చూస్తా..’’ అంటూ బూతులు తిడుతూ తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లికి చెందిన టీడీపీ నేత, బీజేపీ మహిళా కార్యకర్తపై దౌర్జన్యానికి పాల్పడి, దాడికి యత్నించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బుధవారం వైరల్‌గా మారింది.
నాగయ్యగారిపల్లికి చెందిన బీజేపీ మహిళా కార్యకర్త లక్ష్మికి చెందిన పొలం వద్ద బోరు పూడుకుపోవడంతో మరమ్మతులు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం బోరు పైపు చుట్టుపక్కల ఇసుకతో సరిచేసుకునేందుకు నిర్ణయించారు. స్వర్ణముఖినదిలో ఇసుక కోసం వెళ్లారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నాగరాజు నాయుడు ఇసుక ట్రాక్టర్‌ను అడ్డుకుని దౌర్జన్యానికి దిగాడు. దీంతో తన పొలంలో అవసరానికి ఇసుక తీసుకుంటున్నానని లక్ష్మి చెప్పారు.
మహిళపై విచక్షణరహితంగా బూతులు
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికిలోనైన నాగరాజ నాయుడు ఒక్కసారిగా లక్ష్మిపై బూతులు తిడుతూ చెలరేగిపోయాడు. ‘నీకు ఎంత ధైర్యముంటే ఇక్కడ నుంచి ఇసుకు తీసుకెళ్తావు. నీ జాగీరనుకున్నావా.. మా ఇష్టమైన వాళ్లకు మాత్రమే ఇసుక ఇస్తాం. నీకు దిక్కున్న చోట చెప్పుకో’’ అంటూ పత్రికల్లో రాయలేని విధంగా మహిళా అని కూడా చూడకుండా బూతులతో రెచ్చిపోయాడు. దీంతో సొంత అవసరాలకు ఎవరి అనుమతి అవసరం లేదంటూ లక్ష్మీ సమాధానం చెప్పారు. దీనికి ఆగ్రహించిన నాగరాజ నాయుడు ఒక్కసారిగా ఆమెపై దాడికి యత్నించాడు.
అక్కడే ఉన్న తోటి గ్రామస్తులు నాగరాజ నాయుడును నిలువరించి అక్కడ నుంచి తీసుకెళ్లారు. అనంతరం నాగరాజ నాయుడు ఇసుకను తరలిస్తుండటంతో లక్ష్మి అక్కడకు వెళ్లి ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు మహిళా అని కూడా చూడకుండా ఆమెను తోసేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మహిళలపై రెచ్చిపోతున్న పచ్చనేతలు
ఈ ఘటనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో మహిళలకే రక్షణ లేకపోవడం చూస్తుంటే, ప్రభుత్వం మహిళలకు ఏ స్థాయిలో గౌరవం ఇస్తుందో తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలపై చర్యలు తీసుకోకపోతే నష్టం తప్పదంటున్నారు. ఇప్పటికే టీడీపీ నేతల అక్రమ ఇసుక దందా కారణంగా గతంలో గొడవలు జరిగాయనీ, ఇదే కొనసాగితే పెనుప్రమాదం పొంచి ఉందంటున్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment