'ఆ విషయం నన్నెంతో బాధిస్తోంది'
ముంబయి: ప్రస్తుతం పబ్లిక్గా ఏ అంశంపై మాట్లాడినా సెలబ్రిటీలు హెచ్చరికలకు కేంద్రాలుగా మారుతున్నారని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ అన్నారు. అందుకే, ఇటీవల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. దేశంలో అసహన పరిస్థితులపై తమ అభిప్రాయాలను ప్రముఖ బాలీవుడ్ నటులు అమిర్ ఖాన్, షారుక్ ఖాన్, కరణ్ జోహార్ వంటి వారు సోషల్ మీడియా ద్వారా, నాయకుల ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భావ వ్యక్తీకరణ భారత్లో కష్టంగా మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. గతాన్ని పక్కనపెడితే ఇప్పుడు మాత్రం తాను మాట్లాడే ప్రతి పదం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని చెప్పారు. 'ఇప్పుడు ప్రతి చిత్ర నిర్మాత, ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారు ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతంగా మారుతుంది కనుక' అని ఆయన చెప్పారు.
'మనకు ఏదైనా అభిప్రాయం ఉంటే అది సమతుల్యంతో ఉండాలి. అవతలి వైపువారు కూడా గర్వించేదిగా ఉండాలి' అని ఆయన చెప్పారు. అసహ్యభావంతో ప్రారంభమైన ఒక అంశం తొలుత చివరకు సొసైటీలో నేడు అనేక చీలికలు తీసుకొచ్చి ముగుస్తుందని, ఇది తనను ఎంతో బాధిస్తుందని చెప్పారు. కృత్రిమంగా సృష్టించిన వాతావరణమేమిటో మనుషులుగా ప్రతి ఒక్కరం తెలుసుకొని బతికితే బాగుంటుందని చెప్పారు.