పశువును కనుము | Makar Sankranti celebrated with traditional fervour | Sakshi
Sakshi News home page

పశువును కనుము

Published Mon, Jan 15 2018 12:51 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

Makar Sankranti celebrated with traditional fervour - Sakshi

సంక్రాంతి మూడవరోజును ‘కనుము’గా నిర్థారించారు మన పెద్దలు. ‘కనుము’ నేరుగా పండుగ కాదని పండుగను అనుసరించి వచ్చే పండుగ రోజు అని చెబుతారు. ‘కనుము’ అంటే ‘జాగ్రత్తగా చూడు’ అని అర్థం. అంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవలసిన రోజులు అనే అర్థం కూడా వస్తుంది. ‘కనుము’ వ్యావహారికంలో ‘కనుమ’ అయ్యింది.  కనుము అనే మాటకి పశువు అనే అర్థం కూడా చెబుతారు. అందుకని దీనిని పశువుల పండుగగా జరపడమనేది తెలుగు ప్రాంతంతో పాటు తమిళనాట ఉంది. పాడిపంటలలో తోడ్పడే  పశువులను ‘చూడండి’, సత్కరించండి అనే అర్థం ‘కనుము’లో ఉంది.

సూర్యుడు దక్షిణాయనంలో నుంచి ఉత్తరాయణంలోకి తొంగి చూశాడు కనుక ‘కనుము’ అయ్యిందని కూడా అంటారు.  సంక్రాంతి ఉత్తరాయణానికి మొదటి రోజు. ఉత్తరాయణం – దేవతలకు ప్రీతికరమైన కాలం. ఒకవైపు ఇలా పుణ్యకాలం కావడం మరో వైపు పంటలు వచ్చే సమయం కాబట్టి ఈ సంబరమంతా ఒకరోజులో ముగిసేది కాదు కనుక ‘కనుము’ ఒక కొనసాగింపు పండగరోజు అయ్యింది. ఇంటికి వచ్చిన బంధుమిత్రులెవరూ కదలకుండా ఉండాలనే ఉద్దేశంతో ‘కనుము పండుగ నాడు కాకులు కూడా కదలవని’ శాస్త్రం పెట్టారు.

పశువులను పూజించాలి: ‘గవామంగేషుతిష్ఠంతి భువనాని చతుర్దశ’.... అంటే ముక్కోటి దేవతలు, 14 లోకాలు గోవుల శరీరంలో ఉంటాయని శాస్త్రం చెబుతోంది. గో శబ్దానికి ఎద్దులు అనే అర్థం కూడా ఉంది. అనేక పూజలు పురస్కారాలకు పశువులను ఆదిమానవుడి దగ్గర నుంచి ఉపయోగిస్తూనే ఉన్నాం. ఎద్దులతో వ్యవసాయం చేసి ఆహారం పొందగలుగుతున్నాం.  అందువల్ల ఉత్తరాయణ పుణ్యకాలంలో పశువుల్ని కూడా భక్తిగా కొలుచుకోవడం ఆచారంగా వస్తోంది.

పూర్వకాలంలో ప్రభువులు పశువులను కడిగి, కొమ్ములకు అలంకరించి, అలంకరణ (బంగారు డిప్పలు) కాళ్ల గిట్టలకు వెండి తొడుగులు మెడలో వెండి మువ్వలు వేసినట్లు కావ్యాలు చెబుతున్నాయి. పట్టు వస్త్రాలు కప్పడం, పసుపుకుంకుమలతో పూజించడం, కొత్త ఎడ్లకు గడ్డి వేసి, ఆహార పదార్థాలు ఇవ్వడం, ఆ రోజు హుషారుగా పరుగులు తీసేలా చూస్తూ పశువులకు కూడా పండుగ చేస్తారు.  సంక్రాంతికి పంటలు చేతికి వస్తాయి. ఇళ్లన్నీ సిరిసంపదలతో తులతూగుతూంటాయి. ఇంత సంపన్నులు కావడానికి మూలమైన వారిని జాగ్రత్తగా చూసుకోమని అంటే వారి కోసం పండగ చేయాలి అనే అర్థంలో కనుము పండుగ ఏర్పడింది.

 రైతన్నకి పశువులంటే పంచప్రాణాలు. అందుకే కనుమునాడు పశువుల్ని అలంకరిస్తారు. కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. ఆ పొంగలిని పశువులకే నివేదన చేస్తారు రైతులు. అంటే పశువుల ద్వారా లభించిన ధాన్యాన్ని, ఆ పశువులకే తొలి నైవేద్యంగా పెట్టి, పశువుల పట్ల  కృతజ్ఞతను తెలియచేసుకుంటారు రైతులు. అలాగే కనుమ నాడు కాకులకు ఆహారం తప్పనిసరిగా పెట్టడం ఆచారంగా వస్తోంది. పక్షులకు సైతం...: కనుమును తమిళులు మాట్టు పొంగలి అంటారు. మాట్టు అంటే పశువు. అందుకే కనుము అంటే  పశువులకి చేసే ముఖ్యమైన పండుగగా భావిస్తారు. రైతులకు పక్షులతో కూడా అవినాభావ సంబంధం ఉంది. అందుకే సంక్రాంతి సమయంలో ఇంటి చూరుకు లేదా గుమ్మాలకు వరిధాన్యం కంకులు వేలాడదీస్తారు.

కనుము నాడు గోపూజ చేయడంతో పాటు, గోకల్యాణం కూడా చేస్తారు. పూర్వం ఈ పండుగనాడు పశువులకు ప్రత్యేకమైన ఆహారం తయారుచేసి తినిపించేవారు. ఇందుకోసం... ప్రతి ఇంటివారు తెల్లవారుజామునే కత్తి, సంచి తీసుకుని దగ్గరలో ఉన్న అడవికి వెళ్లేవారు. మద్దిమాను, నేరేడు మాను చెక్క, మోదుగపూలు, నల్లేరు, మారేడు... వంటి కొన్ని మూలికలను సేకరించి, చిన్నచిన్న ముక్కలుగా చేసి, పెద్ద మొత్తంలో ఉప్పు జత చేసి, రోట్లో వేసి దంచేవారు. ఆ పొడిని ఉప్పు చెక్క అంటారు. దీనిని పశువులకు తినిపించాలి. వాస్తవానికి ఈ చెక్క పొడిని తినడానికి పశువులు ఇష్టపడవు.

అతి కష్టంతో ఒక్కొక్క దాని నోటిని తెరిచి చారెడేసి ఉప్పు చెక్కను నోట్లో పోసి మూస్తారు. ఇలా రెండు మూడు దోసెళ్లు పోస్తారు. ఏడాదికోసారి ఉప్పుచెక్కను తినిపిస్తే పశువులు ఆరోగ్యంగా ఉంటాయని వీరి నమ్మకం. ఉప్పు చెక్క తినిపించాక, వీటికి పరిశుభ్రంగా స్నానం చేయిస్తారు. కొమ్ములను అందంగా చెక్కి, రంగులు పూస్తారు. కోడెదూడల కొమ్ములకు తొడుగులు తొడిగి, మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. ఈ సమయంలో చేలన్నీ పంటలు కోసి ఖాళీగా ఉండటంతో, వీటిని పొలాల్లోకి వదిలేస్తారు. పశువులన్నీ స్వేచ్ఛగా పొలాలలో పరుగులు తీసి పరవశించడం కనులారే చూసే పండుగే కనుము.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement