
సాక్షి, విజయవాడ : మాజీ ఎంపీ చెన్నువాటి విద్య కన్ను మూశారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. చెన్నుపాటి విద్య ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు(గోరా) కుమార్తె. భారత జాతీయ కాంగ్రెస్ తరఫున విజయవాడ పార్లమెంట్ నుంచి విద్య రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఎదురు లేని మహిళా నాయకురాలిగా, విజయవాడ ఎంపీగా ఎదగడం ఆమెను ప్రజలకు మరింత చేరువ చేశాయి. ఈస్థాయి గుర్తింపు పొందిన మహిళా నేత చెన్నుపాటి విద్యనే.
వాసవ్య మహిళా మండలి స్థాపన సమయంలో అష్టకష్టాలూ పడాల్సి వచ్చినా, ఆ తరువాత ఆమె ఎక్కిన ప్రతి మెట్టూ విజయం వైపే పడింది. వాసవ్య మహిళా మండలి ద్వారా మహిళా సంక్షేమం, అభ్యుదయానికి ఎంతో కృషి చేశారు. తన తండ్రి నుంచి అభ్యుదయ భావాలను, క్రమశిక్షణను అలవర్చుకున్నట్టు విద్య పలుసార్లు చెప్పారు. నాన్న గారి సలహా మేరకే మహిళా మండలిని ఏర్పాటు చేసినట్టు ఆమె చెప్పేవారు. విద్య సేవలను గుర్తించిన ఇందిరాగాంధీ 1979లో తొలిసారి పార్లమెంట్ ఎన్నికల కోసం విజయవాడ టిక్కెట్‌ను విద్యకు కేటాయించారు. 1980 నుంచి 1984 వరకు మొదటిసారి, 1989 నుంచి 1991 వరకు రెండోసారి లోక్‌సభ ఎంపీగా తన బాధ్యతలను నిర్వర్తించారు. 1934 జూన్ 5న జన్మించిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. చెన్నుపాటి శేషగిరి రావును 1950లో వివాహం చేసుకున్నారు. విద్యకు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విద్య అంత్యక్రియలు సోమవారం విజయవాడలో జరుగుతాయని బంధువులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment