ఇది కిడ్నీకి సంబంధించిన జబ్బేనా?
నా వయసు 35 ఏళ్లు. షుగర్ ఉంది. ఈమధ్యకాలంలో కాళ్లు బాగా వాస్తున్నాయి. బలహీనంగా కూడా అనిపిస్తోంది. ఊపిరి తీసుకోవడం కూడా అప్పుడప్పుడూ ఇబ్బందిగా ఉంటోంది. జీర్ణశక్తి తగ్గింది. మూత్రవిసర్జనలో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి వాంతులు అవుతున్నాయి. ఇది కిడ్నీలకు సంబంధించిన జబ్బేమోనని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
- మేరీ కృపావరం, కడప
చాలా సందర్భాల్లో కిడ్నీలకు సంబంధించిన జబ్బుల విషయంలో ముందస్తు హెచ్చరికలుగా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అయితే శరీరంలో వచ్చే మార్పులను ముందుస్తు హెచ్చరికలుగా పరిగణించి జాగ్రత్తపడాలి. ప్రస్తుతం మీ విషయంలో కూడా మీరు చెప్పిన లక్షణాలన్నీ కిడ్నీ జబ్బులకు సంబంధించిన ముందస్తు సంకేతాలుగానే అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయంలో కాలయాపన మరింత ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే మీకు అందుబాటులో ఉన్న నెఫ్రాలజిస్టును మీరు కలవండి. ఏమాత్రం ఆలస్యం చేయవచ్చు. కిడ్నీ సంబంధిత జబ్బుల లక్షణాలు లేదా సంకేతాలను గ్రహించిన మూడు నెలలోనే ఆ జబ్బులను పరీక్షల ద్వారా నిర్ధారణ చేయించుకుని, చికిత్స ప్రారంభించకపోతే కిడ్నీలు పూర్తిగా విఫలం కాగలవు. ఒకసారి కిడ్నీలు విఫలమైన తర్వాత వాటిని సాధారణ స్థితికి తీసుకురావడం ఏ చికిత్స ద్వారా కూడా సాధ్యం కాదన్న వాస్తవాన్ని గ్రహించి, తక్షణమే వైద్యులను సంప్రదించండి.
నా వయసు 50 ఏళ్లు. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న నాకు రెండు మూత్రపిండాలూ పాడైపోవడంతో చాలాకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. అయితే ప్రతిసారీ డయాలసిస్ కోసం ఆస్పత్రికి వెళ్లిరావడం ఇబ్బందిగా ఉంటోంది. దీనికి ప్రత్యామ్నాయ పద్ధతి ఉందని ఇటీవలే తెలిసింది. దాని గురించి వివరించండి.
- ఎస్ ఇందిరాదేవి, బీహెచ్‌ఈఎల్, రామచంద్రాపురం
ఆస్పత్రి లేదా నర్సింగ్‌హోమ్‌లలో నిర్వహించే డయాలసిస్‌ను హీమోడయాలసిస్ అంటారు. అయితే ఇంటి దగ్గర మీరే స్వయంగా లేదా మీ కుటుంబ సభ్యుల సహాయంతో డయాలసిస్ చేసుకునే మరో ప్రక్రియ కూడా ఉంది. ఇదే పెరిటోనియల్ డయాలసిస్. అయితే ఇంటి దగ్గర డయాలసిస్ చేసుకోగల నేర్పు, ఓర్పు పేషెంట్‌కు ఉండాలి. లేదా దీనిని చేయగలవారు ఇంట్లో అందుబాటులో ఉండాలి. ఇందులో కడుపు లోపల అంటే ఉదర కుహరంలో ఆవరించిన పొరలలో ఉండే రక్తనాళాల్లోకి డయాలసేట్ అనే ద్రవాన్ని నింపుతూ ఎప్పటికప్పుడు రక్తంలో వ్యర్థాలను బయటకు తీయవచ్చు. రక్తాన్ని శుద్ధి చేసే ద్రవాన్ని కేథెటర్ ద్వారా కడుపులోకి పంపిస్తారు. ఈ ద్రవం నిర్ణీతకాలం వరకు కడుపులో ఉంటుంది. ఈ సమయంలో రక్తంలోని వ్యర్థాలు, రసాయనాలు, ద్రవాలు... కడుపులోపలి పొరను అంటిపెట్టుకుని ఉండే రక్తనాళాల నుంచి బయటకు వచ్చి ఆ ద్రవంలో కలుస్తాయి. నిర్ణీత సమయం తర్వాత వ్యర్థాలు కలిసిన ద్రవం పేషెంట్ శరీరం వెలుపల అమర్చిన సంచిలోకి డ్రెయిన్ అవుతుంది. కడుపులోకి ద్రవాన్ని పంపడం, కొంతసేపటి తర్వాత దాన్ని బయటకు తీయడం ప్రక్రియను ఎక్స్ఛేంజ్ అంటారు. రాత్రివేళ పేషెంట్ నిద్రించే సమయంలో కూడా డయాలసిస్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆటోమేటెడ్ సైక్లర్‌ను వినియోగిస్తారు. ఈ సైక్లర్ తనంతట తానుగా డయాలసిస్ ద్రవాన్ని కడుపులోపలికి పంపించడం, నిర్ణీత వ్యవధి తర్వాత దాన్ని బయటకు డ్రెయిన్ చేయడం వంటి విధులు నిర్వహిస్తుంది.
మహిళల కోసం ప్రత్యేకంగా నెఫ్రాలజీ కౌన్సెలింగ్
Published Thu, Jul 9 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement
Advertisement