మహిళల చైతన్యానికి విద్య | Jamnalal Bajaj Award for Chennupati Vidya | Sakshi
Sakshi News home page

మహిళల చైతన్యానికి విద్య

Published Sun, Dec 7 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM

మహిళల చైతన్యానికి విద్య

మహిళల చైతన్యానికి విద్య

మహాత్మాగాంధీ, మదర్ థెరిస్సా, మాజీ ప్రధాని ఇందిరాగాంధీలతో పరిచయాలు ఆమెలో స్ఫూర్తి రగిల్చాయి. సమాజంలో పెరిగిన అసమానతలు అంటరానితనంపై పోరాటానికి పురికొల్పాయి. అనంతరం అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఎదురు లేని మహిళా నాయకురాలిగా, బెజవాడ ఎంపీగా ఎదగడం ఆమెను ప్రజలకు మరింత చేరువ చేశాయి. ఈస్థాయి గుర్తింపు పొందిన ఆ మహిళా నేత... చెన్నుపాటి విద్య. వాసవ్య మహిళా మండలి స్థాపన సమయంలో అష్టకష్టాలూ పడాల్సి వచ్చినా, ఆ తరువాత ఆమె ఎక్కిన ప్రతి మెట్టూ విజయం వైపే పడింది. ఇటీవలే జమ్నాలాల్ బజాజ్ అవార్డును అందుకున్న విద్య జీవితం... మహిళలకు స్ఫూర్తిదాయకం. తన జీవనయానం గురించి ఆమె మాటల్లోనే...
 
‘నాస్తికోద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన గోరా గారి కుమార్తెను నేను. నాన్న మొదటి నుంచీ అభ్యుదయ భావాలున్న వ్యక్తి. ఆయన నుంచి ఆ అభ్యుదయ భావాలను, క్రమశిక్షణను అలవర్చుకున్నాను. మహాత్మాగాంధీ సూచన మేరకు వార్థా సమీపంలోని గాంధీ సేవాశ్రమ్‌లో మూడేళ్లు ఉన్నాం. నాకప్పుడు ఆరేళ్లు ఉంటాయేమో. ఓ రోజు అల్పాహారంలో కలిపేందుకు టమోటాలు కడుగుతుంటే, అటుగా వెళ్తున్న గాంధీజీ నన్ను పలకరించారు. ‘టమోటాలను కడుగుతున్నావేగానీ, ఒక్క కాయ కూడా తినవేం’ అన్నారు.

‘వీటిని మాకు సాయంత్రం ఆహారంగా పెడతారుగా’ అన్నాను నేను. ఆ సాయంత్రం ఆశ్రమంలో జరిగిన మీటింగ్‌లో గాంధీజీ మాట్లాడారు. ‘ఎక్కడ ఆహారం సమృద్ధిగా దొరుకుతుందన్న భరోసా ప్రజలకు కలుగుతుందో అక్కడ దొంగతనాలు, దౌర్జన్యాలు ఉండవు. తన కోసం ఆహారం సిద్ధంగా ఉంటుందన్న నమ్మకం ఉన్నపుడు దాన్ని ముందుగానే ఎందుకు తినడం? ఈ విధంగా ప్రజల్లో మనం నమ్మకాన్ని, ధైర్యాన్ని పెంచాలి’ అన్నారు. ఆయన మాటలు నాపై చాలా ప్రభావాన్ని చూపాయి.
 
2002 నుంచి ఎయిడ్స్‌పై అవగాహన...

ఎయిడ్స్ గురించి మహిళల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాం. ఏపీ సాక్స్ ద్వారా ఎయిడ్స్ అవగాహనా కార్యక్రమాల నిర్వహణ, మందుల పంపిణీ ప్రారంభించాం. ఎయిడ్స్‌తో బాధపడే పిల్లలకు ఆశ్రయం కల్పించి, విద్యాబుద్దులు నేర్పుతున్నాం. క్లింటన్ ఫౌండేషన్ ఎంపిక చేసిన మొట్టమొదటి ఎన్‌జీవో వాసవ్య కావడం సంతోషం. ప్రస్తుతం మా దగ్గర హెచ్‌ఐవీ, నాన్ హెచ్‌ఐవీ పిల్లలు 100 మందికి పైగా ఉన్నారు. వీరి కోసం సపోర్టు గ్రూపులను ఏర్పాటు చేశాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాం ద్వారా తల్లి నుంచి బిడ్డకు ఎయిడ్స్ రాకుండా మందులు సరఫరా చేస్తున్నాం.
 
ఎన్నికల ప్రచారంలో ఎన్నో చూశా...
మా బావగారైన రామకోటయ్య, 1962లో కంకిపాడు అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఓట్లు అభ్యర్థించమని నాకు చెప్పారు. ఆయన మాట కాదనలేక నలుగురు మహిళల్ని వెంటేసుకుని ఇంటింటికీ వెళ్లాను. చాలామంది మహిళలు కుట్టుశిక్షణ నేర్పి మిషన్లు ఇప్పించమని ప్రాధేయపడ్డారు. కుటుంబ పోషణకు కుట్టుమిషన్లు ఎంతగా దోహదపడతాయో అప్పుడే గుర్తించాను. మగవాళ్లు పనులు వెదుక్కుంటూ దూరప్రాంతాలకు పోతే, ఇంట్లో ఉన్న ఇల్లాళ్లు పిల్లల్ని చదివించుకుంటూ గడిపేవారు.

ఇల్లు నడపడం కోసం కుట్టుపని, నూలు వడికే పనులను నేర్చుకునేవారు. బావగారు ఎమ్మెల్యే అయ్యాక నన్ను జిల్లా పరిషత్ సభ్యురాలిగా నామినేట్ చేశారు. తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలిగా ఎదిగా. పీసీసీ సభ్యురాలిగా రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలకు వెళ్లేదాన్ని. పురుషులతో సమానంగా మహిళలు ఎదగకపోవడాన్ని గుర్తించా. మహిళలు చైతన్యవంతులై, అన్ని విధాలా హక్కులు పొందాలంటే చదువు ఎంతో ముఖ్యమని తెల్సుకున్నా.

1969లో నాన్నగారి సలహా మేరకు మహిళా మండలి ఏర్పాటు చేశా. ఏ పేరు పెట్టాలో తెలియక నాన్నని అడిగితే... వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం ఉన్న మహిళలకు నిలయంగా అభివృద్ధి చెందాల్సి ఉన్నందున ఆయా పదాల్లోని మొదటి అక్షరంతో కూడిన ‘వాసవ్య’ మహిళా మండలి అన్న పేరు బాగుంటుందని చెప్పారు. అయితే సంస్థను రిజిస్టర్ చేయించడానికి కనీసం 9 మంది సభ్యులైనా ఉండాలన్నారు. కానీ అప్పట్లో మహిళలకు బయటకు రావాలన్నా, మీటింగుల్లో పాల్గొనాలన్నా మా చెడ్డ భయం.

దీంతో పరిచయమున్న ఆడవాళ్లను కలిసి వారం రోజుల తరువాత సంస్థను రిజిస్టర్ చేయించాను. వారిలో అభ్యుదయ భావాలను జొప్పించి మహిళల హక్కుల కోసం పోరాడే విధానాలను వివరించేదాన్ని. అన్ని కులాల వారికీ అన్నింటా ప్రాధాన్యం లభించాలన్నది నా అభిమతం. ఈ విషయంలో ఎన్నడూ రాజీపడలేదు.
 
స్త్రీకి సమానత్వం కోసం..
అప్పట్లో మహిళలు నానా రకాలుగా అణచివేతకు గురయ్యేవారు. ఇబ్బందుల్లో ఉన్న ఆడవాళ్లను గుర్తించి వారికి ఆశ్రయం కల్పించే బాధ్యత చేపట్టా. కుటీర పరిశ్రమలు పెట్టించి, చదువునూ నేర్పించేవాళ్లం. అద్దకం, కుట్టుపని, కలంకారీ, కొవ్వొత్తుల తయారీ, పచ్చళ్లు పట్టడం వంటివి నేర్పేవాళ్లం. గ్రామాల్లో మొబైల్ లైబ్రరీల నిర్వహణ ద్వారా అక్షరాస్యత పెంచేందుకు శ్రమించేవాళ్లం.

ఆర్థికపరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆడపిల్లల్ని స్కూళ్లకు పంపాలన్నదే నినాదంగా ముందుకు సాగాం. ఫలితంగా వేలమంది ఆడపిల్లలు స్కూళ్లల్లో చేరారు. మున్సిపల్ స్కూళ్లల్లో ఆడపిల్లల హాజరు శాతం బాగా పెరగడం చూశాక, వయోజనవిద్య కేంద్రాలను ప్రారంభించాం. బాలికా వివాహాలను అడ్డుకున్నాం. మా ఉద్యమం చాపకింద నీరులా పాకింది. జిల్లా అంతటా 482 మండళ్లు ఏర్పాటు చేయగలిగాం.

 1979లో ఎంపీగా...
అప్పట్లో నా సేవలను గుర్తించిన ఇందిరాగాంధీ 1979 పార్లమెంటు ఎన్నికల కోసం విజయవాడ టికెట్‌ను నాకు కేటాయించారు. మరుసటి రోజు పేపర్లల్లో ‘విజయవాడకు విద్య’ అన్న తాటికాయంత అక్షరాలను చూసి ఆశ్చర్యపోయా. లక్షకు పైగా ఓట్లతో గెలిచా. అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో వెనుదిరిగి చూడలేదు. చేయాలనుకున్నదంతా చేస్తున్నాను.
 
ఈ పది లక్షలు కూడా మహిళా, శిశు సంక్షేమానికే....
నా సేవలను గుర్తించి జమ్నాలాల్ బజాజ్ అవార్డును ప్రదానం చేశారు. 10 లక్షల ప్రైజ్‌మనీ ఇచ్చారు. దీన్ని ఆశ్రమంలో ఉన్న మహిళలు, అనాథ పిల్లలకే ఖర్చు చేయాలనుకుంటున్నా. నా ఆశయాలకు అనుగుణంగా నాకు చేదోడువాదోడుగా నిలిచిన నా భర్త శేషగిరిరావుగారికి, నా పిల్లలకి, స్ఫూర్తినిచ్చిన నాన్న గోరాకి ఎంతో రుణపడి ఉంటా. బతికి ఉన్నంత వరకూ నలుగురికీ ఇలాగే సేవ చేస్తుంటా. నాకు నిజమైన తృప్తి దొరికేది అందులోనే!
 - గంగిశెట్టి వేణుగోపాల్, సాక్షి ప్రతినిధి, విజయవాడ
ఫొటోలు: పీఎల్ మోహన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement