కాన్స్‌లో మల్లిక ‘లాక్ మీ అప్’ ప్రదర్శన
అమాయకత్వానికి స్వేచ్ఛనివ్వాలంటే తాళం కావాలి.పసి బతుకులకు విముక్తి కావాలంటేతాళం కావాలి.చిన్నారులను చెర తప్పించాలంటే..తాళం కావాలి. మనం ఒక్కరం తాళం వేసుకుంటేవేలాదిమందికి తాళంచెవి దొరుకుతుంది. మల్లిక క్యాంపెయిన్ మొదలుపెట్టింది.మీరూ.. ‘తాళం’ వెయ్యండి.కాన్స్‌లో ఇంకేం చూడ్డానికి ఉండదు. గౌన్స్.. గౌన్స్.. గౌన్స్! ఐశ్వర్య గౌన్. సోనమ్ గౌన్. దీపికా గౌన్. కంగనా గౌన్. ఇంకా.. సో మెనీ బాలీవుడ్ గౌన్స్. కాన్స్ అంటేనే గౌన్స్ అన్నట్లు ఉంటుంది ఈవెంట్. ఆ గౌన్లన్నీ రెడ్ కార్పెట్‌పై నడుస్తూనో, విహరిస్తూనో కనిపిస్తాయి. నడవడం స్వేచ్ఛ. విహరించడం విముక్తి. మల్లికా శెరావత్ కూడా కాన్స్‌కు వెళ్లిన మొదటి రెండు రోజూలూ గౌన్‌లోనే కనిపించారు. ఆ తర్వాతే.. రెక్కలు తెగిన పక్షిలా, సంకెళ్లు లేని ఖైదీలా.. ఒక బోనులో, ఆ ఊచల్లోంచి పిచ్చిచూపులు చూస్తూ కనిపించారు! కాన్స్ ప్రాంగణం ఒక్కసారిగా ఫ్రీజ్ అయింది!
నాకు తాళం వెయ్యండి
మల్లికను ఎవరు ఆ బోనులో బంధించారు? ఎవరో కాదు, తనను తానే చిన్న పెట్టె లాంటి ఆ బోనులో ఆమె బందీ అయ్యారు. ‘పన్నెండు గంటలుగా నేను ఈ బోనులో ఉన్నాను. నాకు అండగా ఉండండి’ అని ఆ బోనుకు పైన తగిలించిన తెల్లటి బోర్డు పైన నల్లటి అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాల పక్కన.. తెరిచి ఉన్న తాళం కప్ప ‘లాక్ మీ అప్’ (నాకు తాళం వెయ్యండి) అని ఉంది. ఆ తాళంకప్ప పక్కన.. మల్లిక ఈ ప్రపంచానికి ఇవ్వదలచుకున్న సందేశం ఉంది. ‘ఫ్రీ ఎ గర్ల్’బాలికలకు విముక్తి కల్పించండి. అది వట్టి సందేశం కాదు. అభ్యర్థన. విజ్ఞప్తి. వేడుకోలు. ప్రార్థన. ‘చూడండి.. బందీ అయిన బాలిక జీవితం ఎలా ఉంటుందో నన్ను చూడండి’ అని చెప్పడం. కాన్స్‌కి వచ్చి ఇదేం పని. చక్కగా సీతాకోక చిలకలా రెపరెపలాడక! రెపరెపలాడాలంటే కదలిక ఉండాలి. కదలిక ఉండాలంటే బంధనాలు లేకుండా ఉండాలి. ఇది చెప్పడానికే మల్లిక ఇక్కడికి వచ్చారు. ఊరికే వచ్చి ప్రసంగిస్తే, చర్చిస్తే, వాదిస్తే, అరిస్తే, ఆగ్రహిస్తే, గర్జిస్తే, గాండ్రిస్తే, అక్రమాలపై ఆక్రోశిస్తే.. ఎవరు వింటారు? ఎవరు తలతిప్పి చూస్తారు. బందీలను చేసి వినిపించాలి. అందుకోసం తను బందీ అయ్యారు మల్లిక! అప్పుడు మల్లిక ఒక్కరే కనిపించరు. మల్లికలోని ఆవేదన కనిపిస్తుంది. వినిపించే ఆవేదన కన్నా కనిపించే ఆవేదన పవర్‌ఫుల్.
దగాపడిన చెల్లెళ్ల కోసం
తొమ్మిదేళ్లుగా మల్లిక శెరావత్ కాన్స్‌కు వస్తున్నారు. ఇక్కడేం మాట్లాడినా ప్రపంచం వింటుందనీ, ఇక్కడే అభిప్రాయం వెలిబుచ్చినా ప్రపంచం గౌరవిస్తుందని, ఇక్కడి ప్రతి అడుగుకు, ప్రతి మూవ్‌మెంట్‌కు విలువ ఉంటుందని మల్లిక గ్రహించారు. కాన్స్‌పై అంత గమనింపు, అంత పట్టింపు ఉన్న ప్రపంచం కాన్స్‌లో బందీగా పడి ఉన్న ఒక అమ్మాయిని చూడకుండా ఉంటుందా? చూసీ చూడనట్లు వెళ్లిపోతుందా! అందుకే మల్లిక బోనులో కూర్చున్నారు. బయట తాళం కప్ప వేసుకుని తాళం వెయ్యమని అడుగుతున్నారు. బోనులో ప్రపంచానికి కనిపించేది మల్లికే కావచ్చు. కానీ మల్లిక.. దగాపడిన చెల్లెళ్లకు, నమ్మి మోసపోయి, రవాణా అయి, బందీ అయిన చిన్నారి బాలికలకు ప్రతిరూపం. ఆ విషయాన్నే మల్లిక చెప్పదలచుకున్నారు. ‘బంధన విముక్తి కల్పించండి’ అనే మాటనే, రివర్స్‌లో ‘బయట తాళం వెయ్యండి’ అనే మాటగా చెప్పారు. ఆలోచన రేపి, హృదయాన్ని తట్టి లేపే బంధనమిది!
విముక్తి శక్తి.. శెరావత్
‘ఫ్రీ ఎ గర్ల్’ అనే ఎన్జీవో సంస్థకు అంతర్జాతీయ రాయబారి మల్లికా శెరావత్. అక్రమ రవాణా నుంచి, లైంగిక దోపిడీ నుంచి బాలికలకు విముక్తి కల్పించడం ఆ సంస్థ లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా గత ఏడాది కూడా కాన్స్‌లో చురుకైన పాత్రను పోషించారు మల్లిక. ఈ ఏడాది ‘లాక్ మీ అప్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. మోసగించి అపహరించుకు వచ్చిన బాలికల్ని ‘ట్రాఫికింగ్ మాఫియా’ పన్నెండు, ఎనిమిది అడుగుల చిన్న గదిలో బంధించి ఉంచుతుంది. ఎప్పుడు బయట పడతారో తెలీదు. ఎవరి చేతుల్లో పడతారో తెలీదు. ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా అవుతారో తెలీదు. ఏ నిముషానికి ఏ తరహాలో లైంగిక హింస జరుగుతుందో తెలీదు. చీకటి బతుకు. ఆ చీకట్లో అలా ఎన్నేళ్లు బతకాలో, అసలు బతుకంటూ మిగిలుందో లేదో తెలియని బతుకు. ఆదుకునే వారుండరు. అక్కున చేర్చుకునే వారుండరు. ఈ దుస్థితి ఎలా ఉంటుందో ఒక్క మాటలో చెప్పడానికే, చూసేవాళ్లకు ఒక్కచూపులో తెలియడానికే మల్లిక ఇలా బోనులో బందీ అయ్యారు. ‘స్కూల్ ఫర్ జస్టిస్’ అనే సంస్థకు కూడా మల్లిక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇండియాలో, మిగతా దేశాల్లో పసిపిల్లల్ని బాలవేశ్యలుగా మారుస్తున్న ముఠాలకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యంగా చొరవ చూపుతున్నారు. ఇందుకు.. ఐక్యరాజ్య సమితి తరఫున స్త్రీ, శిశు సంక్షేమం కోసం పని చేసిన అనుభవం, పరిచయాలు మల్లికకు తోడ్పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment