మొహమాటాలొద్దు...
మెన్స్ వెల్త్
కొందరికి అదేపనిగా అప్పులు అడిగే అలవాటు ఉంటుంది. తీసుకున్న అప్పు తీర్చరని తెలిసినా ఇచ్చేస్తుంటాం. ఆ తరువాత తీరిగ్గా బాధ పడుతుంటాం. అందుకే ‘సారీ’ చెప్పి తప్పించుకోవడమంత ఉత్తమమేదీలేదు.
ఒక్కసారి చెక్ చేసుకోండి...
హైదరాబాద్‌లో అయిదు సంవత్సరాలుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రశాంత్ నోటి నుంచి ‘‘డబ్బులు సరిపోవడం లేదు’’ అనే మాట తరచుగా వినిపించేది. పని మీద దృష్టి పెట్టకుండా, ఎక్కువ జీతం వచ్చే వేరే కంపెనీకి మారాలని ఆలోచిస్తూ ఉండేవాడు.
ఒకరోజు అతని స్నేహితుడు-
‘‘మార్చాల్సింది కంపెనీ కాదు...నీ అలవాట్లను’’ అని సలహా ఇచ్చాడు.
దీంతో తన నెల ఖర్చులు వివరంగా లెక్కలు వేసుకున్నాడు. అనివార్యమైన ఖర్చుల కంటే, వృథా ఖర్చులు రెట్టింపు ఉన్నాయి! అప్పటి నుంచి అవసర ఖర్చులకు పుల్‌స్టాప్ పెట్టాడు. ‘ ఒక రూపాయి ఆదా చేస్తే, ఒక రూపాయి సంపాదించినట్లే కదా’ అనే పాత నిజం అనుభవంలోకి రావడానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు.
మంచీ చెడు.. మన మీదే!
డబ్బుకు మంచి చేసే గుణం, చెడు చేసే గుణం రెండూ ఉంటాయనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు ‘ఫైనాన్షియల్ రికవరీ: డెవలపింగ్ ఏ హెల్తీ రిలేషన్‌షిప్ విత్ మనీ’ పుస్తక రచయిత కరెన్ మెకాల్. డబ్బును సద్వినియోగం చేస్తే ‘మంచి’ జరిగినా జరగకపోయినా, దుర్వినియోగం చేస్తే మాత్రం వందశాతం చెడు జరుగుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు.
ఖాళీ తెర...
‘డబ్బు అనేది బ్లాంక్ స్క్రీన్ లాంటిది. దానిపై మనం ఎన్ని అందమైన కలలైనా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఆ కలలను ఎంత వరకు వాస్తవంలోకి తీసుకువస్తున్నామనే దానిపై మన సామర్థ్యం ఆధారపడి ఉంటుంది అంటున్నారు ఢిల్లీకి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డా.బ్రిష్టి బర్కతక్.