షిఫ్ట్ టీమ్ | All together with the shift to take up farming | Sakshi
Sakshi News home page

షిఫ్ట్ టీమ్

Published Wed, Aug 19 2015 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

షిఫ్ట్ టీమ్

షిఫ్ట్ టీమ్

ఇవి కొండలు.
వీటిని పిండి కొట్టే వీరుల్లేరు.
ఒక్క మగాడు లేడు.
అంతా మైదానాలకు వలస వెళ్లారు.
ఈ ‘షి’ టీమ్‌కి చేతిలో కొద్దిగా భూమి, కావలసినంత టైము ఉంది.
అంతే.
అందరూ కలిసి షిఫ్ట్ సేద్యం చేపట్టారు.
అదే భూమిముక్కను ఒక్కో సంఘం నలభై రోజులు అరువు తీసుకుంది.
రెక్కలు ముక్కలు చేసుకుని వాణిజ్య పంటను పండించింది
కలిసి మార్కెటింగ్ చేసుకుంది.
ఇప్పుడు దేశమంతా ఈ నాగాలాండ్ షిఫ్ట్ కల్చర్‌ని ఒక ఆదర్శంగా తీసుకుంది.
మన మహిళలూ ఈ ప్రయత్నం చేయొచ్చు.
మన షీ టీమ్‌ల పంటా పండొచ్చు.

 
పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఆమె లేనిదే పూచిక పుల్ల జరగదు! చివరి శ్వాస వరకూ విరామం ఎరుగని మనిషి.. ఇంట్లో అవిశ్రాంత ఉద్యోగి.. అలాంటి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం లేదు. ఆస్తుల్లో వాటా లేదు. మిగిలిన దేశాల్లో మహిళల పరిస్థితి ఎలా ఉన్నా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ స్త్రీల పరిస్థితి మాత్రం అచ్చంగా అదే! అయితే నాగాలాండ్ మహిళలు ఈమధ్యే ఓ విప్లవం తెచ్చారు. తమ సమస్యలకు మూలం ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడమేనని గ్రహించి కలిసికట్టుగా ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించారు. ఇప్పుడు నాగాలాండ్ రాష్ట్రం వ్యవసాయిక ఉత్పత్తి, సంపదలో అక్కడి మహిళలదే ప్రధాన భూమిక.
 
ఎలాగంటే...

నాగాలాండ్ రాజధాని కొహిమాకు దగ్గర్లోని గ్రామం  దిమాపూర్. మిగతాచోట ఉన్న స్థితిగతులే ఆ ఊళ్లోని స్త్రీలవి కూడా. ఇది వాళ్లకేమాత్రం రుచించలేదు. అక్కడి మగవాళ్లు మెరుగైన జీతం కోసం మైదాన ప్రాంతాలకు వలస వెళ్తుంటే.. ఏ ప్రొడక్టివ్ వర్క్ లేక కేవలం ఇంటిపనితోనే సరిపెట్టుకోవడం వాళ్లకు నచ్చలేదు. ఏదైనా చేయాలి? ఏం చేయాలి. అందుబాటులో ఏముంది? కావల్సినంత సమయం ఉంది.. శక్తి ఉంది.. బీడుపడ్డ భూమి ఉంది. ఇది చాలదా? అనుకున్నారు ఆ ఊరి మహిళలు. సమయం, శక్తి పెట్టుబడిగా ముందు వాళ్ల చేతుల్లో ఉన్న నేలను దున్నారు. బంగారు పంట పండించారు. దిగుబడి బాగానే వచ్చింది. ఖర్చులు పోనూ రాబడి బాగానే మిగిలింది. దాంతో ఇంకొంత భూమిలో పంట పండించాలనుకున్నారు. నేల కావాలి, అలాగే మనుషులూ కావాలి. గ్రామ కమ్యూనిటీ కింద ఉన్న భూమి కనిపించింది. పనిచేయాలన్న సంకల్పం ఉన్న సాటి మహిళలూ దృష్టికొచ్చారు.
 
సమాలోచన
ఇంకేముంది.. మొదటి పంట పండించిన మహిళలంతా సమావేశమై చర్చించారు. ‘ఈ కొద్దిపాటి నేలలోనే ఇంతమంచి దిగుబడి సాధించాం.. ఇంకొంత నేలను కలుపుకొంటే మరింత దిగుబడిని సాధిస్తాం కదా.. అలాగే మనలాంటి ఆడవాళ్లకు పనిచ్చిన వాళ్లమూ అవుతాం’ అని అనుకున్నారు. గ్రామ కమిటీ కిందున్న భూమిని ఎలా తీసుకోగలం? అని ఆలోచించారు. అందరూ కలిసి సర్పంచ్ దగ్గరకు వెళ్లారు. అంతకుముందు వాళ్లు సాధించిన ఫలితం గురించి చెప్పారు. ముందు కాస్త హేళనగా మాట్లాడాడు సర్పంచ్. దానిని పట్టించుకోని మహిళలు తాము చేయదల్చుకున్న పని గురించే పదేపదే వివరించారు. వాళ్ల పట్టుదల, అంతకుముందు వాళ్లు సాధించిన విజయం సర్పంచ్‌ను పునరాలోచనలో పడేశాయి. కమ్యూనిటీ భూమిని వాళ్లకు అప్పజెప్పేలా చేశాయి.
 
రెండో వ్యూహం
తమ దగ్గరున్న కొంత భూమి, గ్రామ కమ్యూనిటీ లీజుకిచ్చిన కొంత భూమి అంతా కలిపినా అందరూ సాగుచేసుకునేంత అవడం లేదు. ఏం చేయాలి? మళ్లీ సమావేశమయ్యారు. రకరకాల ప్రణాళికలను చర్చించారు. అవన్నీ పెద్దగా ఉపయోగమున్నట్లు అనిపించలేదు. చివరకు ఒకరిద్దరు మహిళలు ‘షిఫ్ట్ సిస్టమ్‌లో సాగుచేసుకుంటే..’ అన్నారు చిన్నగా. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. తేరుకున్నాక ఒకటే చప్పట్లు. ‘అవును.. షిఫ్ట్ సిస్టమ్‌లో పంట పండిద్దాం!’ అన్నారు ముక్తకంఠంతో. ఎలా? ఆ గుంపులో మూలనుంచి ఓ సందేహ స్వరం వినపడింది. ‘స్వల్పకాలిక పంటలు వేద్దాం. వీటి వల్ల నేల సారమూ పోదు’ అన్నారు షిఫ్ట్‌సిస్టమ్ ఐడియా చెప్పిన మహిళలే. దాని మీద ఆలోచనలు, ప్లాన్లు సాగి చివరకు ఓ నిర్ణయానికి వచ్చారు.
 
మూడో వ్యూహం
దిమాపూర్‌లోని మహిళలంతా రెండు గ్రూపులుగా విడిపోయారు. స్వల్పకాలిక పంటలేమున్నాయో... వేటికి డిమాండ్ ఉందో లెక్క తీశారు. జాబితా తయారు చేశారు. ముందు ఒక గ్రూప్ ఆ భూమిలో జొన్నలు వేసింది. ఆ పంట చేతికి రాగానే రెండో గ్రూప్ ఆ నేలలోనే మొక్కజొన్నలు వేసింది. ఈ లోపు మొదటి గ్రూప్ తమ పంటకి మార్కెట్ వెదుక్కుంది. రెండో గ్రూప్‌వాళ్లకు మార్కెటింగ్‌లో వాళ్లకు ఎదురైన అనుభవాలను, నేర్చుకున్న విషయాలను, అవగతం చేసుకున్న కిటుకులనూ చెప్పింది. ఇంతలోకే రెండో గ్రూప్‌పంటా చేతికి వచ్చింది. మొదటి గ్రూప్ వాళ్లు చేసిన సూచనలు, మెలకువలతో రెండో గ్రూప్‌వాళ్లకు మార్కెటింగ్ తేలికైంది. ఇలా ఆ ఊళ్లోని మహిళలందరికీ చేతినిండా పని దొరికింది. కూలీలుగా కాదు యజమానులుగానే!
 
దిమాపూర్ స్ఫూర్తితో పెరెన్‌జిల్లాలోని కొంతమంది యువతులు వాళ్లు పండించిన ఆర్గానిక్ పంటలతో, డ్రైడ్, కేన్డ్ ఫుడ్ ఐటమ్స్‌తో ఒక స్టోర్‌నే నిర్వహిస్తున్నారు. ఢిల్లీ మార్కెట్‌లో వీళ్ల ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉందట.

కష్టపడి పనిచేయడం వాళ్లకు తెలిసిన విద్య. ఆ శక్తిని గుర్తెరిగారు. దేనికి డిమాండ్ ఉందో తెలుసుకున్నారు. సమష్టికృషిని సేంద్రియ వ్యవసాయం మీద పెట్టుబడిపెట్టి సంపదను సృష్టిస్తున్నారు. శ్రమైక సౌందర్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. దేశంలోని మహిళలకు స్ఫూర్తిని పంచుతున్నారు.
 
ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా...
దిమాపూర్‌లో రూపుదిద్దుకున్న షిఫ్ట్ సాగు ఆ నోటా ఈ నోటా నాగాలాండ్ అంతటా పాకి ఇప్పుడు ఆ రాష్ట్రంలోని ప్రతి గ్రామం దాన్ని అమలు చేస్తోంది. మొదటి గ్రామంలోని మహిళలు ఒకడుగు ముందుకేసి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌గా ఏర్పడి పంటల మీద వచ్చిన లాభాన్ని వ్యాపారంలో పెట్టుబడి పెట్టసాగారు. ప్రజల్లో ఆర్గానిక్ పంటలు, తాజా ఆహారాపదార్థాల పట్ల డిమాండ్ ఉందని తెలుసుకుని వాటినే పండిస్తున్నారు. స్వయంగా మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నారు. ఢిల్లీ, పుణె, ముంబై, చండీగఢ్, బెంగళూరు లాంటి నగరాల్లో జరిగే ఫుడ్ ఎక్స్‌పోల్లో పాల్గొని వాళ్ల  ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటున్నారు. అలా వాళ్ల ఆదాయాన్ని పెంచుకోవడమే కాక ప్రభుత్వ ఆదాయం పెరగడంలోనూ ప్రధాన భాగస్వాములయ్యారు.

నా మాటే చెల్లుతోంది
మాకు నలుగురు పిల్లలు. మా ఆయనది అరకొర సంపాదనే. దాంతో కుటుంబ అవసరాలే తీరకపోయేది. చేదోడుగా నేనేదైనా చేయాలి అని చాలా ఉండేది. కానీ ఊళ్లో ఉపాధి మార్గాలేముంటాయి? అప్పుడు ఈ షిఫ్ట్‌సాగు పరిచయమైంది. నేనూ చేరా. తర్వాత సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లోనూ జాయినయ్యా. ఇప్పుడు మా ఆయనకన్నా నాలుగింతలు ఎక్కువ సంపాదిస్తున్నా. పిల్లలను మంచి స్కూల్లో చేర్పించా. ఇప్పుడు ఇంట్లో నా మాటే చెల్లుతోంది.’
- లొచిమి లోతా (48), దిమాపూర్

ధైర్యం వస్తోంది
మా ఊళ్లో స్త్రీలందరికీ సమానావకాశాలు కల్పించడమే మా లక్ష్యం. పనిచేసే అవకాశం ఇస్తే సంపాదించుకుంటారు, నిర్ణయాలు తీసుకునే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు, దీనివల్ల వాళ్ల ఇళ్లే కాదు గ్రామమూ బాగుపడ్తుంది. ఈ విషయాన్ని మేం నిరూపించాం కూడా.
- మెరీ ఖియామ్‌నింగన్, షురున్ సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ సభ్యురాలు, దిమాపూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement