
నవరాత్రి పండుగ అంటే తొమ్మిదిరోజుల పాటు శక్తిని ఆరాధించడం. నవ అనే పదానికి తొమ్మిది అని అర్థం. తొమ్మిది రాత్రులు ఆ తల్లిని పూజించి పదో రోజు విజయ దశమి రోజున వేడుకగా, భక్తిశ్రద్ధలతో ఆచరించడం. మన అభివృద్ధికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా, మనసును ఆధ్యాత్మికత వైపుకు మళ్లించమని, భగవంతుని ముందు దీపం వెలిగించి ఆ తల్లిని ప్రార్థించడం ఈ పండుగ ప్రాధాన్యత.
1. గుడాన్నప్రీత మానసా: ఈపండుగలో గుడాన్న నివేదనకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. గుడము అంటే బెల్లం, అన్నం అంటే బియ్యంతో వండినది అని అర్థం. గుడాన్నం అంటే బెల్లం, బియ్యం కలిపి చేసే వంట. లలితామ్మవారికి గుడాన్నం అంటే ప్రీతి. అందుకే లలితా సహస్రంలో గుడాన్నప్రీత మానసా అని అర్చిస్తారు.
2. స్నిగ్ధౌదన ప్రియా: స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనము అంటే అన్నం, ప్రియా అంటే ఇష్టపడటం. తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకికార్థం. తెల్లటి అన్నం అనగానే తెలుపు వర్ణమని కాదు, స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని పారమార్థికార్థం. తెలుపు స్వచ్ఛతకు, పరిశుభ్రతకు, నిర్మలమైన అంతరంగానికి మారుపేరు. మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే చేసే పనులు అంత స్వచ్ఛంగా ఉంటాయని పండితులు చెబుతారు. పని పట్ల నిబద్ధత, భక్తిభావం కలిగి ఉండాలని, అమ్మవారిలాగే మనం ఆచరించే కర్మలు స్వచ్ఛంగా ఉండాలని ఈ ప్రసాదం సూచిస్తుంది. అందుకే స్నిగ్ధౌదన ప్రియా అని ఆ తల్లిని అర్చిస్తారు.
3. పాయసాన్నప్రియా: పయః అంటే పాలు, అన్నం అంటే వండబడిన బియ్యం. పాలు, బియ్యానికి మధుర పదార్థం జత చేసి వండిన వంట. ఆ తల్లికి ఈ వంటకం మీద ప్రీతి ఎక్కువ. మనం మాట్లాడే మాటలు, చేసే పనులు ఇతరులకు మధురంగా అనిపించాలి. మధురపదార్థం జిహ్వను తాకగానే మనసు ఆనంద తరంగాలలో డోలలూగుతుంది. మధురమైన సంభాషణలు పలికితే ఇతరుల మనసులు కూడా ఆనందసాగరంలో తేలియాడుతాయి. అందువల్లే ఆ తల్లి పాయసాన్నప్రియా నామం ద్వారా తియ్యని మాటలను పలుకమని బోధిస్తోంది.
4. మధుప్రీతా: మధు అంటే తేనె అనే అర్థం కూడా ఉంది. ప్రీతా అంటే ఇష్టపడటం. తేనె వంటిపదార్థాలను ఇష్టపడటం అని బాహ్యార్థం. తేనె సకల వ్యాధులకు నివారణోపాయం. తేనెను స్వీకరించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చుననే అంతరార్థంతో ఆ తల్లిని మధుప్రీతా అని అర్చిస్తాం.
5. దద్ధ్యన్నాసక్త హృదయా: దధి అంటే పెరుగు, అన్నం అంటే బియ్యంతో వండినది. ఆసక్త అంటే అభీష్టాన్ని చూపడం, హృదయా అంటే అంతటి మనస్సు కలిగినది. పెరుగుతో వండిన అన్నం పట్ల ఆసక్తి కలిగిన హృదయం కలిగిన తల్లి అని అర్థం. పాలను కాచి, తోడు వేస్తే కాని పెరుగు లభించదు. పెరుగుకు అన్నం జోడించి తయారుచేసేదే దద్ధ్యోదనం. కార్యంలో విజయం సులువుగా లభించదని, లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల, దీక్ష అవసరమని ఈ నైవేద్యం ద్వారా ఆ తల్లి చెబుతోంది. ఎంతో కొంత శ్రమకోర్చితేనే పెరుగు లభిస్తుంది. కాని సాధించిన తర్వాత లభించే రుచి వర్ణనాతీతం అని ఈ మంత్రం తెలియచేస్తోంది.
6. ముద్గౌదనాసక్త హృదయా: ముద్గ అంటే పెసలు, ఓదనం అంటే అన్నం, ఆసక్త అంటే అభిరుచి కలిగిన, హృదయా అంటే మనసు కలిగిన అని అర్థం. ఆ తల్లికి పెసలతో వండిన అన్నమంటే ప్రీతి. నిత్యం గుప్పెడు పెసలు తింటే ఆరోగ్యం అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఈ పదార్థాలను తిని ఆరోగ్యంగా జీవించమని ఆ తల్లి చెబుతోంది. అందుకే ఆమెను ముద్గౌదనాసక్త హృదయా అని ఆరాధిస్తున్నాం
7. హరిద్రాన్నైక రసికా: హరిద్రం అంటే పసుపు, అన్నం అంటే బియ్యంతో వండినది. మనం మన పరిభాషలో పులిహోరగా పిల్చుకుంటాం. పసుపు శుభానికి సూచిక. సర్వ సూక్ష్మజీవులను హరించే శక్తి కలిగి ఉన్న పదార్థం. పసుపుతో తయారయిన అన్నం కడుపులోని అనారోగ్యాలను దూరం చేస్తుందని అంతరార్థం. ఆ తల్లికి హరిద్రాన్నం మీద ప్రీతి ఎక్కువ. అందుకే హరిద్రాన్న + ఏక అంటున్నాం. ఈ హరిద్రాన్నాన్ని అత్యంత ప్రీతిగా సేవిస్తుంది ఆ తల్లి అని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది.
8. సర్వౌదనప్రీతచిత్తా: సర్వ అంటే అన్నిరకాల, ఓదనం అంటే అన్నం, ప్రీత అంటే ఇష్టపడటం, చిత్తా అంటే మనసు కలిగి ఉండటం. అన్నిరకాల ఆహార పదార్థాలను ఇష్టపడే చిత్తం కలిగినది తల్లి అని అర్థం. ఆశ్వీయుజ మాసంలో వరి పంట ఇంటికి చేరుతుంది. కాయగూరలు తాజాగా ఉంటాయి. కొత్తబియ్యం, కొత్త బెల్లం, ఆవు పాడి... వీటితో ఈ తొమ్మిదినాళ్లు తొమ్మిది రకాల నైవేద్యాలను నివేదన చేస్తారు.
లలితా సహస్రంలో నైవేద్యాలు
లలితా సహస్రంలో చెప్పిన ఈ నైవేద్యాలన్నీ అతి సులువుగా జీర్ణమై ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. నవరాత్రులలో చాలామంది ఏకభుక్తం ఉంటారు. ఆ ఒక్కపూట కూడా సులువుగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే స్వీకరిస్తారు. అలా ఆ తల్లిని తొమ్మిది రోజులు ధ్యానించి, తేలికపాటి నైవేద్యాలను ఆ శక్తికి నివేదించి, స్వీకరించి ఆరోగ్యాన్ని వరంగా పొందాలన్నదే ఈ నామాల పరమార్థం అని పండితులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment