
ఎంవీ రమణారెడ్డి
విశ్లేషణ
‘ముస్లిం’ అంటేనే మోసగాడుగా జమకట్టడం పొరపాటనే ఇతివృత్తంతో నిర్మించిన హిందీ చిత్రం ‘పీకే’ ఈ చిన్న వాస్తవాన్ని నిరూపించడానికి కథా రచయితకు, దర్శకునికి మనిషిలాంటి గ్రహాంతరవాసి (ఏలియన్) అవసరం కావడం చూసి జాలిపడాల్సిందే. ఈ ఏలియన్ చక్కగా హిందీలో మాట్లాడగలడు, ఇంగ్లిష్‌లో ‘ఐ లవ్ యూ’ అని రాయగలడు. ఇట్టే ఓ ముసలాయన భార్య ఆసుపత్రిలో ఎలా ఉందో చెప్పేయగలడు. హీరోయిన్ ప్రేమించిన ముస్లిం యువకుని వివరాలు పసిగట్టేయనూ గలడు.
కానీ తనను సొంత గ్రహానికి తీసుకెళ్లగల రిమోట్ యంత్రాన్ని లాక్కెళ్లిన దొంగను మాత్రం కనిపెట్టలేడు. అదే తెలుసుకోగలిగి ఉంటే ఈ సినిమాయే లేదు. మత పక్షపాతం లేదని నిరూపించు కునే ప్రయాసలో దర్శకుడు అన్ని మత విశ్వాసాల మీదా, మత గురువుల మీదా గురిలేని బాణాలను కురిపించాడు. ప్రజలను మూర్ఖులను చేసి డబ్బును రాల్చుకోవడంలో సినిమా రంగానికి ఎవరూ సాటిరారని నిరూపించాడు. రంగం ఏదైనా మోసగాణ్ణి మోసగాడని నిందించేకంటే, మోసపోయినవాళ్ల మూర్ఖ త్వాన్ని బయటపెడితే కాసింత ఉపకారి కావచ్చనేదే నా ఆవేదన.
కుహనా మతగురువులను, కుహనా మతవిశ్వాసా లను ఎండగడుతూ సినిమాలు తీయని, కథలు రాయని భాష లేదు. ఇదే అంశంపై ‘పీకే’ కంటే బలంగా ప్రేక్షక హృదయాలపై బలమైన ముద్ర వేయగలిగిన ఎన్నో సిని మాలు మన దేశంలోనే వచ్చాయి. కానీ, ఒక బాబా మోసగాడని తెలియగానే మరో బాబానూ, ఒక గురువు నీచుడని తేలితే మరో గురువునూ వెదుక్కునే బేల తనాన్ని అడ్డుకోవడం ఏ దేశంలోనూ, ఏ చిత్రానికి సాధ్యం కాలేదు. మన దేశంలో ఆ వెర్రి మరింత పెరిగిం ది కూడా. కాబట్టి ఈ దిశగా ‘పీకే’తో దర్శకుడు సాధిం చగలిగిన పరమార్థం ఎండమావే.
యూరోపియన్ దేశం బెల్జియంలో బ్లాకులో సిని మా టికెట్లను అమ్మడం వంటి అసంబద్ధతలను పక్కకు నెట్టేస్తే, ఈ సినిమా ధ్యేయం హిందూ-ముస్లిం ప్రేమా యణం, మత సౌహార్ద్రతలే. మతాంతర ప్రేమలూ, వాటి పర్యవసానాల గురించి ‘ఛెమ్మీన్’ అనే మలయాళ చిత్రం మొదలు చాలా సినిమాలే చూశాను, వందలాది కథలు చదివాను. వాటికి మించిన సామాజిక జీవితం గానీ, కొత్తదనంగానీ ‘పీకే’లో లేవు. ఇక హిందూ- ముస్లిం సౌహార్ద్రత విషయంలో వాస్తవ దూరమైన సాం ఘిక జీవితపు కృత్రిమ ఉత్పత్తి అయిన ఈ చిత్రాన్ని, జీవ నసారం వడబిండిన కళాఖండాల సరసన నిలపనూ లేము, వాటితో పోల్చనూ లేము. అయినా సినీ అభిమా నుల జ్ఞాపకాలను తట్టి లేపడానికి రెండే రెండు ఉదా హరణలను ప్రస్తావించడం దేశ ఆరోగ్యానికి మంచిదని పిస్తోంది. ఒకటి, గోవింద నిహ్లానీ టీవీ సీరియల్ ‘తమస్’ దేశ విభజన నేపథ్యంలో నిర్మించినది.
మత విద్వేషాలు తీవ్ర స్థాయిలో పెల్లుబికిన సమయంలోనూ మానవత్వం ఏదో ఒక మూల బ్రతికి ఉండటం మానలే దని దర్శకుడు గొప్పగా నిరూపించాడు. ‘ముస్లిం’ అని తెలిస్తే హిందువులు, ‘హిందువు’ అని తెలిస్తే ముస్లింలు హతమార్చే మారణహోమంలో తీవ్రవాదులైన భర్త, కుమారుల కంట పడకుండా ఒక ముస్లిం యువతి తనను ఆశ్రయించిన హిందూ వృద్ధ దంపతులను కాపాడి, ఊరి బయటికి సాగనంపుతుంది. ‘ధన్యవా దాలు భేటీ, ఈ ముసలివాళ్ల ప్రాణాలు కాపాడావు’ అం టున్న వృద్ధులతో ఆ యువతి ‘‘బ్రతికిస్తున్నానో, చావ డానికే పంపిస్తున్నానో నాకే తెలియడం లేదు’’ అంటుం ది. ఆ సన్నివేశం చూసి నేనైతే మొహం కప్పుకుని ఏడుస్తూ ఎంతసేపో కూచున్నాను.
ఇక రెండో కళాఖండం కేతన్ మెహ్రా ‘మిర్చ్ మసా లా’ (కారంపొడి). చలన చిత్రాభిమానులు పదివేలకు ఒకరు కూడా ఆ సినిమా చూసి ఉండరు. బ్రిటిష్ హయాంలో సామాన్యులపై విచ్చలవిడిగా సాగిన అమా నుష పీడన నేపథ్యంగా రూపొందిన జీవన చిత్రమది. తెల్ల దొరలను మించి నల్లదొరలు చేసే దాష్టీకమే గుం డెలు పిండేది. వాటిని చిత్రించడానికి దర్శకుడు ఒక సుగాలీ గ్రామాన్ని ఎంచుకున్నాడు. ఎలిపైరు ఆధారంగా జీవించే ఆ గ్రామంలో జొన్న, మిరప ప్రధాన పంటలు. పన్ను వసూళ్లకు ఆ గ్రామానికి పటాలంతో వచ్చిన సుబేదారు గుడారంలో విడిది చేస్తాడు. ఉద్యోగం కోసం భర్త ఊరు విడిచివెళ్లిన ఒక వివాహిత స్త్రీపై అతగాడి కన్ను పడుతుంది. మానరక్షణ కోసం ఆమె కారంపొడి తయారీ కార్ఖానాలో దూరుతుంది. దాని చౌకీదారు, చూపు మందగించిన ముదుసలి ముస్లిం. ఒక హిందూ ఆడపడుచు మానరక్షణ కోసం అతడు తన యజమాని దర్వాజా తెరవమని ఆజ్ఞాపించినా నిరాకరిస్తాడు. సుబే దార్ బెదిరింపులకు గ్రామంలోని పురుషులంతా లొంగి పోతారు. గ్రామపెద్ద ‘ముఖియా’ నాయకత్వంలో కార్ఖా నాకు వస్తారు.
‘‘అబూమియా, ఇది గ్రామం సమస్య. నువ్వు దర్వాజా తెరిచి తీరాలి’’ అంటాడు ముఖియా. ‘‘ఊరు మొత్తం మీద ఈ ఆడపడుచుకు తోడొచ్చే మగా డు ఒక్కడైనా మిగల్లేదా?’’ అని అబూమియా అడుగు తాడు. చెడుగా ప్రవర్తించేవాళ్లను ‘‘సైతాన్ కా ఔలాద్’’ అనడం ఉర్దూ నానుడి. ముఖియా వచ్చింది చెడు పనికి కాదు, నీచమైన పనికి, ఊరి ఆడపడుచును తార్చడానికి వచ్చాడు. ఆ పతనాన్ని సూచిస్తూ - ‘‘సైతాన్ కే సాలే బన్‌కర్ ఆయాహో, ఔర్ షరంబీ నహీ ఆతీ’’ (దయ్యా నికి బావమరిదిగా వస్తున్నావ్, అయినా నీకు సిగ్గనిపిం చడం లేదా?) అంటాడు అబూమియా. ఒక హిందూ స్త్రీ మానరక్షణ కోసం అబూమియా బ్రిటిష్ తుపాకులకు బలైపోతాడు. తన గొప్ప మనసును మాత్రం తాకట్టు పెట్టుకోడు.
ఈ సినిమాలు రెండింటినీ పైసా ఖర్చు లేకుండా ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చూసి, ప్రతి అంగుళాన్ని ఆస్వాదించగల మనసులకు చిత్రపరిశ్రమ రుణపడిపోతుంది.
(వ్యాసకర్త రాయలసీమ విమోచన సమితి వ్యవస్థాపకులు, మొబైల్ నం: 9440280655)