‘‘నా ఫొటో తియ్యాలి’’ అన్నాడు వీరయ్య స్టూడియోలో అడుగు పెడుతూ. వీరయ్య తన ఫొటో తీయించుకోవాలని చాలా రోజుల నుండి ఉబలాటపడ్డాడు కాని ఎప్పుడూ వీలుపడలేదు. ఎంతో ఉత్సాహంగా వెళ్లాడు అవాళ ఆ సాయంత్రానికి కొట్టును గుమస్తాకు నమ్మి.
‘‘సరే’’ నన్నాడు జర్మనీకి వెళ్లి ప్రత్యేకంగా ఈ ఆర్టులో ప్రవీణుడై వచ్చిన ఫొటోగ్రాఫరు. కళ్లకు అద్దాలు, ఫుల్‌సూటు మీద ఉన్నాడు మనిషి. అతని ఫొటోగ్రఫీ సైన్సు అంతా సిగరెట్టు పొగలో ఉబ్బిన అరమోడ్పు కళ్లల్లో వ్యక్తమౌతోంది.
‘‘కూర్చోండి. ఇప్పుడే పిలుస్తాను మిమ్మల్ని’’ అని లోపలికి వెళ్లాడు. ‘‘మంచిది’’ అంటూ చిరునవ్వుతో బొజ్జ నిమురుకుంటూ సోఫాలో కూర్చున్నాడు వీరయ్య. అరగంట అయింది. అతను లోపలి తలుపులోని మఖమలు పరదాను కొద్దిగా తీసి ముఖం ఇవతలికి పెట్టి ‘‘రండి’’ అన్నాడు. వెళ్లాడు లోపలికి వీరయ్య. అంతా చీకటిగా ఉంది. కొద్దిగా వెలుతురు అద్దాల తలుపులోంచి వస్తోంది మనిషి కనబడే మాత్రం. ఒక మెత్తని కుర్చీ, దాని పక్క ఎత్తయిన స్టూలు మీద ఫ్లవర్‌వేస్, దాని నిండా అందమయిన రకరకాల కాగితాల పువ్వులు అమర్చి ఉన్నాయి. కింద కూడా అంతా పూలదుప్పటి పరచినట్టు ఉన్నది. లోపలికి వెళ్లాక కుర్చీమీద కూర్చోమన్నాడు వీరయ్యని.
వీరయ్య కూర్చున్నాక ఫొటోగ్రాఫరు ఒకటి మెషీను పెట్టెలాంటిది మూడు కాళ్ల మీద నిలబెట్టి ఆ కాళ్లలో నుండి వెనక్కు దూరాడు. దాన్ని వెనక్కు ముందుకు నెట్టి సరిగా నిలబెట్టాడు. మళ్లీ ఒకమాటు దానిలో దూరి నల్లటిగుడ్డను కప్పుకున్నాడు. వీరయ్యకు ఇదంతా ఏమిటో గారడీ విద్యలాగా అనిపించింది. గారడీవాళ్లు మొదలు ఉత్తగిన్నె చూపించి దానిలోంచి మామిడి మొలకను చూపించినట్టు చూపిస్తాడు గామాలు తన ఫొటో అనుకున్నాడు. ఫొటోగ్రాఫరు ఇవతలికి వచ్చి ‘‘నీ ముఖమే సరిగాలేదు’’ అన్నాడు కనుబొమ్మలు ముడివేసి పెదిమలు చప్పరిస్తూ.
‘‘చిత్తం. అది నాక్కూడా తెలుసు. కాని ఎట్లాగయినా’’ వీరయ్య చేతులు నలుముకుంటూ ప్రాధేయపడ్డాడు.
ఒక నిట్టూర్పు విడిచాడు ఫొటోగ్రాఫరు.
‘‘సరే. అయితే త్రీ క్వార్టర్స్ ఫుల్ (ముఖంలో మూడు వంతులు కనపడేటట్టు) ఉండేలాగా చేస్తాను’’ అని అతని దగ్గరికి వచ్చి, తన చేతుల్తో అతని ముఖాన్ని పట్టుకుని ఎడమవేపు తిప్పాడు. అట్లాగే ఉండాలేమో ననుకున్నాడు వీరయ్య. ఫొటోగ్రాఫరు మళ్లా ఎడమవేపు నుండి కుడివేపు తిప్పగలిగినంత వరకు తిప్పాడు ముఖాన్ని. ఆ మెషీను వంక ముఖం వంక పరీక్షగా చూచి ‘‘అబ్బే– అస్సలు కుదరటం లేదు. ఈ తల ఏమీ బాగాలేదు. ‘‘కొంచెం నోరు తెరవండి’’ తెరవబోతుంటే, ఆ... ఆ... చాలు. మూసుకోండి కొంచెం అని ‘డైరెక్టు’ చేశాడు. ‘‘ఏదీ కొంచెం ముఖం అట్లాగే ఉంచి ఒళ్లు తిప్పండి ఇటువేపు’’. ఏమిటిరా భగవంతుడా ఈ అవస్థ అంతా అనుకుంటూ ఎంతో ప్రయత్నం మీద కిందికి బరువును తిప్పగలిగాడు.
‘‘అయ్యయ్యో! పోస్చర్ అంతా చెడగొట్టేశారు!!’’ అని గోలపెట్టాడు ఫొటోగ్రాఫరు. మళ్లీ కాసేపటిదాకా ఇటు తిప్పి సరిగా పెట్టాడు ముఖాన్ని.
‘‘సరే. ఇటు చూడండి దీనివేపు. కొంచెం తల పైకెత్తండి. ఆ... ఆ... చాలు. చేతులు మోకాళ్ల మీద పెట్టుకోండి. తల వొంచకుండా నడుము ముడతలు పడకుండా సరిగా నిలబెట్టండి.’’
వీరయ్య షావుకారికి అరికాలిమంట నెత్తికెక్కింది. ఫొటో లేకుంటే పీడ పోయింది! ఈ వెధవ అవస్థంతా అనుకున్నాడు. కాని ఇహ ఇంత కష్టపడి ఒక్క నిమిషం ఓపిక పడితే మంచిదని అతను చెప్పినట్టల్లా అమలు పెట్టాడు.
‘‘ఆ, సరే, బాగుంది’’ అని మళ్లీ దగ్గరికొచ్చి సరిచేశాడు. ‘‘ఇహ కదలకండి’’. ధోవతి అంచు నుండి చూసి ఇవతలికి వచ్చి ‘‘అయిపోయింది. అయినా సంతృప్తికరంగా కుదరలేదు. మీ ముఖం అంత ప్రపోర్షనేటుగా లేదు’’ అన్నాడు.
వీరయ్యకు కోపం వచ్చింది కూడా. ‘‘వచ్చినప్పటి నుండి ముఖం బాగాలేదు, ముక్కు బాగాలేదనటమే. మెడ నొప్పి పుట్టేటట్టు వంకరటింకరగా ఈ ఇష్టం వచ్చినట్టు తిప్పటమే గాని ఫొటో లేదు పాడు లేదు. మంచో చెడ్డో ఇక్కడికి నలభయి ఏళ్లు గడిచిపోయాయి. నా ముఖంతో తగాదా నీకే వచ్చింది. నీ ముఖం నీ మెషీనులో పట్టకపోతే’’ అంటూ లేచాడు. ఒక్క వెలుగు వెలిగింది. కళ్లు మిరుమిట్లు గొలిపేటట్లు ఫొటోగ్రాఫరు చిరునవ్వు నవ్వి, ‘‘మంచి పట్టులో తీశాను’’ అన్నాడు. ‘‘ఏమిటీ ఇట్లాగేనా?’’ అని నోరు తెరిచాడు సెట్టి.
‘‘ఏదీ చూడనియ్యి నన్ను.’’
‘‘ఇప్పుడే ఎక్కడా? నెగెటివు చేశాక కాని రాదు. శుక్రవారం రండి’’ అన్నాడు.
∙∙
శుక్రవారం వెళ్లాడు వీరయ్య. లోపలికి పిలిచాడు ఫొటోగ్రాఫరు. చాలా సీరియస్‌గా కాగితం మడత విప్పి లోపలి ప్రూఫ్‌ను చూపెట్టాడు.
‘‘నేనేనా?’’ అన్నాడు షావుకారు.
‘‘అవును’’ అన్నాడు ఫొటోగ్రాఫరు సాలోచనగా.
వీరయ్య పరీక్షగా చూస్తో ‘‘ఈ కళ్లు నావిలా లేవేం?’’
‘‘అవా? నేను రీటచ్ చేశాను. బాగా రాలే?’’
‘‘ఆహా? నా కనుబొమలు ఇట్లా లేవు.’’
‘‘అవును లేవు. కళ్ల కనుగుణ్యంగా ఉండాలని కనుబొమ్మలను కూడా కాస్త మార్చాను. కళ్ల మీద అన్ని వెంట్రుకలంటే ఏం బాగుంటాయని? యూరపులో సన్న కనుబొమ్మలే ఫ్యాషను.’’
‘‘అట్లాగా?’’ అన్నాడు వీరయ్య.
‘‘అందుకని– మా దగ్గర సైన్సులో సల్ఫైడు ద్వారా కొత్త కనుబొమలను వేసే విధానం ఉంది. దానితో ఆ వెంట్రుకలన్నీ ఊడదీసి ఎన్ని ఉంటే బాగుంటుందో అన్నే ఉంచాను’’ అన్నాడు ఫొటోగ్రాఫరు.
‘‘ఈ నోరేవిటి?’’ అన్నాడు వీరయ్య తననంతా మార్చేశాడన్న కోపంతో. ‘‘ఇది నాది కాదా?’’
‘‘నీ నోరు మరీ కిందికి ఉందని కొంచెం ఎత్తు లేపాను.’’
‘‘ఈ చెవులు మట్టుకు నావిలాగా ఉన్నాయి.’’
‘‘అవును. కాని అది కూడా సరిచెయ్యాలి. సల్ఫైడు అని ఉంది. దానితో పూర్తిగా చెవులు తీసేయటానికి వీలుంది. చూసి చెప్తాను.’’
షావుకారుకి కళ్లనీళ్ల పర్యంతం అయింది. ఇహ ఆగలేకపోయాడు.
‘‘ఏడిశావు. నీ మొహం! నా ఫొటో తియ్యమని నీ దగ్గరకు వస్తే కండ్లు పీకేసి, కనుబొమ్మలు నరికేసి, పండ్లూడదీసి నా రూపమే లేకుండా చేశావు. నేను చస్తే నావాళ్ల దగ్గర నా ఫొటో ఉండాలనుకుంటే ఈ మారురూపు తీసికెళ్లి ఏం చేసుకోను! దీన్ని సల్ఫేడులోనో డల్ఫేడులోనో ముంచుకొని నీ స్నేహితులకు చూపెట్టుకో’’ అని స్టూడియోలోంచి వెళ్లిపోయాడు వీరయ్య.
తెలంగాణ తొలితరం రచయిత్రి
నందగిరి ఇందిరాదేవి కథ ‘వీరయ్య గారి ఫొటో’ పూర్తిపాఠం ఇది. తొలి ప్రచురణ: 1941. హన్మకొండలో పుట్టి హైదరాబాద్‌లో స్థిరపడిన ఇందిరాదేవి తెలంగాణ తొలితరం రచయిత్రి. ఆమె జీవితకాలం: 22 సెప్టెంబర్ 1919 – 22 జనవరి 2007. ఆమె కథల్ని గతేడాది తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించింది.
నందగిరి ఇందిరాదేవి
Comments
Please login to add a commentAdd a comment