Nephralaji counseling
-
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే న్యుమోనియా!
పల్మనాలజీ కౌన్సెలింగ్ మా బాబుకు మూడేళ్లు. ఇటీవల వాడికి తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు వచ్చాయి. మాకు తెలిసిన కొన్ని మందులు వాడినా లక్షణాలు తగ్గలేదు. గత ఏడాది కూడా చలికాలంలో ఇలాంటి సమస్యే కనిపించి, కొంతకాలం తర్వాత తగ్గింది. మా బాబుకు చలికాలంలోనే ఈ సమస్య వస్తున్నట్లు అనిపిస్తోంది. దానంతట అదే తగ్గిపోతుందని అంతగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకూ సమస్య క్రమంగా పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. మా బాబుకు ఏమైందో తెలియడం లేదు. చలికాలంలోనే ఇలాంటి సమస్య ఎందుకు వస్తోంది. దయచేసి వాడి సమస్యకు తగిన పరిష్కారం చూపించగలరు. - రాజేశ్వరి, మహబూబ్‌నగర్ మీరు తెలిపిన వివరాలను బట్టి మీ బాబు న్యుమోనియాతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమస్య ఉన్నవారికి వెంటనే చికిత్స ప్రారంభించాలి. ఆలస్యం చేస్తే వ్యాది తీవ్రమైపోయి, శ్వాస ఆడక పరిస్థితి విషమించే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే న్యుమో నియా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచించిన జాగ్రత్తలు పాటించండి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, అధిక చల్లదనం వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. సులువుగా శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మీ బాబుకు అన్ని రకాల వ్యాక్సిన్లు వేయించారా లేదా ఒకసారి చూసుకోండి. న్యుమోకోకల్, ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) అనే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వేయించడం ద్వారా పిల్లలకు న్యుమోనియా రాకుండా నివారించవచ్చు. అపరిశుభ్ర వాతావరణం, పోషకాహార లోపం, శిశువులకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వకపోవడం వల్ల న్యుమోనియా వస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి చలికాలం అనర్థాలను నివారించడానికి మీ బాబు శరీరం పూర్తిగా కప్పి ఉండేలా స్వెటర్లు వేయండి. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో బాబును బయటకు తీసుకెళ్లకండి. వీలైనంత వరకు చలిగాలి తగలకుండా చూడండి. ఈ సీజన్లో చల్లటి పానీయాలు, చల్లటి పదార్థాలు ఇవ్వకపోవడమే మంచిది. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయు 64 ఏళ్లు. గత రెండేళ్లుగా నేను హైబీపీతో బాధపడుతున్నాను. నిరుడు రక్తపరీక్షలు చేయించుకుంటే క్రియాటినిన్ 6, యూరియా 120 వరకు ఉన్నాయి. నా కిడ్నీలు పనిచేయడం లేదని చెబుతున్నారు. కానీ నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. నాకు ఇలా ఏ లక్షణాలూ కనిపించకపోయినా లోపల ఏవైనా సమస్యలు ఉండి ఉంటాయా? ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? - లోకేశ్వరరావు, నేలకొండపల్లి మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ జబ్బు వచ్చినవారిలో రెండు కిడ్నీల పనితీరు బాగా తగ్గిపోతుంది. రక్తపరీక్షలూ ఏమీ తెలియకపోవచ్చు. సాధారణంగా అయితే కిడ్నీ పనితీరు 30 శాతం కంటే తగ్గగానే ఈ జబ్బు లక్షణాలు వెంటనే తెలుస్తాయి. కాబట్టి మీరు ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. హైబీపీ, డయాబెటిస్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న కుటుంబాల్లో ఎవరికైనా కిడ్నీ వ్యాధులు ఉంటే... వారికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వాళ్లు ప్రతి ఏడాదీ కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుందో తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే... కిడ్నీలను కాపాడుకునే వీలు అంత ఎక్కువ. నా వయసు 48 ఏళ్లు. నేను గత ఏడాదిగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)తో బాధపడుతున్నాను. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాలన్నారు. ఒకటి లేదా రెండు సార్లు చేయించుకుంటే సరిపోదా? - రమేశ్‌కుమార్, కరీంనగర్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీ కిడ్నీ కేవలం పది నుంచి పదిహేను శాతం మాత్రమే పనిచేస్తోందని అనుకోవచ్చు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)లో ఇలాంటి పరిస్థితే సంభవిస్తుంది. ఈ దశలో మీరు వారానికి మూడుసార్లు తప్పనిసరిగా డయాలసిస్ చేయించుకోవాల్సిందే. ఒకవేళ మీరు క్రమం తప్పితే ఆ ప్రభావం మీ శరీరంలోని ఇతర కీలక అవయవాల మీద పడే అవకాశం ఉంది. జీవన నాణ్యత కూడా తగ్గుతుంది. పై పరిణామాలను నివారించడానికి మీరు తప్పనిసరిగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోక తప్పదు. లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్ ఆస్తమా ఉన్నవారు చలికాలంలో అనుసరించాల్సిన జీవనశైలిలో మార్పులు చెప్పండి. - శ్రీధర్, తుంగతుర్తి ఈ సీజన్ ఆస్తమా రోగులకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే కొన్ని జీవనశైలి మార్పులను చేసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలావరకు నివారించవచ్చు. మీరు అనుసరించాల్సిన సూచనలివి... చేతులు కడుక్కోవడం : మీరు వీలైనన్ని ఎక్కువసార్లు మీ చేతుల్ని కడుక్కుంటూ ఉండండి. సబ్బుతో కడుక్కుంటూ ఉండటం వల్ల చేతులకు అంటుకునే జలుబును కలిగించే వైరస్‌లను ముక్కు వరకూ చేరకుండా ఉంచవచ్చు. అలాగే ఇతర హానికారక క్రిములూ కొట్టుకుపోతాయి ఫ్లూని నివారించే వ్యాక్సిన్ తీసుకోండి : చాలా చిన్న వయసు పిల్లలూ, వయసు పైబడిన వారిలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. అందుకే వీళ్లు ఆస్తమాకు తేలిగ్గా గురవుతారు. పైగా ఫ్లూను కలుగజేసే క్రిముల వల్ల ఆస్తమా బారినపడే అవకాశాలు మరింత ఎక్కువ. కాబట్టి ఈ సీజన్లో ఫ్లూని నివారించే వ్యాక్సిన్ (ఫ్లూ షాట్) తీసుకోండి. దీనివల్ల మీకు ఫ్లూ తర్వాతి నిమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కలుగుతుంది చలిమంట, కాలే కట్టెల దగ్గర కూర్చోకండి : చలికాలంలో ఆస్తమా ఉన్నవారికి మంట దగ్గర ఉండటం మరింత ఉపశమనంగా ఉంటే ఉండవచ్చు. కానీ చలిమంట దగ్గర, కాలే కట్టెల వద్ద ఆస్తమా రోగులు కూర్చోకపోవడం మంచిది. కట్టెలపొయ్యి దగ్గర కూర్చొని ఉండటం వల్ల ఆస్తమా రోగులకు ఉపశమనం దొరుకుతుందనుకుంటే పొరబాటే. ఎందుకంటే చలిమంట, కట్టెలపొయ్యి నుంచి వచ్చే పొగలు, ఆవిర్లు ఊపిరితిత్తులను మరింతగా మండిస్తాయి. ఆస్తమాను ప్రేరేపిస్తాయి నోటిని మూసి ఉంచండి: కేవలం ముక్కుతో మాత్రమే శ్వాసతీసుకుంటూ ఉండాలి. నోటిద్వారా ఎంత మాత్రమూ శ్వాసించకూడదు. ఇక ముక్కుకు ఏదైనా అడ్డంకి ఉంచుకోవడం మరీ మంచిది ఏసీ ఫిల్టర్లను మార్చుకోండి : మీ ఏసీ ఫిల్టర్లను మార్చుకుంటూ ఉండండి. ఈ ఫిల్టర్లను మార్చుకోవడం క్రమం తప్పకుండా జరగాలి ఇంట్లోనే వ్యాయామం చేయండి : వ్యాయామం ఇంట్లో చేయాలి లేదా ఇన్‌డోర్స్‌లో మాత్రమే జరగాలి వార్మప్ తర్వాతే వ్యాయామాలు : వ్యాయామం చేసే ముందర తగినంత సేపు వార్మప్ ప్రక్రియలతో దానికి సంసిద్ధం కావాలి. ఇలా వార్మప్ చాలాసేపు చేశాక, వ్యాయామం చేసే వారిలో ఊపిరితిత్తుల పనిసామర్థ్యం పెరుగుతుందనీ, వాళ్లు తక్కువగా ఆస్తమాకు గురవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. పైగా ఇలాంటివాళ్లు ఆస్తమాకు గురైతే తేరుకోవడమూ చాలా వేగంగా జరుగుతుందనీ పరిశోధనలు పేర్కొంటున్నాయి మందులు తప్పక వాడండి : ఆస్తమాను నివారించే మందులు, ఇన్హేలర్స్ మరచిపోకుండా వాడండి. క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి. లక్షణాలు కనిపించన వెంటనే డాక్టర్‌ను కలవండి. -
రొమ్ములో ఏర్పడే కణతులన్నీ క్యాన్సర్లు కాదు..!
హస్తవాసి ఆంకాలజీ కౌన్సెలింగ్ నా వయసు 18 ఏళ్లు. డిగ్రీ చదువుతున్నాను. నేను సొంతంగా నా రొమ్ములను పరీక్షించుకున్నప్పుడు రెండేళ్ల క్రితం నా కుడి వైపు రొమ్ములో వేరుశనగ కాయ పరిమాణంలో కణితి ఉన్నట్లు గమనించాను. ఆ కణితి చాలా నొప్పిగా ఉంటోంది. దాంతో నేను చాలా అసౌకర్యానికి గురవుతుండడంతో పాటు చదువుపై దృష్టి సారించలేకపోతున్నాను. నా సమస్యను ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేనే ఇబ్బంది పడుతున్నాను. ఇది రొమ్ము క్యాన్సరేమో అని చాలా భయంగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన చూపించగలరు. - ఓ సోదరి మీ వయసులో రొమ్ములో కణితి (ఫైబ్రోడినోమా) ఏడ్పడటం సాధారణమైన సమస్య. రొమ్ములో ఏర్పడిన కణుతులు, చిన్న చిన్న గడ్డలు క్యాన్సర్లు కావు. ఇది ఒక వ్యాధి కాదు. కేవలం బ్రెస్ట్ డెవలప్మెంట్లో జరిగే సాధారణ పరిణామం మాత్రమే. కాబట్టి మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీ సమస్యకు సరైన చికిత్స అవసరం. కొన్ని సాధారణ పరీక్షల ద్వారా వైద్యులు పూర్తిగా పరీక్షించి, ఆ కణితిని తొలగించాలా, వద్దా అని నిర్ధారిస్తారు. క్రమంగా కణితి పరిమాణం పెరుగుతూ ఉండటం, నొప్పి తగ్గకుండా స్థిరంగా ఉండడం, వైద్య పరీక్షల్లో క్యాన్సర్ సూచనలు కనిపించడం, రొమ్ము క్యాన్సర్ కలిగిన కుటుంబ చరిత్ర ఉన్న వారిలో శస్త్రచికిత్స నిర్వహించి రొమ్ములోని కణితి తొలగించవలసి ఉంటుంది. కణితి పరిమాణాన్ని బట్టి ఆపరేషన్ అవసరమా, కాదా అని వైద్యులు నిర్థారిస్తారు. ఒకవేళ ఆపరేషన్ అవసరమైనా మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తక్కువ గాటుతోనే సురక్షితమైన విధానం ద్వారా ఆపరేషన్ నిర్వహించవచ్చు. ఈ శస్త్ర చికిత్స జరిగిన రోజునే ఇంటికి పంపిస్తారు. రొమ్ము నుంచి కణితి తొలగించిన ప్రాంతంలో మాత్రం చిన్న మచ్చ ఏర్పడే అవకాశం ఉంటుంది. వివిధ పద్ధతుల ద్వారా ఆ మచ్చను కూడా కనబడకుండా చేసే అవకాశం ఉంటుంది. ఫైబ్రోడినోమా (రొమ్ములో కణితి లేదా గడ్డ)కు పూర్తి స్థాయి చికిత్స పొందడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి దుష్ర్పభావాలు తలెత్తకుండా జాగ్రత్త పడొచ్చు. -డాక్టర్ వి. హేమంత్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస ్టయశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 33. నాకు ఏ విధమైన ఇబ్బందులూ లేవు. కానీ జ్వరం వచ్చినప్పుడు డాక్టర్‌కు చూపించుకుంటే బి.పి. 170/120 అని చెప్పారు. బి.పి.కి. మందులు వాడాలి అని చెప్పారు. మందులు వాడకుంటే ఫ్యూచర్లో ఏమైనా కిడ్నీ ప్రాబ్లం రావచ్చా? - సుకుమార్, వెంకటాపురం ఈ వయసులో ఏ కారణం లేకుండా బి.పి. (ఎసెన్షియల్ హైపర్ టెన్షన్) రావడం చాలా అరుదు. నలభై సంవత్సరాల లోపు బి.పి. ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా చూడాలి. మీరు యూరిన్ టెస్ట్, ఆల్ట్రాసౌండ్ అబ్డామిన్తో పాటు అవసరమైన ఇతర టెస్ట్‌లు చేయించుకొని బి.పి. ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బి.పి.కి తప్పనిసరిగా మందులు వాడాలి. లేకుంటే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మందులు వాడడమే కాకుండా ఉప్పు చాలా తగ్గించి తినాలి. క్రమం తప్పకుండా కనీసం ఒక గంట సేపు వాకింగ్ చేయడం మంచిది. మీరు ఉండాల్సిన . బరువు కంటే ఎక్కువగా ఉన్నట్లయితే బరువు తగ్గించుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే మానివేయాలి. నా వయసు 58. నేను విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. వీటి కోసం ఎక్కువగా నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) వాడుతున్నాను. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - సలీమ్, గుంటూరు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడినట్లయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందులు కలిపి ఉంటాయి. ఇవి కిడ్నీకి చాలా హాని చేస్తాయి. పెయిన్ కిల్లర్స్ కాకుండా ఇతర పద్ధతులతో (ఫిజియోథెరపీ)తో నొప్పి తగ్గించుకోవాలి. రోజూ నీళ్లు ఎక్కువగా తాగాలి. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకు మూడేళ్లు. ఇటీవల వాడికి తరచు జ్వరం వస్తోంది. డాక్టర్లు రాసిన మందులు వాడుతున్నంత సేపు తగ్గి మళ్లీ వస్తోంది. ఇలా వాడికి మాటిమాటికీ జ్వరం రావడంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. - సుధ, భద్రాచలం చిన్నారులు నిత్యం సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్పోజ్ అవుతుండటం వల్ల ఇలా జ్వరం వస్తుండటం చాలా సాధారణం. అందునా కాలం మారినప్పుడు (సీజనల్ వేరియేషన్స్) ఇన్ఫెక్షన్స్ఎక్కువగా రావచ్చు. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్ ఫీవర్ సిండ్రోమ్ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన సమస్యల వరకు ఇలా జ్వరం రావచ్చు. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన పరీక్షలతో పాటు దీర్ఘకాలికమైన జబ్బులు ఏమైనా అంతర్గతంగా ఉన్నాయేమో అని వాటి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు చేయించడం చాలా అవసరం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు - మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్, ఎన్ఎస్ఏఐడీ వంటివి చాలాకాలం పాటు వాడుతూ పోవడం చాలా అపాయకరం. అది సరైనదీ కాదు. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి ఈ అంశాలన్నీ చర్చించి, తగిన చికిత్స తీసుకోండి. మా పాప వయసు ఐదేళ్లు. ప్రతిసారీ చలికాలంలో పాప ఒళ్లంతా తెల్లటి పొడల్లాంటివి వస్తన్నాయి. ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఇది తిరగబెడుతుందేమోనని మాకు ఆందోళనగా ఉంది. మాకు ముందుగానే కొన్ని సూచనలు చెప్పండి. - రవికాంత్, పాడేరు మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఎగ్జిమా లేదా అలర్జిక్ డర్మటైటిస్ అని చెప్పవచ్చు. ఇందులో చర్మం ఎర్రబారడం, పొట్టులా రాలడం, విపరీతమైన దురదలు ఉంటాయి. కొంతమంది పిల్లల్లో చర్మంపై ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తుంటాం. ఇది ముఖ్యంగా వాతావరణంలో తీవ్రత (అంటే మరీ ఎక్కువ వేడిమి, మరీ ఎక్కువ చలి) ఉన్న సమయంలో రావడాన్ని గమనిస్తాం. ఇలాంటి పిల్లలకు మాయిశ్చరైజింగ్ సోప్స్ వాడటం, మాయిశ్చరైజింగ్ లోషన్స్ శరీరంపై రాయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి కూడా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ అలర్జీ ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోయే సమస్య కాదు. ముందుగా మీరు మీ పాపను మరీ తీవ్రమైన వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోండి. పైన పేర్కొన్న జాగ్రత్తలతో సమస్య తగ్గనప్పుడు డాక్టర్‌ను సంప్రదించి మైల్డ్ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. - డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్ -
సిగరెట్ వల్ల ఎముకలూ పొగచూరిపోతాయి!
నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకు మూత్రపిండాల సమస్య ఉంది. రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. కిడ్నీ మార్పిడి చేయించుకోవడం మంచిదని తెలిసిన వాళ్లు చెబుతున్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత కూడా డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుందా? మా కుటుంబ సభ్యులు నాకు కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారిలో ఎవరితోనూ నా బ్లడ్‌గ్రూపు కలవడం లేదు. నాకు కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు. - రమేశ్, ఆదిలాబాద్ కిడ్నీలు పూర్తిగా పాడై డయాలసిస్‌పై ఆధారపడుతున్న వారికి కిడ్నీ మార్పిడి ఉత్తమమైన మార్గం. మీరు రెండు పద్ధతుల ద్వారా కిడ్నీ మార్పిడి చేయించుకోవచ్చు. ఒకటి స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్. రెండోది ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్. స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మీలాంటి సమస్యతోనే బాధపడుతున్న మరొకరు ఉంటే... వారి కుటుంబ సభ్యులతో మీ బ్లడ్ మ్యాచ్ అయితే... వారి కుటుంబసభ్యులు మీకూ... మీ కుటుంబ సభ్యులు వారికీ... ఇలా దాతలను పరస్పరం మార్చుకొని... ఇరువురు బాధితులూ కిడ్నీలు పొంది, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవచ్చు. అయితే ఇప్పుడు అత్యాధునికమైన ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అందుబాటులోకి వచ్చింది. దాని వల్ల బ్లడ్‌గ్రూపు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో ప్రత్యేకమైన ప్లాస్మాఫెరాసిస్ పద్ధతిని అనుసరించి వేర్వేరు బ్లడ్గ్రూపులలోని యాంటీజెన్‌ను కలిసేలా చేస్తారు. ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానంలో కిడ్నీ మార్పిడి చేసుకున్నవారు కూడా కంపాటబుల్ కిడ్నీ మార్పిడి మాదిరిగానే మెరుగైన ఫలితాలు పొందుతున్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత డయాలసిస్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మీరు సాధారణ జీవితం గడపగలుగుతారు. లైఫ్ స్టైల్ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. రోజుకు పదిహేను నుంచి ఇరవై సిగరెట్లు తాగుతాను. ఇటీవల నా బరువు తగ్గింది. విటమిన్ డి పాళ్లు కూడా తగ్గాయి. మా డాక్టర్ సిగరెట్లు మానేయమని చెబుతున్నారు. సిగరెట్ దుష్ర్పభావం ఎముకలపైన ఉంటుందా? - ప్రేమ్‌కుమార్, బెంగళూరు అన్ని అవయవాల మాదిరిగానే పొగతాగే అలవాటు ఎముకలపైనా దుష్ర్పభావం చూపుతుంది. సిగరెట్ల వల్ల అనారోగ్యకరంగా బరువు తగ్గడం, విటమిన్ డి పాళ్లు తగ్గడం, ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకడం కూడా తగ్గడం జరుగుతుంది. పైగా మామూలు వ్యక్తులతో పోలిస్తే స్మోకర్లలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు 25 శాతం ఎక్కువ. అలాగే తుంటిఎముక ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పొగతాగే వారిలో ఎక్కువ. స్మోకింగ్ వల్ల అనేక దుష్ర్పభావాలు కనిపించి ఎముక సాంద్రత తగ్గుతుంది. అందుకు దారితీసే అంశాలివి... పొగతాగే అలవాటు వల్ల హార్మోనల్ మార్పులు వచ్చి క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి వెళ్లేలా చేసే పారాథైరాయిడ్ హార్మోన్ పాళ్లు, మహిళల్లో ఈస్ట్రోజెన్ పాళ్లు తగ్గుతాయి. పొగతాగే అలవాటు వల్ల విటమిన్ డి పాళ్లు తగ్గడంతో, శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గుతుంది. శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ పెరగడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్’ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల ఎముకకూ రక్తప్రసరణ తగ్గుతుంది. పొగతాగే అలవాటు వల్ల నరాలు స్పందించే వేగం తగ్గుతుంది. దాంతో వాళ్లు పడిపోయే అవకాశాలు ఎక్కువ. పొగలోని విషపదార్థాలు ఎముక కణాలపైనా నేరుగా తమ దుష్ర్పభావం చూపుతాయి. ఎముకలలోని బంతిగిన్నె కీలుతో పాటు అన్ని కీళ్లు పొగ వల్ల వేగంగా గాయపడే అవకాశాలుంటాయి. గాయాలు చాలా ఆలస్యంగా తగ్గుతాయి. భర్తకు పొగతాగే అలవాటు ఉన్నప్పుడు వారి భాగస్వామికి ప్యాసివ్స్మోకింగ్ బారినపడటం వల్ల వాళ్లకు పుట్టబోయే బిడ్డల ఎముకల బరువూ చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.అందుకే మీ డాక్టర్ చెప్పినట్లుగా మీరు వెంటనే పొగతాగే అలవాటు మానేయండి. గ్యాస్ట్రోంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 56 ఏళ్లు. గతంలో చేసిన కొన్ని పరీక్షల్లో లివర్ సిర్రోసిస్ వ్యాధి బయటపడింది. ఇందుకు తగిన చికిత్స తీసుకుంటున్నాను. గత ఏడాది మళ్లీ పరీక్షలు చేయిస్తే... హైపోథైరాయిడ్ సమస్య ఉన్నట్లు తేలింది. ఈ వ్యాధికి మందులు వాడాల్సిందిగా వైద్యులు సూచించారు. కానీ లివర్ సిర్రోసిస్ వల్ల థైరాయిడ్ మందులు పనిచేయడం లేదని డాక్టర్ చెబుతున్నారు. థైరాయిడ్ సమస్య తగ్గేదెలా? తగిన సలహా ఇవ్వగలరు. - సుభాష్, జగ్గయ్యపేట లివర్ సిర్రోసిస్ ఉన్నప్పుడు థైరాయిడ్ మందులు మాత్రమే కాకుండా, మిగతా చాలా మందులు శరీర జీవక్రియల (మెటబాలిజమ్) ప్రభావానికి లోనవుతాయి. థైరాయిడ్ మందులు పనిచేయాలంటే ముందుగా లివర్ కణాలలో జీవక్రియ సరిగ్గా జరగాల్సి ఉంటుంది. అలా జరగకపోవడం వల్ల మీ హైపోథైరాయిడ్ సమస్య తగ్గడం లేదు. మీరు కొన్ని ఆటోఇమ్యూన్ పరీక్షలు చేయించుకోవాలి. లివర్, థైరాయిడ్‌కు సంబంధించిన ఆటోఇమ్యూన్ హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంది. మీరు స్టెరాయిడ్స్ వాడటం వల్ల మీ రెండు వ్యాధులూ నయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. నా వయసు 36 ఏళ్లు. ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను. ఉద్యోగరీత్యా నాపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పని తర్వాత సేదదీరడం కోసం ప్రతి వీకెండ్లో ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటాను. దీనివల్ల లివర్ దెబ్బతినే ప్రమాదం ఉందా? ప్రతినెలా లివర్‌కు సంబంధించిన పరీక్షలు ఏమైనా చేయించమంటారా? వివరంగా చెప్పండి. - జే.ఆర్.పి., హైదరాబాద్ మీరు తీసుకునే ఆల్కహాల్ మోతాదు బట్టి లివర్ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత పరిమాణంలో ఆల్కహాల్ తీసుకుంటారో రాయలేదు. ఎందుకైనా మంచిది... మీరు ఒకసారి బేస్‌లైన్ టెస్టులు... ఎల్.ఎఫ్.టి., లిపిడ్ ప్రొఫైల్, ఓజీటీ, ఎఫ్.బి.ఎస్, క్రియాటినిన్ అనే పరీక్షలు చేయించుకోండి. ప్రతినెలా పరీక్షలు అవసరం లేదు. ఇప్పటికే మీకు డయాబెటిస్, లివర్ జబ్బులు ఉంటే చాలా తక్కువగా ఆల్కహాల్ తీసుకున్నా... అది మీకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి మీరు తక్షణం ఆల్కహాల్ మానేయడం మంచిది. -
ఇంట్లోనే డయాలసిస్... సీఏపీడీ
హోమియో కౌన్సెలింగ్ 1. మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి. - సునయన, నెల్లూరు ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో ఎన్నో స్థాయులు, వివిధ లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలో లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లలు తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం, నలుగురిలో కలవడలేకపోవడం, ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు గమనించి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠ స్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎఎమ్ రెడ్డి,పాజిటివ్ హోమియోపతి 2. లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నేను ఇటీవల బాగా అలసిపోతున్నాను. నడుము నొప్పి కూడా వస్తోంది. మాది ఎనిమిది గంటల షిఫ్ట్. నేను డబుల్ డ్యూటీలు చేస్తుంటాను. వరసగా రెండో షిఫ్ట్ కూడా పనిచేయడం వల్ల ఇలా జరుగుతోందా? ఈ అలసట అధిగమించడానికి మార్గాలు చెప్పండి. - మస్తాన్‌రావు, హైదరాబాద్ మీలా డబుల్ షిఫ్ట్ పనిచేసేవారిలో తీవ్రమైన అలసట, బాగా ఒత్తిడికి లోనైనట్లు అనిపించడం చాలా సాధారణం. పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు ఏకధాటిగా (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారిలో మీలా వృత్తిపరమైన అలసట వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇలా పనిచేసేవారిలో తీవ్రమైన అలసటతో పాటు కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలూ రావచ్చు. మీలాంటి వారు అలసటతో పాటు, వృత్తిసంబంధమైన ఇతర సమస్యలను నివారించేందుకు ఈ సూచనలు పాటించండి. * పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగలో కార్బన్‌మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అది రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది. *చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు. *మీ ఉద్యోగంలో ఏదైనా సమస్యలు, మీరు లక్ష్యాలను అధిగమించాల్సిన (టార్గెట్స్ రీచ్ కావాల్సిన) వృత్తిలో ఉన్నా అలసటకు లోనవుతారు. మీ సమస్యలను మీవెంట ఇంటికి మోసుకెళ్లకండి. * తగినంతగా నిద్రపొండి. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి. *మీరు పనిచేసే చోట కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పుల పరిమితికి మించి తాగకండి. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు. *రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి. * భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు. *ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ-హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా అలసటతోనూ, నడుంనొప్పితో బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్,సికింద్రాబాద్ 3. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నాను. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. నేను ఉండే ఊళ్లో డయాలసిస్ సెంటర్ లేదు. డయాలసిస్ కాకుండా వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? - షణ్ముఖరావు, ఆత్మకూరు ఇలా వారంలో మూడు సార్లు డయాలసిస్ చేయించాల్సిన వ్యక్తుల్లో కిడ్నీ మార్పిడి మంచి చికిత్స. అయితే ఇది అందరికీ సాధ్యపడే అంశం కాదు. మాటిమాటికీ హాస్పిటల్‌కు వెళ్లేందుకు అనువుగా లేనివారు, ఇంట్లోనే డయాలసిస్ చేసు కునే ప్రక్రియను కంటిన్యువస్ ఆంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్ (సీఏపీడీ) మెషిన్‌ను వాడటం మంచిది. ఇది చాలా సులువైన ప్రక్రియ. డయాలసిస్ పూర్తయ్యాక మామూలుగా తమ వృత్తులూ చేసుకోవచ్చు. దీనివల్ల జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) కూడా బాగా మెరుగవుతుంది. ఇలా డయాలసిస్ చేసుకునే వారికి బీపీతో పాటు ఇతర మందులు చాలా తక్కువగా అవసరం పడతాయి. నా వయసు 32 ఏళ్లు. తరచుగా జ్వరం. మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన మంట కూడా ఉంటోంది. ఇలా తరచూ జ్వరం, మూత్రంలో మంట వస్తున్నాయి. ఇలా మాటిమాటికీ జ్వరం రాకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? - మాలతి, జగ్గయ్యపేట మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్’తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా మీకు మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తున్న కారణం ఏమిటన్నది తెలుసుకోవాలి. మీకు షుగర్ ఉంటే కూడా ఇలా మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఒకసారి మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లుగానీ, మూత్రనాళాల్లో వాపుగానీ ఉన్నాయేమో చూడాలి. మీకు డాక్టర్ ఇచ్చిన యాంటీబయాటిక్ పూర్తి కోర్సు వాడకుండా ఉన్నా కూడా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్స్ తిరగబెట్టవచ్చు. మీకు ఏ కారణం లేకుండా ఇన్ఫెక్షన్ వస్తుంటే కనీసం మూడు నెలల పాటు యాంటీబయాటిక్స్ వాడాలి. రోజూ నీళ్లు ఎక్కువగా (అంటే రెండు నుంచి మూడు లీటర్లు) తాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా, వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లాలి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
మహిళల కోసం ప్రత్యేకంగా నెఫ్రాలజీ కౌన్సెలింగ్
ఇది కిడ్నీకి సంబంధించిన జబ్బేనా? నా వయసు 35 ఏళ్లు. షుగర్ ఉంది. ఈమధ్యకాలంలో కాళ్లు బాగా వాస్తున్నాయి. బలహీనంగా కూడా అనిపిస్తోంది. ఊపిరి తీసుకోవడం కూడా అప్పుడప్పుడూ ఇబ్బందిగా ఉంటోంది. జీర్ణశక్తి తగ్గింది. మూత్రవిసర్జనలో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి వాంతులు అవుతున్నాయి. ఇది కిడ్నీలకు సంబంధించిన జబ్బేమోనని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - మేరీ కృపావరం, కడప చాలా సందర్భాల్లో కిడ్నీలకు సంబంధించిన జబ్బుల విషయంలో ముందస్తు హెచ్చరికలుగా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అయితే శరీరంలో వచ్చే మార్పులను ముందుస్తు హెచ్చరికలుగా పరిగణించి జాగ్రత్తపడాలి. ప్రస్తుతం మీ విషయంలో కూడా మీరు చెప్పిన లక్షణాలన్నీ కిడ్నీ జబ్బులకు సంబంధించిన ముందస్తు సంకేతాలుగానే అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయంలో కాలయాపన మరింత ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే మీకు అందుబాటులో ఉన్న నెఫ్రాలజిస్టును మీరు కలవండి. ఏమాత్రం ఆలస్యం చేయవచ్చు. కిడ్నీ సంబంధిత జబ్బుల లక్షణాలు లేదా సంకేతాలను గ్రహించిన మూడు నెలలోనే ఆ జబ్బులను పరీక్షల ద్వారా నిర్ధారణ చేయించుకుని, చికిత్స ప్రారంభించకపోతే కిడ్నీలు పూర్తిగా విఫలం కాగలవు. ఒకసారి కిడ్నీలు విఫలమైన తర్వాత వాటిని సాధారణ స్థితికి తీసుకురావడం ఏ చికిత్స ద్వారా కూడా సాధ్యం కాదన్న వాస్తవాన్ని గ్రహించి, తక్షణమే వైద్యులను సంప్రదించండి. నా వయసు 50 ఏళ్లు. టైప్-2 డయాబెటిస్తో బాధపడుతున్న నాకు రెండు మూత్రపిండాలూ పాడైపోవడంతో చాలాకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. అయితే ప్రతిసారీ డయాలసిస్ కోసం ఆస్పత్రికి వెళ్లిరావడం ఇబ్బందిగా ఉంటోంది. దీనికి ప్రత్యామ్నాయ పద్ధతి ఉందని ఇటీవలే తెలిసింది. దాని గురించి వివరించండి. - ఎస్ ఇందిరాదేవి, బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం ఆస్పత్రి లేదా నర్సింగ్‌హోమ్‌లలో నిర్వహించే డయాలసిస్‌ను హీమోడయాలసిస్ అంటారు. అయితే ఇంటి దగ్గర మీరే స్వయంగా లేదా మీ కుటుంబ సభ్యుల సహాయంతో డయాలసిస్ చేసుకునే మరో ప్రక్రియ కూడా ఉంది. ఇదే పెరిటోనియల్ డయాలసిస్. అయితే ఇంటి దగ్గర డయాలసిస్ చేసుకోగల నేర్పు, ఓర్పు పేషెంట్‌కు ఉండాలి. లేదా దీనిని చేయగలవారు ఇంట్లో అందుబాటులో ఉండాలి. ఇందులో కడుపు లోపల అంటే ఉదర కుహరంలో ఆవరించిన పొరలలో ఉండే రక్తనాళాల్లోకి డయాలసేట్ అనే ద్రవాన్ని నింపుతూ ఎప్పటికప్పుడు రక్తంలో వ్యర్థాలను బయటకు తీయవచ్చు. రక్తాన్ని శుద్ధి చేసే ద్రవాన్ని కేథెటర్ ద్వారా కడుపులోకి పంపిస్తారు. ఈ ద్రవం నిర్ణీతకాలం వరకు కడుపులో ఉంటుంది. ఈ సమయంలో రక్తంలోని వ్యర్థాలు, రసాయనాలు, ద్రవాలు... కడుపులోపలి పొరను అంటిపెట్టుకుని ఉండే రక్తనాళాల నుంచి బయటకు వచ్చి ఆ ద్రవంలో కలుస్తాయి. నిర్ణీత సమయం తర్వాత వ్యర్థాలు కలిసిన ద్రవం పేషెంట్ శరీరం వెలుపల అమర్చిన సంచిలోకి డ్రెయిన్ అవుతుంది. కడుపులోకి ద్రవాన్ని పంపడం, కొంతసేపటి తర్వాత దాన్ని బయటకు తీయడం ప్రక్రియను ఎక్స్ఛేంజ్ అంటారు. రాత్రివేళ పేషెంట్ నిద్రించే సమయంలో కూడా డయాలసిస్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆటోమేటెడ్ సైక్లర్‌ను వినియోగిస్తారు. ఈ సైక్లర్ తనంతట తానుగా డయాలసిస్ ద్రవాన్ని కడుపులోపలికి పంపించడం, నిర్ణీత వ్యవధి తర్వాత దాన్ని బయటకు డ్రెయిన్ చేయడం వంటి విధులు నిర్వహిస్తుంది.