కొమొడోలు రాత్రిపూట వేటాడలేవా..?
జంతు ప్రపంచం
కొమొడో డ్రాగన్స్ బల్లి జాతికి చెందినవి. దాదాపు పది అడుగుల వరకూ పొడవు పెరుగుతాయి. ప్రపంచంలో ఇవే అతి పొడవైన బల్లులు!ఇవి గడ్డిభూములు, మైదానాలు, రుతు పవనారణ్యాలలో ఎక్కువగా నివసిస్తాయి. ఇండోనేసియాలోని ఓ దీవిలో కొమొడోలు అత్యధిక సంఖ్యలో కనిపిస్తాయి. అందువల్లనే ఆ దీవిని కొమొడో ఐల్యాండ్ అని పిలుస్తుంటారు!కొమొడోలు పూర్తిగా మాంసాహారులు. గుర్రాలు, పందులు, గేదెలు, పక్షులు, పాములు, చేపలు... అవీ ఇవీ అని లేదు. ఆకలేస్తే దేనినైనా స్వాహా చేస్తాయి!కొమొడోలు పట్టుకు పదిహేను నుంచి ముప్ఫై గుడ్లు పెడతాయి. అయితే వాటిని పొదగవు. పిల్లలు తయారైన తర్వాత, అవే లోపల్నుంచి గుల్లను పగులగొట్టి బయటకు వస్తాయి!
ఇవి కొన్నిసార్లు తమ పిల్లలను కూడా తినేస్తాయి. అందుకే గుడ్డులోంచి బయటకు రాగానే పిల్లలు చెట్లు ఎక్కేస్తాయి. నాలుగేళ్లు వచ్చేవరకూ చెట్లమీదే నివసిస్తుంటాయి. ఎందుకంటే... శరీరం భారీగా పెరిగాక కొమొడోలు చెట్లు ఎక్కలేవు. కాబట్టి తాము సురక్షితంగా ఉంటామన్న ఉద్దేశంతో పిల్లలు చెట్లమీదే ఉంటాయి. శరీరం కాస్త పెరిగాక, ఇంకే ప్రమాదం ఉండదని కిందకు వచ్చేస్తాయి.
కొమొడోలకు రాత్రిపూట కళ్లు సరిగ్గా కనిపించవు. అందుకే పగటిపూట సంచరించినట్టు రాత్రిపూట సంచరించవు. ఆహారాన్ని కూడా పగలే వేటాడతాయి. వీటికి వినికిడి శక్తి కూడా తక్కువే!
ఇవి వేటాడవు. వేటాడటం కోసం వెంటాడవు. మాటు వేసి, తమ దగ్గరకు వచ్చిన వాటినే చంపి తింటాయి! వీటి లాలాజలంలో యాభై రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే ఇది ఒక్కసారి ఏ జంతువునైనా కరిచిందంటే, దాని ్టఒంట్లోకి విషం వెళ్లి ప్రాణాలు తీసేస్తుంది. అందువల్లే కొమొడోలకు వేట తేలికవుతుంది! ఇవి అద్భుతంగా ఈదుతాయి. ఆహారం దొరకనప్పుడు, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఒక దీవి నుంచి మరో దీవికి తేలికగా ఈదుకుంటూ వెళ్లిపోతుంటాయి!