
నీటి పద్యాలు క్రమంగా
నేల మీదికి దిగుతాయి
వర్ష వ్యాకరణ సూత్రాలు
భూమి లోనికి ఇంకుతాయి
మేఘాల వట వృక్షాలు
వాన ఊడల్ని పుడమిలో దింపుతాయి
మబ్బుల్లో దాగిన ఫిలిగ్రీ కళాకారులు
మట్టిని వెండి తీగలతో అలంకరిస్తారు
నింగి బడి వదలిన వాన పిల్లలు
నీళ్ల వూయలల తాళ్ళు పట్టుకుని వూగుతారు
వేన వేల వాన వీణియల తీగలు
అమృతవర్షిణి రాగాల్ని ఆలపిస్తాయి
గగనోద్యానంలోని వాన మొక్కల తీగలు
భూమి పందిరిని ఆప్యాయంగా అల్లుకుంటాయి
మేఘాల దూది నుంచి వస్తున్న నీళ్ల నూలు దారాలు
మేదిని మీద మేలిమి జల వస్త్రం నేస్తాయి
కిందకు వస్తున్న ఈ అపురూప ప్రేమ పాశాలు
నింగీ నేలల జన్మ జలమల జల బంధాన్ని గుర్తుచేస్తాయి
ఇవి వాన ధారలు కావు
మబ్బుల జల్లెడల్లోంచి
రాలుతున్న వడ్ల ధారలు
ఇవి సప్త స్వరాలను మించిన
మహోజ్వల జల సిక్త సర్వ
స్వరాలు
ఆకాశ తటాకంలోంచి
అమాంతం
దూకుతున్న చేప పిల్లలు
గెంతుతున్న చిరు కప్పలు
మేఘ బాల బాలికలు
మెల్లమెల్లగా
నేల పలక మీద దిద్దుతున్న
వర్షాక్షరాలు
ఇవి వరుణుని
కరుణ రసార్ద్ర వాక్యాలు
కాల పురుషుని కమనీయ
కవితా వర్ష పంక్తులు
నింగి కంటి నుంచి ఒలికిన ఈ ఆనంద బాష్ప కణాలు
నేల నెలతకు నెల తప్పించిన
మహదానంద క్షణాలు
-నలిమెల భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment