పంఛూబాయి
ఇస్రార్ కొన్నేళ్లుగా ఒక ఊరి కోసం గాలిస్తున్నాడు. అచ్ఛన్ ఆంటీ ఊరు అది. నెట్‌లో దొరకడం లేదు. ఇస్రార్ తండ్రి ఆమెను కాపాడి ఇంటికి తెచ్చాడు. ఆయన పోయాడు. ఇక ఆంటీ బాధ్యత ఇస్రార్‌ది. మొత్తానికి ఊరిని వెతికి పట్టుకున్నాడు! మతిస్థిమితం లేని పంఛూబాయిని తండ్రి చేరదీస్తే.. ఇస్రార్ ఆమెను భద్రంగా సొంతవాళ్ల దగ్గరకు చేర్చాడు.
నలభై ఏళ్లుగా అతడు తన తల్లి కోసం వెదుకుతూనే ఉన్నాడు. మూడేళ్ల క్రితం అతడి వెతుకులాట ఆగిపోయింది. తల్లి ఆచూకీ దొరకలేదు. అతడు చనిపోయాడు! మూడు రోజుల క్రితమే ఆ తల్లి తిరిగొచ్చింది. కొడుకు చనిపోయాడని తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. నాగపూర్‌లో అదృశ్యమై, నాలుగు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరింది ఆ వృద్ధురాలు. ఈ మధ్యలో ఏం జరిగింది?! ఏం జరగలేదు. ఇన్నాళ్లూ మధ్యప్రదేశ్‌లో ఆమె భద్రంగా ఉంది. ఆమెను భద్రంగా చూసుకున్నది ఒక ముస్లిం కుటుంబం. ఆమె పేరు పంఛూబాయి. 94 ఏళ్ల వయసు. అదృశ్యం అయినప్పుడు 54 ఏళ్లు
పంఛూబాయిది మహారాష్ట్రలోని ఖంజ్మానగర్. అమరావతి జిల్లా. పంఛూబాయి ఇప్పటివరకు ఉన్నది మధ్యప్రదేశ్, దామో జిల్లా. ఖంజ్మానగర్ నుంచి ఆమెను ఆమె కొడుకు చికిత్స కోసం నాగపూర్‌కి తీసుకురాక పోయుంటే సుఖాంతం అయిన ఈ కథ ప్రారంభం అయి ఉండేదే కాదు. ప్రారంభం అవకపోవడమే మంచిది కానీ.. అయ్యాక ఎటూ సుఖాంతం అయింది కనుక ఎక్కడ ప్రారంభం అయిందో అక్కడికి వెళ్లడమే సరళమైన స్క్రిప్ట్ అవుతుంది. స్క్రిప్టుకు తొలి మాటలు ఇస్రార్ ఖాన్. పంఛూబాయిని ఇన్నేళ్లు భద్రంగా చూసుకున్న ఆ ముస్లిం కుటుంబంలోని మనిషి. ‘‘నాన్న ట్రక్కు డ్రైవర్. ఓ రోజు తనతో పాటు అచ్ఛన్ ఆంటీని తీసుకొచ్చారు. ఆంటీ ఎవర్నీ గుర్తించే స్థితిలో లేరు. ముఖమంతా తేనెటీగలు కుట్టి ఉన్నాయి. బలహీనంగా ఉన్నారు. రోడ్డు పక్కన దీనస్థితిలో çనడుచుకుంటూ పోతుంటే నాన్న లారీ ఆపి, తట్టి లేపి వివరాలు అడిగారట. ఆంటీ చెప్పలేకపోతే భద్రంగా ఇంటికి తెచ్చారు. 1970 చివర్లో అనుకుంటాను. అప్పటికి నేను చిన్నపిల్లాడిని. ఆంటీ పేరు ఏంటో కూడా మాకు తెలీదు. అచ్ఛన్ ఆంటీ అనే పిలిచేవాళ్లం’’ అని గుర్తు చేసుకున్నాడు ఇస్రార్. ఇక నేరుగా కథలోకి వచ్చేద్దాం
నలభై ఏళ్లు గడిచాయి! ఇస్రార్ తండ్రీ చనిపోయారు. పంఛూబాయికి ఆ కుటుంబం అలవాటు పడిపోయింది. వాళ్లే ఆమెను పోషిస్తున్నారు. అచ్ఛన్ ఆంటీ మరాఠీలో మాట్లాడేది. ‘‘మీవాళ్లు ఎక్కడుంటారు?’’ అని ఆమెను అడిగేవారు. అస్పష్టంగా ఏదో చెప్పేది. ఆమె నోటి నుంచి తరచు వచ్చే మాట ఖంజ్మానగర్. ఆ నగర్ ఎక్కడుందో గూగుల్‌లో సెర్చ్ చేశాడు ఇస్రార్. ‘నో రిజల్ట్’! గూగుల్ కూడా కనిపెట్టని ఊరు ఈ భూమి మీద ఎక్కడ ఉందా అని ఆలోచనలో పడ్డాడు. స్పెల్లింగ్ తప్పు అయుండొచ్చు అనుకున్నాడు. ఈ ఏడాది మే 4న లాక్‌డౌన్‌లో కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉన్నప్పుడు అచ్ఛన్ ఆంటీని మళ్లీ అడిగాడు.. ‘ఆంటీ.. మీ ఊరి పేరు గుర్తుందా?’ అని. ఈసారి ఆమె పర్సాపూర్ అని చెప్పింది! నెట్‌లోకి వెళ్లి పర్సాపూర్ అని కొట్టాడు. మహారాష్ట్ర అని వచ్చింది. మూడు రోజుల తర్వాత నెట్‌లో మే 7న ఇస్రార్‌కు పర్సాపూర్‌లో దుకాణం నడిపే అభిషేక్ కాంటాక్ట్‌లోకి వచ్చాడు. ‘మీకు దగ్గరల్లో ఖంజ్మానగర్ ఉందా?’ అని అతడిని అడిగాడు. ‘‘ఆ.. ఉంది కదా’’అన్నాడు అభిషేక్. అదే రోజు రాత్రి 8. 30.కి అచ్ఛన్ ఆంటీ వీడియోను అతడికి పంపాడు. అభిషేక్‌ది ‘కిరార్’ కమ్యూనిటీ. వాట్సాప్‌లో తన కమ్యూనిటీలోని వాళ్లందరికీ అచ్ఛన్ అంటీ వీడియోను ఫార్వర్డ్ చేశాడు అభిషేక్. అర్ధరాత్రి అవుతుండగా ఇస్రార్‌కు ఫోన్ వచ్చింది.
‘‘మా వాళ్లమనిషే. కొంతమంది గుర్తుపట్టారు’’ అని చెప్పాడు అభిషేక్!
ఇక్కడ ఈ పెద్దావిడ వీడియో ఖంజ్మానగర్ నుంచి నాగపూర్‌లో ఉన్న ఆమె మనవడు పృథ్వీ లాల్ షింగానేకు చేరింది. ‘‘నానమ్మా..’’ అని పెద్దగా అరిచేశాడు. ఆయనకు యాభైపైనే ఉంటాయి. వెంటనే మధ్యప్రదేశ్ వెళ్లి నానమ్మని తెచ్చేసుకుందామనుకున్నాడు కానీ లాక్‌డౌన్. ఇస్రార్‌తో కాంటాక్టులోకి వెళ్లాడు. కుటుంబ వివరాలన్నీ చెప్పాడు. త్వరలోనే వస్తానన్నాడు.పంఛూబాయి నాగపూర్‌లో తప్పిపోడానికి పదేళ్ల ముందు ఆమె కొడుకు పంఛూబాయిని ఖంజ్మానగర్‌లోనే ఉంచేసి, బతుకు తెరువు కోసం తన కుటుంబంతో నాగపూర్ వచ్చేశాడు. తర్వాత పదేళ్లకు తల్లిని మానసిక వైద్యుడికి చూపించడానికి నాగపూర్ తీసుకొచ్చి, తన దగ్గరే ఉంచుకున్నాడు. ఓ రోజు సాయంత్రం ‘‘మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను’’ అని ఇరుగు పొరుగుకు చెప్పి ఎటో వెళ్లిపోయింది. మళ్లీ కనిపించలేదు. పంఛూబాయి పూర్తి పేరు తేజ్‌పాల్ సింగ్ షింగానే. అప్పట్నుంచీ తల్లి కోసం వెతికీ వెతికీ 2017లో ఆయన చనిపోయాడు. ఈ వివరాలన్నీ ఇస్రార్‌కి చెప్పాడు మనవడు. లాక్‌డౌన్ ఎత్తివేయగానే మధ్యప్రదేశ్ వెళ్లి, ఈ నెల 17న నానమ్మతో నాగపూర్‌లోని ఇంటికి చేరుకున్నాడు. తొంభై నాలుగేళ్ల వయసులోనూ ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉంది. మానసికంగా కూడా. ఇస్రార్ కుటుంబం రుణం తీర్చుకోలేనిదని పంఛూబాయి కుటుంబ సభ్యులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment