వచ్చిన కథలన్నీ ముందు పెట్టుకుని కూర్చున్నాడు ప్రిన్సిపాలు పాండురంగారావు. అతని చేయి వణుకుతోంది, అంతరాత్మ నువ్వు చేస్తున్న పని మంచిది కాదని హెచ్చరించబోయింది. విసుగ్గా అంతరాత్మను జోకొట్టాడు. మంచికి నిర్వచనము ఏమిట? తను చేస్తున్న చెడు బయటికి యెలా వెడుతుంది?
‘‘నాన్నారూ!’’ త్రివేణి వచ్చింది, హడావుడిగా. ‘‘మరేమో, మా స్నేహితురాళ్లు ఏమంటున్నారంటే...’’
‘‘చెప్పమ్మా ఏమన్నారు?’’
‘‘చిన్న కథల పోటీకి మీరు న్యాయ నిర్ణేతలు కదా! నేను వ్రాసిన కథ పోటీకి అంగీకరించరట కదా!’’
‘‘వాళ్లకేం తెలియదు, ఆ పత్రిక తెచ్చి నిబంధనలు చదువు’’ అన్నాడు. అతని గొంతు నీరసంగా ఉంది.
నిబంధనలు చదివింది. న్యాయనిర్ణేతల పిల్లలు పాల్గొనరాదని యెక్కడా లేదు.
‘‘నాన్నారూ! నాకు ఫస్ట్ ప్రైజు ఇస్తారు కదండీ.’’
‘‘తప్పకుండా తల్లీ’’ అన్నాడు కూతురి వీపు నిమురుతూ. వెయ్యి రూపాయలు పోగొట్టుకోవడం తనకు మాత్రం ఇష్టమా?
‘‘మీ నాన్నగా రొక్కరిస్తే చాలా? మరో న్యాయ నిర్ణేత కూడా ఉన్నారుగా’’ అప్పుడే అక్కడికి వచ్చిన కమలమ్మ అన్నది.
‘‘అవునా నాన్నారూ?’’
‘‘మీ అమ్మకేం తెలియదు. ఫస్టు ప్రైజు నీది’’ మళ్లీ మళ్లీ అన్నాడు. త్రివేణి ఉత్సాహంగా వెళ్లిపోయింది.
‘‘పసిదానికి ఆశ పెట్టడం దేనికి? మీరు ఇచ్చినా మరో న్యాయ నిర్ణేత ఇవ్వవద్దూ?’’
‘‘ఇవ్వరని నీకు కలగాని వచ్చిందా? పత్రికలవారు నా స్నేహితులు. ఇక మరో న్యాయ నిర్ణేత రచయిత్రి. ఆమెకు నన్ను ఎదిరించే దమ్ములు లేవు. నువ్వూరుకుందూ!’’ అన్నాడు.
ఉత్సాహవంతులయిన విద్యార్థులలోని రచనా పిపాసను బయటికి లాగాలని, ఓ ప్రముఖ పత్రిక – కాలేజీలో, హైస్కూల్లో చదివే విద్యార్థుల కోసం చిన్న కథల పోటీ పెట్టారు. మొదటి బహుమతి వెయ్యి రూపాయలు, రెండవ బహుమతి ఐదు వందలు, అని అనౌన్స్ చేసి, యెడిటర్స్ కాక, ప్రిన్సిపాల్ పాండురంగారావును, మరో రచయిత్రి నైనాదేవిని న్యాయ నిర్ణేతలుగా వేశారు. పాండురంగారావు కూతురు త్రివేణి కూడా ఓ కథ వ్రాసి, తను విద్యార్థిని అని కాలేజీ నుండి సర్టిఫై చేయించుకు వచ్చి, పోటీలో పాల్గొన్నది. పాండురంగారావు కూతురు కథ చదివి కాస్త మార్పులు, చేర్పులు చేయించి వ్రాద్దాం అనుకున్నాడు. కాని ఎడిటర్స్ మొదట చదివి వుంటే బాగోదని ఏమయితే అది అయిందని కూతురికే మొదటి బహుమతి ఇచ్చేశాడు. ప్రథమ బహుమతికి అర్హమైన కథను అన్నిటి క్రింద పెట్టాడు.
ఆ రాత్రి కమలమ్మ కొన్ని చదివింది. కూతురిది అసలు చదవలేనంత అస్తవ్యస్తంగా ఉంది. ఆమెకు బాధ కల్గింది. ఆమె తండ్రి టీచరుగానే చేశాడు. వక్తృత్వం పోటీలు జరిగితే కమలమ్మ పాల్గొంటే అతను తప్పుకునేవాడు.
