Shes Team
-
ఉల్లాసంగా మహిళా సైక్లథాన్
రాయదుర్గం: మహిళల సైక్లథాన్ ఉల్లాసంగా...ఉత్సాహంగా సాగింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నానక్‌రాంగూడలోని కాంటినెంటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం 25 కిలో మీటర్ల సైక్లథాన్ నిర్వహించారు. గచ్చిబౌలి షీ టీమ్ ఇన్చార్జి. ఇన్స్పెక్టర్ సునీత, కాంటినెంటల్ ఆస్పత్రి సీఓఓ హరీష్మానియన్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సైక్లథాన్లో డాక్టర్లతో పాటు 480 మంది పాల్గొన్నారు. జయంతి అనే మహిళ 25 కిలో మీటర్ల దూరాన్ని 48 నిమిషాల్లో పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలవడగా, శిప్రా అనే మహిళ రెండు స్థానం కైవసం చేసుకుంది. అనంతరం నిర్వాహకులు 300 మంది విద్యార్థులకు కొత్త షూలు పంపిణీ చేశారు. -
షీ టీమ్‌లతో మరింత భద్రత
మహిళల సమస్యల పరిష్కారానికి 4 బృందాలు రాష్ట్రంలో ప్రథమంగా ఏర్పాటు నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్) : ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు సఖీ, షీ టీమ్‌ల బృందాల ఏర్పాటుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను వేధింపులకు గురి చేసే అకతాయిలను పట్టుకునేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీమ్‌ల ఏర్పాటయ్యాయి. ఇవి రెండు విభాగాలు మహిళల సంరక్షణ కోసం పనిచేస్తున్నాయి. సఖీ, షీ టీమ్‌లు సంయుక్తంగా పనిచేస్తే మహిళల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని గ్రహించిన కలెక్టర్ యోగితారాణా అందుకు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈనెల 10న సఖీ, షీ టీమ్ అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ సదస్సులో రెవెన్యూ పోలీస్ యంత్రాంగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయిలో మహిళలకు ఆ గ్రామంలోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా కమిటీలు నియమించేందుకు కసరత్తు చేశారు. ఈ కమిటీలు త్వరలో ఏర్పాటు కానున్నాయి. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సఖీ, షీ టీమ్ కమిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. గ్రామస్థాయి సఖీ, షీ టీమ్ కమిటీ.. గ్రామ స్థాయిలో మహిళలు తమ సమస్యలను గ్రామ స్థాయిలో ఉన్న జెండర్ కమిటీ సభ్యులకు తమ సమస్యను ఫిర్యాదు చేయాలి. జెండర్ కమిటీ సభ్యులే గ్రామంలో గల సమస్యలను తెలుసుకుని గ్రామస్థాయి సఖీ, షీ కేంద్రంలో కమిటీ సభ్యులతో కౌన్సిలింగ్ నిర్వహించి సమస్యలను పరిష్కారిస్తారు. జెండర్ కమిటీలో ఆ గ్రామంలో గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, వీఆర్వో, గ్రామ సర్పంచ్, మండల కమిటీలో చైర్మన్‌గా తహసీల్దార్, ఎస్హెచ్ఓ కన్వీనర్, కమిటీలు సభ్యులుగా ఏపీఎం, మండల విద్యాశాఖ అధికారి తదితరులు ఉంటారు. డివిజన్ స్థాయిలో కమిటీ చైర్మన్‌గా సబ్ కలెక్టర్ లేదా, ఆర్డీఓ, కన్వీనర్‌గా సబ్‌డివిజన్ పోలీస్ అధికారి(డీఎస్పీ), కమిటీ సభ్యులుగా డివిజన్ స్థాయి న్యాయ సేవాసంస్థ అధికారి, సీఐ తదితరులు ఉంటారు. జిల్లా స్థాయి కమిటీలో కమిటీ చైర్‌పర్సన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా పోలీస్ కమిషనర్, సభ్యులుగా ప్రతి ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు ఉంటారు. -
జిల్లావ్యాప్తంగా షీ టీంలు
* ప్రజల నుంచి షీ టీంకు మంచి ఆదరణ * జిల్లా ఎస్పీ పి.విశ్వప్రసాద్ మహబూబ్‌నగర్ క్రైం : మహిళల కోసం ఉన్న ప్రత్యేక చట్టాలలో ఉన్న ఫీచర్స్ తీసుకోని వాటిని తెలుగులో అనువాదం చేసి షీ టీం పోస్టర్లు తయారు చేశామని, ఇలాంటి పోస్టర్ల వల్ల మహిళలకు ఉపయోగం ఉంటుం దని జిల్లా ఎస్పీ పి.విశ్వప్రసాద్ అన్నా రు. షీ టీంలు ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం షీ టీం పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. జిల్లా లో షీ టీంకు మంచి ఆదరణ వస్తుందని అన్నారు. పనితీరు బాగున్నందు వల్లే జిల్లాలో విసృ్తతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలపారు. మహిళ రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ టీంలు మరింత ముందుకు తీసుకువెళ్లడానికి పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతి సబ్‌డివిజన్‌లో ఒక షీ టీం పని చేస్తోందని, అవసరమైన ముఖ్య పట్టణాల్లో త్వరలోనే షీ టీంలు ప్రారంభిస్తామని తెలిపారు. జనం రద్దీ గా ఉండే కళాశాలలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టర్లు ఏర్పాటు చేయిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో సీఐలు సీత య్య, రామకృష్ణ, సైదయ్య, ఎస్ఐ జీతేందర్‌రెడ్డి పాల్గొన్నారు. చలివేంద్రం ప్రారంభం నిత్యం రద్దీగా ఉంటే వన్‌టౌన్ చౌరస్తాలో చలివేంద్రం ఏర్పాటు చేయడం, చాలా ఉపయోగకరంగా ఉంటుం దని జిల్లా ఎస్పీ పి. విశ్వప్రసాద్ అన్నారు. వన్‌టౌన్ సీఐ సీతయ్య ఆధ్వర్యంలో మంగళవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గ్లా సులో నీళ్లుపోసి పలువురికి అందించారు. చలి వేంద్రాలు ఎంతోమంది దాహం తీరుస్తాయని అన్నారు. దాతలు సహకరిస్తే పట్టణంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పా టు చేస్తామని చెప్పారు. మహిళ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ జిల్లా కేంద్రంలోని మహిళ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ పి.విశ్వప్రసాద్ తనిఖీ చేశారు. సీఐ గది, రికార్డు గది, లాకప్‌లను, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను, సౌకర్యాలను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న ద్విచక్ర వాహనాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. కౌన్సెలింగ్ సెంటర్‌కు వస్తున్న బాధితుల వివరాలు నమోదు రిజిస్టర్ గురించి అడిగినప్పుడు సిబ్బంది ఇబ్బందిపడ్డారు. దీంతో ఎస్పీ స్పందిస్తూ రికార్డు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. అన్ని రకాల రిజిస్టర్లు తప్పకుండా మెయింటెన్ చేయాలని సూచించారు. -
సతి బాధ
ఓన్లీ టెన్ మినిట్స్ వాచ్మెన్ ఆర్ముగం కన్నీరు మున్నీరవడం మా ఆవిడ చెడామడా తిట్టడం చెవిన పడుతూనే ఉంది. చివరకు మా ఆవిడ తరిమి కొట్టింది. వెళ్లిపోయాడు. ‘ఏమైంది’ లేచి అడిగాను. ‘ఉద్యోగం మానేస్తాడట. తిరువణ్ణామలై వెళ్లి రమణ మహర్షి ఆశ్రమంలో చేరిపోతాడట. పిచ్చి పిచ్చిగా ఉందా కాళ్లిరగ్గొడతాను... ఎక్కువ మాట్లాడావంటే గుడ్మాణింగ్ మేడమ్ అన్నావని షీ టీమ్‌కు పట్టిస్తాను అని చెప్పాను. దెబ్బకు దారికొచ్చాడు’ అని వెళ్లిపోయింది. ఏం లేదు. నిన్న సాయంత్రం ఫస్ట్‌షోకు వెళ్దామనుకున్నాము. అంతా రెడీ అయ్యాక మీరు కిందకు దిగి కారు తీసి ఉండండి టెన్ మినిట్స్‌లో వచ్చేస్తాను అంది. ఆ మాట వినగానే పిల్లలు రెండు స్నాక్స్ బాక్సులు తీసుకొని హోమ్‌వర్క్ పుస్తకాలు తీసుకొని వీడియోగేమ్స్ ఆడేందుకు ట్యాబ్స్ తీసుకొని లిఫ్ట్ ఎక్కారు. నేనేమిట్రా అంటే షటిల్కి అలవాటు పడ్డాను. అది కూడా ఆర్ముగంతో. పొట్టిగా లావుగా ఉన్నా భలే ఆడతాడు. నేను కారు తీసి డ్రైవ్ వేలో పెట్టి ఏడు గేమ్స్ ఆడాను తనతో. నాలుగు నేను గెలిచాను. మూడు తను. తొమ్మిదిన్నర అయ్యాక అప్పటికీ పూర్తిగా రెడీ కాలేదనే అసంతృప్తితో- అంటే ఎడమ చేతికి ప్రతి మూడు గాజుల మధ్య ఒక బంగారు గాజు వదిలి ఆ తర్వాత లక్క గాజు వేసి పిదప రాళ్ల గాజు పొదిగి అప్పుడు మెటల్ గాజు అమర్చి తర్వాత... ఇలా ఏదో చెప్తూ అది వీలు కాలేదనే అసంతృప్తితో వచ్చింది. ముందు జాగ్రత్తగా సెకండ్ షో టికెట్లు కూడా బుక్ చేశాను కాబట్టి హ్యాపీగా వెళ్లిపోయాం. మధ్యలో ఆర్ముగంకు ఏమిటి నొప్పి?‘కాళ్లా వేళ్లా పడగా కూరలు ఇవ్వడం మానేశావుగా. ఇక మీదట మళ్లీ ఇవ్వడం మొదలెట్టు వెధవకి. దారికొస్తాడు’ అన్నాను.మంచి పాయింట్ ఏది చెప్పినా మా ఆవిడ టక్కున అందుకుంటుంది. వెంటనే ఫ్రిజ్ దగ్గరకు వెళ్లి మూడ్రోజుల నుంచి దాచి పెట్టిన ‘క్యాబేజీ కాలీఫ్లవర్ ఇగురు కాన్పూరీ’ తీసి చేతిలో పట్టుకుంది. పెళ్లయిన కొత్తల్లో ఒక అద్దింట్లో ఉన్నాం. ఆ ఓనరమ్మ రోజూ రెండు బిందెలు నీళ్లు రాగానే కరెక్ట్‌గా మోటర్ స్విచ్ఛాఫ్ చేయడం సాయంత్రం ఐదున్నర కాగానే గేట్లకు తాళాలు వేసేసి కుక్కల్ని వదలడం, బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే చెప్పులు దాచేయడం ఇలాంటి సత్కార్యాలతో మా ఆవిణ్ణి కొంచెం అనుకూలంగా చూసుకుంది. ఇప్పుడు ఆమె మంచాన పడిందట. ఇప్పుడో మరి కాసేపటికో అన్నట్టుగా ఉందట. వెళ్లే ముందు అంతటి కర్కోటకురాలు కూడా పాపం అతణ్ణి ఒకసారి రమ్మనండి చూడాలని ఉంది... అని నా గురించి ఒకటే సానుభూతితో కబురు చేస్తోంది. ‘మీ మీద ఎందుకండి ఆమెకు సానుభూతి’ అని మా ఆవిడకు కోపం. ‘ఏమో నాకేం తెలుసు. చివరి కోరిక కదా తీర్చొద్దా’ అన్నాను. ‘సరే. కిందకు దిగి కారు తీయండి. టెన్ మినిట్స్‌లో వచ్చేస్తాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల చూసుకొని వచ్చేద్దాం’ అంది. అప్పుడు మా పిల్లలు ఫిఫ్త్ ఒకడు, థర్డ్ ఒకరు చదువుతున్నారు. మేము చూసి వచ్చేసరికి ఒకడు ఎంసెట్‌లో ర్యాంక్ తెచ్చుకొని హుషారు హుషారుగా ఉన్నాడు. ఇంకొకడు అడ్రస్ లేడు. వెతగ్గా వెతగ్గా ఒక్లాహామా యూనివర్సిటీలో సీట్ వచ్చిందట... వీసా కోసం చెన్నైకి వెళ్లి టైమ్ గ్యాప్‌లో శరవణలో ఊతప్పం తింటున్నాడు. దేవుడా నువ్వున్నావయ్యా అనుకున్నాను. అసలు పెళ్లినాడే సంకేతాలు అందాయి. మా మావగారు అదో టైపు. మా అత్తగారి మాట నెమ్మదితనం వల్ల ఆయనకు జీవితంలో మాట్లాడే అవసరమే లేకపోయింది. పెళ్లయ్యి తాళి కట్టడం పూర్తయ్యాక దగ్గరకు వచ్చి ఒకలాగా చూసి భుజం గట్టిగా నొక్కి కళ్లద్దాలు తీసి నిట్టూర్చి వెళ్లిన మనిషి మళ్లీ పత్తా లేడు. ఇక అన్నీ అత్తగారే. ఆమె ఎంతో మర్యాదగా వచ్చి పవిట నిండుగా కప్పుకొని నిలబడి ‘పది నిమిషాలే బాబూ వచ్చేస్తోంది’ అని వెళ్లిపోయింది. నేను గదిలో అంబికా దర్బార్ బత్తి పొగలో అలా అలా అపురూపమైన సంసిత శోభితమైన అంటే ఏంటో తెలీదు కాని మొత్తానికి ఒక మైమరపులో ఉండగా ‘చిట్టి చేమంతులు’ అనే సౌండ్ వినిపించింది. ఆ తర్వాత అంతటా కలకలం. మొదటి రాత్రి చిట్టి చేమంతుల జడతో గదిలోకి వెళ్లాలని ఆ చేమంతులతో కుట్టిన జడే తనకు నప్పుతుందని అనుకున్నదట. తీరా ఇప్పుడా చేమంతులు లేవు. ఒకావిడ ఎవరో గాబరాగా సర్ది చెప్పడం వినిపించింది. ‘అదిగాదే పొడవు కాగడాలు ఉన్నాయి. వెడల్పు రోజాలు ఉన్నాయి. సరళ కనకాంబరాలు ఉన్నాయి. త్రిభుజ మందారాలు ఉన్నాయి. కుంభాకార సంపెంగలున్నాయి. పుటాకార కారబ్బంతులున్నాయి. ఇక వృత్తాకార ముద్దబంతులకు అంతే లేదు... వీటితో’.... ‘కుదర్దు’ ‘పోనీ కావాలంటే కాగితం పూలు కూడా ఉన్నాయి. పింక్వి’‘నథ్థింగ్ నథ్థింగ్’... ఇక అమ్మాయి పట్టుదల అర్థమైపోయింది. ‘ఏం చేస్తాం. డ్రైవర్ కొండలును కేకేయండి’ అన్నారెవరో. ‘వాడి మొహం. ఖాదర్ బాషా అయితే రెండ్రోజుల్లో వచ్చేస్తాడు’ అన్నారు ఇంకెవరో. చివరకు ఖాదర్ బాషా కడియం వెళ్లి... అప్పుడు ఏదో తుఫాను... రెండు మూడు రోజులు అశ్వత్థామ పేటలో చిక్కుకుని, రెండ్రోజులు వరదలో అంబాసిడర్ కొట్టుకెళితే యానాంలో తేలి, షార్ట్‌కట్‌లో రావడానికి మదనపల్లి వెళ్లి, జడ్చర్ల మీదుగా... మొత్తానికి తగలడే సరికి ఊళ్లోనే చిట్టి చేమంతులు దొరకడం మొదలుపెట్టాయి. జనవరిలో అనుకున్న ముహూర్తం సెప్టెంబర్కయ్యింది. మా ఆవిడ బంగారం. నేనంటే ప్రాణం. నా తోడిదే లోకం. కాకుంటే ఈ రెడీ అయ్యే పనిలో కొంచెం లేటవుతుంది. ఫలానా సీజన్లో ఫలానా సందర్భానికి ఫలానా విధంగా రెడీ అవ్వాలనే ఒక సంకల్పం, ఆశయం ఉన్నాయి. చిన్నప్పుడు స్కూల్ ప్రేయర్ హాల్లో అలా అని చెప్పి ప్రతిజ్ఞ కూడా చేసిందట. అది కొంచెం నా నెక్కొచ్చింది. మొన్న మా బాస్ ఫ్యామిలీతో భోజనానికి పిలిస్తే రానని మంకుపట్టు. ఏం అన్నాను. ‘మీరు గాంధర్వ పట్టు తేనిదే’ అంది. ‘అదేం పట్టు?’ అన్నాను. ‘కొత్తది. మార్కెట్లోకి ఎన్నో వచ్చాయి. ఎప్పుడైనా అడిగానా? ఆషాఢపట్టును వదిలేశాను. శ్రావణం పట్టును ఇగ్నోర్ చేశాను. భాద్రపదం పట్టును వద్దనుకున్నాను. ఇక ఆశ్వీయుజం, మార్గశిరం, పుష్యమి... మీ వల్ల అయ్యే పని కాదు. అనీబిసెంట్ పట్టు’... ‘అనీబిసెంట్ పట్టా?’‘అవును. అనీబిసెంట్ పట్టే. ఆగస్టు 15, జనవరి 26కు కట్టుకోవడానికి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దానినీ అడగలేదు. కనీసం గాంధర్వ పట్టు కూడా తేలేరా? అందరూ కట్టుకుని వస్తే నేను నీరూస్ వాళ్ల చీప్ చిల్లర్ పదిహేను వేల రూపాయల చీర కట్టుకుని రావాలా’ అని ఒకటే హటం. ఆయుఃక్షీణం అని తెలిసినా మగవాళ్లు క్రెడిట్ కార్డులు ఎందుకు తీసుకుంటారో ఇప్పుడు అర్థమైంది. గులాబీ రంగు గంధర్వ పట్టు చీర తెచ్చాను. ఎంతో సంతోష పడింది. ఆప్యాయత అనురాగాలతో నన్ను ముంచెత్తింది. ‘మీకెందుకు కింద ఉండండి. పది నిమిషాలలో వచ్చేస్తానుగా’ అంది. పిల్లలు స్నాక్స్ అందుకున్నారు. రెండు మూడు జతల బట్టలు కూడా సర్దుకున్నారు. నేను టక్కు గిక్కు చేసుకొని టై కట్టుకుని కారు తాళాలు అందుకుంటూ ‘ఆర్ముగం’ అని కేక వేశాను. ఎక్కడ ఉన్నాడో. పది గేమ్స్ ఆడి పదింట్లోనూ ఓడిస్తాను వెధవని. - భా.బా (భార్యా బాధితుడు) గమనిక: మీ ఆనందబాష్పాలు నన్ను తాకుతున్నాయి. బిందువు బిందువు కలిసి సింధువుగా మారి మగవాళ్లకు మంచిరోజులు తెచ్చే ఉషోదయం కనుచూపు మేరలో ఉంది. సహనం వహించండి. అదే మగవాడికి అజ్ఞాత ఆభరణం. ‘అవును. అనీబిసెంట్ పట్టే. ఆగస్టు 15, జనవరి 26కు కట్టుకోవడానికి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దానినీ అడగలేదు. కనీసం గాంధర్వ పట్టు కూడా తేలేరా? అందరూ కట్టుకుని వస్తే నేను నీరూస్ వాళ్ల చీప్ జచిల్లర్ పదిహేను వేల రూపాయల చీర కట్టుకుని రావాలా’ అని ఒకటే హటం. -
షిఫ్ట్ టీమ్
ఇవి కొండలు. వీటిని పిండి కొట్టే వీరుల్లేరు. ఒక్క మగాడు లేడు. అంతా మైదానాలకు వలస వెళ్లారు. ఈ ‘షి’ టీమ్‌కి చేతిలో కొద్దిగా భూమి, కావలసినంత టైము ఉంది. అంతే. అందరూ కలిసి షిఫ్ట్ సేద్యం చేపట్టారు. అదే భూమిముక్కను ఒక్కో సంఘం నలభై రోజులు అరువు తీసుకుంది. రెక్కలు ముక్కలు చేసుకుని వాణిజ్య పంటను పండించింది కలిసి మార్కెటింగ్ చేసుకుంది. ఇప్పుడు దేశమంతా ఈ నాగాలాండ్ షిఫ్ట్ కల్చర్‌ని ఒక ఆదర్శంగా తీసుకుంది. మన మహిళలూ ఈ ప్రయత్నం చేయొచ్చు. మన షీ టీమ్‌ల పంటా పండొచ్చు. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఆమె లేనిదే పూచిక పుల్ల జరగదు! చివరి శ్వాస వరకూ విరామం ఎరుగని మనిషి.. ఇంట్లో అవిశ్రాంత ఉద్యోగి.. అలాంటి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం లేదు. ఆస్తుల్లో వాటా లేదు. మిగిలిన దేశాల్లో మహిళల పరిస్థితి ఎలా ఉన్నా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ స్త్రీల పరిస్థితి మాత్రం అచ్చంగా అదే! అయితే నాగాలాండ్ మహిళలు ఈమధ్యే ఓ విప్లవం తెచ్చారు. తమ సమస్యలకు మూలం ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడమేనని గ్రహించి కలిసికట్టుగా ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించారు. ఇప్పుడు నాగాలాండ్ రాష్ట్రం వ్యవసాయిక ఉత్పత్తి, సంపదలో అక్కడి మహిళలదే ప్రధాన భూమిక. ఎలాగంటే... నాగాలాండ్ రాజధాని కొహిమాకు దగ్గర్లోని గ్రామం దిమాపూర్. మిగతాచోట ఉన్న స్థితిగతులే ఆ ఊళ్లోని స్త్రీలవి కూడా. ఇది వాళ్లకేమాత్రం రుచించలేదు. అక్కడి మగవాళ్లు మెరుగైన జీతం కోసం మైదాన ప్రాంతాలకు వలస వెళ్తుంటే.. ఏ ప్రొడక్టివ్ వర్క్ లేక కేవలం ఇంటిపనితోనే సరిపెట్టుకోవడం వాళ్లకు నచ్చలేదు. ఏదైనా చేయాలి? ఏం చేయాలి. అందుబాటులో ఏముంది? కావల్సినంత సమయం ఉంది.. శక్తి ఉంది.. బీడుపడ్డ భూమి ఉంది. ఇది చాలదా? అనుకున్నారు ఆ ఊరి మహిళలు. సమయం, శక్తి పెట్టుబడిగా ముందు వాళ్ల చేతుల్లో ఉన్న నేలను దున్నారు. బంగారు పంట పండించారు. దిగుబడి బాగానే వచ్చింది. ఖర్చులు పోనూ రాబడి బాగానే మిగిలింది. దాంతో ఇంకొంత భూమిలో పంట పండించాలనుకున్నారు. నేల కావాలి, అలాగే మనుషులూ కావాలి. గ్రామ కమ్యూనిటీ కింద ఉన్న భూమి కనిపించింది. పనిచేయాలన్న సంకల్పం ఉన్న సాటి మహిళలూ దృష్టికొచ్చారు. సమాలోచన ఇంకేముంది.. మొదటి పంట పండించిన మహిళలంతా సమావేశమై చర్చించారు. ‘ఈ కొద్దిపాటి నేలలోనే ఇంతమంచి దిగుబడి సాధించాం.. ఇంకొంత నేలను కలుపుకొంటే మరింత దిగుబడిని సాధిస్తాం కదా.. అలాగే మనలాంటి ఆడవాళ్లకు పనిచ్చిన వాళ్లమూ అవుతాం’ అని అనుకున్నారు. గ్రామ కమిటీ కిందున్న భూమిని ఎలా తీసుకోగలం? అని ఆలోచించారు. అందరూ కలిసి సర్పంచ్ దగ్గరకు వెళ్లారు. అంతకుముందు వాళ్లు సాధించిన ఫలితం గురించి చెప్పారు. ముందు కాస్త హేళనగా మాట్లాడాడు సర్పంచ్. దానిని పట్టించుకోని మహిళలు తాము చేయదల్చుకున్న పని గురించే పదేపదే వివరించారు. వాళ్ల పట్టుదల, అంతకుముందు వాళ్లు సాధించిన విజయం సర్పంచ్‌ను పునరాలోచనలో పడేశాయి. కమ్యూనిటీ భూమిని వాళ్లకు అప్పజెప్పేలా చేశాయి. రెండో వ్యూహం తమ దగ్గరున్న కొంత భూమి, గ్రామ కమ్యూనిటీ లీజుకిచ్చిన కొంత భూమి అంతా కలిపినా అందరూ సాగుచేసుకునేంత అవడం లేదు. ఏం చేయాలి? మళ్లీ సమావేశమయ్యారు. రకరకాల ప్రణాళికలను చర్చించారు. అవన్నీ పెద్దగా ఉపయోగమున్నట్లు అనిపించలేదు. చివరకు ఒకరిద్దరు మహిళలు ‘షిఫ్ట్ సిస్టమ్‌లో సాగుచేసుకుంటే..’ అన్నారు చిన్నగా. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. తేరుకున్నాక ఒకటే చప్పట్లు. ‘అవును.. షిఫ్ట్ సిస్టమ్‌లో పంట పండిద్దాం!’ అన్నారు ముక్తకంఠంతో. ఎలా? ఆ గుంపులో మూలనుంచి ఓ సందేహ స్వరం వినపడింది. ‘స్వల్పకాలిక పంటలు వేద్దాం. వీటి వల్ల నేల సారమూ పోదు’ అన్నారు షిఫ్ట్సిస్టమ్ ఐడియా చెప్పిన మహిళలే. దాని మీద ఆలోచనలు, ప్లాన్లు సాగి చివరకు ఓ నిర్ణయానికి వచ్చారు. మూడో వ్యూహం దిమాపూర్‌లోని మహిళలంతా రెండు గ్రూపులుగా విడిపోయారు. స్వల్పకాలిక పంటలేమున్నాయో... వేటికి డిమాండ్ ఉందో లెక్క తీశారు. జాబితా తయారు చేశారు. ముందు ఒక గ్రూప్ ఆ భూమిలో జొన్నలు వేసింది. ఆ పంట చేతికి రాగానే రెండో గ్రూప్ ఆ నేలలోనే మొక్కజొన్నలు వేసింది. ఈ లోపు మొదటి గ్రూప్ తమ పంటకి మార్కెట్ వెదుక్కుంది. రెండో గ్రూప్‌వాళ్లకు మార్కెటింగ్‌లో వాళ్లకు ఎదురైన అనుభవాలను, నేర్చుకున్న విషయాలను, అవగతం చేసుకున్న కిటుకులనూ చెప్పింది. ఇంతలోకే రెండో గ్రూప్పంటా చేతికి వచ్చింది. మొదటి గ్రూప్ వాళ్లు చేసిన సూచనలు, మెలకువలతో రెండో గ్రూప్‌వాళ్లకు మార్కెటింగ్ తేలికైంది. ఇలా ఆ ఊళ్లోని మహిళలందరికీ చేతినిండా పని దొరికింది. కూలీలుగా కాదు యజమానులుగానే! దిమాపూర్ స్ఫూర్తితో పెరెన్జిల్లాలోని కొంతమంది యువతులు వాళ్లు పండించిన ఆర్గానిక్ పంటలతో, డ్రైడ్, కేన్డ్ ఫుడ్ ఐటమ్స్‌తో ఒక స్టోర్‌నే నిర్వహిస్తున్నారు. ఢిల్లీ మార్కెట్లో వీళ్ల ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉందట. కష్టపడి పనిచేయడం వాళ్లకు తెలిసిన విద్య. ఆ శక్తిని గుర్తెరిగారు. దేనికి డిమాండ్ ఉందో తెలుసుకున్నారు. సమష్టికృషిని సేంద్రియ వ్యవసాయం మీద పెట్టుబడిపెట్టి సంపదను సృష్టిస్తున్నారు. శ్రమైక సౌందర్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. దేశంలోని మహిళలకు స్ఫూర్తిని పంచుతున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా... దిమాపూర్‌లో రూపుదిద్దుకున్న షిఫ్ట్ సాగు ఆ నోటా ఈ నోటా నాగాలాండ్ అంతటా పాకి ఇప్పుడు ఆ రాష్ట్రంలోని ప్రతి గ్రామం దాన్ని అమలు చేస్తోంది. మొదటి గ్రామంలోని మహిళలు ఒకడుగు ముందుకేసి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌గా ఏర్పడి పంటల మీద వచ్చిన లాభాన్ని వ్యాపారంలో పెట్టుబడి పెట్టసాగారు. ప్రజల్లో ఆర్గానిక్ పంటలు, తాజా ఆహారాపదార్థాల పట్ల డిమాండ్ ఉందని తెలుసుకుని వాటినే పండిస్తున్నారు. స్వయంగా మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నారు. ఢిల్లీ, పుణె, ముంబై, చండీగఢ్, బెంగళూరు లాంటి నగరాల్లో జరిగే ఫుడ్ ఎక్స్పోల్లో పాల్గొని వాళ్ల ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటున్నారు. అలా వాళ్ల ఆదాయాన్ని పెంచుకోవడమే కాక ప్రభుత్వ ఆదాయం పెరగడంలోనూ ప్రధాన భాగస్వాములయ్యారు. నా మాటే చెల్లుతోంది మాకు నలుగురు పిల్లలు. మా ఆయనది అరకొర సంపాదనే. దాంతో కుటుంబ అవసరాలే తీరకపోయేది. చేదోడుగా నేనేదైనా చేయాలి అని చాలా ఉండేది. కానీ ఊళ్లో ఉపాధి మార్గాలేముంటాయి? అప్పుడు ఈ షిఫ్ట్సాగు పరిచయమైంది. నేనూ చేరా. తర్వాత సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లోనూ జాయినయ్యా. ఇప్పుడు మా ఆయనకన్నా నాలుగింతలు ఎక్కువ సంపాదిస్తున్నా. పిల్లలను మంచి స్కూల్లో చేర్పించా. ఇప్పుడు ఇంట్లో నా మాటే చెల్లుతోంది.’ - లొచిమి లోతా (48), దిమాపూర్ ధైర్యం వస్తోంది మా ఊళ్లో స్త్రీలందరికీ సమానావకాశాలు కల్పించడమే మా లక్ష్యం. పనిచేసే అవకాశం ఇస్తే సంపాదించుకుంటారు, నిర్ణయాలు తీసుకునే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు, దీనివల్ల వాళ్ల ఇళ్లే కాదు గ్రామమూ బాగుపడ్తుంది. ఈ విషయాన్ని మేం నిరూపించాం కూడా. - మెరీ ఖియామ్నింగన్, షురున్ సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ సభ్యురాలు, దిమాపూర్ -
స్టేడియంలో ‘షీ’కి చిక్కారు..
షీ టీమ్‌పై ఎదురుదాడి యువకుల రిమాండ్ ఉప్పల్: ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన యువకులు మద్యం మత్తులో యువతులపై అసభ్యంగా ప్రవర్తించి, షీ టీమ్‌కు చిక్కారు. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాలు.. శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన జూబ్లీహిల్స్‌కు చెందిన విద్యార్థి వాజల రేవంత్(22), హబ్సిగూడకు చెందిన నూకల ధీరజ్‌రెడ్డి (21), కారెపు ప్రేమ్‌రాజ్(18), సాఫ్ట్వేర్ ఉద్యోగులు పాములపర్తి అభిషేక్‌రెడ్డి(27), నారాయణతేజ(24)లు కార్పొరేట్ బాక్స్‌లో మద్యం సేవించారు. అనంతరం పక్కనే మరో కార్పొరేట్ బాక్స్‌లో ఉన్న యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో అక్కడే ఉన్న షీ టీం బృందం గమనించి వీడియో తీశారు. అనంతరం యువతుల ఫిర్యాదు మేరకు వారిని షీ బృందం అదుపులోకి తీసుకుంది. ఆయితే యువకులను అదుపులోకి తీసుకున్న షీ బృందం పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించి ఎదురుదాడి చేశారు. ఆరుగురి యువకులపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే ఇక జైలే
షీ టీంకు దొరికిన ఖదీర్‌కు రెండు రోజుల జైలు శిక్ష సాక్షి, హైదరాబాద్: ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన నిందితులను పీటీ కేసు కింద నమోదు చేయడంతో పోలీసు స్టేషన్లోనే బెయిల్‌పై విడుదలయ్యేవారు. ఇక నుంచి అలా కాకుండా ఏకంగా జైలు శిక్షే పడేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తొలి రోజే నాంపల్లి కోర్టు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఓ నిందితుడికి రెండు రోజుల జైలు శిక్ష కూడా విధించింది. మంగళవారం మల క్‌పేట బస్‌స్టాప్‌లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ పతేషానగర్కు చెందిన ఎండీ అబ్దుల్ ఖదీర్ ఖురేషీ(37) సీసీఎస్ పోలీసు(షీటీమ్)లకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతనిపై సిటీ పోలీసు యాక్ట్ 70 సీ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని బుధవారం నాంపల్లిలోని ఏడవ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ కేసు వివరాలను పరిశీలించి ఖదీర్‌కు ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించా రు. తనపై ఆధారపడిన భార్య, కూతురు ఇబ్బందులకు గురవుతారని ఖదీర్ మెజిస్ట్రేట్‌ను అభ్యర్ధించి, సారీ చెప్పాడు. దీంతో శిక్షను రెండు రోజులుగా మార్చి తీర్పునిచ్చారు. ఖదీర్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మహిళ భద్రతపై దృష్టి.... ఇప్పటివరకు నిందితులు స్టేషన్ స్థాయిలోనే చలానా చెల్లించడంతో కేసు మూసివేసేవారు. దీంతో ఈవ్‌టీజర్లలో మార్పు రాదని తలంచిన నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి నిందితులను కోర్టులో హాజరుపర్చేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా నగర మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి రజనికి ఇటీవల లేఖ రాసారు. దీన్ని పరిశీలించిన జడ్జి.. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిని కోర్టులో హాజరుపర్చి జైలు శిక్ష కూడా విధించాలంటూ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లను ఆదేశించారు. ఇది బుధవారం నుంచే మొదలైంది. ఇక నుంచి పట్టుబడితే ఎనిమిది రోజుల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. -
ఆమె కోసం... ఓ రక్షణ వలయం - స్వాతీ లక్రా
సమాజంలో ధైర్యంగా జీవించే భరోసాను మహిళలకు ఇవ్వాలి. ఆకతాయిల ఆటలు ఇక సాగవనే నమ్మకం కలిగించాలి. తమ కోసం ఓ నిఘా వ్యవస్థ అండగా ఉందనే అవగాహన తేవాలి. అప్పుడే చక్కటి సమాజం ఆవిష్కృతమవుతుంది... అంటారు స్వాతీ లక్రా. హైదరాబాద్ అడిషనల్ పోలీస్ కమిషనరైన ఆమె ఆకతాయిల నుంచి ఆడవాళ్ళ రక్షణ కోసం రూపొందించిన ‘షీ బృందం’ బాధ్యతలు మోస్త్తున్నారు. సమర్థంగా అమలైతే, సమాజంలో మార్పు తెచ్చే ఈ వినూత్న ప్రయత్నం గురించి ప్రత్యేక కథనం... జార్ఖండ్ రాష్ట్రం, రాంచీలో పుట్టి పెరిగిన స్వాతీ లక్రాతో కొద్దిసేపు మాట్లాడితే సమాజంలో మహిళలు ఎన్ని రకాలుగా టీజింగ్‌కు గురవుతున్నారనే విషయంలో ఆమెకున్న అవగాహన తెలుస్తుంది. మహిళలను ఆదుకోవడానికి నాలుగు సింహాల పోలీస్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే ఆమె అభిలాషలో అంకితభావం కనిపిస్తుంది. ఆలోచనకు మూలం ఇదీ! ‘‘మహిళల రక్షణ కోసం ప్రభుత్వం సెక్యూరిటీ కమిటీలను నియమించింది. ఆ సందర్భంగా మహిళల భద్రత కోసం ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలు చేశాం. వాటిలో షీ టీమ్ కూడా ఒకటి. మహిళల రక్షణ కోసం ఓ నిఘా బృందాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనకు అన్ని వైపుల నుంచి సానుకూలమైన స్పందన వచ్చింది. ఇక బృందాన్ని నిర్వహించే బాధ్యత నాకప్పగించారు. రెండు వారాలుగా మా షీ బృందాలు నగరంలో పనిచేస్తున్నాయి. ఒక్క ముక్కలో ఇది ‘ఆమె’ కోసం ఓ రక్షణవలయం’’ అని చెప్పుకొచ్చారు హైదరాబాద్ ఎసిపి స్వాతీ లక్రా. తప్పించుకొనే వీలు లేకుండా... రికార్డు! కాలేజ్కెళ్తూ బస్టాపులో వేధింపుకు గురయిన అమ్మాయి సమస్య బస్ ఎక్కి వెళ్లిపోవడంతో అంతమైపోదు. ఆ రోజంతా అది ఆమె మనసును తొలుస్తూనే ఉంటుంది. ఒక్క ఆకతాయి చేష్ట... క్లాసులో పాఠం మీద దృష్టి పెట్టలేనంతగా ఆమె మనసును కలచి వేస్తుంది. అదే ఉద్యోగిని అయితే... ఆ రోజు పని చేయలేకపోవచ్చు. పైగా సున్నిత మనస్కులయితే మానసికంగా కుంగిపోతారు. ధైర్యాన్ని కోల్పోతారు. ఇవన్నీ కలిసి వారిలో ఉన్న సహజమైన నైపుణ్యాలను మరుగున పడేస్తాయి. మానసికంగా అభద్రత కలిగితే మహిళాశక్తి నిర్వీర్యమవుతుంది. మహిళలో పోరాడే సత్తా అంతరించిపోతుంది. వీటన్నింటి నుంచి మహిళను రక్షించే ప్రయత్నమే ఈ షీ బృందం. ‘‘మహిళలు ఇంట్లో ఉన్నంత ధైర్యంగా సమాజంలో సంచరించగలగాలి. ఇంటి నుంచి బయటకు రావడానికి బెంబేలు పడే పరిస్థితులు మారాలి. ధైర్యంగా కాలేజ్కెళ్లగలగాలి, ఆఫీసుకెళ్లగలగాలి. గృహిణి ఒంటరిగా మార్కెట్కెళ్లగలిగిన భరోసా కలిగించడమే మా బాధ్యత. ఆకతాయి చేష్టలను మా బృందం కెమెరాల్లో రికార్డు చేస్తారు కాబట్టి వాళ్లు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు’’ అంటారీ ఐ.పి.ఎస్. అధికారిణి. భరోసా కల్పించే వంద బృందాలు.. ఇంటి నుంచి బయటికొచ్చిన మహిళలు ఎన్ని వేధింపులను ఎదుర్కొంటున్నప్పటికీ నోరెత్తి చెప్పడానికి సందేహిస్తూనే ఉన్నారు. ఆ భయాన్ని తొలగించడం, ఫిర్యాదు చేయగలిగిన ధైర్యాన్ని నింపడమే షీ బృందం ప్రధాన విధి అంటున్నారీ ఎసిపి. ‘‘కాలేజ్‌లకెళ్లి వాళ్ళలో చైతన్యం కలిగించేలా సమావేశాలు పెడతాం. మహిళాసంఘాలు, స్వచ్ఛందసంస్థలు, కాలనీ వాసులు కోరుకుంటే మా ప్రతినిధులు వెళ్లి ప్రసంగిస్తారు. 100 నంబర్‌కి డయల్ చేయమని పదే పదే తెలియచేస్తూ డయల్ చేయగలిగిన ధైర్యాన్ని కల్పిస్తాం. పోలీసులకు చెప్పడం ద్వారా సమస్యకు ముగింపు పలకవచ్చనీ, పోలీసులకు చెప్పడం వల్ల ఇతర సమస్యలేవీ రావనే భరోసా కల్పిస్తాం. అందుకోసం జంటనగరాల్లో వంద బృందాలు పనిచేస్తున్నాయి. అవి బస్సుల్లోనూ ప్రయాణిస్తాయి’’ అని వివరించారు స్వాతి. పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి! ‘‘పిల్లలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా గ్రహిస్తారు. దానిని ఎలా వినియోగిస్తున్నారనే దాని మీదనే భవిష్యత్తు ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలను నేర్పించడంతోపాటు వారి కార్యకలాపాలను గమనిస్తుండాలి’’ అంటారు స్వాతీ లక్రా. ఖాళీ సమయాన్ని భర్త, ఇద్దరు పాపలతో గడపడమే తన హాబీ అని చెబుతారీ ఉన్నతాధికారిణి. అన్నట్లు ఆమె భర్త కూడా ప్రభుత్వంలో ఉన్నతాధికారే. ఐఎఎస్ అధికారి అయిన బిఎమ్డి ఎక్కా ఆమె భర్త. హౌసింగ్ బోర్డు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ 1995 బ్యాచ్ విద్యార్థులమని చెబుతూ ముస్సోరీలో శిక్షణ సమయంలో పరిచయమైనట్లు చెప్పారు. ఆశయం, ఆచరణ కలగలిస్తే, అభ్యుదయ సమాజం వైపు పయనం అసాధ్యమేమీ కాదనడానికి స్వాతి సారథ్యంలోని తాజా ప్రయత్నం ‘షీ’ ఒక ఉదాహరణ. - వాకా మంజులారెడ్డి ‘షీ బృందం’ ఏం చేస్తుందంటే... కాలేజ్, బస్టాపు, రైల్వేస్టేషన్, మార్కెట్లలో సంచరిస్తూ నేరస్థులను గుర్తించి అరెస్టు చేస్తారు. ఒక్కో బృందంలో ఐదుమంది వరకు ఉంటారు. ప్రతి బృందంలో విధిగా (సాధారణ పోలీస్ నుంచి అధికారి వరకు) ఓ మహిళ ఉంటుంది. టీనేజ్ పిల్లలు అదీ తొలిసారి అరెస్టయిన వారయితే... పెట్టీ కేసు పెట్టి గట్టిగా మందలిస్తారు. కరడుగట్టిన నేరగాళ్లయితే సెక్షన్ 354, నిర్భయ వంటి తీవ్రమైన కేసులు నమోదవుతాయి. మహిళ పేరు బయటకు రానివ్వకుండా కేసు విచారణ చేస్తారు. మహిళలు ఏం చేయాలంటే..! మగవాళ్లు మాటలతో కానీ, చేష్టలతో కానీ ఏడిపిస్తే 100 నంబరుకు ఫోన్ చేసి తామున్న ప్రదేశాన్ని తెలియచేయాలి. 100కి డయల్ చేసి వివరాలు చెప్తే ఆ సమాచారం ‘షీ బృందా’నికి చేరుతుంది.కాలేజ్ అమ్మాయిలు కానీ, ఉద్యోగినులు కానీ బస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో రోజూ ఆకతాయిలు వస్తున్నట్లయితే - సమయంతో సహా ప్రదేశాన్ని తెలియచేయాలి. మరుసటి రోజు ఆ సమయానికి అక్కడికి ‘షీ బృందం’ వస్తుంది. ఆకతాయి మగవారికిదో హెచ్చరిక! షీ బృందాలు నగరంలో విస్తృతంగా నిఘా పెడుతున్న విషయం మహిళలో సమాజంలో ధైర్యంగా జీవించవచ్చనే భరోసాను కల్పిస్తుంది. అదే సమయంలో ఆకతాయి మగవారికి హెచ్చరిక జారీ అవుతుంది. స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించకపోతే చిక్కుల్లో పడక తప్పదనే భయం వారిలో సత్ప్రవర్తనను తీసుకువస్తుంది. ఇలా షీ బృందాల వల్ల రెండు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. - స్వాతీ లక్రా, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్