వేసవి వేడి పెరిగింది కదా... వ్యాయామం ఆపేయాలా?
ఈమధ్యే ఫిబ్రవరి మొదటివారంలో వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు మార్చిలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి కదా... ఇలాంటి వేడి వాతావరణంలో వ్యాయామం చేయకూడదని, అది మంచిదికాదని ఫ్రెండ్స్ అంటున్నారు. నేను వ్యాయామం ఆపేయాలా? దయచేసి నాకు సలహా ఇవ్వండి. – ఎల్. రామచంద్రం, విజయవాడ
వేసవిలో వ్యాయామం ఆపేయాల్సిన పనిలేదు గానీ ఈ సీజన్‌లో వ్యాయామం చేసేవారు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. అవేమిటంటే... మన శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి శరీరంలోని చర్మం, రక్తనాళాలు పనిచేస్తాయి. మన శారీరక శ్రమ పెరగగానే రక్తనాళాల్లోకి రక్తం ఎక్కువగా ప్రవహించి చర్మాన్ని చేరుతుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి చర్మంపైన ఉన్న స్వేదగ్రంథులు చెమటను స్రవిస్తాయి. ఆ చెమట ఆవిరి అయ్యే క్రమంలో శరీరం నుంచి ఉష్ణోగ్రతను తీసుకుంటుంది. అందుకే చర్మంపై చెమట పట్టినప్పుడు ఫ్యాన్ నుంచి గానీ, చెట్ల నుంచి గానీ గాలి సోకితే ఒంటికి హాయిగా అనిపిస్తుంది.
అలా శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించడానికి చెమట తోడ్పడుతుంది. అయితే శారీరక శ్రమ అలాగే కొనసాగి ఈ చెమట పట్టే ప్రక్రియ అదేపనిగా జరుగుతుంటే... మన మేను నీటినీ, దానితో పాటు ఖనిజలవణాలను కోల్పోతుంది. మరీ ఎక్కువ వేడిమికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు, మనం తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోనప్పుడు మనకు చెమట అతిగా పట్టి శరీర ఉష్ణోగ్రతను ఒకేలా నిర్వహించే వ్యవస్థ దెబ్బతినవచ్చు. అప్పుడు కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అంతేకాదు... వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చాలాసేపు కూర్చొని ఉండి, అకస్మాత్తుగా నిలబడినా లేదా అదేపనిగా నిలబడి వ్యాయామం చేసినా అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.దీన్నే ‘హీట్ సింకోప్ అండ్ ఎక్సర్‌సైజ్ అసోసియేటెడ్ కొలాప్స్’ అని అంటారు. చాలా మంది చెప్పేట్లుగా వాతావరణంలో వేడి పెరుగుతున్న ఇలాంటి సమయంలో వ్యాయామం మాననక్కర్లేదు గానీ పైన చెప్పిన అనర్థాలు నివారించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించండి. అవి...
♦ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో పగటివేళ ఎండకు ఎక్స్‌పోజ్ కావద్దు. మీరు మీ వ్యాయామాలను వాతావరణం చల్లగా ఉండే వేకువజామున చేయండి. ♦ చెమటను పీల్చే కాటన్ దుస్తులను ధరించండి.
♦ బాగా నీళ్లు తాగండి. ఒంట్లో ఖనిజ లవణాలు (ఎలక్రొలైట్స్) భర్తీ అయ్యేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి.
♦ మీరు వ్యాయామం చేసే ముందర ఒకసారి వాతావరణం ఎలా ఉందో పరిశీలించండి. మరీ వేడిగా ఉంటే వ్యాయామాన్ని చల్లటి వేళకు వాయిదా వేసుకోండి. ఒకవేళ మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో తలనొప్పి, కళ్లుతిరిగినట్లు, వాంతి వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి, డాక్టర్‌ను సంప్రదించండి.
ఆరోగ్యకరంగా బరువు పెరగడం ఎలా?
నా వయసు 23 ఏళ్లు. నేను చాలా సన్నగా ఉంటానని అందరూ ఎగతాళి చేస్తుంటారు. నా ఎత్తు ఐదడుగుల తొమ్మిది అంగుళాలు. బరువు కేవలం 46 కేజీలు మాత్రమే. నేను లావు పెరగడానికి సలహాలు ఇవ్వండి. ఏమైనా మందులు వాడాలా చెప్పగలరు. – ఎమ్. సంతోష్, విశాఖపట్నం
కొందరు బరువు పెరగకపోవడానికి సాధారణ కారణాలు ఇవి...
