సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇరవై నాలుగు విభాగాలతో నడిచే పరిశ్రమ. వాటిల్లో ఎక్కువ భాగం పురుషులే ఉంటారు. మహిళలు రావాలనుకున్నా వింతగా చూస్తారు. ‘మీ వల్ల అవుతుందా?’ అని నిరుత్సాహపరుస్తారు. అడుగడుగునా పైకి కనిపించని అవాంతరాలు సృష్టిస్తారు. అయితే ‘‘వీటన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్లాలి’’ అంటున్నారు ఈ ముగ్గురు మహిళా సినిమాటోగ్రాఫర్లు.
సినిమా రంగంలో మహిళా సినిమటోగ్రాఫర్ల సంఖ్య చాలా తక్కువ. ఆ తక్కువలో కాస్త ఎక్కువగా ఫౌజియా ఫాతిమా (47), దీప్తి గుప్తా (46), ప్రియా సేథ్ (44) నిలదొక్కుకోగలిగారు. ‘‘గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళలు చాలామంది సినిమాఫొటోగ్రఫీ రంగంలోకి వస్తున్నారు. ముఖ్యంగా హిందీ పరిశ్రమలో. అందువల్లే 2015లో ఇండియన్ ఉమెన్ ఫొటోగ్రాఫర్స్ కలెక్టివ్‌ను ప్రారంభించాం. ఆ సంస్థ ద్వారా ఇప్పుడు మరింతమంది మహిళల్ని ఈ రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించడం కోసం ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాం’’ అంటున్నారు ఫాతిమా, గుప్తా, సేథ్. ప్రధానంగా మహిళా ఫొటోగ్రాఫర్ల సంఖ్య పెంచాలన్నదే వీరి లక్ష్యం. ప్రస్తుతం వీరి సంస్థలో 78 మంది సభ్యులు ఉన్నారు.
ఫాతిమా ‘మిత్ర్ మై ఫ్రెండ్’, ‘ముదల్ ముదల్ ముదల్ వారాయ్’ చిత్రాలకు పనిచేశారు. చాలా సంవత్సరాలుగా సినిమాటోగ్రఫీ గురించి పాఠాలు చెబుతున్నారు. దీప్తీ గుప్తా ‘హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ తో పాటు, మ్యూజిక్ వీడియోలు, డాక్యుమెంటరీలు తీశారు. ‘షటప్ సోనా’ అనే డాక్యుమెంటరీతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇక సేథ్‌కి ‘అండర్ వాటర్’ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. దీనితో పాటు కమర్షియల్ యాడ్స్ చేస్తున్నారు. లొకేషన్ స్టూడియో నడుపుతున్నారు. రాజా మీనన్ తీసిన ‘బారహ్ అణా’, ‘ఎయిర్ లిఫ్ట్ అండ్ చెఫ్’ సినిమాలకు పనిచేశారు. కెరీర్‌లో ఎదిగే క్రమంలో ఈ ముగ్గురూ ఎదుర్కొన్న మూడు భిన్నమైన అనుభవాలను చూస్తే.. వివక్ష ఈ స్థాయిలో ఉంటుందా అనిపిస్తుంది. అదే సమయంలో.. అంతటి వివక్షను తట్టుకుని నిలబడ గలిగినందుకు వీరిని అభినందించి తీరాలనిపిస్తుంది.
– జయంతి
ఉండే ముఖమేనా?
‘‘నాకు ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్నగారు నాకు రేంజ్‌ౖ ఫెండర్ కెమెరాను ఉపయోగించడం నేర్పించారు. టెలివిజన్‌లో వచ్చే ప్రాంతీయ భాషా చిత్రాలను తప్పనిసరిగా చూస్తాను. నాకు నా ఎనిమిదో ఏట నుంచే గురుదత్ అంటే చాలా ఇష్టం. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌కి దరఖాస్తు చేసుకున్నవారిలో నేను ఒక్కర్తినే అమ్మాయిని. నా కంటే ముందు మహిళలు లేకపోవడం వల్ల నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అక్కడ నన్ను ‘నువ్వు ఈ రంగంలో కొనసాగగలవా?’ అని గుచ్చి గుచ్చి అడిగేవారు. ‘నువ్వు పని చేయాలనుకుంటున్నావా, సెటిల్ అవ్వాలనుకుంటున్నావా’ అంటూ వేధించేవారు. వాళ్ల ఉద్దేశం ఉండే ముఖమేనా అని! ‘అసలు నీకు కెమెరా బరువు ఎంతో తెలుసా?’ అని నన్ను ప్రశ్నించిన సమయంలో, అక్కడ రేణూ సలూజా (ఎడిటర్) ఉన్నారు. ఆవిడ ‘షటప్’ అనటంతో ఆ ఎగతాళికి తెర పడింది’ అన్నారు దీప్తి గుప్తా.
హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్
క్రేన్ ఎత్తగలవా!
‘‘మా ఇంట్లోవాళ్లు సినిమాలు చాలా తక్కువగా చూస్తారు. చిన్నప్పటి నుంచీ సంగీతం వినేదాన్ని, నాటకాలు చూసేదాన్ని. బోర్డింగ్ స్కూల్‌లో ఉన్నప్పుడు టీవీ చూడనిచ్చేవారు కాదు. పెయింటింగ్స్, ఫొటోల నుంచి చాలా తెలుసుకున్నాను. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో యుటీవీలో ఇంటర్న్‌షిప్ చేశాను. అప్పట్లో సౌండ్ ఇంజినీర్‌గా కాని సినిమాటోగ్రఫర్‌గా కాని పనిచేయాలనుకునేదాన్ని. నేను న్యూయార్క్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తున్నప్పుడు, మా ప్రొఫెసర్ నన్ను, ‘ఇంటికి వెళ్లిపోవాలా, పని పూర్తి చేయాలా అని ఆలోచిస్తున్నావ్ కదా’ అని వ్యంగ్యంగా అన్నారు.
నాకు ఇటువంటి వివక్ష ఉంటుందని అప్పటివరకు తెలియదు. నేను వెల్హామ్ గర్ల్స్ స్కూల్‌లో చదువుకున్నాను. అక్కడ లింగవివక్ష ఉండేది కాదు. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉండేది. నేను సినిమా సెట్‌లో మొదటిరోజు పనిచేయడానికి వచ్చినప్పుడు, ఒక కుర్రవాడు వచ్చి, ‘నువ్వు ఒక క్రేన్‌ను ఎత్తగలిగితే నీకు వంద రూపాయలు ఇస్తాను’ అన్నాడు వెటకారంగా. నేను రెండు క్రేన్ల బరువు ఎత్తి, రెండు వందలు ఇవ్వమని అడిగాను. నేను నిజంగానే రెండు వందలు అడిగి తీసుకున్నాను’’ అని చెప్పారు ప్రియా సేథ్.
నీకో సీట్ వేస్ట్
‘‘చెన్నైలో ఉంటున్న మా కుటుంబ సభ్యులందరికీ సినిమా పిచ్చి. మా నాన్నగారు హిచ్‌కాక్ సినిమాలు, కౌబాయ్ సినిమాలు చూస్తుంటారు. మా అత్తయ్య శివాజీగణేశన్ అభిమాని. అందువల్ల నేను ఆ పిచ్చిలో మునిగిపోయాను. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు, ‘నీ కోసం సీట్ వేస్ట్ చేయదల్చుకోలేదు’ అన్నారు. నాకు లోపల్లోపలే కోపం వచ్చింది. నేను సినిమాటోగ్రఫీ కోర్సు చేయాలని ఆ రోజే ప్రమాణం చేసుకున్నాను’’ అన్నారు ఫౌజీ ఫాతిమా.
Comments
Please login to add a commentAdd a comment