‘‘పంతులుగారూ! మీరు అన్యాయం చేయరని తెలుసు. తప్పుకోవటం యెందుకు?’’ ప్రధానోపాధ్యాయుడు అనేవాడు.
‘‘యెందుకండీ, ఒకవేళ మా అమ్మాయే బాగా మాట్లాడినా అందరు ఏమనుకుంటారోనని మొహమాటంతో ఇవ్వకపోవచ్చు’’ అంత నీతి నియమాలుండేవి. ప్రతిచోట అవినీతి అరాచకం ప్రాకిపోయింది. దాన్ని కూకటి వేళ్లతో కదిలించేవాడు యెప్పుడొస్తాడో!
వారం రోజులకు పత్రికాధిపతి కౌండిన్య రెండవ జడ్జీ అయిన నైనాదేవి దగ్గరకు ఫైలు తీసుకువెళ్లి, ఆవిడ చేత కూడా చూపించుకుని, ఆవిడ వ్రాసిన రిమార్క్ తీసుకుని వచ్చాడు.
‘‘ఏమిటి? ఆవిడ వాటిని చదువబోయిందా? నేను వ్రాసినవే టిక్ కొట్టి ఉంటుంది కదూ?’’ సగర్వంగా అడిగాడు పాండురంగారావు.
‘‘అక్కడే మనము పొరపడ్డామండోయ్. తాను చదవటమే కాక అక్కడే ఉంటున్న ఇద్దరు ఎమ్.లిట్‌లతో కూడా చదివించింది. మీరు లాస్టున పెట్టిన అమ్మాయి కథకు మొదటి బహుమతి రావాలని సూచన చేస్తూ, యెందుకు రావాలో నోట్ పుటప్ చేశారు.’’
‘‘మీరేం నిర్ణయించారు?’’
‘‘మీరు యెలా అంటే అలా.’’
‘‘బోడిది అక్షర జ్ఞానము లేనివారంతా రచయిత్రులే. ఓ కుటీర పరిశ్రమ అనుకుని రచనలు చేస్తూ ఇలాంటి వాటిల్లో తల దూరుస్తారా?’’ పాండురంగారావు కళ్లు ఎర్ర చేశాడు.
‘‘అబ్బే, ఆవిడ అభిప్రాయము ఆవిడ వ్రాశారు. మనం మనమే, ఆవిడనో న్యాయనిర్ణేతగా నిర్ణయించుకున్నాము. మాటలు అనటం భావ్యం కాదేమో.’’
‘‘ఊ! త్రివేణి మా అమ్మాయి అని గుర్తించిందా?’’
‘‘గుర్తించే ఉంటుంది...’’ నసిగాడు కౌండిన్య, ఆమె మెత్తగా వేసిన చీవాట్లు గుర్తుకు తెచ్చుకుంటూ. ‘‘వెయ్యి రూపాయల దగ్గర ఈ కక్కుర్తి ఏమిటండీ? తను న్యాయనిర్ణేతగా ఉన్నప్పుడు కూతురు పాల్గొనడం ఏం బావుంటుంది?’’
పాండురంగారావుకు ఎలా చెబుతాడు? ఇద్దరూ చిరకాల మిత్రులు. ఒకరి బలహీనతలు ఒకరికి తెలుసు.
‘‘ఆమె చెప్పినట్టే బహుమతి ఇస్తే రేపు మన తలకు ఆముదము రుద్దుతారు, అసలే సూద్రపు పీనుగులు.’’
‘‘పోనీ ఒక పని చేస్తే? మొదటి, రెండవ బహుమతి కాక, ఆవిడ మొదటి బహుమతి ఇచ్చిన అమ్మాయికీ ప్రత్యేకమయిన బహుమతి ఇస్తే...’’
‘‘ఆ... యెందుకు లెండి.’’
‘‘రేపు మన మీద పడి యేడ్వకుండాను.’’
ఆ పై వారము ఫలితాలు పత్రికలో ప్రకటించారు. అది చూచి పాండురంగారావు గర్వంగాను, నైనాదేవి బాధగానూ నవ్వుకున్నారు. ప్రముఖుల సమక్షంలో బహుమతి ప్రదానము జరుగుతుందని ప్రకటించారు. ఆహ్వానాన్ని చూచుకొని పాండురంగారావు ఆలోచనలో పడ్డాడు. ఆ సభకు ఆకతాయి వెధవలు వచ్చి, త్రివేణి తన కూతురని గుర్తిస్తే? అవాకులూ చవాకులూ వాగితే? అర్జంటుగా తలనొప్పి తెచ్చుకుని మంచ మెక్కేశాడు.
