ఏలూరులోని ఓ సేవాశ్రమంలో కామాంధుడి స్వైరవిహారం
గత కొన్నాళ్లుగా పదుల సంఖ్యలో బాలికలపై వార్డెన్ భర్త లైంగిక దాడి.. ఫొటోషూట్‌లంటూ బాలికలను బయటకు తీసుకెళ్లి అత్యాచారం
ఏలూరు టూటౌన్ స్టేషన్‌లో బాలికల ఫిర్యాదు
నిందితుడికి స్థానిక ఎంపీ కార్యాలయం వ్యక్తుల వత్తాసు
బాలికలను భయపెట్టి కేసును నీరుగార్చే ప్రయత్నం
తూతూ మంత్రంగానే పోలీసుల విచారణ
ఏలూరు టౌన్: పేద బాలికల కోసం ఏర్పాటు చేసిన సేవాశ్రమంలో ఓ కామాంధుడు కొంతకాలంగా చెలరేగిపోతున్నాడు. వార్డెన్ భర్తగా ఎంటరైన సుమారు 55 ఏళ్ల వయసున్న ఆ కీచకుడు బాలికలను చెరబట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తన కోరికను కాదంటే బాలికలను దారుణంగా కొడతాడు. చాలా కాలంగా అతని దుర్మార్గాలను తట్టుకున్న ఆ బాలికలకు ఓపిక నశించింది. సేవాశ్రమంలోని వారంతా మంగళవారం సాయంత్రం ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ అధికారులను వేడుకున్నారు. ఆ కామాంధుడి లీలలు వెలుగులోకి రావడంతో ఏలూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ఘోరకలికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు అమీనాపేటలో శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం ఆధ్వర్యంలో బాలికల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ హాస్టల్‌ను నిర్వహకులు సేవాభావంతో ఏర్పాటు చేయగా.. గత కొంతకాలంగా హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న మణిశ్రీ భర్త శశికుమార్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ అత్యంత దారుణంగా వేధిస్తున్నాడు. శశికుమార్ ఏలూరు ఎన్‌ఆర్‌పేటలో మణి ఫొటో స్టూడియో నడుపుతూ, మరోవైపు ఏలూరు జిల్లా యర్రగుంటపల్లి బీసీ హాస్టల్లో కూడా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉన్న తన పలుకుబడితో కొంతకాలం క్రితం తన రెండో భార్య మణిశ్రీని సేవాశ్రమంలో వార్డెన్‌గా చేర్చాడని సమాచారం.
బాలికలపై లైంగిక దాడులు
ఆ బాలికల సేవాశ్రమంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థినులు వసతి సదుపాయం పొందుతున్నారు. వీరు స్థానికంగా పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. కామాంధుడైన శశికుమార్ ఆ బాలికలపై కన్నేసి సేవాశ్రమంలోకి వార్డెన్ భర్తగా ఎంటరయ్యాడు. పదుల సంఖ్యలో బాలికలను లైంగికంగా వేధించినట్టు బాధిత బాలికలు చెబుతున్నారు. ఆదివారం ఒక బాలికను బాపట్లకు ఫొటో షూట్ కోసమని తీసుకువెళ్లిన శశికుమార్.. సోమవారం రాత్రి తిరిగి తీసుకువచ్చాడు.
రాత్రివేళ ఆ బాలిక తన దుస్తులను ఉతుక్కుంటూ ఏడుస్తూ ఉండగా సహచర బాలికలు ప్రశ్నించారు. జరిగిన దారుణాన్ని ఆమె చెప్పింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన శశికుమార్ జరిగిందంతా ఆ బాలిక సహచరులకు చెప్పిందనే అక్కసుతో అక్కడ ఉన్న బాలికలను అందరినీ మోకాళ్లపై కూర్చోబెట్టి దారుణంగా కొట్టాడు.
రాత్రి బాలికల ఏడుపులు వినిపించాయని స్థానికులు కూడా చెప్పారు. శశికుమార్ దారుణాలను ఇక భరిస్తూ ఉండకూడదనే ఉద్దేశంతో బాలికలు మంగళవారం ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. బాధిత బాలికల బంధువులు, తల్లిదండ్రులు కూడా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
బాలికలను భయపెట్టి నీరుగార్చే ప్రయత్నం
సేవాశ్రమంలో జరిగిన దారుణాలపై పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తారా... అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసే ముందే బాలికలు మీడియాకు జరిగినదంతా వివరించారు. అయినా పోలీసులు మాత్రం బాలికలను భయపెట్టి ఈ దారుణ సంఘటనను నీరుగార్చే ప్రయత్నం చేసు్తన్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వార్డెన్ మణిశ్రీకి ఏలూరులోని ఓ ప్రజాప్రతినిధి వత్తాçÜు పలికినట్లు, అలాగే స్థానిక ఎంపీ కార్యాలయానికి చెందిన వ్యక్తులు సైతం రంగంలోకి దిగి పోలీస్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఫిర్యాదులో కేవలం వేధింపులకు గురిచేసినట్టుగానే బాలికలతో పోలీసులు రాయించినట్లు తెలుస్తోంది.
ఏలూరు డీఎస్పీ దర్యాప్తు
ఏలూరు అమీనాపేటలోని బాలికల వసతి గృహంలో జరిగిన ఘటనపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ వెంటనే స్పందించారు. సేవాశ్రమం వద్దకు చేరుకుని ఆరా తీశారు. ఏలూరు మహిళా స్టేషన్ సీఐ ఎం. సుబ్బారావు, ఏలూరు టూటౌన్ సీఐ వైవీ రమణ, బాలల సంరక్షణ అధికారి సూర్యచక్రవేణి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ మాట్లాడుతూ.. ముగ్గురు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామని తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాలికలపై లైంగిక దాడి జరిగినట్టు ఫిర్యాదు చేశారని, వీటిపై విచారణ చేస్తామని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.
ఫొటో షూట్‌లంటూ..
ఫొటో షూట్‌ల కోసమని శశికుమార్ ఒక్కొక్క బాలికను దూరప్రాంతాలకు తీసుకువెళతాడనీ, అక్కడ కాళ్లూచేతులూ కట్టేసి అఘాయిత్యానికి పాల్పడతాడని, కాదంటే ఇష్టారాజ్యంగా కొడతాడని బాధిత బాలికలు కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. మీకు బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి వాళ్ల దగ్గరకు మిమ్మల్ని పంపుతాను, రూమ్‌లు ఏర్పాటు చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తాడని చెప్పుకొచ్చారు.
బయటకు తీసుకెళ్లి టీ, కాఫీ ఇప్పించి సగం తాగిన అనంతరం కప్పు తీసుకుని తాగుతూ వక్రంగా మాట్లాడుతూ పైశాచికత్వాన్ని చూపిస్తాడని వివరించారు. ఇక స్థానికంగా ఇతర ప్రభుత్వ హాస్టళ్లకు వచ్చే బాలికలను ఈ సేవాశ్రమానికి పంపాలంటూ శశికుమార్ ఆయా హాస్టళ్ల వార్డెన్లను కోరతాడని, అతని కోరిక మేరకు ఆ హాస్టళ్ల వార్డెన్లు బాలికలను ఇక్కడకు పంపుతారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment