భారతీయ సినిమాల్లో ఫాంటసీలే ఎక్కువగా కనిపిస్తాయి. వంద మందిని ఒంటి చేత్తో ఎదిరించే హీరో. ఎంతటి మగాడినైనా ఫిదా చేసే హీరోయిన్, ప్రపంచాన్ని శాసించినా.. హీరో ముందు చిత్తైపోయే విలన్. ఆరు పాటలు,నాలుగు ఫైట్లు, మరో నాలుగు కామెడీ సీన్లు. చాలా కాలంగా మన సినిమా అంటే ఇదే. కమర్షియల్ విలువల పేరుతో సినిమాను ఈ హద్దుల్లో కట్టి పడేశారు. అప్పుడప్పుడు కొత్త ప్రయత్నాలు జరిగినా.. రొటీన్ సినిమాలతో పోలిస్తే ఆ సంఖ్య నామమాత్రమే. అయితే ఇటీవల కాలంలో పరిస్థితిలో మార్పులు వస్తున్నాయి. మూస ఫార్ములాలను పక్కన పెట్టి దేశంలోని పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం నటీనటులు సాంకేతిక నిపుణులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా భారతీయ సినిమా మేకప్ తీసేసి రియలిస్టిక్ గా ప్రజెంట్ చేసిన సినిమాలు కూడా అడపాదడపా తారస పడుతూనే ఉన్నాయి.
ఓ సామాజిక సమస్యను సినిమా కథగా రూపొందించిన తాజా చిత్రం టాయిలెట్. కేంద్ర ప్రభుత్వ నినాదం స్వచ్ఛ భారత్ కు మద్ధతుగా తెరకెక్కించిన ఈ సినిమా దేశంలోని పరిస్థితులను వెండితెర మీద ఆవిష్కరించింది. సామాజికంగా ఎంత అభివృద్ది చెందుతున్నప్పటికీ ఇంకా దేశంలోని సగం జనాభా టాయిలెట్ లను వాడటం లేదన్న నిజాన్ని బయటపెట్టింది ఈ సినిమా. ఓ పల్లెటూరి అబ్బాయిని పెళ్లి చేసుకున్న చదువుకున్న అమ్మాయి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. (సాక్షి స్పెషల్) ఇంట్లో టాయిలెట్ ఏర్పాటు చేయకపోతే విడాకులు ఇస్తానని కండిషన్ పెట్టిన అమ్మాయి తను అనుకున్నది సాధించిందా లేదా అన్నదే ఈ సినిమా కథ.
అయితే ఈ తరహా సినిమాలు చేయటం కాస్త ఇబ్బందికరమైన విషయంలో.. నిజాన్ని అంగీకరించడానికి మన సమాజం సిద్ధంగా ఉండదు. సమస్యను ఎత్తి చూపిస్తే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. వివాదాలు మొదలవుతాయి. కానీ ఆ సమస్యలన్ని దాటి గెలిచిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి ఓ ప్రయత్నమే 'రాజ్ నీతి'. హిందీ సినిమాల్లో రాజకీయాల ప్రస్థావన తరుచూ కనిపిస్తుంటుంది. అయితే ఓ చిన్న గ్రామంలోని రాజకీయ కుటుంబం నేపథ్యంలో భారత రాజకీయ వ్యవస్థ ప్రతిభింబించేలా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు ప్రకాష్ ఝా, ప్రస్తుతం వ్యవస్థలోని జాతీయ నాయకులను పోలిన పాత్రలు సృష్టించి వాటి చుట్టూ కథను నడిపించే సాహసం చేశారు. ఈ సినిమా మన రాజకీయ వ్యవస్థ మూలంగా జరుగుతున్న ఆరాచకాలను, దుర్మార్గాలను చూపించింది.
సామజిక స్ఫృహ కలిగిన చిత్రాలను తెరకెక్కించటంలో బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ ఎపుడూ ముందే ఉంటాడు. అందుకే తారే జమీన్ పర్, దంగల్ అద్భుత చిత్రాలు ఆయన నుంచి వచ్చాయి. అయితే ఈ తరహాలో ఆమిర్ చేసిన ఓ భారీ సాహసం పీకే. నమ్మకాలకు ఎంతో విలువనిచ్చే మన దేశంలో ఆ నమ్మకాలను ప్రశ్నిస్తూ సినిమాను రూపొందించాడు ఆమిర్.(సాక్షి స్పెషల్) దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఆమిర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా పీకే. ఈ సినిమాలో మతపరమైన నమ్మకాలను, ఆచారాలను కాస్తం వ్యంగ్యం చూపించిన చిత్రయూనిట్ దైవ దూతలుగా చెప్పుకునే వారిని ప్రత్యక్షంగానే విమర్శించాడు.
కొత్త దర్శకుడు చైతన్య తంహనే తెరకెక్కించిన మరాఠి సినిమా కోర్టు కూడా ఈ జాబితాలోనిదే. మన న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినా.. ఎన్నో అవార్డులు రివార్డులు సాధించింది. (సాక్షి స్పెషల్) ఓ ప్రజాగాయుకుడు తన పాటలతో ఓ వ్యక్తి ఆత్మ హత్యకు కారకుడయ్యాడన్న కారణంతో అతన్ని కోర్డు ముందు హజరు పరుస్తారు. తరువాత కోర్టులో ఇరు పక్షాల వాదోపవాదనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ కొత్త దర్శకుడు ఏకంగా న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే సాహసం చేయటం.. ఆ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు సాధించటం నిజంగా సంచలనమే.
Comments
Please login to add a commentAdd a comment