హోమియో కౌన్సెలింగ్
వర్షాకాలం వచ్చిందంటే చాలు... మా ఇంటిల్లిపాదికీ బయటికెళ్లాలంటే భయమే. తుమ్ములూ దగ్గులే కాదు, ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. హోమియోలో అయినా మా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందంటారా?
- కె. లక్ష్మి, అమరావతి
వర్షాకాలం వచ్చిందంటే అతిసార, ఆస్తమా, అలర్జీ, బ్రాంకైటిస్, ఫ్లూ, జలుబు, దగ్గు, జ్వరం, మలేరియాలు వ్యాపించడం సర్వసాధారణం. కారణం... బ్యాక్టీరియా, ఇంటికీటకాలు, ఫంగస్‌ల వంటివి వర్షాకాలంలో విజృంభించేస్తాయి గనక. కొన్ని జాగ్రత్తలతోపాటు అవసరమైనప్పుడు వైద్యచికిత్సలు కూడా తీసుకుంటే ఆ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
అలర్జిక్ రైనటిస్: వరుసగా తుమ్ములు రావడం, ముక్కు కారడం, కళ్లు, ముక్కు దురదగా ఉండటం వంటివి ఇందులో కనిపిస్తాయి. సాధారణ జలుబు కాదని తేలిపోతే అది అలర్జీ సమస్యేననే నిర్ధారణకు రావచ్చు. గాలిలో ఉండే కొన్నిరకాల పదార్థాల కారణంగా ముక్కులోపలి కణజాలంలో వాపు రావడం ఇందులోని సమస్య. పొగ, దుమ్ము, కాలుష్యాలు, గాలిలో ఉండే ఉన్ని వంటివి మరికొన్ని అంశాలు.
జాగ్రత్తలు: అలర్జిక్ రైనైటిస్ తీవ్రంగా ఉన్నప్పుడు శరీరంలో సెన్సిటివిటీని తగ్గించుకునేలా శిక్షణ పొందాలి. చాలాకాలంగా వాడకంలో లేని ఉన్నిదుస్తుల వంటి వాటిని ధరించడానికి ముందు తప్పనిసరిగా ఉతికి మంచి ఎండలో ఆరేయాలి. చలివాతావరణానికి దూరంగా ఉండాలి. కూల్‌డ్రింక్స్, చల్లటివస్తువులు తీసుకోకూడదు. అలర్జీ కలిగించే వస్తువులకు దూరంగా ఉండాలి. వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడి ఉంటే తగ్గించుకోవాలి.
హోమియో చికిత్స: అలర్జీని తగ్గించడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచి త్వరగా వ్యాధి నివారణ అయేలా చేయొచ్చు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే అలర్జీ సమూలంగా తగ్గిపోతుంది.
ఆస్తమా: ఇది ఊపిరితిత్తుల్లో వాయునాళాల్లో వచ్చే దీర్ఘకాలిక సమస్య. ఇది తేమ వాతావరణంలో ఉండే పుప్పొడి వంటి అలర్జన్ల వల్ల వస్తుంది. సాధారణంగా ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలే ఎక్కువ అయినప్పటికీ వర్షాకాలంలో వచ్చే ఆస్తమా ఒకరకమైన అలర్జిక్ ఆస్తమా. పుప్పొడి, జంతువుల వెంట్రుకలు, డస్ట్‌మైట్స్ వంటి వాటి వల్ల కూడా వస్తుంది.
ఆస్తమా ఒకసారి వస్తే ఇక ఎప్పటికీ తగ్గదని అందరూ అనుకుంటారు కానీ అది నిజం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అనుభవజ్ఞులైన హోమియో వైద్యుని పర్యవేక్షణలో ఆర్సెనిక్ ఆల్బ్, ఇపికాక్, నైనట్రమ్ సల్ఫ్, కాలికార్బ్, కాల్కేరియా కార్బ్ వంటి మందులు వాడటం ద్వారా ఆస్తమాను శాశ్వతంగా నయం చేయొచ్చు. ఈ మందుల వాడకం వల్ల ఎటువంటి దుష్ర్పభావాలూ ఉండవు కూడా.
క్యాన్సర్ కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. నేను పదిహేనేళ్లుగా గుట్కా తింటున్నాను. ఆర్నెల్లుగా నా నోటిలో వాపు, నొప్పి వస్తున్నాయి. ఒక నెలరోజులుగా ఈ బాధ మరీ ఎక్కువగా ఉంది. నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే నోటిక్యాన్సర్ అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. సరైన సలహా చెప్పండి.
- జి.ఆర్.ఆర్., హైదరాబాద్
గుట్కాలు/పొగాకు నమిలేవారిలో నోటి క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. నోటి పరిశుభ్రత అంతగా పాటించకపోవడంతో పాటు, ఇలా గుట్కాలు, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అంశాలు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. అంటే చెంపలు, నాలుక, చిగుళ్లు... ఇలా నోటిలోని ఏ భాగంలో మీకు క్యాన్సర్ వచ్చిందో రాయలేదు. మీకు నోటిలో వాపు కూడా వచ్చిందంటే అది క్యాన్సర్ కాస్త ముదిరిన దశను సూచిస్తోంది. మొదట మీకు సమస్య ఉన్నచోట, మెడ భాగంలోనూ సీటీ లేదా ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు చేయించి, క్యాన్సర్ వ్యాధి తీవ్రతను అంచనా వేయాలి. ఈ పరీక్షల వల్ల పుండు పడిన చోటి నుంచి, అది ఏ మేరకు వ్యాపించిందో కూడా తెలుస్తుంది. అది ఇప్పటికే మీ దవడ ఎముకను చేరిందా, లేక ఎముకను దాటి మెడలోని లింఫ్ గ్రంథులకూ వ్యాపించిదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. మీరు మామూలుగా నోరు తెరవగలుగుతూ ఉంటే, క్యాన్సర్ మీ దవడ కండరాల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ దవడ కండరాల్లోకి వ్యాపిస్తే నోరుతెరవడం కష్టమవుతుంది. దాంతో క్యాన్సర్ కూడా కొంచెం ముదిరినట్లు అర్థం. వ్యాపించకపోతే శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ వచ్చిన భాగం మేరకు తొలగించడం మొదట చేయాలి. ఆ తర్వాత తొలగించిన భాగాన్ని ప్లాస్టిక్ సర్జరీ లేదా రీ-కన్‌స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా పునర్మించవచ్చు. ఈ పద్ధతుల ద్వారా దవడ ఎముకను తొలగించి కూడా మళ్లీ మునుపటిలాగే అమర్చేలా చూడవచ్చు. ఒకవేళ మెడలోని లింఫ్ గ్రంథుల్లోకి కూడా క్యాన్సర్ వ్యాపించి ఉంటే, వాటన్నింటినీ నెక్ డిసెక్షన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. బయాప్సీ రిపోర్టు ఆధారంగా శస్త్రచికిత్స గాయలు మానాక, రేడియోథెరపీ ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. మీరు మొదట గుట్కా నమలడం మానేయండి. అది కేవలం నోటికే గాక, మెడ, ఆహారనాళం లేదా కడుపులోని ఏ భాగానికైనా క్యాన్సర్ వచ్చేలా చేయగలదు.
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 29 ఏళ్లు. సుమారు ఎనిమిది నెలలుగా నాకు తరచూ కడుపునొప్పి వస్తోంది. విసర్జన తర్వాత కడుపునొప్పి తగ్గుతోంది. మలబద్ధకం, విరేచనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, నన్నే చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. అవి వాడినప్పుడు కాస్త మామూలుగా అనిపిస్తోంది. మానేయగానే మళ్లీ సమస్య మొదటికి వస్తోంది. నా సమస్య శాశ్వతంగా తగ్గే మార్గం చెప్పండి.
- బాలకృష్ణ, ఖమ్మం
మీరు రాసిన లక్షణాలు బట్టి మీరు ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్)తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మానసికంగా ఆందోళన ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఆ తర్వాత స్కానింగ్ పరీక్ష కూడా అవసరం కావచ్చు. పరీక్షలు అన్నీ నార్మల్ అని వస్తే మీకు ఐబీఎస్ అని నిర్ధారణ అవుతుంది. ఈ సమస్యకు మొదటి పరిష్కారం మీరు మానసికమైన ఒత్తిళ్లను, ఆందోళనలను తగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంతకాలం యాంటీ స్పాస్మోడిక్, అనాల్జిక్ మందులు వాడితే మీ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మీ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది.
నా వయసు 36 ఏళ్లు. గత ఏడాది కాలంగా తరచూ కడుపునొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఎండోస్కోపీ చేయించి, గ్యాస్ట్రైటిస్ సమస్య ఉన్నట్లు తెలిపారు. ఆయన రాసిన మందులను క్రమం తప్పకుండా వాడాను. ఈ వ్యాధి రావడానికి కారణం ఏమిటి? దీని నివారణ మార్గం చెప్పగలరు.
- గిరిప్రసాద్, కాకినాడ
గ్యాస్ట్రైటిస్ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. రోజూ ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం, తరచూ పెయిన్‌కిల్లర్స్ వాడటం, సమయానికి భోజనం చేయడకపోవడం వంటి కారణాలతో ఈ సమస్య ఎక్కవగా వస్తుంటుంది. మీకు మద్యం అలవాటు ఉంటే వెంటనే మానేయండి. పెయిన్‌కిల్లర్స్ వాడుతుంటే డాక్టర్‌ను సంప్రదించాకే, వైద్యుల సలహా మేరకే వాటిని తీసుకోండి. వ్యాధి లక్షణాలు బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరోసారి మీ డాక్టర్ దగ్గరకు వెళ్లి సమస్య చెప్పండి.
గుట్కా తింటే... మౌత్ క్యాన్సర్..?
Published Mon, Sep 14 2015 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM
Advertisement
Advertisement