బ్రెయిన్ పవర్ కావాలా? అయితే, ఛలో షాపింగ్!
స్టడీ
షాపింగ్ మీద బోలెడు జోకులు ఉన్నాయి. షాపింగ్...అంటే భయపడేవాళ్ల మీద కూడా బోలెడు జోకులు ఉన్నాయి. షాపింగ్ అంటే భయపడనక్కర్లేదని, షాపింగ్ వల్ల పోయేదానితో పాటు (డబ్బులు) వచ్చేది కూడా ఉంటుందని, దాని పేరే ‘బ్రెయిన్ పవర్’ అని చెబుతున్నారు పరిశోధకులు. బ్రెయిన్ పవర్‌కు, షాపింగ్‌కు ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకుందాం...
వయసు పైబడినవారు షాపింగ్ చేస్తే బ్రెయిన్ పవర్ పెరుగుతుందని, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని డ్యూక్ యూనివర్శిటీకి(అమెరికా)కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. తమ అధ్యయనంలో భాగంగా 20 మంది యువకులు, 22 మంది వయసు మళ్లిన వారిని ఎంచుకొని షాపింగ్ అనంతరం వారి బ్రెయిన్ స్కాన్‌తో పాటు రకరకాల అధ్యయనాలు నిర్వహించారు. కొందరికి ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు చూపిస్తూ ప్రశ్నలు అడిగారు.
ఒక వస్తువును ఎంచుకునే సమయంలో, ధర గురించి ఆలోచించే సమయంలో వారి మెదడు కదలికలలో వచ్చే మార్పును రికార్డ్ చేశారు. నాణ్యత గల వస్తువు గురించి ఆలోచించడం, ఎంచుకున్న వస్తువును వేరే వస్తువుతో పోల్చిచూసుకోవడం, బేరమాడడం... ఇలా షాపింగ్‌లో కనిపించే సమస్త అంశాలు... జ్ఞాపకశక్తిని వృద్ధి చేసేవే అంటున్నారు పరిశోధకులు.
ఒక వస్తువుని ఎంచుకోవడానికి, ఒకటికి పదిసార్లు ఆలోచించడం అనేది కూడా మెదడు చురుకుదనానికి కారణమవుతుందట. దీనివల్ల మెదడులో కాస్తో కూస్తో స్తబ్దంగా ఉన్న ప్రాంతాలు కూడా... షాపింగ్ తాలూకు ఆలోచన ప్రక్రియలోకి వచ్చి చేరుతాయి. ఒక ప్రాడక్ట్‌కు సంబంధించిన రెండు వస్తువులను చూపిస్తూ ‘‘ఏది ఎంచుకుంటారు?’’ అని అడిగినప్పుడు మెదడులోని చురుకుదనం పెరుగుతుందట! కాబట్టి ఇకముందు మీకు మీరుగా షాపింగ్ చేయాలనుకున్నా, ఎవరికోసమైనా చేసినా సాకుల కోసం వెదుక్కోనక్కర్లేదు. హడావిడిగా కాకుండా కాస్త ఎక్కువ టైమ్ తీసుకునే షాపింగ్ చేయండి!