హస్తవాసి
ఆంకాలజీ కౌన్సెలింగ్
నా వయసు 18 ఏళ్లు. డిగ్రీ చదువుతున్నాను. నేను సొంతంగా నా రొమ్ములను పరీక్షించుకున్నప్పుడు రెండేళ్ల క్రితం నా కుడి వైపు రొమ్ములో వేరుశనగ కాయ పరిమాణంలో కణితి ఉన్నట్లు గమనించాను. ఆ కణితి చాలా నొప్పిగా ఉంటోంది. దాంతో నేను చాలా అసౌకర్యానికి గురవుతుండడంతో పాటు చదువుపై దృష్టి సారించలేకపోతున్నాను. నా సమస్యను ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేనే ఇబ్బంది పడుతున్నాను. ఇది రొమ్ము క్యాన్సరేమో అని చాలా భయంగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన చూపించగలరు.
- ఓ సోదరి
మీ వయసులో రొమ్ములో కణితి (ఫైబ్రోడినోమా) ఏడ్పడటం సాధారణమైన సమస్య. రొమ్ములో ఏర్పడిన కణుతులు, చిన్న చిన్న గడ్డలు క్యాన్సర్లు కావు. ఇది ఒక వ్యాధి కాదు. కేవలం బ్రెస్ట్ డెవలప్‌మెంట్‌లో జరిగే సాధారణ పరిణామం మాత్రమే. కాబట్టి మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీ సమస్యకు సరైన చికిత్స అవసరం. కొన్ని సాధారణ పరీక్షల ద్వారా వైద్యులు పూర్తిగా పరీక్షించి, ఆ కణితిని తొలగించాలా, వద్దా అని నిర్ధారిస్తారు.
క్రమంగా కణితి పరిమాణం పెరుగుతూ ఉండటం, నొప్పి తగ్గకుండా స్థిరంగా ఉండడం, వైద్య పరీక్షల్లో క్యాన్సర్ సూచనలు కనిపించడం, రొమ్ము క్యాన్సర్ కలిగిన కుటుంబ చరిత్ర ఉన్న వారిలో శస్త్రచికిత్స నిర్వహించి రొమ్ములోని కణితి తొలగించవలసి ఉంటుంది. కణితి పరిమాణాన్ని బట్టి ఆపరేషన్ అవసరమా, కాదా అని వైద్యులు నిర్థారిస్తారు. ఒకవేళ ఆపరేషన్ అవసరమైనా మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తక్కువ గాటుతోనే సురక్షితమైన విధానం ద్వారా ఆపరేషన్ నిర్వహించవచ్చు.
ఈ శస్త్ర చికిత్స జరిగిన రోజునే ఇంటికి పంపిస్తారు. రొమ్ము నుంచి కణితి తొలగించిన ప్రాంతంలో మాత్రం చిన్న మచ్చ ఏర్పడే అవకాశం ఉంటుంది. వివిధ పద్ధతుల ద్వారా ఆ మచ్చను కూడా కనబడకుండా చేసే అవకాశం ఉంటుంది. ఫైబ్రోడినోమా (రొమ్ములో కణితి లేదా గడ్డ)కు పూర్తి స్థాయి చికిత్స పొందడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి దుష్ర్పభావాలు తలెత్తకుండా జాగ్రత్త పడొచ్చు.
-డాక్టర్ వి. హేమంత్
సీనియర్ సర్జికల్ ఆంకాలజిస ్టయశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
నా వయసు 33. నాకు ఏ విధమైన ఇబ్బందులూ లేవు. కానీ జ్వరం వచ్చినప్పుడు డాక్టర్‌కు చూపించుకుంటే బి.పి. 170/120 అని చెప్పారు. బి.పి.కి. మందులు వాడాలి అని చెప్పారు. మందులు వాడకుంటే ఫ్యూచర్‌లో ఏమైనా కిడ్నీ ప్రాబ్లం రావచ్చా?
- సుకుమార్, వెంకటాపురం
ఈ వయసులో ఏ కారణం లేకుండా బి.పి. (ఎసెన్షియల్ హైపర్ టెన్షన్) రావడం చాలా అరుదు. నలభై సంవత్సరాల లోపు బి.పి. ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా చూడాలి. మీరు యూరిన్ టెస్ట్, ఆల్ట్రాసౌండ్ అబ్డామిన్‌తో పాటు అవసరమైన ఇతర టెస్ట్‌లు చేయించుకొని బి.పి. ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బి.పి.కి తప్పనిసరిగా మందులు వాడాలి. లేకుంటే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మందులు వాడడమే కాకుండా ఉప్పు చాలా తగ్గించి తినాలి. క్రమం తప్పకుండా కనీసం ఒక గంట సేపు వాకింగ్ చేయడం మంచిది. మీరు ఉండాల్సిన . బరువు కంటే ఎక్కువగా ఉన్నట్లయితే బరువు తగ్గించుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే మానివేయాలి.
నా వయసు 58. నేను విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. వీటి కోసం ఎక్కువగా నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) వాడుతున్నాను. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- సలీమ్, గుంటూరు
ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడినట్లయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందులు కలిపి ఉంటాయి. ఇవి కిడ్నీకి చాలా హాని చేస్తాయి. పెయిన్ కిల్లర్స్ కాకుండా ఇతర పద్ధతులతో (ఫిజియోథెరపీ)తో నొప్పి తగ్గించుకోవాలి. రోజూ నీళ్లు ఎక్కువగా తాగాలి.
- డాక్టర్ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా బాబుకు మూడేళ్లు. ఇటీవల వాడికి తరచు జ్వరం వస్తోంది. డాక్టర్లు రాసిన మందులు వాడుతున్నంత సేపు తగ్గి మళ్లీ వస్తోంది. ఇలా వాడికి మాటిమాటికీ జ్వరం రావడంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి.
- సుధ, భద్రాచలం
చిన్నారులు నిత్యం సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్‌పోజ్ అవుతుండటం వల్ల ఇలా జ్వరం వస్తుండటం చాలా సాధారణం. అందునా కాలం మారినప్పుడు (సీజనల్ వేరియేషన్స్) ఇన్ఫెక్షన్స్‌ఎక్కువగా రావచ్చు. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్ ఫీవర్ సిండ్రోమ్ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన సమస్యల వరకు ఇలా జ్వరం రావచ్చు. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు.
అయితే ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన పరీక్షలతో పాటు దీర్ఘకాలికమైన జబ్బులు ఏమైనా అంతర్గతంగా ఉన్నాయేమో అని వాటి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు చేయించడం చాలా అవసరం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు - మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్, ఎన్‌ఎస్‌ఏఐడీ వంటివి చాలాకాలం పాటు వాడుతూ పోవడం చాలా అపాయకరం. అది సరైనదీ కాదు. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి ఈ అంశాలన్నీ చర్చించి, తగిన చికిత్స తీసుకోండి.
మా పాప వయసు ఐదేళ్లు. ప్రతిసారీ చలికాలంలో పాప ఒళ్లంతా తెల్లటి పొడల్లాంటివి వస్తన్నాయి. ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఇది తిరగబెడుతుందేమోనని మాకు ఆందోళనగా ఉంది. మాకు ముందుగానే కొన్ని సూచనలు చెప్పండి.
- రవికాంత్, పాడేరు
మీ పాపకు ఉన్న కండిషన్‌ను ఎగ్జిమా లేదా అలర్జిక్ డర్మటైటిస్ అని చెప్పవచ్చు. ఇందులో చర్మం ఎర్రబారడం, పొట్టులా రాలడం, విపరీతమైన దురదలు ఉంటాయి. కొంతమంది పిల్లల్లో చర్మంపై ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తుంటాం. ఇది ముఖ్యంగా వాతావరణంలో తీవ్రత (అంటే మరీ ఎక్కువ వేడిమి, మరీ ఎక్కువ చలి) ఉన్న సమయంలో రావడాన్ని గమనిస్తాం. ఇలాంటి పిల్లలకు మాయిశ్చరైజింగ్ సోప్స్ వాడటం, మాయిశ్చరైజింగ్ లోషన్స్ శరీరంపై రాయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి కూడా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ అలర్జీ ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోయే సమస్య కాదు. ముందుగా మీరు మీ పాపను మరీ తీవ్రమైన వాతావరణానికి ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోండి. పైన పేర్కొన్న జాగ్రత్తలతో సమస్య తగ్గనప్పుడు డాక్టర్‌ను సంప్రదించి మైల్డ్ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
- డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్
రొమ్ములో ఏర్పడే కణతులన్నీ క్యాన్సర్లు కాదు..!
Published Sun, Nov 8 2015 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM
Advertisement
Advertisement