
ఇప్పుడు ఉన్నది నైతిక అంధత్వం...
తాజా పుస్తకం
ఇప్పటి దాకా తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు. వ్యాఖ్యానించడం కంటే దానిని మార్చడం ముఖ్యం అని మార్క్స్ అన్నాడు. స్థలం, కాలం చూపుకీ చేతికీ అందినప్పుడు వ్యాఖ్యానం కానీ మార్పుకి ప్రయత్నంకానీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న వ్యవస్థ చూపుకిగానీ చేతికిగానీ అందనంత వేగంగా పరిగెడుతోంది. కర్త ఎవరో తెలియదు. కాని ఆడక తప్పని పరిస్థితి. వలసలు, భూమి నుంచి ఎడబాటు, డిస్‌ప్లేస్‌మెంట్, మూలాలు విచ్ఛిన్నం కావడం, కన్స్యూమరిజం, మార్కెట్, అస్థిర ఉద్యోగాలు ఇవన్నీ మనిషి జీవనాన్ని కలవరపెడుతున్నాయి. ఇది స్థిరమైన అస్థిర వర్తమానం. దీనిని వ్యాఖ్యానించడం, అర్థం చేసుకోవడం కోసం పోలెండ్‌కు చెందిన జిగ్మండ్ బౌమన్ అనే తత్త్వవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతమే ‘లిక్విడ్ మోడర్నిటీ’. అంటే ఇప్పుడున్న సమాజం ఆధునిక సమాజం కాదనీ ‘ద్రవాధునిక సమాజం’ అనీ అంటాడాయన. సమాజానికి ‘ద్రవ స్వభావం’ ఉంటే ఏమవుతుందో వివరించే ప్రయత్నం చేస్తాడు. దీనికి పూర్వరంగంగా రెండు ప్రపంచ యుద్ధాలు చేసిన విధ్వంసం, ప్రపంచాన్ని శాసించడానికి బ్రిటన్, అమెరికాలు చిరకాలంగా సాగించిన క్రూరత్వం, ‘స్వేచ్ఛ’ను ఒక పావులా వాడి అవి స్థిరపరిచిన అస్థిరత వీటిని చర్చిస్తాడు. విస్తృతంగా ఆయన చేసిన వ్యాఖ్యానాలను తెలుగు పాఠకులకు సులభంగా అర్థం చేయించే ప్రయత్నంగా పాపినేని శివశంకర్ రాసిన పుస్తకమే ‘ద్రవాధునికత’.
బౌమన్ చెప్పిన విషయాలను వెల్లడి చేస్తూనే వాటిని మన సమాజానికి అన్వయిస్తూ వ్యాఖ్యానం చేస్తారు పాపినేని శివశంకర్. పెళ్లి, స్త్రీ పురుష సంబంధాలు, అభివృద్ధి, ఆహారం, సాంస్కృతిక పతనం, ప్రకృతి ఈ అంశాలన్నింటినీ వాటి వర్తమాన స్థితికి కారణమైన ‘కుట్రలను’ అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని పరిశీలించాలి. బౌమన్ చెప్తున్న అంశాలలో కొన్నింటిని వ్యాఖ్యామాత్రంగా చూద్దాం.
పెట్టుబడిదారీ వ్యవస్థ రెండు రకాలు. ఒకటి భార సహితమైనది (హెవీ కాపిటలిజమ్). రెండు భార రహితమైనది (లైట్ కాపిటలిజమ్). మొదటిదానికి మిచిగన్ రాష్ట్రంలో డెట్రాయిట్ సరస్సు ఒడ్డున ఉన్న భారీ కార్ల కంపెనీ- జనరల్ మోటార్స్ ఉదాహరణ. రెండో దానికి సియాటిల్ (రెడ్‌మండ్) నగరంలో ఉంటూ ప్రపంచమంతటికీ తన రెక్కలు సాచిన మైక్రోసాఫ్ట్ సంస్థ మరో ఉదాహరణ. ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగి జీవనం అక్కడే ముగుస్తుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఆ గ్యారంటీ లేదు. ద్రవాధునికతలో పెట్టుబడికి వినియోగదారుడితోనే సంబంధం. కనుక కార్మికశక్తి మృదువుగా మారింది. వెనుకటి సంఘీభావం, యూనియన్ యాక్షన్‌లు ఈ కాలంలో ఉండవు.
ద్రవాధునికత ‘పౌరుణ్ణి’ ‘వ్యక్తి’గా మారుస్తుంది. ఈ వ్యక్తికి ఏకాంతాన్నిచ్చే నగరం కావాలి. అందువల్ల నగరీకరణ పెరుగుతుంది. నగరంలో మనిషి అపరిచితం అవుతాడు. అపరిచితులు అపరిచితులను కలుసుకుంటూ అపరిచితులుగా మిగిలిపోయే నివాస ప్రాంతమే నగరం.
ద్రవాధునికతలో నైతిక అంధత్వం వస్తుంది. అంటే ప్రపంచంలో జరిగేవాటిపట్ల నిర్లక్ష్యం అన్నమాట. నైతిక అంధత్వం కలిగినవారు జరిగిన చెడుపనికి ఎడంగా జరుగుతారు. దాన్ని ధైర్యంగా ఖండించలేక ఎదుర్కోలేక మౌనం వహిస్తారు. ఒక్కోసారి ప్రతికూల వాదన చేస్తూ దెబ్బ తిన్నవారినే తప్పు పడతారు.
చిరకాలం తన ఆకృతిని నిలుపుకోలేకపోవడం ద్రవపదార్థాల ముఖ్యలక్షణం. ద్రవాధునికతలో మానవ సంబంధాలు కూడా అంతే. గాఢమైన ప్రేమలు ఉండవు. ఆకర్షణ దాటి ప్రేమ అంకురించేంత సమయం, దాని కోసం తపన, చిరకాల త్యాగం ఉండవు. కోరికకి, కోరినదాన్ని పొందడానికి మధ్య దూరం తగ్గిపోయింది. పొందడమే ముఖ్యమైనప్పుడు మనసు స్థానాన్ని శరీరం ఆక్రమిస్తుంది. ప్రేమ తావును సెక్స్ ఆక్రమిస్తుంది.
ఈ బౌమన్ ప్రతిపాదనలను తెలుగు సమాజం, సాహిత్యంలోని ఉదాహరణలతో వివరించే ఈ ప్రయత్నాన్ని ఈ పుస్తకంలో చేశారు పాపినేని శివశంకర్. ఆలోచనాపరులు తప్పక పరిశీలించదగ్గ పుస్తకం ఇది.
ద్రవాధునికత- పాపినేని శివశంకర్; వెల- రూ.70
ప్రతులకు: నవచేతన - 040- 24224458