
పేరెంట్స్ ఉత్సాహంతోనే పిల్లల్లో ప్రతిభాపాటవాలు!
పరిపరిశోధన
పిల్లలు స్కూల్లో మంచి ప్రతిభను కనబరచాలంటే వాళ్లు మాత్రమే సంతోషంగా ఉంటే చాలదు. వాళ్ల తల్లిదండ్రులు కూడా ఉల్లాసంగా ఉండాలంటున్నారు పరిశోధకులు. తల్లిదండ్రులు నిరాశ నిస్పృహలతో ఉంటే అది పిల్లల చదువులపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు మానసిక నిపుణులు. స్వీడన్‌లో దాదాపు పదకొండు లక్షల మంది టీనేజ్ విద్యార్థులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలిందంటున్నారు మానసిక అధ్యయనవేత్తలు. ఈ పదకొండు లక్షల మంది పిల్లల ఫైనల్ పరీక్షల ఫలితాలను, వాళ్ల తల్లిదండ్రుల మానసిక ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. డిప్రెషన్‌తో బాధపడుతూ వ్యాకులతతో ఉన్న తల్లిదండ్రులకు చెందిన పిల్లల స్కోర్లనూ, అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండి, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే తల్లిదండ్రుల తాలూకు పిల్లల మార్కులను సరిపోల్చి చూశారు.
ఈ పరిశోధన ఫలితాలు అబ్బురపరచేలా ఉన్నాయట. మిగతావారిలో పోలిస్తే డిప్రెషన్‌తో బాధపడే తల్లిదండ్రుల తాలూకు పిల్లల మార్కులు కనీసం 4 శాతం నుంచి 4.5 శాతం తక్కువగా ఉన్నాయట. ఈ అధ్యయన ఫలితాలను ‘జామా సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరిచారు సదరు అధ్యయనవేత్తలు. అంతేకాదు... పిల్లల మానసిక వికాసం, నరాల ఆరోగ్యకరమైన ఎదుగుల, భావోద్వేగాలపై అదుపు, మంచి సామాజిక ప్రవర్తన ఉండాలంటే తల్లిదండ్రులు ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలని పిలుపునిస్తున్నారు మానసిన నిపుణులు.