రెండోసారి కామెర్లు, ఏం చేయాలి? | Jaundice is the second time, What? | Sakshi
Sakshi News home page

రెండోసారి కామెర్లు, ఏం చేయాలి?

Published Sun, Aug 9 2015 11:09 PM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

రెండోసారి కామెర్లు, ఏం చేయాలి?

రెండోసారి కామెర్లు, ఏం చేయాలి?

లైఫ్ స్టైల్ కౌన్సెలింగ్
 
అది బ్లాక్‌బెర్రీ సిండ్రోమ్ కావచ్చు!
నేను స్మార్ట్‌ఫోన్‌ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నాను. ఇటీవల నా బొటనవేలు చాలా నొప్పిగా అనిపిస్తోంది. ఈ నొప్పి తగ్గడానికి మార్గాలు చెప్పండి.
 - ఎస్.ఆర్. శాంతకుమార్, హైదరాబాద్

 మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు బ్లాక్‌బెర్రీ థంబ్ లేదా గేమర్స్ థంబ్ అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. దీన్నే వైద్యపరిభాషలో డీ-క్వెర్‌వెయిన్ సిండ్రోమ్ అంటారు. మనం మన స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే సమయంలో బొటనవేలిని మాటిమాటికీ ఉపయోగిస్తుంటాం. దాంతో బొటనవేలి వెనకభాగంలో ఉన్న టెండన్ ఇన్‌ఫ్లమేషన్‌కు గురై వాపు వస్తుంది. మళ్లీ అదేపనిగా దాన్ని ఉపయోగించడం వల్ల ఆ గాయం మానక మళ్లీ మళ్లీ గాయం తిరగబెడుతుంది. ఫలితంగా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. అవి...

 టైపింగ్ లేదా టెక్ట్స్ మెటీరియల్ పంపడం కోసం ఒక బొటన వేలినే కాకుండా ఇతర వేళ్లను కూడా మార్చి మార్చి ఉపయోగిస్తూ బొటనవేలిపై పడే భారాన్ని తగ్గించడం.  ఫోన్‌ను ఒక చేత్తో పట్టుకొని మరో చేతి బొటనవేలిని ఉపయోగించే బదులు, దాన్ని ఒక ఉపరితలం మీద పెట్టి ఇరుచేతుల వేళ్లను మార్చి ఉపయోగిస్తూ ఉండటం.  మణికట్టును చాలా రిలాక్స్‌గా ఉంచి వీలైనంత వరకు మణికట్టుపై భారం పడకుండా చూడటం.  మీ స్మార్ట్‌ఫోన్‌ను ఒళ్లో పెట్టుకొని ఉండకుండా, కాస్త ఛాతీ భాగం వద్ద ఉండేలా చూసుకోవడం. ఒళ్లో పెట్టుకోవడం వల్ల కంటి మీద, ఒంగి స్క్రీన్ చూస్తూ ఉండటంతో మెడ మీద భారం పడుతుంది. అదే ఫోన్‌ను ఛాతీ వద్ద పెట్టుకుంటే అన్నివిధాలా సౌకర్యంగా ఉంటుంది.  ఫోన్‌ను శరీరానికి ఏదో ఒక వైపున ఉంచకుండా మధ్యన ఉంచడం. దీని వల్ల శరీరం అసహజ భంగిమలో ఒంగకుండా బ్యాలెన్స్‌తో ఉంటుంది.  ఫోన్ ఉపయోగించే సమయాన్ని సాధ్యమైనంతగా తగ్గించడం.  పొడవు పొడవు వాక్యాలు కాకుండా అర్థమయ్యేరీతిలో షార్ట్‌కట్స్ వాడుతూ బొటనవేలి ఉపయోగాన్ని తగ్గించడం. దీనివల్ల మీ బొటనవేలు, ఇతర వేళ్లు, మణికట్టుపై భారం తగ్గుతుంది.  ‘ఐ యామ్ ఇన్ మీటింగ్’ లాంటి కొన్ని రెడీమేడ్ వాక్యాలు ఉంటాయి. వాటి సహాయం తీసుకుంటే టైపింగ్ బాధ తగ్గడంతో పాటు, సమయమూ ఆదా అవుతుంది.  ఎవరిపేరునైనా కనుగొనాలంటే పూర్తిగా స్క్రీన్ స్క్రోల్ చేస్తుండే బదులు షార్ట్‌కట్స్ ఉపయోగించడం ద్వారా సమయాన్నీ, బొటనవేలి ఉపయోగాన్నీ తగ్గించవచ్చు.  అదేపనిగా ఫోన్ ఉపయోగించే వారు... ప్రతి 15 నిమిషాల్లో కనీసం 2-3 నిమిషాల పాటు బొటనవేలికి విశ్రాంతినివ్వాలి. అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే ఒకసారి మీ డాక్టర్‌ను సంప్రదించండి.
 
 
 
గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్
 
రెండోసారి కామెర్లు, ఏం చేయాలి?

మా బాబు వయసు 12 ఏళ్లు. రెండేళ్ల క్రితం వాడికి పచ్చకామెర్లు వచ్చాయి. నెల రోజుల తర్వాత అవే తగ్గిపోయాయి. కానీ ప్రస్తుతం మళ్లీ పచ్చగా కనిపిస్తున్నాయి. మళ్లీ పచ్చకామెర్లు వచ్చాయేమోనని ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి.
 - కావ్య, విజయవాడ

సాధారణంగా ఈ వయసులో పచ్చకామెర్లు రావడానికి ముఖ్యంగా ‘హెపటైటిస్-ఏ’ అనే వైరస్ కారణం. మీరు ఇంతకు ముందే ఒకసారి కామెర్లు వచ్చాయంటున్నారు కాబట్టి ఈ వైరస్‌తో మళ్లీ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం చాలా అరుదు. కాబట్టి మీ బాబు కామెర్లకు ‘విల్సన్ డిసీజ్’ వంటి ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు. అలాగే మీ బాబుకు దురద, రక్తహీనత వంటి లక్షణాలేమైనా ఉన్నాయా రాయలేదు. కాబట్టి మీరు ఒకసారి మీ బాబును గ్యాస్ట్రోఎంటరాల జిస్ట్‌కు చూపించి, తగిన పరీక్షలు చేయించి, తగిన చికిత్స తీసుకుంటే అతడు త్వరగా కోలుకునే అవకాశం ఉంది.

మా పాప వయసు పదేళ్లు. ఆమె మలవిసర్జనలో ఎలాంటి సమస్యా లేదు. కానీ అప్పుడప్పుడూ మలంలో రక్తం పడుతోంది. ఇలా రక్తం ఎందుకు పడుతోందో అర్థం కావడం లేదు. మాకు తగిన సలహా ఇవ్వగలరు.
 -సుజాత, మల్లేపల్లి

మీరు రాసిన లక్షణాలను, మీ పాప వయసును పరిగణనలోకి తీసుకొని చూస్తే పెద్ద పేగుల్లో కంతులు (పాలిప్స్) ఉన్నట్లు అనిపిస్తోంది. వీటి వల్ల రక్తం పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి మీ పాపకు సిగ్మాయిడోస్కోపీ చేయించండి. ఒకవేళ కంతులు ఉన్నట్లు నిర్ధారణ అయితే ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా వాటిని తొలగించవచ్చు. ఈ చికిత్స చేయడంతో మీ పాప సమస్య తొలగిపోతుంది. మీ దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, చికిత్స తీసుకోండి.

నా వయసు 55 ఏళ్లు. నేను ఆల్కహాల్ సిర్రోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను. డాక్టర్ సలహా మేరకు ఎండోస్కోపీ చేయించాను. ఆహారవాహికలో రక్తనాళాలు ఉబ్బి ఉన్నట్లు తెలిసింది.     ఈ సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
 - రహీమ్, చిత్తూరు

 మీరు ఆల్కహాల్ సిర్రోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి మీ ఆహార వాహికలో ‘ఈసోఫేజియల్ వారిసెస్’ అభివృద్ధి చెందాయి. వీటి పరిమాణాన్ని బట్టి రక్తపు వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. ఎండోస్కోపీ చేయించాక రక్తనాళాలు ఉబ్బి ఉన్నట్లు తెలిసిందని రాశారుగానీ వారిసెస్ ఏ పరిమాణంలో ఉన్నాయో తెలపలేదు. మామూలుగా వారిసెస్ పరిమాణాలను గ్రేడ్-3, గ్రేడ్-4 ఉన్నట్లుయితే అవి పగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎండోస్కోపీ ద్వారా బ్యాండిన్ అనే చికిత్సతో ఉబ్బిన రక్తనాళాలను పూర్తిగా తగ్గేట్లుగా చేయవచ్చు. ఈ చికిత్స చేయడం వల్ల రక్తపు వాంతులనూ నివారించవచ్చు. మీరు తప్పనిసరిగా ఆల్కహాల్‌ను పూర్తిగా మానేయాలి. మీరు ప్రొపనాల్ 20ఎంజీ మాత్రలు రోజుకు రెండుసార్లు వేసుకోండి. మీకు దగ్గర్లోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి చికిత్స తీసుకోండి.
 
 పీడియాట్రీషియన్ కౌన్సెలింగ్
 
బాబుకు తరచూ తలనొప్పి... ఏం చేయాలి?
మా బాబు వయసు పదేళ్లు. తరచూ తలనొపితో చాలా బాధపడుతున్నాడు. ఇంతకుముందు తలనొప్పి చాలా అరుదుగా వచ్చేది. కాని ఇటీవల చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. మా బాబు విషయంలో తగిన సలహా ఇవ్వండి.
 - సుందర్, అమలాపురం


 మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్ హెడేక్)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్. ఇది పెద్దల్లో ఎంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్‌తో పాటు టెన్షన్ హెడేక్, మెదడు లోపలి సమ స్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటి లోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్ వల్ల తలనొప్పి అని భావించవచ్చు. అయితే ఈ మైగ్రేన్‌లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. కొద్దిమంది పిల్లల్లో వెలుతురు చూడటానికి ఇష్టపడకపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది తీవ్రంగా ఉండే కొంతమందిలో దీని వల్ల శరీరంలోని కొన్ని అవయవాలు బలహీనంగా మారడం కూడా కనిపించవచ్చు.

 నివారణ / చికిత్స
చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం నుదుటిపై చల్లటి నీటితో అద్దడం నొప్పి తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మందులు (ఉదాహరణకు యాస్పిరిన్ లేదా ఎన్‌ఎస్‌ఏఐడీ గ్రూప్ మందులు) వాడటం నీళ్లు ఎక్కువగా తాగించడం ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం  పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్‌ను చాలామట్టుకు తగ్గించవచ్చు. అయితే ఇది చాలా తరచూ వస్తుంటే మాత్రం ప్రొఫిలాక్టిక్ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్ సలహా మేరకు మరికొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి.
 
న్యూరాలజీ కౌన్సెలింగ్
మూలకణ చికిత్సతో పక్షవాతం నయమవుతుందా?
నేను గత 15 ఏళ్లుగా పక్షవాతం (పెరాలసిస్) వ్యాధితో బాధపడుతున్నాను. అయితే పెరాలసిస్‌కు మూలకణ చికిత్స (స్టెమ్‌సెల్ థెరపీ) అందుబాటులోకి వచ్చినట్లు వార్తాపత్రికల్లో చదివాను. ఈ చికిత్స ప్రస్తుతం ఎక్కడ లభ్యమవుతోంది, దీనికి ఎంత ఖర్చవుతుంది, దాని ఫలితాలు ఎంత మెరుగ్గా ఉంటాయన్న విషయాలను వివరంగా తెలియజేయగలరు.
 - ఎమ్. దిలిప్‌కుమార్ శెట్టి, ఎర్రపల్లి, చిత్తూరు జిల్లా


ఒకసారి మెదడులోని కణాలు చనిపోతే అవి శాశ్వతంగా చనిపోయినట్టే. అది పక్షవాతం వల్ల చనిపోయినా లేదా రక్తస్రావం వల్ల చనిపోయినా మెదడులోని కణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అవి మళ్లీ పునరుజ్జీవించలేవు. ఇలాంటి సమయంలో మనం నేర్చుకున్న దాన్ని తిరిగి పొందాలంటే దెబ్బతిన్న కణాలకు పక్కనే ఉండే కణాలు తోడ్పడతాయి. దాంతో మనం పోగొట్టుకున్న అంశం మళ్లీ మనకు దక్కుతుంది. మన మెదడుకు ఉన్న ఈ అద్భుతమైన శక్తిని ‘న్యూరోనల్ ప్లాస్టిసిటీ’ అని వ్యవహరిస్తారు.

సాధారణంగా 80 శాతం మేరకు కోలుకోడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధి పడుతుంది. ఇక మూలకణాలతో చికిత్స అంటే... ఇవి మన శరీరంలోని ఎలాంటి కణాలుగానైనా మారేశక్తి ఉన్న కణాలన్నమాట. పక్షవాతానికి మూలకణాలతో చికిత్స చేసే ప్రక్రియలో రెండు రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాం. మొదటిది... మెదడులోనే చెడిపోయి ఉన్న కణాలను కొన్ని మందుల ద్వారా మళ్లీ ప్రేరేపించి పనిచేయించేలా చూడటం; ఇక రెండోది... బయటి నుంచి మూలకణాలను శరీరంలోకి పంపడం. అంటే ఉదాహరణకు చెడిపోయిన మూలగ స్థానంలో కొత్త కణాలు పంపి, కొత్త మూలగను రూపొందించేలా అన్నమాట.

ఇక చనిపోయిన మెదడుకణాల స్థానంలో మూలకణాలను ప్రవేశపెట్టడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇందులో మూలకణాలు పాతకణాలతోనూ, న్యూరాన్ల దారులతో అనుసంధానితం అయి, అక్కడి రసాయన చర్యలకు అనుగుణంగా స్పందిస్తూ ఉండటానికి చాలా కాలం పడుతుంది. ఇందుకు కొన్నేళ్ల వ్యవధి కూడా పట్టవచ్చు. ఇవ్వాళ్టికీ ఈ విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికి వచ్చిన ఫలితాలు అంత సంతృప్తికరంగా లేవు. కాబట్టి ప్రస్తుతానికి మూలకణ చికిత్స అన్నది పరిశోధనదశలోనే ఉంది. ఇంకా చికిత్స వరకూ రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement