
బుజ్జి జీవానుబంధం
పిల్లలకు సరిగా మార్కులు రాకపోతే... ‘వెళ్లి గొర్రెలు కాసుకో...’ అని తిట్టే తల్లిదండ్రులను, టీచర్లను మనం చూస్తూనే ఉన్నాం. అయితే గొర్రెలు కాయడం అంటే మరీ అవమానమైన పని కాదని, దీంట్లో కూడా మంచి గుర్తింపు ఉందని, చిన్న వయసులోనే గొర్రెలను కాయడం గర్వించదగ్గ అంశమని ఈ సంఘటనతో రుజువవుతోంది. ఆ బుడ్డోడి పేరు ఆర్థర్ జోన్స్. వయసు రెండేళ్లు. ఆర్థర్ వంశంలో ఐదోతరం గొర్రెల కాపరి ఇతడు.
ప్రస్తుతం 80 గొర్రెల సంరక్షణ బాధ్యతను చూస్తున్నాడు. స్థానికంగా ‘యంగెస్ట్ షెఫర్డ్’ గుర్తింపును సొంతం చేసుకొన్నాడు జోన్స్. ఉదయం లేచింది మొదలు.. తన మినీ బైక్‌లో తమ గొర్రెల ఫారమ్‌లో తిరుగుతూ వాటిని కాస్తుంటాడు. వాటికి ఫీడింగ్ ఇవ్వడం, నీళ్లను తాపడం జోన్స్ బాధ్యతలు. జోన్స్ నాయనమ్మ ఈ ఫారమ్ యజమాని. ఇక్కడ తన మనవడు గొర్రెలు కాయడాన్ని, వీడియోల రూపంలో ఫోటోల రూపంలో చిత్రీకరించి చిన్న పిల్లల యాక్టివిటీస్‌కు సంబంధించిన పోటీలకు ఆ వీడియోలను పంపింది.
వాటితో జోన్స్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకూ ఈ రెండేళ్ల గొర్రెల కాపరికి మూడు అవార్డులు వచ్చాయి. బుజ్జిమూగజీవులతో ఈ బుజ్జాయి పెంచుకొన్న అనుబంధం గురించి ప్రత్యేక డాక్యుమెంటరీలే రూపొందుతున్నాయిప్పుడు. ఇప్పుడైనా ఒప్పుకుంటారా మరి! గొర్రెల కాయడం చాలా గ్రేటైన పని అని!