లోగిలి -14 | Logili -14 | Sakshi
Sakshi News home page

లోగిలి -14

Published Mon, Jan 26 2015 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

లోగిలి -14

లోగిలి -14

టూకీగా ప్రపంచ చరిత్ర
ఒక మొగుడు, ఒక పెళ్ళాం మాత్రమే కలిసుండే కుటుంబ వ్యవస్థ వీటిది. ఒకటి రెండు పిల్లలు కూడా కలిసుంటాయి. కొడుకుకైనా కూతురుకైనా యుక్తవయసు రాగానే కుటుంబం నుండి తరిమేస్తాయి.
 
 సీనోజోయిక్ యుగం మూడుకోట్ల సంవత్సరాలు గడచిన తరువాత భూగోళం ఉపరితలం చూడముచ్చటైన దృశ్యంగా మారిపోయింది. చెట్లల్లో రకాలు పెరిగి కొండలూ కోనలూ ఆక్రమించాయి. అనుకూలమైన తావుల్లో కీకారణ్యాలు ఏర్పడ్డాయి. పర్వతశిఖరాలకు మంచుకిరీటాల సొబగు చేకూరింది. కాయలూ పండ్లూ కొదువలేకుండా దొరకడంతో పక్షుల సంతానం జాతులూ విచ్చలవిడిగా విస్తరించాయి.

పిట్టల కూతలూ, జంతువుల అరుపులతో ప్రపంచం కోలాహలంగా మారింది. అదివరకున్న మీసోజోయిక్ యుగం ఒక నిశ్శబ్దయుగం. శబ్దమంటూవుంటే, ఆ యుగం ముగిసేముందు ఆవిర్భవించిన ‘సర్ప’జాతి బుసలు మాత్రమే. మిగతా ఏ జంతువుకూ గొంతు లేదు. వినేందుకు శబ్దాలు లేనందున ఆనాటి జంతువుకు చెవులతో అవసరమే కలుగలేదు.
 
సీనోజోయిక్ జంతువుల్లోనూ సంతానం పెరిగింది. పెరగడంతోపాటు వేరువేరు జాతులూ, ఉపజాతులూ, తెగలూ, వర్గాలూ, కులాలూ కొల్లలుగా తయారయ్యాయి. కుక్కలూ, పిల్లులూ, ఎలుగుబంట్లూ, ఏనుగులూ, గుర్రాలూ, ఒంటెలూ తదితర జంతువులు ఇంచుమించు ఇప్పుడు కనిపించే ఆకారానికి చేరుకున్నాయి. పులులూ, సింహాలూ ఇంకా రంగప్రవేశం చేయలేదు. కోరలు ఖడ్గంలాగా వంగివుండే ‘సేబర్ టీత్ టైగర్’ మాత్రం ఉండేది అప్పట్లో.
 
స్తన్యజంతువుల ఆకారంలో చోటుచేసుకున్న మార్పుల్లో ముఖ్యంగా గమనించదగ్గవి కాళ్ళూ, వేళ్ళూ. జీవికి కాళ్ళూ వేళ్ళూ గోర్లూ ఉభయచరం దశలోనే ఏర్పడ్డాయి. నీటిని వదిలివచ్చిన జీవికి నేలమీద దన్ను దొరకాలంటే తప్పనిసరిగా అవి ఉండాలి. కాళ్ళను కోల్పోయి, పొట్టమీద పాకే జంతువులను మినహాయిస్తే, మిగతా సరీసృపాలన్నిటికీ ఆ నిర్మాణం ఇంచుమించు అదేరీతిలో కొనసాగింది. ఈ నిర్మాణం సీనోజోయిక్ స్తన్యజంతువుల్లో వేరువేరు రూపాలకు మార్పుచెందడం మొదలెట్టింది.
 
ఈ యుగంలో మొదటిఘట్టం మధ్యకాలానికి చేరుకునే సమయానికి, నేలమీద తిరిగే శాకాహార జంతువులకు, ఏనుగువంటి ఏదోవొకదానికి తప్ప మిగతా జంతువులన్నిటికి, వ్రేళ్ళు అంతర్ధానమై గిట్టలు ఏర్పడ్డాయి. ఏనుగుకు కూడా పాదం ఆకృతి దిమ్మెలా మారి, వ్రేళ్ళు నామావశిష్టంగా మిగిలాయి. వేటాడే జంతువుల వేళ్ళు కురచబారి, వాటికింద చప్పుడు కాకుండా అడుగేసేందుకు అనుకూలంగా మెత్తటి బొజ్జలు పెరిగాయి. గోర్లు వాడిగా, పటిష్టంగా తయారయ్యాయి. చెట్టుకొమ్మల మీద తిరిగే ఉడుతలవంటి జంతువులకు పొడవైన వ్రేళ్ళూ, ములుకుల్లా కొసదేరిన గోర్లూ ఎప్పటిలాగే మిగిలి, సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా పరిణమించాయి.
 
అదే శకంలోనో మరికాస్తా ముందో, శాఖాచర జంతువుల్లో కొత్త శ్రేణికి చెందిన జంతుజాతులు ఉదయించాయి. ఆ శ్రేణి పేరు ‘ప్రేమేట్స్’- అంటే ‘ప్రథమశ్రేణి జీవులు’ అని. వీటిల్లో అధమజాతులకు చెందిన ‘ట్రీష్రూ’ వంటి జంతువులు ఉడుతల్లాగే ఉంటాయి. ‘కాదు, అవి కోతులు’ అంటే నమ్మలేం గూడా. అయితే, ఏవి వానరజాతులో, ఏవి కావో నిర్ణయించేందుకు కొన్ని ప్రమాణాలున్నాయి.

వానరాలకు ముందుకాళ్ళ కొసలు అరచేతులుగానూ, వెనకకాళ్ళ కొసలు పాదాలుగానూ వేరుపడి ఉంటాయి. గోర్ల ముందరి కొసలు మడిగి వంకర తిరిగినా, పాదు వద్ద మాత్రం వెడల్పుగా ఉంటాయి. బొటనవేలు మిగతా వేళ్ళకు ఎదురుగా వస్తుంది. అంటే, వాటి చేతికి వస్తువును పట్టుకునే వసతి ఏర్పడింది. రొమ్మునూ గూడనూ కలుపుతూ బోటెముక (కాలర్ బోన్) ఒక్క వానరాలకు మాత్రమే ఉంటుంది. ఇతర జంతువుల కళ్ళల్లో ఒకటి తలకు కుడివైపు. మరొకటి ఎడమవైపు ఉండి, దేనిపాటికది వేరు వేరు దృశ్యాలను చూస్తుంది.

వానరం కళ్ళు ముఖం మీదికి జరిగి, రెండు కళ్ళూ ఒకే దృశ్యాన్ని చూస్తాయి. దానివల్ల చూపుకు పదును పెరుగుతుంది. చివరిగా చెప్పుకోవలసింది పెద్దమెదడు సైజు. ఇందులో ఇతర ఏ జంతువు వానరానికి సాటిరాదు. ఇందుకు చిన్న ఉదాహరణ చూపించాలంటే - మందలో ఒక శాల్తీ తరిగిందో పెరిగిందో గ్రహించే జ్ఞానం మిగతా జంతువుల్లో కనిపించదు; ఆ లోటుపాట్లను గమనించే జ్ఞానం కేవలం వానరంతోనే మొదలౌతుంది.
 
ఈ ఎదుగుదలలో వానరం పోగొట్టుకున్న అంగాలు కూడా కొన్ని ఉన్నాయి. స్తనాల సంఖ్య తగ్గి, రెండు మాత్రమే చంకలదగ్గర మిగిలాయి. వాసన గ్రహించే శక్తిహీనమైన స్థాయికి పడిపోయింది. కపాలంలో వాసన గ్రంథులను నలగదొక్కుకుంటూ పెద్దమెదడు విస్తరించింది.
 
ఈ శ్రేణికి రెండు ఉపశ్రేణులు ఉన్నాయి. వాటిల్లో రెండవదైన ‘యాంత్రొపాయిడీ’ ఉపశ్రేణిలోని జంతువులు మూడు విభాగాల కింద ఉంటాయి. ఒకటి, రెండు విభాగాలు తోకలుండే కోతులు. ‘హోమినాయిడీ’ అనే మూడవ విభాగం తోకలేని కోతులది. ఇందులో తిరిగి రెండు జాతులు. వీటిల్లో మొదటిది ‘పాంజిడీ’. ఇందులోని జీవాలను ‘ఏప్స్’- అంటే ‘వాలిడులు’ అంటాం. వాలిడుల్లో తిరిగి ఐదు తెగలు. అవి- 1. గిబ్బన్లు, 2. సయామాంగులు, 3. ఒరాంగుటాన్లు, 4. గొరిల్లాలు, 5. చింపాంజీలు
 
గిబ్బన్లూ, సయామాంగులూ చిన్నపాటి జంతువులు. మూడూ మూడున్నర అడుగులకు మించి పెరగవు. వీటి కాళ్ళకంటే చేతుల పొడవు చాలా ఎక్కువ. చెట్టు నుండి చెట్టుకు చేతులతో ఊగుతూ దాటుకుంటాయి. అవసరమైతే నేలమీదికి దిగి రెండుకాళ్ళ మీద నాలుగడుగులు వేస్తాయి.

ఒక మొగుడు, ఒక పెళ్ళాం మాత్రమే కలిసుండే కుటుంబ వ్యవస్థ వీటిది. ఒకటి రెండు పిల్లలు కూడా కలిసుంటాయి. కొడుకుకైనా కూతురుకైనా యుక్తవయసు రాగానే కుటుంబం నుండి తరిమేస్తాయి. ఒరాంగుటాన్ శరీరం పెద్దది. ఐదడుగుల ఎత్తుకు పెరుగుతుంది. ఇవి చిన్నచిన్న కుటుంబాలుగా జీవిస్తాయి. సంపూర్ణంగా సాధుజంతువులు. చూసేందుకు ఏదో దిగులుతో వున్నట్టు కనిపిస్తాయి.
రచన: ఎం.వి.రమణారెడ్డి

Advertisement

పోల్

Advertisement