ఆమె కోసం... ఓ రక్షణ వలయం - స్వాతీ లక్రా
సమాజంలో ధైర్యంగా జీవించే భరోసాను మహిళలకు ఇవ్వాలి. ఆకతాయిల ఆటలు ఇక సాగవనే నమ్మకం కలిగించాలి. తమ కోసం ఓ నిఘా వ్యవస్థ అండగా ఉందనే అవగాహన తేవాలి. అప్పుడే చక్కటి సమాజం ఆవిష్కృతమవుతుంది... అంటారు స్వాతీ లక్రా. హైదరాబాద్ అడిషనల్ పోలీస్ కమిషనరైన ఆమె ఆకతాయిల నుంచి ఆడవాళ్ళ రక్షణ కోసం రూపొందించిన ‘షీ బృందం’ బాధ్యతలు మోస్త్తున్నారు. సమర్థంగా అమలైతే, సమాజంలో మార్పు తెచ్చే ఈ వినూత్న ప్రయత్నం గురించి ప్రత్యేక కథనం...
జార్ఖండ్ రాష్ట్రం, రాంచీలో పుట్టి పెరిగిన స్వాతీ లక్రాతో కొద్దిసేపు మాట్లాడితే సమాజంలో మహిళలు ఎన్ని రకాలుగా టీజింగ్‌కు గురవుతున్నారనే విషయంలో ఆమెకున్న అవగాహన తెలుస్తుంది. మహిళలను ఆదుకోవడానికి నాలుగు సింహాల పోలీస్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే ఆమె అభిలాషలో అంకితభావం కనిపిస్తుంది.
ఆలోచనకు మూలం ఇదీ!
‘‘మహిళల రక్షణ కోసం ప్రభుత్వం సెక్యూరిటీ కమిటీలను నియమించింది. ఆ సందర్భంగా మహిళల భద్రత కోసం ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలు చేశాం. వాటిలో షీ టీమ్ కూడా ఒకటి. మహిళల రక్షణ కోసం ఓ నిఘా బృందాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనకు అన్ని వైపుల నుంచి సానుకూలమైన స్పందన వచ్చింది. ఇక బృందాన్ని నిర్వహించే బాధ్యత నాకప్పగించారు. రెండు వారాలుగా మా షీ బృందాలు నగరంలో పనిచేస్తున్నాయి. ఒక్క ముక్కలో ఇది ‘ఆమె’ కోసం ఓ రక్షణవలయం’’ అని చెప్పుకొచ్చారు హైదరాబాద్ ఎసిపి స్వాతీ లక్రా.
తప్పించుకొనే వీలు లేకుండా... రికార్డు!
కాలేజ్‌కెళ్తూ బస్టాపులో వేధింపుకు గురయిన అమ్మాయి సమస్య బస్ ఎక్కి వెళ్లిపోవడంతో అంతమైపోదు. ఆ రోజంతా అది ఆమె మనసును తొలుస్తూనే ఉంటుంది. ఒక్క ఆకతాయి చేష్ట... క్లాసులో పాఠం మీద దృష్టి పెట్టలేనంతగా ఆమె మనసును కలచి వేస్తుంది. అదే ఉద్యోగిని అయితే... ఆ రోజు పని చేయలేకపోవచ్చు. పైగా సున్నిత మనస్కులయితే మానసికంగా కుంగిపోతారు. ధైర్యాన్ని కోల్పోతారు. ఇవన్నీ కలిసి వారిలో ఉన్న సహజమైన నైపుణ్యాలను మరుగున పడేస్తాయి. మానసికంగా అభద్రత కలిగితే మహిళాశక్తి నిర్వీర్యమవుతుంది. మహిళలో పోరాడే సత్తా అంతరించిపోతుంది. వీటన్నింటి నుంచి మహిళను రక్షించే ప్రయత్నమే ఈ షీ బృందం. ‘‘మహిళలు ఇంట్లో ఉన్నంత ధైర్యంగా సమాజంలో సంచరించగలగాలి. ఇంటి నుంచి బయటకు రావడానికి బెంబేలు పడే పరిస్థితులు మారాలి. ధైర్యంగా కాలేజ్‌కెళ్లగలగాలి, ఆఫీసుకెళ్లగలగాలి. గృహిణి ఒంటరిగా మార్కెట్‌కెళ్లగలిగిన భరోసా కలిగించడమే మా బాధ్యత. ఆకతాయి చేష్టలను మా బృందం కెమెరాల్లో రికార్డు చేస్తారు కాబట్టి వాళ్లు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు’’ అంటారీ ఐ.పి.ఎస్. అధికారిణి.
భరోసా కల్పించే వంద బృందాలు..
ఇంటి నుంచి బయటికొచ్చిన మహిళలు ఎన్ని వేధింపులను ఎదుర్కొంటున్నప్పటికీ నోరెత్తి చెప్పడానికి సందేహిస్తూనే ఉన్నారు. ఆ భయాన్ని తొలగించడం, ఫిర్యాదు చేయగలిగిన ధైర్యాన్ని నింపడమే షీ బృందం ప్రధాన విధి అంటున్నారీ ఎసిపి. ‘‘కాలేజ్‌లకెళ్లి వాళ్ళలో చైతన్యం కలిగించేలా సమావేశాలు పెడతాం. మహిళాసంఘాలు, స్వచ్ఛందసంస్థలు, కాలనీ వాసులు కోరుకుంటే మా ప్రతినిధులు వెళ్లి ప్రసంగిస్తారు. 100 నంబర్‌కి డయల్ చేయమని పదే పదే తెలియచేస్తూ డయల్ చేయగలిగిన ధైర్యాన్ని కల్పిస్తాం. పోలీసులకు చెప్పడం ద్వారా సమస్యకు ముగింపు పలకవచ్చనీ, పోలీసులకు చెప్పడం వల్ల ఇతర సమస్యలేవీ రావనే భరోసా కల్పిస్తాం. అందుకోసం జంటనగరాల్లో వంద బృందాలు పనిచేస్తున్నాయి. అవి బస్సుల్లోనూ ప్రయాణిస్తాయి’’ అని వివరించారు స్వాతి.
పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి!
‘‘పిల్లలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా గ్రహిస్తారు. దానిని ఎలా వినియోగిస్తున్నారనే దాని మీదనే భవిష్యత్తు ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలను నేర్పించడంతోపాటు వారి కార్యకలాపాలను గమనిస్తుండాలి’’ అంటారు స్వాతీ లక్రా. ఖాళీ సమయాన్ని భర్త, ఇద్దరు పాపలతో గడపడమే తన హాబీ అని చెబుతారీ ఉన్నతాధికారిణి. అన్నట్లు ఆమె భర్త కూడా ప్రభుత్వంలో ఉన్నతాధికారే. ఐఎఎస్ అధికారి అయిన బిఎమ్‌డి ఎక్కా ఆమె భర్త. హౌసింగ్ బోర్డు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ 1995 బ్యాచ్ విద్యార్థులమని చెబుతూ ముస్సోరీలో శిక్షణ సమయంలో పరిచయమైనట్లు చెప్పారు. ఆశయం, ఆచరణ కలగలిస్తే, అభ్యుదయ సమాజం వైపు పయనం అసాధ్యమేమీ కాదనడానికి స్వాతి సారథ్యంలోని తాజా ప్రయత్నం ‘షీ’ ఒక ఉదాహరణ. - వాకా మంజులారెడ్డి
‘షీ బృందం’ ఏం చేస్తుందంటే...
కాలేజ్, బస్టాపు, రైల్వేస్టేషన్, మార్కెట్‌లలో సంచరిస్తూ నేరస్థులను గుర్తించి అరెస్టు చేస్తారు. ఒక్కో బృందంలో ఐదుమంది వరకు ఉంటారు. ప్రతి బృందంలో విధిగా (సాధారణ పోలీస్ నుంచి అధికారి వరకు) ఓ మహిళ ఉంటుంది. టీనేజ్ పిల్లలు అదీ తొలిసారి అరెస్టయిన వారయితే... పెట్టీ కేసు పెట్టి గట్టిగా మందలిస్తారు. కరడుగట్టిన నేరగాళ్లయితే సెక్షన్ 354, నిర్భయ వంటి తీవ్రమైన కేసులు నమోదవుతాయి. మహిళ పేరు బయటకు రానివ్వకుండా కేసు విచారణ చేస్తారు.
మహిళలు ఏం చేయాలంటే..!
మగవాళ్లు మాటలతో కానీ, చేష్టలతో కానీ ఏడిపిస్తే 100 నంబరుకు ఫోన్ చేసి తామున్న ప్రదేశాన్ని తెలియచేయాలి. 100కి డయల్ చేసి వివరాలు చెప్తే ఆ సమాచారం ‘షీ బృందా’నికి చేరుతుంది.కాలేజ్ అమ్మాయిలు కానీ, ఉద్యోగినులు కానీ బస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో రోజూ ఆకతాయిలు వస్తున్నట్లయితే - సమయంతో సహా ప్రదేశాన్ని తెలియచేయాలి. మరుసటి రోజు ఆ సమయానికి అక్కడికి ‘షీ బృందం’ వస్తుంది.
ఆకతాయి మగవారికిదో హెచ్చరిక!
షీ బృందాలు నగరంలో విస్తృతంగా నిఘా పెడుతున్న విషయం మహిళలో సమాజంలో ధైర్యంగా జీవించవచ్చనే భరోసాను కల్పిస్తుంది. అదే సమయంలో ఆకతాయి మగవారికి హెచ్చరిక జారీ అవుతుంది. స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించకపోతే చిక్కుల్లో పడక తప్పదనే భయం వారిలో సత్ప్రవర్తనను తీసుకువస్తుంది. ఇలా షీ బృందాల వల్ల రెండు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.
- స్వాతీ లక్రా, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్