♦జన్యుపరమైనవి సరిగా తినకపోవడం
♦ చాలా తీవ్రమైన శారీరక శ్రమ ఉన్న వృత్తిలో ఉండటం
♦ అవి వ్యాయామం. ఈ సమస్యలే గాక ఇక ఆరోగ్యపరంగా కొందరికి ఆహారం తీసుకోవడం విషయంలో వైద్యపకరమైన రుగ్మతలు ఉన్నప్పుడు కూడా బరువు పెరగరు. మీ విషయంలో సమస్య ఏమిటో తెలుసుకోడానికి ముందుగా వైద్యుడిని కలవండి. డాక్టరు మిమ్మల్ని పరీక్షించి...
♦ మీకు ఏదైనా వైద్యపరమైన సమస్య ఉందేమో తెలుసుకోడానికి తగిన పరీక్షలు చేయించి వాటిని నిర్ధారణ చేస్తారు (ఉదా: ౖహె పర్ థైరాయిడిజమ్) మీరు తీసుకునే ఆహరంలో పోషకాలు పాళ్లు ఎలా ఉన్నాయో అన్నదానితో పాటు మీ శారీరక శ్రమ వివరాలను అడిగి తెలుసుకుంటారు.
♦ ఆ తర్వాత ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు మీరు తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామాల గురించి వివరిస్తారు. మీకు కొన్ని సూచనలు : ∙మీరు ఇప్పుడు తీసుకుంటున్న పరిమాణం కంటే పెద్ద పరిమాణాల్లో కనీసం మూడుసార్లయినా ఆహారం తీసుకోండి. మధ్యలో మరో మూడుసార్లు చిన్న పరిమాణాల్లో మరో మూడుసార్లు తినండి. ఇలా రోజుకు ఆరుసార్లు తినండి
♦ మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. అవి కండరాల పెరుగుదలకు దోహదపడతాయి. కేవలం ఆరోగ్యకరమైన ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి లేకపోతే మీరు అతిగా తీసుకునే ప్రోటీన్ మీ అంతర్గత అవయవాలపై చెడుప్రభావం చూపుతుంది. (ముఖ్యంగా కిడ్నీలు). అందుకే హై–ప్రోటీన్ డైట్ వద్దు.
♦ మీ ఆహారంలో పండ్లు, పెరుగు, కస్టర్డ్, మిల్క్‌షేక్‌లు నిత్యం ఉండేలా చూసుకోండి.
♦ ఆరుసార్లు తినే ఆహారంలో అతిగా కొవ్వులు, పోషకాలు లేకుండా ఉండే జంక్‌ఫుడ్ లేకుండా జాగ్రత్త తీసుకోండి.
♦ ఇక నట్స్ ఎక్కువగా తీసుకోండి.
♦ వెన్న, ఆల్మండ్, వేరుశెనక్కాయలు, డ్రైఫ్రూట్స్ మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి.
♦ మీరు వాడే నూనెకు బదులు ఆరోగ్యకరమైన ఆలివ్ ఆయిల్‌ను వాడండి.
♦ అతి వ్యాయామం కాకుండా పరిమితమైన వ్యాయామం తప్పక చేయండి. మీ వ్యాయామాలు ఎలా ఉండాలంటే అతిగా చేసి కొద్దిసేపట్లో ముగిసేలా కాకుండా, మెల్లగా చేస్తూ... చాలాసేపు కొనసాగేలా జాగ్రత్తపడండి. బరువు పెరగడానికి దోహదపడతాయంటూ న్యూస్‌పేపర్లలో, టీవీల్లో కనిపించే ప్రకటనలలోని పౌడర్ల జోలికి వెళ్లకండి. పరిమితమైన కొవ్వులు శరీర జీవకార్యకలాపాలకు అవసరం. అంత మేరకు మాత్రమే కొవ్వులు పెరిగేలా ముందుగా మీరు ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇక మీరు బరువు పెరిగే క్రమం కూడా చాలా మెల్లగా జరగాలి. అంతేతప్ప ఒకేసారి కాదు.
- డాక్టర్ సుధీంద్ర ఊటూరి ,లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment