chennupati vidya
-
మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య కన్నుమూత
లబ్బీపేట (విజయవాడతూర్పు): మాజీ ఎంపీ, సంఘ సేవకురాలు, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు చెన్నుపాటి విద్య (84) విజయవాడలోని ఆమె నివాసంలో శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆమె రెండుసార్లు విజయవాడ పార్లమెంటు సభ్యురాలిగా గెలుపొందారు. వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలిగా ఉన్న ఆమె పలు సంఘ సేవా కార్యక్రమాలను విస్తృతం గా నిర్వహించేవారు. అదే క్రమంలో మదర్‌థెరిస్సాను సైతం కలుసుకున్నారు. నాస్తికులైన గోరా, సరస్వతి గోరా దంపతులకు 1934లో జన్మించిన చెన్నుపాటి విద్య ఆరేళ్ల వయస్సులో 1940లో గాంధీజీ ఆశ్రమం సేవాగ్రమ్‌లో ఒకరోజు ఉన్నారు. ఆ సమయంలో జాతీయస్ఫూర్తిని అల వర్చుకున్న విద్య 1949లో కులాంతర వివాహం చేసుకుని సమాజంలో కుల నిర్మూలనకు శ్రీకారం చుట్టారు. రాజకీయ ప్రస్థానం చెన్నుపాటి విద్య తొలిసారిగా 1962లో గొల్లపూడి పంచాయతీ కో–ఆప్టెడ్ సభ్యురా లిగా నియమితులయ్యారు. అనంతరం 1967లో కృష్ణాజిల్లా పరిషత్ కో–ఆప్టెడ్ సభ్యురాలిగా పనిచేసిన ఆమె 1980–84, 1989–91 కాలంలో రెండుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా పనిచేశారు. వాసవ్య మహిళా మండలితో.. సమాజంలో అసమానతలు రూపుమాపి, ఆర్థికాభివృద్ధి చెందేలా కృషి చేసేందుకు 1969లో గోరా, సరస్వతి గోరా వాసవ్య మహిళా మండలిని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌గా రిజిస్ట్రేషన్ చేశారు. దానికి అధ్యక్షురాలిగా ఉన్న చెన్నుపాటి విద్య లెప్రసీ, క్షయ, ఎయిడ్స్ వంటి వ్యాధులపై అవగాహన కల్పిం చారు. గర్భనిర్ధారణ పరీక్షల నిర్మూలన, చైల్డ్ అండ్ ఉమెన్ అక్రమ తరలింపునకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ తుదిశ్వాస విడిచే వరకూ కృషిచేశారు. మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు సెల్ఫ్ డిఫెన్స్ మెథడ్స్‌పై శిక్షణ ఇచ్చేవారు. విద్య అంత్యక్రియలు సోమవారం నిర్వహిం చనున్నారు. -
విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత
-
మాజీ ఎంపీ విద్య కన్నుమూత
సాక్షి, విజయవాడ : మాజీ ఎంపీ చెన్నువాటి విద్య కన్ను మూశారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. చెన్నుపాటి విద్య ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు(గోరా) కుమార్తె. భారత జాతీయ కాంగ్రెస్ తరఫున విజయవాడ పార్లమెంట్ నుంచి విద్య రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఎదురు లేని మహిళా నాయకురాలిగా, విజయవాడ ఎంపీగా ఎదగడం ఆమెను ప్రజలకు మరింత చేరువ చేశాయి. ఈస్థాయి గుర్తింపు పొందిన మహిళా నేత చెన్నుపాటి విద్యనే. వాసవ్య మహిళా మండలి స్థాపన సమయంలో అష్టకష్టాలూ పడాల్సి వచ్చినా, ఆ తరువాత ఆమె ఎక్కిన ప్రతి మెట్టూ విజయం వైపే పడింది. వాసవ్య మహిళా మండలి ద్వారా మహిళా సంక్షేమం, అభ్యుదయానికి ఎంతో కృషి చేశారు. తన తండ్రి నుంచి అభ్యుదయ భావాలను, క్రమశిక్షణను అలవర్చుకున్నట్టు విద్య పలుసార్లు చెప్పారు. నాన్న గారి సలహా మేరకే మహిళా మండలిని ఏర్పాటు చేసినట్టు ఆమె చెప్పేవారు. విద్య సేవలను గుర్తించిన ఇందిరాగాంధీ 1979లో తొలిసారి పార్లమెంట్ ఎన్నికల కోసం విజయవాడ టిక్కెట్‌ను విద్యకు కేటాయించారు. 1980 నుంచి 1984 వరకు మొదటిసారి, 1989 నుంచి 1991 వరకు రెండోసారి లోక్‌సభ ఎంపీగా తన బాధ్యతలను నిర్వర్తించారు. 1934 జూన్ 5న జన్మించిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. చెన్నుపాటి శేషగిరి రావును 1950లో వివాహం చేసుకున్నారు. విద్యకు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విద్య అంత్యక్రియలు సోమవారం విజయవాడలో జరుగుతాయని బంధువులు వెల్లడించారు. -
మహిళల చైతన్యానికి విద్య
మహాత్మాగాంధీ, మదర్ థెరిస్సా, మాజీ ప్రధాని ఇందిరాగాంధీలతో పరిచయాలు ఆమెలో స్ఫూర్తి రగిల్చాయి. సమాజంలో పెరిగిన అసమానతలు అంటరానితనంపై పోరాటానికి పురికొల్పాయి. అనంతరం అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఎదురు లేని మహిళా నాయకురాలిగా, బెజవాడ ఎంపీగా ఎదగడం ఆమెను ప్రజలకు మరింత చేరువ చేశాయి. ఈస్థాయి గుర్తింపు పొందిన ఆ మహిళా నేత... చెన్నుపాటి విద్య. వాసవ్య మహిళా మండలి స్థాపన సమయంలో అష్టకష్టాలూ పడాల్సి వచ్చినా, ఆ తరువాత ఆమె ఎక్కిన ప్రతి మెట్టూ విజయం వైపే పడింది. ఇటీవలే జమ్నాలాల్ బజాజ్ అవార్డును అందుకున్న విద్య జీవితం... మహిళలకు స్ఫూర్తిదాయకం. తన జీవనయానం గురించి ఆమె మాటల్లోనే... ‘నాస్తికోద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన గోరా గారి కుమార్తెను నేను. నాన్న మొదటి నుంచీ అభ్యుదయ భావాలున్న వ్యక్తి. ఆయన నుంచి ఆ అభ్యుదయ భావాలను, క్రమశిక్షణను అలవర్చుకున్నాను. మహాత్మాగాంధీ సూచన మేరకు వార్థా సమీపంలోని గాంధీ సేవాశ్రమ్‌లో మూడేళ్లు ఉన్నాం. నాకప్పుడు ఆరేళ్లు ఉంటాయేమో. ఓ రోజు అల్పాహారంలో కలిపేందుకు టమోటాలు కడుగుతుంటే, అటుగా వెళ్తున్న గాంధీజీ నన్ను పలకరించారు. ‘టమోటాలను కడుగుతున్నావేగానీ, ఒక్క కాయ కూడా తినవేం’ అన్నారు. ‘వీటిని మాకు సాయంత్రం ఆహారంగా పెడతారుగా’ అన్నాను నేను. ఆ సాయంత్రం ఆశ్రమంలో జరిగిన మీటింగ్‌లో గాంధీజీ మాట్లాడారు. ‘ఎక్కడ ఆహారం సమృద్ధిగా దొరుకుతుందన్న భరోసా ప్రజలకు కలుగుతుందో అక్కడ దొంగతనాలు, దౌర్జన్యాలు ఉండవు. తన కోసం ఆహారం సిద్ధంగా ఉంటుందన్న నమ్మకం ఉన్నపుడు దాన్ని ముందుగానే ఎందుకు తినడం? ఈ విధంగా ప్రజల్లో మనం నమ్మకాన్ని, ధైర్యాన్ని పెంచాలి’ అన్నారు. ఆయన మాటలు నాపై చాలా ప్రభావాన్ని చూపాయి. 2002 నుంచి ఎయిడ్స్‌పై అవగాహన... ఎయిడ్స్ గురించి మహిళల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాం. ఏపీ సాక్స్ ద్వారా ఎయిడ్స్ అవగాహనా కార్యక్రమాల నిర్వహణ, మందుల పంపిణీ ప్రారంభించాం. ఎయిడ్స్‌తో బాధపడే పిల్లలకు ఆశ్రయం కల్పించి, విద్యాబుద్దులు నేర్పుతున్నాం. క్లింటన్ ఫౌండేషన్ ఎంపిక చేసిన మొట్టమొదటి ఎన్జీవో వాసవ్య కావడం సంతోషం. ప్రస్తుతం మా దగ్గర హెచ్ఐవీ, నాన్ హెచ్ఐవీ పిల్లలు 100 మందికి పైగా ఉన్నారు. వీరి కోసం సపోర్టు గ్రూపులను ఏర్పాటు చేశాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాం ద్వారా తల్లి నుంచి బిడ్డకు ఎయిడ్స్ రాకుండా మందులు సరఫరా చేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ఎన్నో చూశా... మా బావగారైన రామకోటయ్య, 1962లో కంకిపాడు అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఓట్లు అభ్యర్థించమని నాకు చెప్పారు. ఆయన మాట కాదనలేక నలుగురు మహిళల్ని వెంటేసుకుని ఇంటింటికీ వెళ్లాను. చాలామంది మహిళలు కుట్టుశిక్షణ నేర్పి మిషన్లు ఇప్పించమని ప్రాధేయపడ్డారు. కుటుంబ పోషణకు కుట్టుమిషన్లు ఎంతగా దోహదపడతాయో అప్పుడే గుర్తించాను. మగవాళ్లు పనులు వెదుక్కుంటూ దూరప్రాంతాలకు పోతే, ఇంట్లో ఉన్న ఇల్లాళ్లు పిల్లల్ని చదివించుకుంటూ గడిపేవారు. ఇల్లు నడపడం కోసం కుట్టుపని, నూలు వడికే పనులను నేర్చుకునేవారు. బావగారు ఎమ్మెల్యే అయ్యాక నన్ను జిల్లా పరిషత్ సభ్యురాలిగా నామినేట్ చేశారు. తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలిగా ఎదిగా. పీసీసీ సభ్యురాలిగా రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలకు వెళ్లేదాన్ని. పురుషులతో సమానంగా మహిళలు ఎదగకపోవడాన్ని గుర్తించా. మహిళలు చైతన్యవంతులై, అన్ని విధాలా హక్కులు పొందాలంటే చదువు ఎంతో ముఖ్యమని తెల్సుకున్నా. 1969లో నాన్నగారి సలహా మేరకు మహిళా మండలి ఏర్పాటు చేశా. ఏ పేరు పెట్టాలో తెలియక నాన్నని అడిగితే... వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం ఉన్న మహిళలకు నిలయంగా అభివృద్ధి చెందాల్సి ఉన్నందున ఆయా పదాల్లోని మొదటి అక్షరంతో కూడిన ‘వాసవ్య’ మహిళా మండలి అన్న పేరు బాగుంటుందని చెప్పారు. అయితే సంస్థను రిజిస్టర్ చేయించడానికి కనీసం 9 మంది సభ్యులైనా ఉండాలన్నారు. కానీ అప్పట్లో మహిళలకు బయటకు రావాలన్నా, మీటింగుల్లో పాల్గొనాలన్నా మా చెడ్డ భయం. దీంతో పరిచయమున్న ఆడవాళ్లను కలిసి వారం రోజుల తరువాత సంస్థను రిజిస్టర్ చేయించాను. వారిలో అభ్యుదయ భావాలను జొప్పించి మహిళల హక్కుల కోసం పోరాడే విధానాలను వివరించేదాన్ని. అన్ని కులాల వారికీ అన్నింటా ప్రాధాన్యం లభించాలన్నది నా అభిమతం. ఈ విషయంలో ఎన్నడూ రాజీపడలేదు. స్త్రీకి సమానత్వం కోసం.. అప్పట్లో మహిళలు నానా రకాలుగా అణచివేతకు గురయ్యేవారు. ఇబ్బందుల్లో ఉన్న ఆడవాళ్లను గుర్తించి వారికి ఆశ్రయం కల్పించే బాధ్యత చేపట్టా. కుటీర పరిశ్రమలు పెట్టించి, చదువునూ నేర్పించేవాళ్లం. అద్దకం, కుట్టుపని, కలంకారీ, కొవ్వొత్తుల తయారీ, పచ్చళ్లు పట్టడం వంటివి నేర్పేవాళ్లం. గ్రామాల్లో మొబైల్ లైబ్రరీల నిర్వహణ ద్వారా అక్షరాస్యత పెంచేందుకు శ్రమించేవాళ్లం. ఆర్థికపరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆడపిల్లల్ని స్కూళ్లకు పంపాలన్నదే నినాదంగా ముందుకు సాగాం. ఫలితంగా వేలమంది ఆడపిల్లలు స్కూళ్లల్లో చేరారు. మున్సిపల్ స్కూళ్లల్లో ఆడపిల్లల హాజరు శాతం బాగా పెరగడం చూశాక, వయోజనవిద్య కేంద్రాలను ప్రారంభించాం. బాలికా వివాహాలను అడ్డుకున్నాం. మా ఉద్యమం చాపకింద నీరులా పాకింది. జిల్లా అంతటా 482 మండళ్లు ఏర్పాటు చేయగలిగాం. 1979లో ఎంపీగా... అప్పట్లో నా సేవలను గుర్తించిన ఇందిరాగాంధీ 1979 పార్లమెంటు ఎన్నికల కోసం విజయవాడ టికెట్‌ను నాకు కేటాయించారు. మరుసటి రోజు పేపర్లల్లో ‘విజయవాడకు విద్య’ అన్న తాటికాయంత అక్షరాలను చూసి ఆశ్చర్యపోయా. లక్షకు పైగా ఓట్లతో గెలిచా. అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో వెనుదిరిగి చూడలేదు. చేయాలనుకున్నదంతా చేస్తున్నాను. ఈ పది లక్షలు కూడా మహిళా, శిశు సంక్షేమానికే.... నా సేవలను గుర్తించి జమ్నాలాల్ బజాజ్ అవార్డును ప్రదానం చేశారు. 10 లక్షల ప్రైజ్‌మనీ ఇచ్చారు. దీన్ని ఆశ్రమంలో ఉన్న మహిళలు, అనాథ పిల్లలకే ఖర్చు చేయాలనుకుంటున్నా. నా ఆశయాలకు అనుగుణంగా నాకు చేదోడువాదోడుగా నిలిచిన నా భర్త శేషగిరిరావుగారికి, నా పిల్లలకి, స్ఫూర్తినిచ్చిన నాన్న గోరాకి ఎంతో రుణపడి ఉంటా. బతికి ఉన్నంత వరకూ నలుగురికీ ఇలాగే సేవ చేస్తుంటా. నాకు నిజమైన తృప్తి దొరికేది అందులోనే! - గంగిశెట్టి వేణుగోపాల్, సాక్షి ప్రతినిధి, విజయవాడ ఫొటోలు: పీఎల్ మోహన్ -
చెన్నుపాటి విద్యకు జమ్నాలాల్ బజాజ్ అవార్డు
* నోబెల్ గ్రహీత కైలాష్ ప్రత్యర్థిచే అవార్డుల ప్రదానం సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య జమ్నాలాల్ బజాజ్ అవార్డును అందుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడ జరిగిన 37వ జమ్నాలాల్ బజాజ్ అవార్డుల ప్రదానోత్సవంలో జానకీదేవి బజాజ్ స్మృతి చిహ్నంగా అందించే మహిళ, శిశు సంక్షేమం విభాగం అవార్డును ఆమె అందుకున్నారు. నిర్మాణాత్మక పనుల విభాగంలో కర్ణాటకకు చెందిన జన్పద్ సేవా ట్రస్ట్ ఫౌండర్ సరేంద్ర కౌలగి, సైన్స్, టెక్నాలజీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో గుజరాత్‌కు చెందిన సురుచి శిక్షణ్ వసాహత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, డెరైక్టర్ రామ్‌కుమార్ సింగ్‌లు అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ విబాగంలో ఇతర దేశాల్లో గాంధేయవాదాన్ని ప్రోత్సహించే వారికి ఇచ్చే అవార్డును థాయ్‌లాండ్‌కు చెందిన ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ ఎంగేజ్డ్ బుద్దిస్ట్ సంస్థ సంస్థాపకులు సులక్ సివారస్కా అందుకున్నారు. నోబెల్ అవార్డు గ్రహిత కైలాష్ సత్యర్థి ఈ అవార్డులను అందజేశారు. జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాహుల్ బజాజ్, ఫౌండేషన్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్, రిటైర్డ్ న్యాయమూర్తి సీఎస్ ధర్మాధికారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జమ్నాలాల్ బజాజ్ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ సారి అవార్డు గ్రహీతలకు అందించే ప్రైజ్‌మనీని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచారు. మహిళలకు గౌరవం లభిస్తేనే సమాజంలో మార్పులు: విద్య మహిళలకు సమాన హక్కులతో పాటు గౌరవం లభిస్తేనే సమాజంలో మార్పులు సాధ్యమని చెన్నుపాటి విద్య చెప్పారు. జమ్నాలాల్ బజాజ్ అవార్డు అందుకున్న విద్య ‘సాక్షి’తో మాట్లాడుతూ మహిళలకు సమాన హక్కుల సాధన లక్ష్యంతో వాసవ్య మహిళా మండలిని స్థాపించి నట్లు చెప్పారు. సామాజికంగా, రాజకీయంగా మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళల్లో అక్షరాస్యతతోపాటు అనేక విషయాలపై అవగాహన కల్పించి వారి అభివృద్ధికి పాటుపడుతున్నట్టు చెప్పారు. పలు జిల్లాల్లో తమ సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తోందన్నారు. సైన్స్, టెక్నాలజీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ విభాగం అవార్డు గ్రహీత రామ్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలు, అక్కడి వనరుల అభివృద్ధికి తమ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా రైతులకు పనులు, శ్రమ తగ్గించే విధంగా చవకైన పనిముట్లను రూపొందిస్తున్నట్లు చెప్పారు. తాము డిజైన్ చేసిన ‘పార’తో కూలీల శ్రమ చాలా తగ్గుతుందని, వారి మోకాళ్లు, నడుంపై కూడా భారం పడదని తెలిపారు.