నెఫ్రాలజీ కౌన్సెలింగ్
నా వయసు 50 ఏళ్లు. టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకు మూత్రపిండాల సమస్య ఉంది. రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. కిడ్నీ మార్పిడి చేయించుకోవడం మంచిదని తెలిసిన వాళ్లు చెబుతున్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత కూడా డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుందా? మా కుటుంబ సభ్యులు నాకు కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారిలో ఎవరితోనూ నా బ్లడ్‌గ్రూపు కలవడం లేదు. నాకు కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు.
- రమేశ్, ఆదిలాబాద్
కిడ్నీలు పూర్తిగా పాడై డయాలసిస్‌పై ఆధారపడుతున్న వారికి కిడ్నీ మార్పిడి ఉత్తమమైన మార్గం. మీరు రెండు పద్ధతుల ద్వారా కిడ్నీ మార్పిడి చేయించుకోవచ్చు. ఒకటి స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్. రెండోది ఏబీఓ ఇన్‌కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్. స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మీలాంటి సమస్యతోనే బాధపడుతున్న మరొకరు ఉంటే... వారి కుటుంబ సభ్యులతో మీ బ్లడ్ మ్యాచ్ అయితే... వారి కుటుంబసభ్యులు మీకూ... మీ కుటుంబ సభ్యులు వారికీ... ఇలా దాతలను పరస్పరం మార్చుకొని... ఇరువురు బాధితులూ కిడ్నీలు పొంది, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవచ్చు.
అయితే ఇప్పుడు అత్యాధునికమైన ఏబీఓ ఇన్‌కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అందుబాటులోకి వచ్చింది. దాని వల్ల బ్లడ్‌గ్రూపు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో ప్రత్యేకమైన ప్లాస్మాఫెరాసిస్ పద్ధతిని అనుసరించి వేర్వేరు బ్లడ్‌గ్రూపులలోని యాంటీజెన్‌ను కలిసేలా చేస్తారు. ఏబీఓ ఇన్‌కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానంలో కిడ్నీ మార్పిడి చేసుకున్నవారు కూడా కంపాటబుల్ కిడ్నీ మార్పిడి మాదిరిగానే మెరుగైన ఫలితాలు పొందుతున్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత డయాలసిస్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మీరు సాధారణ జీవితం గడపగలుగుతారు.
లైఫ్ స్టైల్ కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. రోజుకు పదిహేను నుంచి ఇరవై సిగరెట్లు తాగుతాను. ఇటీవల నా బరువు తగ్గింది. విటమిన్ డి పాళ్లు కూడా తగ్గాయి. మా డాక్టర్ సిగరెట్లు మానేయమని చెబుతున్నారు. సిగరెట్ దుష్ర్పభావం ఎముకలపైన ఉంటుందా?
- ప్రేమ్‌కుమార్, బెంగళూరు
అన్ని అవయవాల మాదిరిగానే పొగతాగే అలవాటు ఎముకలపైనా దుష్ర్పభావం చూపుతుంది. సిగరెట్ల వల్ల అనారోగ్యకరంగా బరువు తగ్గడం, విటమిన్ డి పాళ్లు తగ్గడం, ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకడం కూడా తగ్గడం జరుగుతుంది. పైగా మామూలు వ్యక్తులతో పోలిస్తే స్మోకర్లలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు 25 శాతం ఎక్కువ. అలాగే తుంటిఎముక ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పొగతాగే వారిలో ఎక్కువ. స్మోకింగ్ వల్ల అనేక దుష్ర్పభావాలు కనిపించి ఎముక సాంద్రత తగ్గుతుంది. అందుకు దారితీసే అంశాలివి... పొగతాగే అలవాటు వల్ల హార్మోనల్ మార్పులు వచ్చి క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి వెళ్లేలా చేసే పారాథైరాయిడ్ హార్మోన్ పాళ్లు, మహిళల్లో ఈస్ట్రోజెన్ పాళ్లు తగ్గుతాయి.
పొగతాగే అలవాటు వల్ల విటమిన్ డి పాళ్లు తగ్గడంతో, శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గుతుంది. శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ పెరగడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్’ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల ఎముకకూ రక్తప్రసరణ తగ్గుతుంది. పొగతాగే అలవాటు వల్ల నరాలు స్పందించే వేగం తగ్గుతుంది. దాంతో వాళ్లు పడిపోయే అవకాశాలు ఎక్కువ. పొగలోని విషపదార్థాలు ఎముక కణాలపైనా నేరుగా తమ దుష్ర్పభావం చూపుతాయి. ఎముకలలోని బంతిగిన్నె కీలుతో పాటు అన్ని కీళ్లు పొగ వల్ల వేగంగా గాయపడే అవకాశాలుంటాయి. గాయాలు చాలా ఆలస్యంగా తగ్గుతాయి. భర్తకు పొగతాగే అలవాటు ఉన్నప్పుడు వారి భాగస్వామికి ప్యాసివ్‌స్మోకింగ్ బారినపడటం వల్ల వాళ్లకు పుట్టబోయే బిడ్డల ఎముకల బరువూ చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.అందుకే మీ డాక్టర్ చెప్పినట్లుగా మీరు వెంటనే పొగతాగే అలవాటు మానేయండి.
గ్యాస్ట్రోంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 56 ఏళ్లు. గతంలో చేసిన కొన్ని పరీక్షల్లో లివర్ సిర్రోసిస్ వ్యాధి బయటపడింది. ఇందుకు తగిన చికిత్స తీసుకుంటున్నాను. గత ఏడాది మళ్లీ పరీక్షలు చేయిస్తే... హైపోథైరాయిడ్ సమస్య ఉన్నట్లు తేలింది. ఈ వ్యాధికి మందులు వాడాల్సిందిగా వైద్యులు సూచించారు. కానీ లివర్ సిర్రోసిస్ వల్ల థైరాయిడ్ మందులు పనిచేయడం లేదని డాక్టర్ చెబుతున్నారు. థైరాయిడ్ సమస్య తగ్గేదెలా? తగిన సలహా ఇవ్వగలరు.
- సుభాష్, జగ్గయ్యపేట
లివర్ సిర్రోసిస్ ఉన్నప్పుడు థైరాయిడ్ మందులు మాత్రమే కాకుండా, మిగతా చాలా మందులు శరీర జీవక్రియల (మెటబాలిజమ్) ప్రభావానికి లోనవుతాయి. థైరాయిడ్ మందులు పనిచేయాలంటే ముందుగా లివర్ కణాలలో జీవక్రియ సరిగ్గా జరగాల్సి ఉంటుంది. అలా జరగకపోవడం వల్ల మీ హైపోథైరాయిడ్ సమస్య తగ్గడం లేదు. మీరు కొన్ని ఆటోఇమ్యూన్ పరీక్షలు చేయించుకోవాలి. లివర్, థైరాయిడ్‌కు సంబంధించిన ఆటోఇమ్యూన్ హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంది. మీరు స్టెరాయిడ్స్ వాడటం వల్ల మీ రెండు వ్యాధులూ నయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి.
నా వయసు 36 ఏళ్లు. ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను. ఉద్యోగరీత్యా నాపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పని తర్వాత సేదదీరడం కోసం ప్రతి వీకెండ్‌లో ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటాను. దీనివల్ల లివర్ దెబ్బతినే ప్రమాదం ఉందా? ప్రతినెలా లివర్‌కు సంబంధించిన పరీక్షలు ఏమైనా చేయించమంటారా? వివరంగా చెప్పండి.
- జే.ఆర్.పి., హైదరాబాద్
మీరు తీసుకునే ఆల్కహాల్ మోతాదు బట్టి లివర్ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత పరిమాణంలో ఆల్కహాల్ తీసుకుంటారో రాయలేదు. ఎందుకైనా మంచిది... మీరు ఒకసారి బేస్‌లైన్ టెస్టులు... ఎల్.ఎఫ్.టి., లిపిడ్ ప్రొఫైల్, ఓజీటీ, ఎఫ్.బి.ఎస్, క్రియాటినిన్ అనే పరీక్షలు చేయించుకోండి. ప్రతినెలా పరీక్షలు అవసరం లేదు. ఇప్పటికే మీకు డయాబెటిస్, లివర్ జబ్బులు ఉంటే చాలా తక్కువగా ఆల్కహాల్ తీసుకున్నా... అది మీకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి మీరు తక్షణం ఆల్కహాల్ మానేయడం మంచిది.
సిగరెట్ వల్ల ఎముకలూ పొగచూరిపోతాయి!
Published Thu, Oct 15 2015 11:42 PM | Last Updated on Wed, Apr 3 2019 4:22 PM
Advertisement
Advertisement