హోమియో కౌన్సెలింగ్
నా వయసు 35 సంవత్సరాలు. నేను ఉద్యోగరీత్యా తరచు ప్రయాణాలు చేస్తుంటాను. ఎక్కువగా నాన్‌వెజ్ తీసుకుంటాను. ఈ మధ్య నా కాలిబొటనవేలు వాచి విపరీతంగా నొప్పిగా ఉంటే రక్తపరీక్షలో యూరిక్ యాసిడ్ పెరిగిందన్నారు. హోమియోలో దీనికి చికిత్స ఉందా?
- పి. రమేశ్, రామేశ్వరం
మన శరీరంలో ఏ కదలికలోనైనా కీళ్లదే ప్రధాన పాత్ర. ఆహార నియమాల లోపం వల్ల, కాలేయానికి సంబంధించిన జీవక్రియల అసమతుల్యత వలన రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి కీళ్లలో గుళికలుగా చేరి నొప్పిని కలిగిస్తాయి. అలాంటి కీళ్ల జబ్బును గౌట్ ఆర్థరైటిస్ అంటారు. 25 నుంచి 45 సంవత్సరాల మధ్యవయసులో ఈ వ్యాధి రావచ్చు. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో గౌట్ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. గౌట్ ప్రధానంగా కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ ఆర్థరైటిస్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. మూత్రపిండాలు ఆశించిన స్థాయిలో యూరిక్ యాసిడ్ బయటికి పారదోలడంలో వైఫల్యం చెందడం వల్ల రక్తంలో వాటిస్థాయి పెరుగుతుంది.
కారణాలు: రక్తంలో యూరిక్ ఆసిడ్ స్థాయి పెరగడం, వంశపారంపర్యం, స్థూలకాయం, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి, రోగనిరోధక శక్తి తగ్గించే మందులు, అధిక మద్యపానం, ఎక్కువగా మాంసం, చేపలు తినడం వల్ల, హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడేవారిలో యూరిక్ ఆసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది.
లక్షణాలు: అకస్మాత్తుగా రాత్రివేళలో జ్వరం రావడం, కాలి బొటన వేలిలో నొప్పి, వాపుతో ప్రారంభమవుతుంది. అందుకే గౌట్ ఆర్థరైటిస్‌ను వైద్యపరిభాషలో పొడగ్రా అంటారు. కీళ్లవాపుతో కీళ్లు ఎర్రగా మారడం, కీళ్లు వేడిగా ఉండటం, మోకాళ్లలో నొప్పి, రాత్రివేళలో విపరీతమైన జ్వరం, నీరసంగా ఉండటం.
జాగ్రత్తలు: మద్యపానం మానేయాలి, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. క్రమపద్ధతిలో వ్యాయామం చేయాలి. చాలామందిలో కీళ్లనొప్పులు వచ్చేంత వరకు తెలియదు వారిలో యూరిక్ యాసిడ్ స్థాయికి మించి ఉందని. ముందుజాగ్రత్తగా ఇలాంటి నొప్పులు రాకుండా ఉండటానికి అధిక బరువును నియంత్రించాలి. సమతులాహారాన్ని తీసుకోవాలి.
హోమియో చికిత్స: హోమియోపతిలో గౌట్ ఆర్థరైటిస్‌కు రోగి మానసిక, శారీరక లక్షణాలను అనుసరించి మందులివ్వడం జరుగుతుంది. కీళ్లలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడకుండా చూసి, రక్త ప్రసరణలోని వివిధ రసాయనాల సమతుల్యతను కాపాడటం ద్వారా గౌట్ వ్యాధిని సమూలంగా నయం చేయవచ్చు. ముఖ్యంగా బ్ర యోనియా, కాల్బికమ్, బెంజోమిన్, ఆసిడ్, బెర్పిరిస్, నైట్రిక్ యాసిడ్ వంటి మందులను వైద్యుని పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్
డయాబెటిస్ కౌన్సెలింగ్
నా వయసు 32. ఈ మధ్య నా భార్యకు తెలియకుండా నాకు పరిచయం ఉన్న ఓ ఆంటీని కలిశాను. ఆవిడతో కలిసిన కొద్దిరోజులకే మూత్రంలో మంట, దురద, అంగచర్మంపై పొక్కులు వచ్చాయి. ఇది హెచ్.ఐ.వి అని నా ఫ్రెండ్స్ అంటే పరీక్ష చేయించుకున్నాను. హెచ్.ఐ.వి. నెగటివ్ వచ్చింది. అయినా నాకు భయంగా ఉంది. నా భార్యకు కూడా వస్తుందా? నాకు తగిన పరిష్కారం సూచించగలరు.
- ఒక సోదరుడు, హైదరాబాద్
మీరు ఎప్పుడైనా బయటి వ్యక్తులతో కలిసినప్పుడు కండోమ్ వాడాలి. కండోమ్స్ వాడకం వల్ల సుఖవ్యాధులు రాకుండా ఉంటాయి. తర్వాత మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే హెచ్.ఐ.వి పరీక్ష అనేది అరక్షిత సెక్స్‌లో పాల్గొన్న మూడు నెలల తర్వాత తెలుస్తుంది. దీనిని విండోపిరియడ్ అంటారు. ఈ సమయంలో హెచ్.ఐ.వి పరీక్ష నెగటివే వస్తుంది. మీరు మూడు నెలల తర్వాత పరీక్ష చేయించుకోండి. అయితే సుఖవ్యాధులు మాత్రం సెక్స్‌లో పాల్గొన్న అతి తక్కువ వ్యవధిలోనే తెలుస్తుంది. దీనికోసం మీరు వీడీఆర్‌ఎల్, టార్చ్ పరీక్షలు, వీటితోపాటు ఆర్‌బీఎస్ పరీక్ష కూడా చేయించుకోవడం ద్వారా మీకు వచ్చినది సుఖవ్యాధా, కాదా తెలుస్తుంది. ప్రస్తుతం మీకు సుఖవ్యాధి ఉన్నా లేకపోయినా మీరు మీ భార్యతో కండోమ్‌తోనే సెక్స్‌లో పాల్గొనడం సురక్షితం.
నా వయసు 21. నాకు ఆరు నెలలుగా జ్వరం వస్తూ పోతూ ఉంటోంది. వైద్యుల దగ్గరకి వెళ్లి చికిత్స తీసుకున్నా, ఫలితం లేదు. మలేరియా, మూత్రపరీక్ష, షుగర్ పరీక్షలు అన్నీ నెగటివ్ అనే వస్తున్నాయి. నాకు జ్వరంతో పాటు రాత్రులు విపరీతమైన చలి, దుప్పట్లు తడిసిపోయేంత చెమట కూడా ఉంటోంది. బాగా నీరసంగా ఉంటోంది. బరువు కూడా తగ్గాను. నా మెడ దగ్గర కొన్ని గడ్డలుగా కూడా ఉన్నట్లు అనిపిస్తోంది. నాకు తరుణోపాయం చూపించగలరు.
- శ్రీలక్ష్మి, గుంతకల్లు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే సర్వైకల్ లింఫిడినోపతిలా కనిపిస్తోంది. మీరు సీబీపీ, ఈఎస్సార్, ఎంపీ, వైడల్, సీయూఈ, చెస్ట్‌ఎక్స్‌రే, ఎఫ్‌ఎన్‌ఏసీ లేదా బయాప్సీ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా మీకు ఎటువంటి జ్వరం అన్నది తెలుస్తుంది. మీకు వచ్చిన జ్వరం టీ బీ జ్వరం అని నాకు అనిపిస్తోంది. టీబీ ఊపిరితిత్తులకే కాకుండా లింఫ్ గ్రంథులకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి నేను చెప్పిన పరీక్షలు చేయించుకుని మీరు డాక్టర్ దగ్గర చూపించుకుంటే మీకు మంచి తరుణోపాయం లభిస్తుంది.
డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి
కన్సల్టెంట్ - ఇంటర్నల్ మెడిసిన్
అండ్ డయాబెటిస్
సెంచరీ హాస్పిటల్
బంజారాహిల్స్, హైదరాబాద్
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
మా అబ్బాయి వయసు 19 ఏళ్లు. ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇటీవల వాడికి కాళ్లలో వాపు వస్తుంటే వైద్యులకు చూపించాం. పలు వైద్యపరీక్షలు నిర్వహించి, మా అబ్బాయికి కిడ్నీ జబ్బు ఉందని నిర్ధారించారు. మా కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఈ జబ్బు లేదు. మరి మా వాడికే ఎందుకొచ్చిందో తెలియడం లేదు. దయచేసి మా అబ్బాయి సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు.
- ప్రకాష్, గుంటూరు
కిడ్నీజబ్బులు రావడానికి చాలా కారణాలుంటాయి. మధుమేహం, రక్తపోటు ఉన్నవారిలో, ఊబకాయంతో బాధపడుతున్న వారిలో, కిడ్నీజబ్బులున్న కుటుంబ చరిత్ర కలిగి ఉన్నవారిలో ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారణం తెలియకుండా కూడా కిడ్నీ జబ్బులు వస్తాయి. కిడ్నీజబ్బులు ఏ వయసులోనైనా రావచ్చు. కాబట్టి ఈ వ్యాధివల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీజబ్బు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలూ కనిపించవు. దురదృష్టవశాత్తూ వ్యాధి ముదిరిన తర్వాతనే లక్షణాలు బయట పడుతుంటాయి. కిడ్నీ వ్యాధిలో ఐదు దశలు ఉంటాయి. రోగి వయసు, వ్యాధి, దశ, ఇతర పరిస్థితులను బట్టి చికిత్స అందిస్తారు. మొదటి రెండు దశల్లోనే వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే చాలా వరకు పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంటుంది. మూడవ దశ, నాలుగవ దశలో గుర్తించి చికిత్స అందిస్తే వ్యాధి తీవ్రత పెరగకుండా చూసుకోవచ్చు లేదా 10-15 ఏళ్ల వరకు వ్యాధి ముదరకుండా వాయిదా వేయవచ్చు. కిడ్నీజబ్బు ఓ సెలైంట్ కిల్లర్. ఎందుకంటే ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తుంటుంది. ఈ జబ్బులో చాలా వరకు వ్యాధి ముదిరిన తర్వాతనే లక్షణాలు కనపడుతుండడంతో ముందస్తుగా ఏం చేయలేకపోతుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా ఏడాదికి ఒకసారి మూత్రపరీక్ష, సీరమ్ క్రియాటినిన్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. మీ అబ్బాయికి కిడ్నీజబ్బు ఉందని మీరుగాని, మీ కుటుంబ సభ్యులు కానీ ఆందోళన చెందకండి. ప్రస్తుతం కిడ్నీజబ్బులకు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చికిత్సను కొనసాగిస్తూ వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా మీ అబ్బాయి కూడా అందరిలాగే సాధారణ జీవితం గడపగలుగుతారు. చదువను కొనసాగించి ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా చేయగలుగుతారు.
డాక్టర్ వి.సురేష్‌బాబు
సీనియర్ నెఫ్రాలజిస్ట్
యశోదా హాస్పిటల్స్
సికింద్రాబాద్
లింఫ్‌గ్రంథులకూ టీబీ వచ్చే అవకాశం ఉంది...
Published Tue, Dec 22 2015 11:28 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM
Advertisement