ఇంట్లోనే డయాలసిస్... సీఏపీడీ
హోమియో కౌన్సెలింగ్
1. మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి. - సునయన, నెల్లూరు
ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో ఎన్నో స్థాయులు, వివిధ లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలో లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లలు తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది.
ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు...
అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం, నలుగురిలో కలవడలేకపోవడం, ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం
వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు గమనించి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠ స్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎఎమ్ రెడ్డి,పాజిటివ్ హోమియోపతి
2. లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్
నేను ఇటీవల బాగా అలసిపోతున్నాను. నడుము నొప్పి కూడా వస్తోంది. మాది ఎనిమిది గంటల షిఫ్ట్. నేను డబుల్ డ్యూటీలు చేస్తుంటాను. వరసగా రెండో షిఫ్ట్ కూడా పనిచేయడం వల్ల ఇలా జరుగుతోందా? ఈ అలసట అధిగమించడానికి మార్గాలు చెప్పండి. - మస్తాన్‌రావు, హైదరాబాద్
మీలా డబుల్ షిఫ్ట్ పనిచేసేవారిలో తీవ్రమైన అలసట, బాగా ఒత్తిడికి లోనైనట్లు అనిపించడం చాలా సాధారణం. పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు ఏకధాటిగా (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారిలో మీలా వృత్తిపరమైన అలసట వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇలా పనిచేసేవారిలో తీవ్రమైన అలసటతో పాటు కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలూ రావచ్చు. మీలాంటి వారు అలసటతో పాటు, వృత్తిసంబంధమైన ఇతర సమస్యలను నివారించేందుకు ఈ సూచనలు పాటించండి.
* పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగలో కార్బన్‌మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అది రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది.
*చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు.
*మీ ఉద్యోగంలో ఏదైనా సమస్యలు, మీరు లక్ష్యాలను అధిగమించాల్సిన (టార్గెట్స్ రీచ్ కావాల్సిన) వృత్తిలో ఉన్నా అలసటకు లోనవుతారు. మీ సమస్యలను మీవెంట ఇంటికి మోసుకెళ్లకండి.
* తగినంతగా నిద్రపొండి. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి.
*మీరు పనిచేసే చోట కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పుల పరిమితికి మించి తాగకండి. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు.
*రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి.
* భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు.
*ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ-హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా అలసటతోనూ, నడుంనొప్పితో బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్,సికింద్రాబాద్
3. నెఫ్రాలజీ కౌన్సెలింగ్
నా వయసు 50 ఏళ్లు. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నాను. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. నేను ఉండే ఊళ్లో డయాలసిస్ సెంటర్ లేదు. డయాలసిస్ కాకుండా వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? - షణ్ముఖరావు, ఆత్మకూరు
ఇలా వారంలో మూడు సార్లు డయాలసిస్ చేయించాల్సిన వ్యక్తుల్లో కిడ్నీ మార్పిడి మంచి చికిత్స. అయితే ఇది అందరికీ సాధ్యపడే అంశం కాదు. మాటిమాటికీ హాస్పిటల్‌కు వెళ్లేందుకు అనువుగా లేనివారు, ఇంట్లోనే డయాలసిస్ చేసు కునే ప్రక్రియను కంటిన్యువస్ ఆంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్ (సీఏపీడీ) మెషిన్‌ను వాడటం మంచిది. ఇది చాలా సులువైన ప్రక్రియ. డయాలసిస్ పూర్తయ్యాక మామూలుగా తమ వృత్తులూ చేసుకోవచ్చు. దీనివల్ల జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) కూడా బాగా మెరుగవుతుంది. ఇలా డయాలసిస్ చేసుకునే వారికి బీపీతో పాటు ఇతర మందులు చాలా తక్కువగా అవసరం పడతాయి.
నా వయసు 32 ఏళ్లు. తరచుగా జ్వరం. మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన మంట కూడా ఉంటోంది. ఇలా తరచూ జ్వరం, మూత్రంలో మంట వస్తున్నాయి. ఇలా మాటిమాటికీ జ్వరం రాకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? - మాలతి, జగ్గయ్యపేట
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్’తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా మీకు మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తున్న కారణం ఏమిటన్నది తెలుసుకోవాలి. మీకు షుగర్ ఉంటే కూడా ఇలా మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఒకసారి మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లుగానీ, మూత్రనాళాల్లో వాపుగానీ ఉన్నాయేమో చూడాలి. మీకు డాక్టర్ ఇచ్చిన యాంటీబయాటిక్ పూర్తి కోర్సు వాడకుండా ఉన్నా కూడా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్స్ తిరగబెట్టవచ్చు. మీకు ఏ కారణం లేకుండా ఇన్ఫెక్షన్ వస్తుంటే కనీసం మూడు నెలల పాటు యాంటీబయాటిక్స్ వాడాలి. రోజూ నీళ్లు ఎక్కువగా (అంటే రెండు నుంచి మూడు లీటర్లు) తాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా, వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లాలి.
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.