సతి బాధ
ఓన్లీ టెన్ మినిట్స్
వాచ్‌మెన్ ఆర్ముగం కన్నీరు మున్నీరవడం మా ఆవిడ చెడామడా తిట్టడం చెవిన పడుతూనే ఉంది. చివరకు మా ఆవిడ తరిమి కొట్టింది. వెళ్లిపోయాడు. ‘ఏమైంది’ లేచి అడిగాను. ‘ఉద్యోగం మానేస్తాడట. తిరువణ్ణామలై వెళ్లి రమణ మహర్షి ఆశ్రమంలో చేరిపోతాడట. పిచ్చి పిచ్చిగా ఉందా కాళ్లిరగ్గొడతాను... ఎక్కువ మాట్లాడావంటే గుడ్మాణింగ్ మేడమ్ అన్నావని షీ టీమ్‌కు పట్టిస్తాను అని చెప్పాను. దెబ్బకు దారికొచ్చాడు’ అని వెళ్లిపోయింది. ఏం లేదు. నిన్న సాయంత్రం ఫస్ట్‌షోకు వెళ్దామనుకున్నాము. అంతా రెడీ అయ్యాక మీరు కిందకు దిగి కారు తీసి ఉండండి టెన్ మినిట్స్‌లో వచ్చేస్తాను అంది. ఆ మాట వినగానే పిల్లలు రెండు స్నాక్స్ బాక్సులు తీసుకొని హోమ్‌వర్క్ పుస్తకాలు తీసుకొని వీడియోగేమ్స్ ఆడేందుకు ట్యాబ్స్ తీసుకొని లిఫ్ట్ ఎక్కారు. నేనేమిట్రా అంటే షటిల్‌కి అలవాటు పడ్డాను. అది కూడా ఆర్ముగంతో. పొట్టిగా లావుగా ఉన్నా భలే ఆడతాడు. నేను కారు తీసి డ్రైవ్ వేలో పెట్టి ఏడు గేమ్స్ ఆడాను తనతో. నాలుగు నేను గెలిచాను. మూడు తను. తొమ్మిదిన్నర అయ్యాక అప్పటికీ పూర్తిగా రెడీ కాలేదనే అసంతృప్తితో- అంటే ఎడమ చేతికి ప్రతి మూడు గాజుల మధ్య ఒక బంగారు గాజు వదిలి ఆ తర్వాత లక్క గాజు వేసి పిదప రాళ్ల గాజు పొదిగి అప్పుడు మెటల్ గాజు అమర్చి తర్వాత... ఇలా ఏదో చెప్తూ అది వీలు కాలేదనే అసంతృప్తితో వచ్చింది. ముందు జాగ్రత్తగా సెకండ్ షో టికెట్లు కూడా బుక్ చేశాను కాబట్టి హ్యాపీగా వెళ్లిపోయాం. మధ్యలో ఆర్ముగంకు ఏమిటి నొప్పి?‘కాళ్లా వేళ్లా పడగా కూరలు ఇవ్వడం మానేశావుగా. ఇక మీదట మళ్లీ ఇవ్వడం మొదలెట్టు వెధవకి. దారికొస్తాడు’ అన్నాను.మంచి పాయింట్ ఏది చెప్పినా మా ఆవిడ టక్కున అందుకుంటుంది. వెంటనే ఫ్రిజ్ దగ్గరకు వెళ్లి మూడ్రోజుల నుంచి దాచి పెట్టిన ‘క్యాబేజీ కాలీఫ్లవర్ ఇగురు కాన్పూరీ’ తీసి చేతిలో పట్టుకుంది.
పెళ్లయిన కొత్తల్లో ఒక అద్దింట్లో ఉన్నాం. ఆ ఓనరమ్మ రోజూ రెండు బిందెలు నీళ్లు రాగానే కరెక్ట్‌గా మోటర్ స్విచ్ఛాఫ్ చేయడం సాయంత్రం ఐదున్నర కాగానే గేట్లకు తాళాలు వేసేసి కుక్కల్ని వదలడం, బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే చెప్పులు దాచేయడం ఇలాంటి సత్కార్యాలతో మా ఆవిణ్ణి కొంచెం అనుకూలంగా చూసుకుంది. ఇప్పుడు ఆమె మంచాన పడిందట. ఇప్పుడో మరి కాసేపటికో అన్నట్టుగా ఉందట. వెళ్లే ముందు అంతటి కర్కోటకురాలు కూడా పాపం అతణ్ణి ఒకసారి రమ్మనండి చూడాలని ఉంది... అని నా గురించి ఒకటే సానుభూతితో కబురు చేస్తోంది.
‘మీ మీద ఎందుకండి ఆమెకు సానుభూతి’ అని మా ఆవిడకు కోపం. ‘ఏమో నాకేం తెలుసు. చివరి కోరిక కదా తీర్చొద్దా’ అన్నాను. ‘సరే. కిందకు దిగి కారు తీయండి. టెన్ మినిట్స్‌లో వచ్చేస్తాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల చూసుకొని వచ్చేద్దాం’ అంది. అప్పుడు మా పిల్లలు ఫిఫ్త్ ఒకడు, థర్డ్ ఒకరు చదువుతున్నారు. మేము చూసి వచ్చేసరికి ఒకడు ఎంసెట్‌లో ర్యాంక్ తెచ్చుకొని హుషారు హుషారుగా ఉన్నాడు. ఇంకొకడు అడ్రస్ లేడు. వెతగ్గా వెతగ్గా ఒక్లాహామా యూనివర్సిటీలో సీట్ వచ్చిందట... వీసా కోసం చెన్నైకి వెళ్లి టైమ్ గ్యాప్‌లో శరవణలో ఊతప్పం తింటున్నాడు. దేవుడా నువ్వున్నావయ్యా అనుకున్నాను.
అసలు పెళ్లినాడే సంకేతాలు అందాయి. మా మావగారు అదో టైపు. మా అత్తగారి మాట నెమ్మదితనం వల్ల ఆయనకు జీవితంలో మాట్లాడే అవసరమే లేకపోయింది. పెళ్లయ్యి తాళి కట్టడం పూర్తయ్యాక దగ్గరకు వచ్చి ఒకలాగా చూసి భుజం గట్టిగా నొక్కి కళ్లద్దాలు తీసి నిట్టూర్చి వెళ్లిన మనిషి మళ్లీ పత్తా లేడు. ఇక అన్నీ అత్తగారే. ఆమె ఎంతో మర్యాదగా వచ్చి పవిట నిండుగా కప్పుకొని నిలబడి ‘పది నిమిషాలే బాబూ వచ్చేస్తోంది’ అని వెళ్లిపోయింది. నేను గదిలో అంబికా దర్బార్ బత్తి పొగలో అలా అలా అపురూపమైన సంసిత శోభితమైన అంటే ఏంటో తెలీదు కాని మొత్తానికి ఒక మైమరపులో ఉండగా ‘చిట్టి చేమంతులు’ అనే సౌండ్ వినిపించింది. ఆ తర్వాత అంతటా కలకలం. మొదటి రాత్రి చిట్టి చేమంతుల జడతో గదిలోకి వెళ్లాలని ఆ చేమంతులతో కుట్టిన జడే తనకు నప్పుతుందని అనుకున్నదట. తీరా ఇప్పుడా చేమంతులు లేవు. ఒకావిడ ఎవరో గాబరాగా సర్ది చెప్పడం వినిపించింది. ‘అదిగాదే పొడవు కాగడాలు ఉన్నాయి. వెడల్పు రోజాలు ఉన్నాయి. సరళ కనకాంబరాలు ఉన్నాయి. త్రిభుజ మందారాలు ఉన్నాయి. కుంభాకార సంపెంగలున్నాయి. పుటాకార కారబ్బంతులున్నాయి. ఇక వృత్తాకార ముద్దబంతులకు అంతే లేదు... వీటితో’.... ‘కుదర్దు’ ‘పోనీ కావాలంటే కాగితం పూలు కూడా ఉన్నాయి. పింక్‌వి’‘నథ్థింగ్ నథ్థింగ్’... ఇక అమ్మాయి పట్టుదల అర్థమైపోయింది. ‘ఏం చేస్తాం. డ్రైవర్ కొండలును కేకేయండి’ అన్నారెవరో.
‘వాడి మొహం. ఖాదర్ బాషా అయితే రెండ్రోజుల్లో వచ్చేస్తాడు’ అన్నారు ఇంకెవరో. చివరకు ఖాదర్ బాషా కడియం వెళ్లి... అప్పుడు ఏదో తుఫాను... రెండు మూడు రోజులు అశ్వత్థామ పేటలో చిక్కుకుని, రెండ్రోజులు వరదలో అంబాసిడర్ కొట్టుకెళితే యానాంలో తేలి, షార్ట్‌కట్‌లో రావడానికి మదనపల్లి వెళ్లి, జడ్చర్ల మీదుగా... మొత్తానికి తగలడే సరికి ఊళ్లోనే చిట్టి చేమంతులు దొరకడం మొదలుపెట్టాయి. జనవరిలో అనుకున్న ముహూర్తం సెప్టెంబర్‌కయ్యింది.
మా ఆవిడ బంగారం. నేనంటే ప్రాణం. నా తోడిదే లోకం. కాకుంటే ఈ రెడీ అయ్యే పనిలో కొంచెం లేటవుతుంది. ఫలానా సీజన్‌లో ఫలానా సందర్భానికి ఫలానా విధంగా రెడీ అవ్వాలనే ఒక సంకల్పం, ఆశయం ఉన్నాయి. చిన్నప్పుడు స్కూల్ ప్రేయర్ హాల్‌లో అలా అని చెప్పి ప్రతిజ్ఞ కూడా చేసిందట. అది కొంచెం నా నెక్‌కొచ్చింది. మొన్న మా బాస్ ఫ్యామిలీతో భోజనానికి పిలిస్తే రానని మంకుపట్టు. ఏం అన్నాను.
‘మీరు గాంధర్వ పట్టు తేనిదే’ అంది. ‘అదేం పట్టు?’ అన్నాను. ‘కొత్తది. మార్కెట్‌లోకి ఎన్నో వచ్చాయి. ఎప్పుడైనా అడిగానా? ఆషాఢపట్టును వదిలేశాను. శ్రావణం పట్టును ఇగ్నోర్ చేశాను. భాద్రపదం పట్టును వద్దనుకున్నాను. ఇక ఆశ్వీయుజం, మార్గశిరం, పుష్యమి... మీ వల్ల అయ్యే పని కాదు. అనీబిసెంట్ పట్టు’... ‘అనీబిసెంట్ పట్టా?’‘అవును. అనీబిసెంట్ పట్టే. ఆగస్టు 15, జనవరి 26కు కట్టుకోవడానికి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దానినీ అడగలేదు. కనీసం గాంధర్వ పట్టు కూడా తేలేరా? అందరూ కట్టుకుని వస్తే నేను నీరూస్ వాళ్ల చీప్ చిల్లర్ పదిహేను వేల రూపాయల చీర కట్టుకుని రావాలా’ అని ఒకటే హటం. ఆయుఃక్షీణం అని తెలిసినా మగవాళ్లు క్రెడిట్ కార్డులు ఎందుకు తీసుకుంటారో ఇప్పుడు అర్థమైంది. గులాబీ రంగు గంధర్వ పట్టు చీర తెచ్చాను. ఎంతో సంతోష పడింది. ఆప్యాయత అనురాగాలతో నన్ను ముంచెత్తింది. ‘మీకెందుకు కింద ఉండండి. పది నిమిషాలలో వచ్చేస్తానుగా’ అంది. పిల్లలు స్నాక్స్ అందుకున్నారు. రెండు మూడు జతల బట్టలు కూడా సర్దుకున్నారు. నేను టక్కు గిక్కు చేసుకొని టై కట్టుకుని కారు తాళాలు అందుకుంటూ ‘ఆర్ముగం’ అని కేక వేశాను. ఎక్కడ ఉన్నాడో. పది గేమ్స్ ఆడి పదింట్లోనూ ఓడిస్తాను వెధవని.
- భా.బా (భార్యా బాధితుడు)
గమనిక: మీ ఆనందబాష్పాలు నన్ను తాకుతున్నాయి. బిందువు బిందువు కలిసి సింధువుగా మారి మగవాళ్లకు మంచిరోజులు తెచ్చే ఉషోదయం కనుచూపు మేరలో ఉంది. సహనం వహించండి. అదే మగవాడికి అజ్ఞాత ఆభరణం.
‘అవును. అనీబిసెంట్ పట్టే. ఆగస్టు 15, జనవరి 26కు కట్టుకోవడానికి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దానినీ అడగలేదు. కనీసం గాంధర్వ పట్టు కూడా తేలేరా? అందరూ కట్టుకుని వస్తే నేను నీరూస్ వాళ్ల చీప్ జచిల్లర్ పదిహేను వేల రూపాయల చీర కట్టుకుని రావాలా’ అని ఒకటే హటం.