చిన్నారులకు పుష్పగుచ్ఛం
బ్యాచ్‌లర్ ఆఫ్ సోషల్ వర్క్... గ్రాడ్యుయేషన్ విషయంలో ఇలాంటి కోర్సును ఎంచుకునేవారు కచ్చితంగా ప్రత్యేకమైన వ్యక్తులే అయి ఉండాలి. ఇలాంటి ప్రత్యేకమైనవారిలో ఒకరు నేపాల్‌కు చెందిన పుష్ప బస్నెత్. సోషల్‌వర్క్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తిచేసిన పుష్ప, గత ఏడు సంవత్సరాలుగా తన సేవాకార్యక్రమాలతో పీహెచ్‌డీల స్థాయికి ఎదిగింది. గ్రాడ్యుయేషన్ రోజుల్లో తన కాలేజీ అసెస్‌మెంట్‌లో భాగంగా పుష్ప... ఖాట్మండులోని మహిళా కేంద్ర కారాగాన్ని సందర్శించింది. జైళ్లలో వాస్తవ పరిస్థితులను గమనించిన పుష్ప దృష్టి అక్కడున్న చిన్నారుల మీద పడింది. వారి గురించి వాకబు చేస్తే... వారి తల్లులు వివిధ నేరాలు చేసి జైలు శిక్షను అనుభవిస్తున్నారనీ, సంరక్షణకు మరో మార్గం లేక ఆ పిల్లలను కూడా జైలులోనే ఉంచామని అధికారులు వివరించారు.
ఆ చిన్నారుల పరిస్థితిని చూసి పుష్ప ఆవేదన చెందింది. వారి పసిప్రాయం జైలులోనే గడిచిపోవడం దురదృష్టకరం అనిపించింది. ఏదోవిధంగా ఆ చిన్నారులకు జైలు నుంచి విముక్తి కల్పించి, బయటి ప్రపంచాన్ని పరిచయం చేయాలని కృత నిశ్చయురాలైంది. చిన్నారులను సంర క్షించే బాధ్యత స్వీకరిస్తానని ఆమె ముందుకొచ్చింది. జైలు అధికారులతో, ఆ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడింది. అయితే అటు అధికారులు గాని, ఇటు పిల్లల తల్లిదండ్రులు గాని స్పందించలేదు.
ఆఖరికి పుష్ప తల్లిదండ్రులు కూడా ... చక్కగా చదువుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోమన్నారు. పుష్ప మాత్రం తను సోషల్‌వర్క్‌లో డిగ్రీ పుచ్చుకున్నది సాధారణ ఉద్యోగాల కోసం కాదన్నట్టుగా స్నేహితుల, దాతల సహకారంతో ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్ సెంటర్’ (ఈసీడీసీ) ను స్థాపించింది. తనే కర్త, కర్మ, క్రియగా మొదలైన ఈ స్వచ్ఛంద సేవాసంస్థ కార్యకలాపాల్లో భాగంగా... మొదటగా జైలు నుంచి ఐదుగురు పిల్లలను తెచ్చుకుని పగలంతా తన దగ్గర పెట్టుకుని సాయంత్రానికి వదలి రావడం ప్రారంభించింది. అలా మొదలైన పుష్ప శిక్షణ ఇప్పుడు దాదాపు వందమంది చిన్నారులకు ఉచితంగా వసతి, ఆహారం, చదువు, వైద్య సేవలను అందించడం వరకు విస్తరించింది.
ఈ సేవాకార్యక్రమాలతో పుష్పకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉన్నవారిగా సీఎన్‌ఎన్ చానల్ కొంతమందికి ఇచ్చే ‘హీరోస్’ గుర్తింపుతో పాటు, ప్రోత్సాహకంగా వారు ఇచ్చే మూడు లక్షల డాలర్లను బహుమతిగా అందుకుంది.
శ్రీకృష్ణ జన్మస్థానంలో బాల్యం గడపాల్సిన బాలలకు స్వేచ్ఛను, విముక్తిని ప్రసాదించి, విజయవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్న ఈ పుష్పం చిన్నారుల పాలిట సేవాగుచ్ఛం.