‘‘నాన్నారూ! ఈరోజు నా కథకు బహుమతి ఇస్తారు. మీరు రండి’’ అని మారాం మొదలు పెట్టింది త్రివేణి.
‘‘నాకు ఆరోగ్యం బాగా లేదమ్మా’’ అన్నాడు. మూతి ముడుచుకు కూర్చుంది త్రివేణి.
‘‘మా తల్లివి కదూ! వెళ్లి బహుమతి తీసుకుని అందరు మాట్లాడింది జాగ్రత్తగా విను. ముఖ్యంగా ఆ నైనాదేవి ఏమంటుందో విను’’ అన్నాడు అనునయిస్తూ. నిరాశగా వెళ్లిపోయింది.
విసుగ్గా సిగరెట్టు వెలిగించుకున్నాడు. రాత్రి యెనిమిది గంటల వరకు అసహనంగా గడిపాడు. ప్రదానోత్సవం ఇంతసేపా? ఆ నైనాదేవి పేలుతూ ఓ రెండు గంటలు ఉపన్యాసం యిచ్చి ఉంటుంది!
‘‘నాన్నారూ! ఇదిగోనండీ చెక్కు సర్టిఫికెట్టు’’ లేడిపిల్లలా దూకుతూ వచ్చింది త్రివేణి. వెనకాల కమలమ్మ వచ్చింది.
‘‘ఇంతాలస్యం అయిందేం, సభ ఆలస్యంగా ప్రారంభం అయిందా?’’
‘‘లేదండీ, వచ్చేటప్పుడు బస్సులు దొరకలేదు. సభ అరగంటలో ముగిసింది. ఇద్దరు న్యాయనిర్ణేతలు రాలేదు కదా.’’
‘‘ఏమిటీ? నైనాదేవి రాలేదా? యెందుకు?’’
‘‘ఏమో కౌండిన్యగారే పోటీ వుద్దేశం చెప్పారు. ఆ తరువాత మంత్రిగారు నాలుగు మాటలు చెప్పి బహుమతులిచ్చారు, అరగంటలో అయిపోయింది.’’
‘‘అమ్మయ్య’’ అనుకుని గుండెల మీద చేయి వేసుకున్నాడు. అంతవరకు ఏవేవో ఊహిస్తున్న అతని మనసు కుదుటపడింది.
ఆ విషయము పాతబడిపోయింది. అనుకున్న ప్రకారము పోటీలో నెగ్గిన కథలు పత్రికలో ప్రచురించలేదు. అనివార్య కారణాల వలన కథలు ప్రచురించలేదని ప్రకటించారు. అది చూచి త్రివేణి నిరుత్సాహ పడింది. విషయం తండ్రితో చెప్పింది.
సాయంత్రము కాలేజీ నుండి వస్తుండగా కౌండిన్య దగ్గరికి వెళ్లాడు. ఆమాట, ఈమాట చెప్పాడు. ‘‘మొన్న సభకు నైనాదేవి రాలేదట.’’
‘‘మీరు రాలేదు కదా! అందరూ ఏమనుకుంటారోనని ఆమెకు ఫోను చేశాము. ‘వచ్చి అక్కడ నేను ఆత్మను చంపుకుని అబద్ధాలు మాటలాడలేను. నిజం మాటలాడి మీ అందరితో నిష్టూరము కొని తెచ్చుకోలేను’ అన్నది.’’
‘‘బోడి! ఏడ్వలేకపోయింది’’
‘‘కథలు ప్రచురించినా, పాఠకులతో గోల లెండి’’ కౌండిన్య మాట మార్చాడు.
‘‘త్రివేణి కథ ఇలా యివ్వండి. దిద్ది పట్టుకొస్తాను’’ అన్నాడు.
కౌండిన్య ఆశ్చర్యంగా చూశాడు. బాహ్యంగా తమ తప్పులు కప్పి పుచ్చుకున్నా అంతరాత్మ యెలా అంగీకరిస్తుంది? ‘‘ఇక ఇప్పుడా తతంగం అంతా యెందుకు లెండి? మన చుట్టూ వున్నవారు వేయి కళ్లతో కనిపెట్టి చూస్తారు’’ అన్నాడు.
పాండురంగారావు ఇంటికి వచ్చాడు. త్రివేణి ఆశగా ఎదురు వచ్చింది. ‘‘ఏం నాన్నారూ? నా కథ అచ్చు అవుతుందా?’’
‘‘నోరుమూసుకో, రాసింది యింతోటి మహాకథ’’ విసుగ్గా చూచాడు.
- మాదిరెడ్డి సులోచన
అచ్చుకాని బహుమతి కథ
Published Mon, Mar 23 2020 12:08 AM | Last Updated on Mon, Mar 23 2020 12:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment