వెండితెర డాక్టర్‌గారు | Movies With Doctor Characters In Tollywood | Sakshi
Sakshi News home page

వెండితెర డాక్టర్‌గారు

Published Sun, Apr 19 2020 12:02 AM | Last Updated on Sun, Apr 19 2020 3:37 AM

Movies With Doctor Characters In Tollywood - Sakshi

‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌’లో చిరంజీవి; ‘అర్జున్‌ రెడ్డి’లో విజయ్‌ దేవరకొండ 

దేవుడు తెల్లకోటు వేసుకొస్తే అచ్చు డాక్టర్‌లానే ఉంటాడు. ప్రాణం పోసే శక్తి దేవుడి తర్వాత డాక్టర్‌కేగా ఉంది. హీరో డాక్టర్‌ అయితే చెడు మంచాన పడుతుంది. డేంజరస్‌ వైరస్‌ మీదే కాదు డేంజరస్‌ పాత్రల
మీద కూడా పోరాడతాడు హీరో. సమాజానికి అవసరమైన చికిత్స చేసి మంచి మందు చీటి రాస్తాడు. మేకప్‌ వేసుకొని మన ముందుకొచ్చే ఈ డాక్టర్‌కు ప్రేక్షకుల ఈలలు, చప్పట్లే ఫీజు.

నిజ జీవితంలో డాక్టర్లకే కాదు సినిమాల్లో డాక్టర్లకు కూడా పెను సవాళ్లు ఎదురవుతాయి. వారూ ప్రాణాలకు తెగించాల్సి ఉంటుంది. ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఎలాగైనా సరే పాత్రలను కాపాడాల్సి ఉంటుంది. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘శారద’  గుర్తుందా? అందులో శారద ఉత్త అమాయకురాలు. చాలా మంచిది. ఊరి పైకప్పు మీద సుందరంగా పాకిన లేత గుమ్మడి తీగలా ఉంటుంది. ఆ ఊరికి శోభన్‌బాబు డాక్టర్‌లా వస్తాడు. శారదను ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుంటాడు. ఆ రాత్రే శోభనం. కాని ఎవరికో ప్రాణాల మీదకు వస్తే రేవు దాటి వెళ్లి వైద్యం చేస్తాడు. తిరిగి వస్తూ పడవ ప్రమాదంలో మరణిస్తాడు. శారదకు ఆ విషయం తెలిసి స్పృహ కోల్పోతుంది. స్పృహ వచ్చాక విన్న ఆ విషయాన్ని మర్చిపోయి తన భర్త బతికి ఉన్నట్టే భావిస్తూ ఉంటుంది.

భర్త వస్తాడని ఎదురుచూస్తూ ఉంటుంది. చనిపోయిన భర్త కోసం ఎదురుచూసే ఆ పిచ్చిమాతల్లిని చూస్తే ఊరంతటికీ శోకం. ఈ శోకం నుంచి బయటపడేయడానికి ఆమె భర్తలాగే ఉండే మరో డాక్టర్‌ శోభన్‌బాబు రంగంలో దిగుతాడు. తన భార్య జయంతిని ఒప్పించి శారదకు భర్తలా నటిస్తాడు. వొత్తిడి అనుభవిస్తాడు. చివరకు ఆమెను మామూలు మనిషిని చేస్తాడు. కాని మామూలు మనిషి అయిన శారద మామూలు మనిషిలా ఉండలేకపోతుంది. భర్త జ్ఞాపకాలు ఆమెలో సజీవంగా ఉంటాయి. ఆమెను తీసుకొస్తున్న పడవ ఊరి గట్టుకు చేరేలోపల నిశ్శబ్దంగా ప్రాణం విడుస్తుంది. ఆ పేషంట్, ఆ డాక్టర్‌ కూడా సిల్వర్‌జూబ్లీ కలెక్షన్లతో తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారు.
∙∙∙
‘డాక్టర్‌ చక్రవర్తి’ సినిమాలో డాక్టర్‌ చక్రవర్తి పాత్ర పోషించిన అక్కినేని ఎంత మంచివాడని. చనిపోయిన తన చెల్లెలిని స్నేహిడుడైన జగ్గయ్య భార్య సావిత్రిలో చూసుకుంటుంటాడు. ఆ మాట బయటకు చెప్పడానికి మొహమాట పడతాడు. ఈలోపు సావిత్రి పట్ల అతడు పెంచుకున్న మమకారాన్ని అటు అక్కినేని భార్య షావుకారు జానకి, ఇటు సావిత్రి భర్త జగ్గయ్య అపార్థం చేసుకుంటారు. వైద్యునిపై విశ్వాసం పెట్టలేనివారు తమ ప్రాణాలతో పాటు వైద్యుని భవిష్యత్తును కూడా ప్రమాదంలో పడేస్తారు. ఇక్కడ జరిగేది అదే. Mచివరకు అపార్థాల జబ్బు తొలగిపోతుంది.

అక్కినేని గొప్ప వ్యక్తిత్వం ఎక్స్‌రేకు దొరకుతుంది. అందరూ హాయిగా కలిసి మెలుస్తారు. అలాగే ‘మురళీ కృష్ణ’ సినిమాలో డాక్టర్‌ కృష్ణ పాత్ర ధరించిన అక్కినేని ఒక డాక్టర్‌గా పేషెంట్‌ శ్రేయస్సు ఎలా కోరతాడో ఒక భర్తగా భార్య శ్రేయస్సు అలా కోరుతాడు. తాను పెళ్లి చేసుకున్న జమున మరొకరిని అంటే హరనాథ్‌ని ప్రేమిస్తోందని తెలిసి ఆమెను వదిలి ఎక్కడికో వెళ్లిపోతాడు. నిజానికి అదొక అపార్థం. జమున హరనాథ్‌ని ప్రేమించలేదు. అలా ప్రేమించింది శారద. చివరకు భార్యాభర్తలు ఒకరి గొప్పతనం ఒకరు గ్రహించి ఏకమవుతారు. 
∙∙∙


‘సర్పయాగం’లో శోభన్‌బాబు; ‘మనసే మందిరం’లో అక్కినేని

‘మనసే మందిరం’ సినిమాలో డాక్టర్‌గా అక్కినేని ఎదుర్కొన్న సవాలు అతడు ప్రాణత్యాగం చేసేలా చేస్తుంది. ఆ సినిమాలో అక్కినేని సావిత్రిని ప్రేమిస్తాడు. కాని సావిత్రి జగ్గయ్యను వివాహం చేసుకుంటుంది. జగ్గయ్య జబ్బు పడతాడు. డాక్టరైన అక్కినేని అతనికి వైద్యం చేస్తుంటాడు. కాని సావిత్రికి అనుమానం. అక్కినేని వైద్యం పేరుతో తన భర్తను చంపి ఎక్కడ తనను పెళ్లి చేసుకుంటాడోనని. ఆ నింద వేస్తుంది కూడా. కాని అక్కినేని ఒక డాక్టర్‌గా తన ధర్మాన్ని మర్చిపోడు. ప్రాణం ధారబోసి జగ్గయ్యను బతికిస్తాడు. ఆ వొత్తిడికి తానే ప్రాణం విడుస్తాడు. లోకమెల్లా అతని స్మృతిలో ఒక హాస్మిటల్‌ నిర్మించుకుని గుండెల్లో దాచుకుంటుంది.
∙∙∙
శోభన్‌బాబు, మంజుల నటించిన ‘మంచి మనుషులు’ సినిమాలో మంజుల పెళ్లి కాకుండానే శోభన్‌బాబు వల్ల తల్లవుతుంది. కొడుకు పుడతాడు. పోలియో వ్యాధిగ్రస్తుడవుతాడు. మంజులను పెళ్లి చేసుకోబోయే జగ్గయ్య డాక్టర్‌గా ఆ పిల్లవాడికి వైద్యం చేయబోతాడు. కాని మంజులకు అనుమానం. ఆ పిల్లవాడు తన కొడుకే అని జగ్గయ్యకు తెలిసిపోయి ఎక్కడ అపకారం కలుగజేస్తాడో అని. కాని ఏ డాక్టరూ అలా చేయడు. జగ్గయ్య కూడా చేయడు. పిల్లవాణ్ణి ఎమోషనల్‌గా బాధించి కాళ్లు వచ్చేలా చేస్తాడు. పోలియో పోగొడతాడు. ఒక డాక్టర్‌గా జగ్గయ్య వెలిగిన పాత్ర అది.
∙∙∙
డాక్టర్‌కు రక్తం చూడటం వృత్తిలో భాగం. కాని చెడు మీద పోరాడటానికి రక్తాన్ని కళ్ల చూడవలసి రావడం మాత్రం దురదృష్టకరమే. ‘సర్పయాగం’ సినిమాలో శోభన్‌బాబు డాక్టర్‌. భార్య చనిపోతే ఒక్కగానొక్క కూతురిని అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ఈడొచ్చిన ఆ అమ్మాయిని కొంతమంది దారుణంగా అత్యాచారం చేస్తారు. చట్టంలోని లొసుగులు వారిని కాపాడతాయి. దాంతో శోభన్‌బాబే శిక్షాధికారిగా మారుతాడు. కొంతమంది ప్రొఫెషనల్స్‌తో కలిసి ఆ రేప్‌ చేసిన వారిని చంపి, ఉరి కంబం ఎక్కుతాడు. ‘ఖైదీ’ సినిమాలో సుమలత కూడా డాక్టర్‌. పోలీసులు వెంటబడుతున్న చిరంజీవిని కాపాడుతుంది. ప్రతీకారవాంఛతో రగిలి పోతున్న అతనికి సాయం చేస్తుంది. అందుకు ప్రతిఫలంగా తన ప్రాణాన్నే కోల్పోతుంది. హీరో లక్ష్యసాధనలో సాయం చేసే ఇలాంటి డాక్టరు పాత్రలు ఎన్నో ఉన్నాయి.
∙∙∙
‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌’ వచ్చి డాక్టర్లందరినీ ప్రేమాస్పదులను చేసింది. కొంతకాలంగా డాక్టర్లు పేషెంట్లను ఫీజు కట్టే ఒక మెషీన్‌లా చూస్తున్నారని వైద్యం కంటే ముందు డాక్టర్ల నుంచి కావాల్సింది ప్రేమ, ఆదరణ, నమ్మకం, భరోసా అని ఈ సినిమా చెప్పింది. ఇందులో చిరంజీవి మంచి గూండా. డాక్టర్‌ కోర్సు చదవాలనుకుంటాడు తన తండ్రి కోసం. కాని ఒకసారి ఆ కోర్సులో జాయిన్‌ అయ్యాక మరబొమ్మలుగా మారిపోయిన డాక్టర్ల హృదయానికి స్పందన తెస్తాడు. వారి కళ్లల్లో నీళ్లున్నాయన్న సంగతిని గుర్తు చేస్తాడు. వారి మనసుకు చలించే గుణం ఉందని గుర్తు చేస్తాడు. ఫారమ్‌ నింపడం కంటే ముందు పేషంట్‌కు అవసరమైన వైద్యాన్ని ఈ సినిమా గుర్తు చేసింది. శంకర్‌ దాదాకు జిందాబాద్‌లు కొట్టించింది.
∙∙∙
ఇక ఇటీవల సంచలనం సృష్టించిన డాక్టర్‌ ‘అర్జున్‌ రెడ్డి’. ఈ సినిమాలో అర్జున్‌ రెడ్డిగా నటించిన విజయ్‌ దేవరకొండ ఒక గొప్ప ఆర్థోపెడిస్ట్‌ సర్జన్‌గా కనిపిస్తాడు. తన ప్రేమ పట్ల ఎంత నిజాయితీగా ఉంటాడో వృత్తి పట్ల కూడా అంత నిజాయితీగా ఉంటాడు. దేవదాసుగా మారి తాగి హాస్పిటల్‌కు వచ్చి సర్జరీలు చేస్తుంటాడు. అలా చేయడం తప్పు. ఎంక్వయిరీ వచ్చినప్పుడు అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు. కాని నిజాయతీ గా తన తప్పు అంగీకరిస్తాడు. అందుకు డాక్టర్‌ డిగ్రీని కోల్పోయేంత ప్రమాదంలో పడతాడు. అయినప్పటికీ అతని నిజాయతీ ప్రేక్షకులకు నచ్చుతుంది.

చిన్న క్లినిక్‌ పెట్టుకొని, ఈ జీవితం చాలు అనుకునే మిత్రుడు రాహుల్‌ రామకృష్ణను విజయ్‌ దేవరకొండ తిట్టే సీను కూడా బాగుంటుంది. ‘సర్జరీలు చేయ్‌. రక్తాన్ని చూడు. ఏదైనా ఒక గొప్ప పని సాధించు’ అని చెబుతాడు విజయ్‌ దేవరకొండ. తన ప్రేమ స్వచ్ఛమైనదని, దానికి ఏ జబ్బూ చేయలేదని విజయ్‌ దేవరకొండకు తెలుసు. అందుకే చివరకు తన ప్రేమను సాధించుకున్నాడు. 
∙∙∙
తెలుగులో డాక్టర్‌ పాత్రలు అందరూ చేయరు. ఎందుకంటే డాక్టర్‌ ‘మాస్‌’గా ఉండడని మన అభిప్రాయం. కాని అలా మాస్‌గా ఉండొచ్చని బాలకృష్ణ ‘సింహ’లో చూపిస్తాడు. నాగార్జున ‘క్రిమినల్‌’ ఆ రోజుల్లో ఆయన చేత డాక్టర్‌ పాత్ర వేయించినా పూర్తిగా సఫలం కాలేదు.  చాలా సినిమాల్లో డాక్టర్‌ అనగానే ఆపరేషన్‌ అయ్యాక బయటకు వచ్చి ‘సారీ’ అని కళ్లద్దాలు తీసి బరువుగా చెప్పేవాడో, నింపాదిగా ‘హీ ఈజ్‌ ఆల్‌రైట్‌’ అని చెప్పేవాడో అయి ఉంటాడు.

కాని డాక్టర్‌ల జీవితాలను చూస్తే వారు తమ వృత్తి జీవితంలో చూసే కేసుల వివరాల్లోకి, ఆ పేషెంట్ల జీవితాల్లోకి చూస్తే ఎన్నో సినిమాలు తీయొచ్చు. ఇప్పుడు కరోనా సమయంలో వేలాది, లక్షలాది డాక్టర్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు వైద్యం చేస్తున్నారు. కాపాడుతున్నారు. ఈ మహమ్మారి ముగిశాక వారు కథానాయికులుగా అనేక సినిమాలు రావచ్చు. వాటి కోసం ఎదురు చూద్దాం.
– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement